CATTLE
-
‘పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ పోరాటం ఆగదు’
తణుకు(ప.గో. జిల్లా): తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కారుమూరి.. పశువధ కర్మాగారం మూయించటానికి తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.రోజుకి నాలుగు వందల పశువులను వధించటానికి ఇలాంటి పరిశ్రమ ఇరవై ఎకరాల్లో ఉండాలని, కానీ కేవలం మూడెకరాల్లో జనావాసాల మధ్య నడుపుతుంటే ఎందుకు అడ్డకోరని ప్రశ్నించారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి కొంతమందికి తొత్తులా వ్యవహరిస్తున్నాడని కారుమూరి మండిపడ్డారు. అసలు అనుమతులు లేని ఫ్యాకరీకి పోలీసులు ఎలా కాపలా కాస్తారని ప్రశ్నించారు.‘పంచాయితీ తీర్మానం లేదు.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లేదు అయినా అధికారులు ఎందుకు ముందుకు రారు..?, పచ్చటి తణుకును వాయు కాలుష్యం నీరు కాలుష్యం కమ్మేస్తుంటే అధికారులకు పట్టదా ....?, అక్కడ ప్రజలు ముక్కులు బద్దలయ్యే వాసనతో రోదిస్తుంటే 144 సెక్షన్ పెట్టి పోలీస్‌లను పెట్టి వారి నోళ్లు నొక్కేస్తారా....?, గోస్థానం నుండి పుట్టిన గొస్తానీ నదిని గోవు రక్తంతో కలుషితం చేస్తారా?, శాంతియుతంగా ప్రజలు దీక్ష చేస్తుంటే పోలీస్‌లు గూండాల వ్యవహరించి టెంట్లు పీకేస్తారా?, ఎక్కడో యూపీ మనిషికి కొమ్ము కాస్తారా?, ఇక్కడ లక్షల మంది ప్రజల గోడు పట్టదా? అని నిలదీశారు.తణుకు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. రానున్న రోజుల్లో పోరాటానికి సిద్ధం కావాలి. ఇది మంచిది కాదు.. ఇలాంటింటి ప్రకృతి విరుద్ధమైన పరిశ్రమ ఇక్కడ ఉండకూడదు. పశువులను తరలిస్తునప్న వాహనాన్ని ఒక్క పోలీస్ కూడా ఆపి చెక్ చేయడం లేదు. పాలు ఇవ్వని ఒట్టిపోయిన పశువుగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్లు లేకుండా పాడి పశువుల్ని వధిస్తుంటే కళ్లప్పగించి చూస్తారా?, నా హయాంలో ఒక్క పశువుని కూడా వధించకుండా కాపాడుకున్నాను. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అంత దమ్ము లేదు.. అతనికి డబ్బే ముఖ్యం. ప్రజలు సమస్యలు పట్టవు.. ప్రజలు ఏమైపోయినా పర్లేదు’ అని కారుమూరి ధ్వజమెత్తారు. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్‌లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
కనుమ విశిష్టత..ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే..
సంక్రాంతి తర్వాతి రోజు వచ్చే పండుగ కనుమ. ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు?. పైగా ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యరు ఎందుకు?. తదితరాల గురించి తెలుసుకుందాం! సంక్రాంతి వేడుకల్లో ఈ మూడవ రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. కాబట్టి ఇది కనుమ పండుగ. నిజానికి వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. కాబట్టి ఈ కనుమ పండుగను 'పశువుల పండుగ' అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు. ఈ రోజు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కొందరైతే కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా చక్కగా అలంకరిస్తారు. పశువులతో పాటూ పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం ఉంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. వాటికోసం ఇంటి చుట్టూ చేరిన చిన్న చిన్నపిట్టలు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంట చేతికందేందుకు సహాయపడిన వారిందరికీ ఈ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక ఇది శాకాహారులకు మాంసంగా ఉపయోగ పడుతోంది.) సంతృప్తి పడతారు. ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే.. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. దీంతో ప్రతీ లోగిలి బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. అందువల్ల ఈ మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశ్యంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దని చెబుతుంటారు పెద్దలు. ఈ కారణంతోనే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత వచ్చి ఉండొచ్చు. మరికొందరైతే ఇలా పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంది. అందువల్లే చాలామంది కనమ రోజున ప్రయాణాలు ఎట్టిపరిస్థితుల్లో చెయ్యరు. (చదవండి: సంక్రాంతి వైభవాన్ని కనుమా!) -
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్ల (ఆర్‌ఎల్‌యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్‌ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!
‘మేపు లోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పొందాలంటే మేలైన, నాణ్యమైన పశుగ్రాసాలను పచ్చిమేతగా అందించాలి. దాణా కన్నా పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి సాధించడంతో పాటు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచినవారమవుతాం. పాడి పరిశ్రమ లాభసాటి కావాలంటే ఖర్చు తగ్గాలి. ఇది తగ్గాలంటే మేలు జాతి పశుగ్రాసాలను పశువులకు మేతగా అందించాలి. దీనితో 40–50 శాతం ఖర్చు తగ్గటంతో పాటు పాల దిగుబడి 20 శాతం పెరుగుతోంది. రైతులు పశుగ్రాసాల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాలను పెంచి పాడి పశువులకు మేపుతుంటారు. అలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను పెంచి పశువులకు క్రమపద్ధతిలో మేపితే మరింత మేలు జరుగుతోంది. ఈ విధానాన్ని అమలాపురం ఏరియా పశు వైద్యశాల అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఏరియా పశు వైద్యశాల వెనుక నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని చదును చేసి పదిహేను సెంట్ల స్థలంలో పది రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఎల్.విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనా క్షేత్రంలో సూపర్ నేపియర్, గిని గడ్డి, కనుమ గడ్డి, రెడ్ నేపియర్, గిని గ్రాస్, మోని, చంగల్ గడ్డి, బొబ్బర గడ్డి, సీవో4, సీవో 5 రకాల గడ్డిని పెంచుతున్నారు. ఔత్సాహికులైన పాడి రైతులకు పశుగ్రాసాల పెంపక విధానాన్ని వివరిస్తున్నారు. ప్రతి గడ్డిలో వైవిధ్యభరితమైన పోషకాలు ఉండటంతో అన్ని రకాలు మేపితే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం పేరా గ్రాస్ (ఇంగ్లీష్ గడ్డి) మాత్రమే మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశముంది. చెంగల్ గడ్డి ‘రాగి సంగటి’తో సమానం. సూపర్ నేపియర్ ఐదేళ్లు పాటు మేత అందుతోంది. కాండం మెత్తగా ఉండడంతో పాటు ఇందులో అధిక పోషకాలుంటాయి. రెడ్ నేపియర్‌లో ప్రోటీన్, గినీ గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. వీటిని కలిపి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువులు బలంగా ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిలో పశు పోషణలో భాగంగా వివిధ పోషకాలున్న పశుగ్రాసాలను పరిచయం చేయటంతో పాటు వివిధ రకాల నేలలకు అనువైన పశుగ్రాసాల రకాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు, కనుపులను ఉచితంగా అందజేస్తున్నారు. రైతులతో పాటు వెటర్నరీ విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నారు. పదిహేను సెంట్లలో ఏడాదికి సగటున 2.5 టన్నుల పశు గ్రాసాన్ని రైతులు పొందనున్నారు. ఒక ఎకరం భూమిలో ఈ విధంగా పశుగ్రాసాలు పెంచితే 5 నుంచి 6 పాడి పశువులకు ఏడాది పొడవునా మేత అందించవచ్చు. వీటితో పాటు కలబంద, నల్లేరు, పసుపు, రణపాల, తులసి, తిప్పతీగ, ఇన్సులిన్ మొక్క వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతూ, సంప్రదాయ వైద్యంలో వాటి ఉపయోగాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఒకటికి పది రకాల పశుగ్రాసాల పెంపకం వల్ల పాడి రైతుల ఆదాయం పెరుగుతోందంటున్నారు విజయ్‌రెడ్డి (98663 27067). – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం 13 నుంచి సింహపురి సేంద్రియ మేళా గో–ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులోని వి.ఆర్ కాలేజి గ్రౌండ్స్‌లో సేంద్రియ ఉత్పత్తులతో పాటు చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన–అమ్మకం మేళా జరగనుంది. ఇతర వివరాలకు.. 81436 32488. 15,16 తేదీల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఆదిగురు భారత్ ఫౌండేషన్ అధ్వర్యంలో జనగాంలోని బానపురంలో గో΄ాల్ గోశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో సేంద్రియ, గోఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఉంటుంది. ద్రావణాలు, కషాయాలు, గానుగ నునెలు, నెయ్యి, ధూప్ స్టిక్‌లు తదితర ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70953 14226. -
గ్రామ సర్పంచ్ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామ సర్పంచ్ వింత నిబంధన వివాదాస్పదంగా మారింది. గ్రామంలో పశువులు యధేచ్చగా సంచరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. ఆయా పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బల దండన విధిస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా రూ.500 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించాడు. ఈ నిబంధనపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాహదోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రోడ్లపై పశువులను యధేచ్చగా వదిలేస్తున్నారని గమనించిన సర్పంచ్.. వాటి యజమానుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చెప్పు దెబ్బలతో దండన విధిస్తామని దండోరా వేయించాడు. గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిబంధనలను వివరించారు. ఈ వీడియోను గ్రామస్థులు అధికారులకు చూపించి, ఫిర్యాదు చేశారు. ఇదేం వింత నిబంధన, వెంటనే తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
పాల దిగుబడిపై వడ‘దెబ్బ’
నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు ఇవే వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది. వడదెబ్బ తగలకుండా.. పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా.. వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి. చేయాల్సిన చికిత్స ఇదే వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు -
యూపీలో ఆవు దొంగతనం.. అర్థరాత్రి కారులో వచ్చి.. వైరలవుతున్న వీడియో
-
విషపునీరు తాగి 43 పశువులు మృతి
నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయిలో పురుగుమందు కలిసిన నీరు తాగి శుక్రవారం వరకు 30 పశువులు చనిపోగా శనివారం వాటి సంఖ్య 43కు చేరింది. నేరడుకొమ్ము మండలం కాచరాజుపల్లికి చెందిన కృష్ణయ్య, బుచ్చయ్య సోదరులకు పశువుల పెంపకమే జీవనాధారం. తమ ప్రాంతంలో పశుగ్రాసం దొరకని సమయాల్లో మందను ఇతర ప్రాంతాలకు తోలుకుని వెళ్తుంటారు. ఇదే క్రమంలో సోదరులిద్దరితోపాటు మరో ఎనిమిది మంది 250 పశువుల మందను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి వచ్చారు. అక్కడ పొలాల్లోంచి వదిలిన పురుగుమందున్న నీటిని తాగిన కొన్ని పశువులు మృత్యువాతపడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే 43 పశువులు మృతిచెందడంతో స్థానిక పశువైద్యాధికారుల సమాచారం మేరకు జేడీ యాదగిరి, ఏడీ విశ్వేశ్వర్రావు, ఇతర అధికారులు శనివారం మేళ్లవాయి గ్రామాన్ని సందర్శించారు. ఆ పశువుల శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. అయితే, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకలేదని, క్రిమిసంహారక నీటిని తాగడంతోనే మృతి చెందాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ‘పశువులను మేపుకుని జీవనం సాగిస్తున్నాం. పశువుల మృతితో రూ.లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి’అని పశువుల కాపరులు నేతాళ్ల కృష్ణయ్య, లింగమ్మ కోరారు. -
ఇంటి కుళాయికి బిరడా
మంగపేట: రోడ్డువెంట మొక్కల్ని పశువులు ధ్వంసం చేస్తున్నాయంటూ పశువుల కాపరికి రూ.7,500 జరిమానా విధించిన అధికారులు.. తాజాగా సదరు కాపరి ఇంటి కుళాయికి బిరడా బిగించడం వివాదాస్పదమైంది. ములుగు జిల్లా మంగపేటలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేయడానికి కారకుడంటూ పశువుల కాపరి గంపోనిగూడెంకు చెందిన బోయిన యాకయ్యకు పంచాయతీ అధికారులు రూ.7500 జరిమానా విధించడం తెలిసిందే. తాజాగా యాకయ్య ఇంటి కుళాయి (నల్లా)ను సైతం పంచాయతీ అధికారులు సీజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి పశువులు అడ్డం వచ్చాయి. ఎంత హారన్ కొట్టినా వాటిని పక్కకు అదిలించకుండా పశువుల కాపరి యాకయ్య ఫోన్ మాట్లాడుతుండడంతో కలెక్టర్ అసహనానికి గురయ్యారు. దీంతో తన గన్‌మెన్‌ను పంపి కాపరి ఫోన్‌ను లాక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి పశువులు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయన్న సాకుతో జరిమానా విధించినట్లు చెబుతున్నారు. నల్లాకు బిరడా బిగింపుపై పశువుల కాపరి యాకయ్య మాట్లాడుతూ రూ.7,500 జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని చెప్పి ఫోన్ ఇచ్చారని తెలిపాడు. ఇంటికి వచ్చి చూడగా పంచాయతీ సిబ్బంది తన ఇంటి నల్లాకు బిరడా వేసి సీజ్ చేశారని పేర్కొన్నాడు. సాయంత్రం ఎంపీడీవో ఫోన్ చేసి నల్లా బిరడా తొలగించుకోమన్నారని, తనకు తెలియదని చెబి తే.. పంచాయతీ సిబ్బంది వచ్చి తొలగించి వెళ్లారని వివరించాడు. తనకు విధించిన జరిమానాపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. నిర్లక్ష్యానికే జరిమానా: ఎంపీడీవో మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకిరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే పశువుల కాపరికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానా విధించామని ఎంపీడీవో శ్రీధర్ ఓ వీడియోలో వివ రణ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీవోకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వస్తోంది. -
ప్రభవించిన పుంగనూరు
పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న పుంగనూరు జాతి ఆవు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022కు ఎంపికైంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా హరియాణాలోని కర్నాల్‌లోగల జాతీయ జన్యు వనరుల కేంద్రం(యానిమల్ జెనటిక్ రిసోర్స్ సెంటర్)లో ఈ అవార్డును అందించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిసోర్స్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఏకే మిశ్రా నుంచి ఇప్పటికే అందిందని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డా.పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి పశువులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. – పలమనేరు పొట్టి పశువుల పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా ఈ పశు పరిశోధన సంస్థ ప్రారంభమైంది. 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 268 పశువులు వరకూ చేరింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధన కేంద్రంలో ఆర్కేవీవై, ఐకార్ నిధులు రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని(ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి సెమన్‌ను తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు సెమన్ నుంచి ఎక్కువ కణాలను తీసుకుని సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశు పరిశోధన కేంద్రం కృషి చేస్తోంది. అధిక వెన్న, పోషక విలువలు పుంగనూరు ఆవులు మూడడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. తోకలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. ఇవి సగటున 1 నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ పాలలో ఎక్కువ వెన్నతో పాటు.. పోషక విలువులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయి. తక్కువ మేతతోనే జీవించగలుగుతాయి. ఇవి మనిషిని అత్యంత ప్రేమగా నమ్మి విశ్వాసంగా ఉంటాయి. తనకు పరిచయం లేని వారిని దరిదాపులకు కూడా రానివ్వవు. ఒక్కో ఆవు ధర రూ.10 లక్షల దాకా ఉంది. -
పైన ఎల్లిగడ్డలు.. కింద పశువులు.. ట్రక్కులో కుక్కి...
సాక్షి, ఎడపల్లి (నిజామాబాద్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.ఎడపల్లి (బోధన్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. గాయపడిన ఎద్దు సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. చదవండి: అందం హిందోళం.. అధరం తాంబూలం -
పశువులపై విష ప్రయోగం
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): రాజకీయ కక్షలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని వీరవల్లి–1 సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు దూసరి నిర్మల (వైఎస్సార్ సీపీ)కు చెందిన పశువులపై విషప్రయోగం జరిగింది. ఈ ఘటనలో ఓ గేదె దూడ మృతి చెందగా, మరో మూడు గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామంలో ఆదివారం ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన దూసరి నిర్మల, జోజి దంపతులు పాడి పశువులను పెంచుకుంటూ కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయంగా వారిద్దరూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని వారిపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇటీవల నిర్మల దంపతులు కౌలుకు సాగు చేసిన 16 ఎకరాల వరి కుప్పలను ప్రత్యర్థులు దహనం చేశారు. కాగా, శనివారం అర్ధరాత్రి నిర్మల ఇంటి ప్రాంగణంలోని గేదెలపై విషప్రయోగం జరగగా.. సంఘటనాస్థలంలోని ఆనవాళ్లును బట్టి చూస్తే దోసకాయ, వంకాయలలో గుళికల మందు కలిపి గేదెలకు పెట్టినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలంలో పడి ఉన్న గుళికలు కలిపి పెట్టిన కూరగాయలు ఆదివారం తెల్లవారుజామున నిర్మల యథావిధిగా పశువులకు మేత వేసేందుకు వెళ్లినపుడు పశువులన్నీ అపస్మారక స్థితిలో కనిపించాయి. స్థానికులు వీరవల్లి ప్రభుత్వ వైద్యశాల, సంచార పశువైద్యశాల సిబ్బందికి సమాచారం అందించటంతో వారు హుటాహుటిన పశువులకు వైద్యం అందించారు. దీంతో గేదెలకు ప్రాణాపాయం తప్పినట్లేనని పశు వైద్యులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరవల్లి ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు. గతంలో వరి కుప్పలు దహనం చేసిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడా? లేక వేరేఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
సిరుల గ్రాసం.. పచ్చగడ్డి కాదు.. పసిడి పంట!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం: ఒకప్పుడు గ్రామాలు పశువులతో కళకళలాడేవి. వాటి మేత కోసం గ్రామాల్లో బంజరు భూములు ఉండేవి. పొలం గట్లు, అంచుల వెంబడి రైతులు పశుగ్రాసం పెంచేవారు. క్రమేణా బంజరు భూములు సాగునేలలుగా మారాయి. లేదంటే కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గింది. కానీ పాడి పశువుల సంఖ్య పెరిగింది. పాలిచ్చే గేదెలు, జెర్సీ ఆవులను పెంచే రైతుల సంఖ్య గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టు పశుగ్రాసం లభించడం లేదు. అడవులు అధికంగానే ఉన్నా.. రాష్ట్రంలోనే అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పశుగ్రాసం సమస్య తీవ్రంగానే ఉంది. అడవుల సంరక్షణ పేరుతో అటవీ అధికారులు కట్టుదిట్టం చేయడంతో పశువులకు మేత దొరకడంకష్టమైపోయింది. దీంతో పాడిరైతులు పశుగ్రాసాన్ని మోపుల లెక్కన కొనాల్సి వస్తోంది. ఈ క్రమంలో పశువుల ఆహార కొరతను తీరుస్తూ రైతులకు ఆదాయాన్ని అందించే వనరుగా సూపర్ నేపియర్ రకం గడ్డి వెలుగులోకి వచ్చింది. నేపియర్ గ్రాస్‌తో పెంచుతున్న పశువులు సాగు సులభం.. అచ్చం చెరుకుగడలా కనిపించే ఈ నేపియర్ గడ్డి థాయ్‌లాండ్ నుంచి వచ్చింది. భారత్ పరిస్థితులకు తగ్గట్టుగా హైబ్రిడ్ నేపియర్, సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ గడ్డి రకాలు అభివృద్ధి చేశారు. ఇందులో ప్రస్తుతం సూపర్ నేపియర్ రకం సాగు జోరందుకుంది. పశుగ్రాసం కోసం పెంచే జొన్న, దుబ్బ వంటి గడ్డిజాతులు ఒకసారి నాటితే ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తాయి. ఏడాది తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ సూపర్ నేపియర్ గడ్డిజాతి మొక్కలు ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు తిరిగి చూడాల్సిన పనిలేదు. తొలి పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఒకసారి కోస్తే తిరిగి 45 రోజుల్లో మళ్లీ కోతకొస్తుంది. ఇలా ఎనిమిదేళ్ల పాటు రాబడిని అందిస్తోంది. రైతుల మొగ్గు... పట్టణాలకు సమీపంలో పాడి ఎక్కువగా విస్తరించిన గ్రామాల్లో రైతులు సంప్రదాయ వరి, పత్తి, మిర్చిల కంటే నేపియర్ సాగుకే మొగ్గు చూపుతున్నారు. వరి వేసి నానా కష్టాలు పడితే ఎకరానికి రూ.15 వేలకు మించి ఆదాయం రావట్లేదు. పత్తివేస్తే అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.30 వేలైనా మిగలడం లేదు. కానీ సూపర్ నేపియర్ స్టెమ్స్ ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు ఢోకాలేదు. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ.70 వేల వరకు మిగులుతున్నాయని రైతులు అంటున్నారు. రెట్టింపు లాభం.. బెంగళూరులో ఉన్నప్పుడు సొంతూరిలో పాడి పరిశ్రమ పెట్టాలనుకున్నా. అప్పుడే సూపర్ నేపియర్ గురించి తెలిసింది. మా ఊళ్లో ఫాంహౌస్ కట్టి దానిలో ఈ గడ్డి పెంచుతున్నా. సాధారణ గడ్డి ఎకరంలో పండిస్తే.. ఐదారు పశువులకే సరిపోతుంది. కానీ నేపియర్ 16 అడుగుల పొడవు పెరగడం వల్ల 10 పశువులకు సరిపోతుంది. పైగా ఇందులో ప్రొటీన్స్ ఎక్కువ. పాల దిగుబడి బాగుంటుంది. – కళ్యాణ్, రైతు, అశ్వాపురం సమయం ఆదా అవుతోంది గతంలో భూమి కౌలుకు తీసుకుని గడ్డి పెంచేవాన్ని. ప్రతీ ఏడాది దుక్కి దున్ని విత్తనాలు చల్లాల్సి వచ్చేది. సూపర్ నేపియర్‌తో ఈ సమస్య లేదు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. 6 ఏళ్లు పాడి పశువులకు ఆహార కొరత లేదు. ఉదయం ఈ గడ్డి కోసి ఇస్తే చాలు. మిగిలిన సమయంలో ఇతర పను లు చూసుకునే వెసులుబాటు కలుగుతోంది. – బాదం శ్రీనివాసరెడ్డి, రైతు, బూర్గంపాడ -
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్‌కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
విషాదం: గడ్డివాముకు నిప్పు.. పశువులను కాపాడబోయి.. వదిన, మరిది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువులను కాపాడబోయి వది న, మరిది కరెంట్ షాక్‌తో ప్రా ణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డతండాలో ఈ ఘట న జరిగింది. గురువారం రాత్రి తండాలో బానోతు నీల (37), బానోతు రవి(34) ఇంటికి సమీపంలో ఉన్న ట్రా న్స్ఫార్మర్ నుంచి మంటలు వెలువడి గడ్డివాముకు నిప్పంటుకుంది. దీంతో సమీపంలోని పాకలో ఉన్న పశువులను మంటల నుంచి కాపాడేందుకు నీల, రవి వెళ్లా రు. అదే సమయంలో మంటలకు విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు, బంధువులు శుక్రవారం ఉదయం మృతదేహాలతో వీర్నపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అక్కడికి చేరుకొని కలెక్టర్, సెస్ ఎండీతో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. -
చిన్ని ప్రాణుల చలివేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే.. కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఆశగా వెదుకుతుంటాం. ఎప్పటికప్పుడు ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం. అందుకే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవీ ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేమా? అని కెన్ ఫౌండేషన్ సభ్యులకు కలిగిన ఆలోచన.. నేడు నగరంలో వేలాది పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తోంది. 