తణుకు(ప.గో. జిల్లా): తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కారుమూరి.. పశువధ కర్మాగారం మూయించటానికి తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
రోజుకి నాలుగు వందల పశువులను వధించటానికి ఇలాంటి పరిశ్రమ ఇరవై ఎకరాల్లో ఉండాలని, కానీ కేవలం మూడెకరాల్లో జనావాసాల మధ్య నడుపుతుంటే ఎందుకు అడ్డకోరని ప్రశ్నించారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి కొంతమందికి తొత్తులా వ్యవహరిస్తున్నాడని కారుమూరి మండిపడ్డారు. అసలు అనుమతులు లేని ఫ్యాకరీకి పోలీసులు ఎలా కాపలా కాస్తారని ప్రశ్నించారు.
‘పంచాయితీ తీర్మానం లేదు.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లేదు అయినా అధికారులు ఎందుకు ముందుకు రారు..?, పచ్చటి తణుకును వాయు కాలుష్యం నీరు కాలుష్యం కమ్మేస్తుంటే అధికారులకు పట్టదా ....?, అక్కడ ప్రజలు ముక్కులు బద్దలయ్యే వాసనతో రోదిస్తుంటే 144 సెక్షన్ పెట్టి పోలీస్‌లను పెట్టి వారి నోళ్లు నొక్కేస్తారా....?, గోస్థానం నుండి పుట్టిన గొస్తానీ నదిని గోవు రక్తంతో కలుషితం చేస్తారా?, శాంతియుతంగా ప్రజలు దీక్ష చేస్తుంటే పోలీస్‌లు గూండాల వ్యవహరించి టెంట్‌లు పీకేస్తారా?, ఎక్కడో యూపీ మనిషికి కొమ్ము కాస్తారా?, ఇక్కడ లక్షల మంది ప్రజల గోడు పట్టదా? అని నిలదీశారు.
తణుకు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. రానున్న రోజుల్లో పోరాటానికి సిద్ధం కావాలి. ఇది మంచిది కాదు.. ఇలాంటింటి ప్రకృతి విరుద్ధమైన పరిశ్రమ ఇక్కడ ఉండకూడదు. పశువులను తరలిస్తునప్న వాహనాన్ని ఒక్క పోలీస్ కూడా ఆపి చెక్ చేయడం లేదు. పాలు ఇవ్వని ఒట్టిపోయిన పశువుగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్‌లు లేకుండా పాడి పశువుల్ని వధిస్తుంటే కళ్లప్పగించి చూస్తారా?, నా హయాంలో ఒక్క పశువుని కూడా వధించకుండా కాపాడుకున్నాను. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అంత దమ్ము లేదు.. అతనికి డబ్బే ముఖ్యం. ప్రజలు సమస్యలు పట్టవు.. ప్రజలు ఏమైపోయినా పర్లేదు’ అని కారుమూరి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment