shelling
-
దక్షిణ గాజాపై భీకర దాడులు.. శిథిలాల కింద శరణార్థులు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. సరిహద్దులో శరణు కోరుతున్న వేళ.. దక్షిణ గాజాలో భారీ షెల్లింగ్‌తో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. గాజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లక్షల మంది నిస్సహాయులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్క ఖాన్ యూనిస్ ప్రాంతంలోనే దాడుల వల్ల నెలకొన్న విధ్వంసంతో.. శిథిలాల కింద వెయ్యి మంది దాకా చిక్కుకున్నట్లు హమాస్ అధికారిక ప్రకటన చేసింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలనే ఇజ్రాయెల్ బలగాల హెచ్చరికలతో.. పొరుగు దేశాల శరణు కోరుతూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తర గాజా ప్రజలు. ఈ క్రమంలో దక్షిణం వైపున ఖాన్ యూనిస్‌తోపాటు రఫా పట్టణాలకు లక్షల సంఖ్యలో గాజా పౌరులు చేరుకున్నారు. అదే సమయంలో ఈ రెండు పట్టణాలపై భారీ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఈ దాడుల్లో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య 50 మందికిగా ప్రకటించినప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నందునా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తోంది. ఖాన్ యూనిస్‌తోపాటు రఫా పశ్చిమ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం భారీ స్థాయిలో దాడులు జరిపినట్లు గాజా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయని.. వాటికింద చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అదే సమయంలో ఈజిప్టునకు వెళ్లేందుకు రఫా సరిహద్దులో లక్షల మంది వేచిచూస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ దళాలు వారిని అనుమతించడంలేదు. దీంతో ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలతోపాటు అత్యవసర సామగ్రితో గాజాకి వచ్చే ట్రక్కులు ఆ సరిహద్దు వద్దే నిలిచిపోయాయి. మరోవైపు, అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్- గాజాల మధ్య జరుగుతోన్న పోరులో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. రెండు వైపులా ఇప్పటివరకు దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 9వేల మంది గాయాలపాలైనట్లు సమాచారం. ఒక్క గాజాలోనే 2,750 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పది లక్షల మంది పాలస్తీనీయన్లు వారి ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని తెలిపింది. గాజాలో పరిస్థితి దిగజారుతున్న వేళ ఈ సందిగ్ధతను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్‌తోపాటు జోర్డాన్‌లోనూ బుధవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా తమ సైనికులను పంపించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. -
రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి
బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. సోమవారం అత్యంత పటిష్ఠ భద్రత ఉండే గ్రీన్ జోన్‌ను(పార్లమెంటు భవనం) ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ జోన్లో కొందరు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పుల మోత మోగించారు. ఈ ఘటనలో 15 మంది సదర్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం సదర్ మద్దతుదారులకు, ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ అనూకుల వ్యక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నారు. కో ఆర్డినేషన్ ఫ్రేంవర్క్ సానుభూతిపరులు సదర్ మద్దతుదారులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలోనే సదర్ సపోర్టర్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మరోవైపు కో ఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ ఈ దాడిని ఖండించింది. సదర్ మద్దతుదారులు సంయమనం పాటించి చర్చలకు రావాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులపై భద్రత దళాలు గానీ, పోలీసులు గానీ కాల్పులు జరపకుండా తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్ ఖదేమీ నిషేధం విధించారు. అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. బాగ్ధాద్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలని సూచించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా బాగ్ధాద్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాక్‌లో ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్‌ను ముట్టడించారు. అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: 300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం -
మొత్తం చేస్తోంది ఉక్రెయినే... నీతులు చెబుతున్న రష్యా
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నానాటికి ఉగ్ర రూపం దాల్చుతుందే గానీ తగ్గే సూచనలు కనిపించడంలేదు. ఐతే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజజియా ప్లాంట్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ప్రారంభమైన తొలి దశలోనే రష్యా దళాలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అణువిద్యుత్ పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో ప్లాంట్‌ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఐతే యుద్ధ తీవ్రరూపం దాల్చడంతో తాజాగా ఈ దాడుల్లో ఒక షెల్ ప్లాంట్ పై పడినట్లు తెలుస్తోంది. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ బలగాలే అణువిద్యుత్ ప్లాంట్ పై దాడులు జరిపాయని, ఇదంత ఉక్రెయిన్ నిర్వాకమే అంటూ ఆరోపణుల చేస్తోంది. ఇది ఐరోపాతో సహా దాని పొరుగు దేశాలకు అత్యంత ప్రమాదకరం అని రష్య ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు. పైగా ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఇప్పుడైనా మేల్కోని అలాంటి షెల్లింగ్ దాడులు చేయొద్దని ఉక్రెయిన్‌కి హితవు చెప్పాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పై దురాక్రమణకు దాడి దిగిందే కాకుండా తప్పంతా ఉక్రెయిన్ పై నెట్టేసి ఇప్పుడూ నీతి కబుర్లు చెబుతోంది రష్యా. అయినా యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే రష్యా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దాడి చేసిన విషయాన్ని విస్మరిస్తూ ఉక్రెయిన్‌ని నిందించడం గమనార్హం. మరోవైపు రష్యా చేసిన వ్యాఖ్యలన్ని అవాస్తవం అంటూ ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఐతే ఈ విషయమై యూఎన్ కూడా ఇరు దేశాలను హెచ్చరించింది. (చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం) -
Ukraine Russia War: అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం, తేడా వస్తే!
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. డాన్బాస్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాలు భీకర దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజజియా ప్లాంట్‌పై బాంబుల వర్షం కురిసింది. అయితే ఈ చర్యపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడిలో షెల్స్ హై వోల్టేజ్ పవర్ లైన్‌పై పడినట్లు తెలుస్తోంది. దీని వల్ల రేడియేషన్ లీక్ కానప్పటికీ ఆపరేటర్లు ఓ రియాక్టర్‌ను డిస్ కనెక్ట్ చేశారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో మార్చిలోనే ఈ ప్లాంట్‌ను రష్యా తన అధీనంలోకి తీసుకుంది. అయితే అక్కడ పనిచేసేది మాత్రం ఉక్రెయిన్ టెక్నీషియన్లే. ఐక్యరాజ్యసమితి న్యూక్లియర్ వాచ్ డాగ్ ఈ ప్లాంట్‌ను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. ఈ విద్యుత్ కేంద్రాన్ని రష్యా యుద్ధంలో రక్షక కవచంలా ఉపయోగించుకుంటోందని అమెరికా ఇటీవలే ఆరోపించింది. అదృష్టం బాగుంది అణువిద్యుత్ కేంద్రంపై భయానక దాడికి పాల్పడినందుకు రష్యాపై అణు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కోరారు. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయినే ఈ ప్లాంట్‌పై షెల్స్ దాడి చేసిందని, అదృష్టం కొద్ది రేడియో ధార్మిక శక్తి లీక్ కాలేదని వ్యాఖ్యానించింది. ఈ దాడి వల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయిందని పేర్కొంది. సమీప నగరంలోని ప్రజలు విద్యుత్, నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ పోర్టు నుంచి మూడు ధాన్యం ఓడలు శుక్రవారం బయలుదేరాయి. రష్యా దండయాత్ర మొదలైన 5 నెలల్లో ఉక్రెయిన్ ఓడ బయటకు వెళ్ళడం ఇదే తొలిసారి. చదవండి: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల -
ఉక్రెయిన్ యుద్ధం: పట్టుబిగిస్తున్న రష్యా
కీవ్: రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా జరిపిన దాడుల్లో విఫలమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మాత్రం పట్టు సాధించగలిగింది. గత నెలలో రష్యా తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు హోరాహోరీగా సాగించి మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. రష్యా ఇప్పుడూ తూర్పు ఉక్రెయిన్‌లోని మరో నగరమైన సెవెరోడోనెట్స్క్ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు నిర్వహించింది. ఈ మేరకు రష్యా బలగాలు వందలాది మంది పౌరులు ఆశ్రయం పొందుతున్న అజోట్ కెమికల్ ప్లాంట్‌పై పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వందలాదిమంది పౌరులు, సైనికులు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా మద్ధతు గల వేర్పాటువాద ప్రాంతంలో చివరి వంతెన కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రష్యా సేనలు ఇప్పటి వరకు డోనెట్స్ నదిపై నిర్మించిన మూడు వంతెనలు ధ్వంసం చేశారని అన్నారు. ఈ చివరి వంతెన కూడా ధ్వంసం కావడంతో ఉక్రెయిన్ బలగాలు ఆ నగరంలోకి ప్రవేశించడం అసాధ్యంగా ఉందన్నారు. దీంతో రష్యా సేనలు మీకు వేరే మార్గంలేదు లొంగిపొండి లేదా చనిపోండి అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు సెవెరోడోనెట్స్క్లో దాదాపు 70 శాతం రష్యా నియంత్రణలోనే ఉందన్నారు. అదీగాక తూర్పు డాన్బాస్ ప్రాంతంపై నియంత్రణే ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుకు కీలకమని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడోనెట్స్క్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సేనలను చాలా వరకు నియంత్రించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సెవెరోడోనెట్స్క్ను రక్షించడంలో సహాయపడటానికి ఆయుధాలను పంపించండంటూ పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. (చదవండి: మరో 4 నెలలు?) -
అఫ్గాన్‌పై పాక్ దాడులు.. ప్రతిదాడికి సిద్దం!
కాబుల్ : దాయాది పాకిస్తాన్ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించింది. పొరుగు దేశం అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం విచక్షణ రహితంగా దాడులకు తెగబడింది. కందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలోని నివాస ప్రాంతాలపై జరిగిన ఈ ఫిరంగి దాడుల్లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించినట్లు, 50 మంది గాయపడ్డారని ఆప్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నట్లు సాక్షులు పేర్కొన్నారు. (అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి; ఏడుగురి మృతి) దీంతో పాకిస్తాన్‌పై ప్రతిదాడి చర్యలకు సిద్ధంగా ఉండాలని అఫ్ఘన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ యాసిన్ జియా పిలుపు నిచ్చారు. అలాగే ఇందుకు పాక్- అఫ్గాన్‌సరిహద్దు ప్రాంతం డురాండ్ లైన్ వద్ద దేశ సైనిక దళాలను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. కాగా కొన్ని సంవత్సరాలుగా పాక్ సైనిక దళాలు అఫ్గానిస్తాన్ తూర్పు, దక్షిణ భాగాలపై ఫిరంగి దాడులకు పాల్పడుతున్నాయని నిరూపించడానికి అనేక ఉదాహరణలు ఉన్నప్పటికీ పాక్ మాత్రం వీటిని ఖండిస్తూనే ఉంది. (తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక) -
కూలుతున్న గంజాయి కోటలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఏజెన్సీలో నాడు టీడీపీ నేతల అండతో పెచ్చరిల్లిన్న గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కూలగొట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. గంజాయి సాగు నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ దశాబ్దం నుంచి వేళ్ళూనుకున్న స్మగ్లర్ల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఆరు నెలల వ్యవధిలోనే 95 కేసులు నమోదు చేసి 245 మందిని అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ.60 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్యంలో గంజాయి వనాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఆ మాట నిలబెట్టుకుంటూశరవేగంగా చర్యలు చేపట్టారు. ఫలితంగా తక్కువ వ్యవధిలోనే సాగు మూడొంతులకు పడిపోయింది. పదేళ్ల క్రితం నుంచే.. గంజాయి ఖిల్లాగా మారిన విశాఖ మన్యంలో ఆ పంట సాగు పదేళ్ళ కిందటే పురుడుపోసుకుంది. హుకుంపేట మండలం మారుమూల ప్రాంతమైన సరసపాడు అటవీ ప్రాంతంలో ఈ సాగు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. మన్యం దిగువన ఉన్న దేవరాపల్లి మీదుగా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేపట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోని నేపథ్యంతో గిరిజనులు గంజాయి సాగు పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో క్రమేపీ పంట విస్తీర్ణం పెరిగి పదివేల ఎకరాలు దాటిపోయింది. ఓ దశలో సాధారణ పంటల సాగుకంటే గంజాయి సాగు వైపే పూర్తిగా మొగ్గుచూపే పరిస్థితి వచ్చేసింది. ఏజెన్సీలోని మొత్తం 11 మండలాలకు గానూ ఏడు మండలాలు.. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాలకు గంజాయి సాగు విచ్చలవిడిగా విస్తరించింది. ఆరు నెలల్లోనే అనూహ్య మార్పు.. గంజాయి సాగు, రవాణా నిరోధంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన పరిస్థితులను గిరిజనులే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్ళారు. గంజాయి స్మగ్లింగ్ వల్ల అనేక మంది గిరిజనులు జైలు పాలవుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు వాపోయేవారు. అదే సమయంలో విశాఖ నగరంలో యువత గంజాయికి బానిసలుగా మారిన తీరు ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. దాంతో అధికారంలోకి వచ్చాక గంజాయి సాగును పూర్తిగా నిర్మూలిస్తామని ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే గంజాయి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, అధికారాలు ఇచ్చారు. ఎక్సైజ్, ఫారెస్ట్, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో గిరిజనులు గంజాయి సాగు జోలికి పోకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని, కాఫీ సాగు విస్తరించాలని సీఎం సూచించారు. ఆ మేరకు అధికారులు వెంటనే రంగంలోకి దిగి స్మగ్లర్లకు ముకుతాడు వేసే దిశగా చర్యలు చేపట్టారు. నిఘా తీవ్రతరం చేసి తక్కువ వ్యవధిలోనే ఎన్నడూ లేనన్ని కేసులు నమోదు చేశారు. ఫలితంగా గత ఏడాది వరకు సగటున పదివేల ఎకరాల్లో సాగైన గంజాయి విస్తీర్ణం ఇప్పుడు మూడు వేల ఎకరాలకు పరిమితమైంది. అది కూడా పూర్తిగా మారుమూల అటవీ ప్రాంతాలు, ఏవోబీ పరిధిలోకి వచ్చే ఒడిశా సరిహద్దు గ్రామాల్లోనే సాగవుతున్నట్టు అధికారులు గుర్తించారు. స్వచ్ఛందంగా సాగుకు స్వస్తి.. గంజాయి సాగు వద్దని ప్రభుత్వం నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటలకు ఇస్తున్న ప్రోత్సాహంతో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి సాగు విడనాడారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఈ పంట సాగు ప్రారంభిస్తారు. అయితే జూన్ నుంచే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ ఏడాది గంజాయి సాగును పూర్తిగా విరమించారు. ప్రభుత్వ పిలుపు మేరకు గంజాయి సాగును విరమించిన గిరిజనులు తమ దుస్థితిని, అవసరాలను అధికారులకు విన్నవించుకుంటున్నారు. వ్యవసాయ యంత్ర పనిముట్లు కావాలనిఅధికారులను కోరుతున్నారు. ఏజెన్సీలో ఐదు తాత్కాలిక చెక్‌పోస్టులు.. ఏజెన్సీలో చాలా చోట్ల గంజాయి సాగుకు అడ్డుకట్ట వేశాం. గతంలో పండించిన పంట రవాణాను నిరోధించేందుకు ఐదు తాత్కాలిక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. శివలింగాపురం, భీమవరం, డౌనూరు, గరికనంద, జీనపాడు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు నెలకొల్పాం. గంజాయి పండించినా, అక్రమ రవాణా చేసినా నారోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(ఎన్డీపీఎస్)–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – టి. శ్రీనివాసరావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ పెంచి పోషించిన టీడీపీ నేతలు.. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక గంజాయి స్మగ్లింగ్ బహిరంగ వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. సాగు, అక్రమ రవాణాలో అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులే కీలకంగా మారారు. గంజాయి రవాణాకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఓ మాజీ మంత్రి పూర్తిస్థాయిలో అండదండలు అందించేవారనేది బహిరంగ రహస్యం. స్వయంగా ఆయనే ఈ మాఫియాకు డాన్‌గా చెలామణీ కావడంతో స్మగ్లర్లకు ఎదురు లేకుండా పోయింది. మాజీ మంత్రి అనుచరులు, సన్నిహితులైన టీడీపీ నేతలతో పాటు మన్యంలోని టీడీపీ నేతలు కూడా స్మగ్లర్లతో చేతులు కలిపారు. గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాల్సిన అధికారుల చేతులు కట్టేయడంతో ఏజెన్సీలో పండిన గంజాయి యధేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిపోయేది. కేసుల కోసం అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు చేసినట్టు చూపించినప్పటికీ అసలు స్మగ్లర్లను వదిలేసి కూలి డబ్బుల కోసం సరుకును రవాణా చేస్తున్న గిరిజనులు మాత్రమే కటకటాల పాలయ్యేవారు. దీనికి 2014 ఆగస్టు 9 నాటి ఘటనే ఉదాహరణ. పెదబయలు మండలం గోమంగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన అంబులెన్స్‌లో భారీఎత్తున గంజాయి తరలిస్తుండగా పోలీసులు సుండ్రుపుట్టు రోడ్డులో పట్టుకున్నారు. ఈ కేసులో డ్రైవర్ సీదరి మత్స్యరాజును అరెస్టు చేయగా.. ఆయన అసలు సూత్రధారులైన టీడీపీ నేతల పేర్లు వెల్లడించారు. కానీ నాటి పాలకుల ఆదేశాలతో ఈ కేసును ఒక్క డ్రైవర్ అరెస్టుతోనే సరిపెట్టేశారు. -
కాల్పులు వెంటనే ఆపండి.. లేదో!
జమ్ము కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో కాల్పులు, బాంబు దాడులను పాకిస్థాన్ వెంటనే ఆపాలని రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా పాకిస్థాన్ అనవసర ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని, అలా చేస్తే ఎవరూ మిగలరని ఆయన హెచ్చరించారు. అవతలి పక్షం వాళ్లు కాల్పులను వెంటనే ఆపకపోతే తమవైపు నుంచి కూడా తీవ్ర చర్యలు తప్పవన్న పరోక్ష సూచనలను ఆయన ఇచ్చారు. కాల్పులు అటునుంచి కొనసాగినంత కాలం శాంతి అనేది ఉండబోదని జైట్లీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.