బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. సోమవారం అత్యంత పటిష్ఠ భద్రత ఉండే గ్రీన్ జోన్‌ను(పార్లమెంటు భవనం) ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ జోన్‌లో కొందరు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పుల మోత మోగించారు. ఈ ఘటనలో 15 మంది సదర్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం సదర్ మద్దతుదారులకు, ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ అనూకుల వ్యక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నారు. కో ఆర్డినేషన్ ఫ్రేంవర్క్ సానుభూతిపరులు సదర్ మద్దతుదారులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలోనే సదర్ సపోర్టర్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
మరోవైపు కో ఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ ఈ దాడిని ఖండించింది. సదర్ మద్దతుదారులు సంయమనం పాటించి చర్చలకు రావాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులపై భద్రత దళాలు గానీ, పోలీసులు గానీ కాల్పులు జరపకుండా తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్ ఖదేమీ నిషేధం విధించారు. అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు.
బాగ్ధాద్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలని సూచించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా బాగ్ధాద్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇరాక్‌లో ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్‌ను ముట్టడించారు. అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment