గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. సరిహద్దులో శరణు కోరుతున్న వేళ.. దక్షిణ గాజాలో భారీ షెల్లింగ్‌తో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. గాజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లక్షల మంది నిస్సహాయులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్క ఖాన్ యూనిస్ ప్రాంతంలోనే దాడుల వల్ల నెలకొన్న విధ్వంసంతో.. శిథిలాల కింద వెయ్యి మంది దాకా చిక్కుకున్నట్లు హమాస్ అధికారిక ప్రకటన చేసింది.
సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలనే ఇజ్రాయెల్ బలగాల హెచ్చరికలతో.. పొరుగు దేశాల శరణు కోరుతూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తర గాజా ప్రజలు. ఈ క్రమంలో దక్షిణం వైపున ఖాన్ యూనిస్‌తోపాటు రఫా పట్టణాలకు లక్షల సంఖ్యలో గాజా పౌరులు చేరుకున్నారు. అదే సమయంలో ఈ రెండు పట్టణాలపై భారీ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఈ దాడుల్లో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య 50 మందికిగా ప్రకటించినప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నందునా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తోంది.
ఖాన్ యూనిస్‌తోపాటు రఫా పశ్చిమ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం భారీ స్థాయిలో దాడులు జరిపినట్లు గాజా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయని.. వాటికింద చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అదే సమయంలో ఈజిప్టునకు వెళ్లేందుకు రఫా సరిహద్దులో లక్షల మంది వేచిచూస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ దళాలు వారిని అనుమతించడంలేదు. దీంతో ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలతోపాటు అత్యవసర సామగ్రితో గాజాకి వచ్చే ట్రక్కులు ఆ సరిహద్దు వద్దే నిలిచిపోయాయి.
మరోవైపు, అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్- గాజాల మధ్య జరుగుతోన్న పోరులో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. రెండు వైపులా ఇప్పటివరకు దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 9వేల మంది గాయాలపాలైనట్లు సమాచారం. ఒక్క గాజాలోనే 2,750 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పది లక్షల మంది పాలస్తీనీయన్లు వారి ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని తెలిపింది.
గాజాలో పరిస్థితి దిగజారుతున్న వేళ ఈ సందిగ్ధతను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్‌తోపాటు జోర్డాన్‌లోనూ బుధవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా తమ సైనికులను పంపించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment