ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్‌లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు.
సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్‌లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్‌ఐఎల్(ఐఎస్‌ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్‌హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment