
సామాన్యులను కూడా చంద్రబాబు సర్కార్ వదలడం లేదు. కాంట్రాక్ట్ లెక్చరర్‌పై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది.
చిత్తూరు జిల్లా: తల్లికి వందనం ఏదీ..? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎక్కడ...? పేద విద్యార్థులకు ఎందుకీ కష్టాలు...? అంటూ ఓ ప్రైవేట్ కాలేజీ అధ్యాపకుడు తన ఆవేదనను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడితే... అతనిపై పోలీసులు నాటుసారా తరలిస్తున్నారని కేసు కట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు అత్యంత దారుణంగా అధ్యాపకుడిపై నాటుసారా తరలిస్తున్నారని కేసు నమోదు చేశారని విద్యార్థులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు... చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకానికి చెందిన జ్యోతికుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన 15 రోజుల కిందట విద్యా సంవత్సరం ముగుస్తున్నా విద్యార్థులకు తల్లికి వందనం అందలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాలేదని, విద్యాదీవెన వంటి సాయం అందలేదని పిల్లల కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. విద్యార్థులు, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ హయాంలోనే బాగా పని చేశారని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ వీడియో వైరల్‌గా మారడం... జ్యోతికుమార్ ప్రశ్నలను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. అతనిపై పగపట్టారు. అతనిపై ఏదో ఒక తప్పుడు కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో కాణిపాకం పోలీసులు గురువారం ఉదయం జ్యోతికుమార్‌ను తన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారు. సాయంత్రం వరకు తవణంపల్లి, ఐరాల, కాణిపాకం పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతూ అతని గురించి ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. చివరికి రాత్రి సమయానికి నాటు సారా తీసుకొస్తుంటే పట్టుకున్నామని కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటీకి కక్షపూరితంగానే చేశారని గ్రామస్తులు, విద్యార్థి, అధ్యాపక సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
