
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెంగ్‌నౌపాల్ జిల్లాలో అల్లరిమూకలకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనా ప్రాంతంలో దాదాపు 13 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
“ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు లీతు గ్రామంలో 13 మృతదేహాలను కనుగొన్నాయి. మృతదేహాల పక్కన ఎలాంటి ఆయుధాలను గుర్తించలేదు. లీతు ప్రాంతంలో మరణించిన వ్యక్తులు స్థానికులు కాదు. వారు వేరే ప్రాంతం నుండి వచ్చి మరొక సమూహంతో కాల్పులు జరిపి ఉండవచ్చు. చనిపోయిన వారి వివరాలు ఇప్పటికి తెలియదు” అని ఓ అధికారి తెలిపారు.
భారత ప్రభుత్వానికి మెయిటీ మిలిటెంట్ వర్గమైన UNLF మధ్య డిసెంబర్ 3న జరిగిన 'శాంతి ఒప్పందాన్ని' తెంగ్‌నౌపాల్ జిల్లాలోని కుకీ-జో గిరిజన సమూహాలు స్వాగతించాయి. ఈ పరిణామాల తర్వాత డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను మణిపూర్ ప్రభుత్వం ఆదివారం పునరుద్ధరించింది. ఇదే జిల్లాలో కాల్పుల ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మణిపూర్‌లో మే నెల నుంచి అల్లర్లు చెలరేగుతున్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. మెయితీ తెగలకు గిరిజన హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ చొరవతో కొన్ని రోజులుగా పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ తాజాగా మళ్లీ కాల్పుల ఘటన జరగడం ఆందోళనకు దారి తీస్తోంది.
ఇదీ చదవండి: Mizoram Election Results 2023: సీఎం జోరంతంగాపై విజయ ఢంకా