10 ఏళ్లుగా ఎన్నో జీవాలకు వేసవిలో ఊపిరిపోస్తోంది. సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం నగరంలో వేసవి నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు సమీపిస్తోంది. ఈ తరుణంలో పక్షుల సంరక్షణకు నడుం బిగించింది నగరానికి చెందిన కెన్ ఫౌండేషన్. సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా.. సంస్థ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ ఈ సంస్థ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 100 తొట్టెలతో ప్రారంభమై.. పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2012లో కెన్ ఫౌండేషన్ నగరంలో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలుచోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములమవుతామని ముందుకువచ్చారు. దీంతో వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను విస్తరించారు. పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కోయిలలు, కాకులతో పాటు ఉడుతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ వాటర్ బౌల్స్ వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. సంస్థ చైర్పర్సన్ గీతానారాయణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి తొట్టెల ఖర్చును భరిస్తూ.. అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు పంపిణీ చేయగా.. 2021 నాటికి ఆ సంఖ్య 1800 కు చేరింది. ఈ ఏడాది 150 నుంచి 200 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నగరమంతా విస్తరణ నగరంలోని అనేక చోట్ల నుంచి జంతు ప్రేమికులు ఈ వాటర్ బౌల్స్‌ను తీసుకుని వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే మరికొన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్‌ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్... ఇలా శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటితొట్టెలను తీసుకెళ్తున్నారు. ఈ నీటితొట్టెల్లో నీటిని నింపి మేడ చివర్లో కానీ, పెరడులో గానీ పెడితే పక్షులు అక్కడికి చేరి దాహాన్ని తీర్చుకుని ఉపశమనం పొందుతున్నాయి. ఐదేళ్లుగా సరఫరా చేసిన నీటి తొట్టెల వద్దకు ఎన్నో పక్షులు కాలంతో పనిలేకుండా వస్తుండటం విశేషం. ఉచితంగా అందిస్తాం.. వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా ఫౌండేషన్ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇవి జంతువులకు, పక్షులకు చలివేంద్రాలు. నగరంలోని అనేక కళాశాలలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా వీటిని ఏర్పాటుచేశాం. మూగ జీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా.. ఉచితంగా నీటితొట్టెలు అందిస్తాం. ఆసక్తి ఉన్న వారు 98856 74949ను సంప్రదించవచ్చు. – పుల్లేటికుర్తి సంతోష్, కెన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజల స్పందన అనూహ్యం కెన్ ఫౌండేషన్ తరఫున ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. 100 చోట్ల పెట్టి వాటినే ప్రతి ఏటా కొనసాగించాలని భావించాం. అయితే.. నీటి తొట్టెలు చూసిన వారు ఇళ్ల వద్ద కూడా పెడతామని సంప్రదించారు. దీంతో ఆరేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాం. – గీతానారాయణ్, చైర్పర్సన్, కెన్ ఫౌండేషన్ -
కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత
చంపాపేట: గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గం వారిపై తల్వార్లతో దాడికి యత్నించిన సంఘటన మంగళవారం అర్దరాత్రి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి చౌరస్తా నుంచి మీర్‌పేట నందిహిల్స్ మీదుగా ఓ వాహనంలో గోవులను చంద్రాయణగుట్టకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోరక్షక్ సభ్యులు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం సమీపంలో వాహనాన్ని అడ్డుకుని గోవులను కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన యువకులు ఓ వాహనంలో వేగంగా వచ్చి గోరక్ష సభ్యుల ఇన్నోవాను బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం సమితి సభ్యులపై తల్వార్లతో దాడికి యత్నించారు. దీంతో వారు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు. వారిని వెంబడించిన దుండగులు ఆలయంలోకి జొరబడి తల్వార్లతో వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ బీజేపీ నాయకులు, గోరక్షక్ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం బీజేపీ, భజరంగదళ్, గోరక్షా సభ్యులు ఆలయం ఎదుట బైటాయించి దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
పోలీసులుగా మీకు ఆత్మగౌరవం లేదా? హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Karnataka Home Minister Araga Jnanendra Slams Cops: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుంటారని పోలీసులుపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు లంచాలు తినే కుక్కల్లా బతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడిన వీడియో రికార్డింగ్ వైరల్‌గా మారింది. అయితే పుశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకొని కొంతమంది పోలీసులు వారిని వదిలేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు. వధించడం కోసం పశువులను రవాణా చేయడం కర్ణాటక ప్రభుత్తం నిషేధించిన విషయం తెలిసిందే. తాను పోలీసులందరినీ విమర్శించడం లేదని, డబ్బు కోసం పశువుల అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసులను మాత్రమే విమర్శిస్తున్నానని తెలిపారు. -
కార్లను కుమ్మేసి.. మనుషులను పొడిచేసి..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ఆవు విధ్వంసం సృష్టించింది. రోడ్లపై కనబడిన వారినల్లా పొడిచింది. అలాగే, వాహనాలపైనా ప్రతాపం చూపింది. మూడు గంటలపాటు ఆవు సృష్టించిన గందరగోళంతో అశోక్‌నగర్, శ్రీనివాసనగర్ కాలనీ వాసులు హడలిపోయారు. కనిపించిన వారినల్లా పొడవడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు. పార్క్ చేసి ఉన్న కార్లను సైతం వదలకుండా కొమ్ములతో కుమ్మడంతో నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. ఆవు దాడిలో ముగ్గురికి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. చివరకు పోలీసులు, పశువైద్య అధికారులు చేరుకుని తాళ్ల సాయంతో ఆవును బంధించి మత్తు మందు ఇచ్చి నియంత్రించారు.దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
Neetu Yadav And Kirti Jangra: బర్రెలు అమ్మే బిజినెస్.. 2500 కోట్ల అమ్మకాలు!
‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?’ నీతూ యాదవ్, కీర్తి జంగ్రాలను అందరూ ఇదే అడిగారు. ఇద్దరూ ఢిల్లీ ఐఐటిలో చదివారు. ఒకటి రెండు ఉద్యోగాలు చేశారు. మానేసి ఆన్లైన్లో పశువుల సంత పెడతామంటున్నారు. ‘మీకేమైనా పిచ్చా?’ ‘బుద్ధి గడ్డి తింది’ ‘చదివాక పిసలు అన్నారట’ ఎన్నో కామెంట్స్... కాని ఈ ఇద్దరు అమ్మాయిలు ‘యానిమాల్’ అనే యాప్ తయారు చేశారు. 2019లో మొదలెట్టారు. ఇప్పటికి 2500 కోట్ల విలువైన పశు అమ్మకాలు సాగించారు. IITians Neetu Yadav And Kirti Jangra: అది 2019. నీతూ యాదవ్ బెంగళూరు నుంచి జైపూర్‌లో ఫ్లయిట్ దిగింది. సెప్టెంబర్ నెల. జల్లు పడుతోంది. నీతూ బుర్రలో కూడా ఆలోచనల జల్లు కురుస్తోంది. బెంగళూరులో ఆన్లైన్ కథల వేదిక ‘ప్రతిలిపి’లో ఉద్యోగం మానేసి జైపూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతవూరు నవల్పూరుకు వెళుతోందామె. అక్కడ ఏం చేయాలో తన తల్లిదండ్రులకు ఏం చెప్పాలో మననం చేసుకుంటూ ఉంది. మరోవైపు అదే సమయానికి హర్యానాలోని హిసార్ పట్టణంలో కీర్తి జంగ్రా నివాసం కోలాహలంగా ఉంది. కీర్తికి అమెరికాలో ఉన్నత చదువులకు సీట్ వచ్చింది. ఆమె అమెరికాకు వెళ్లనున్నందున తల్లిదండ్రులు బంధువులను పిలిచి చిన్న పార్టీ అరేంజ్ చేశారు. కాని కీర్తి మనసులో ఏముందో తెలిస్తే వారి రియాక్షన్ ఏమిటో. రియాక్షన్ ఎలా ఉన్నా నిర్ణయం చెప్పాల్సిందే కదా. ‘ఆన్లైన్లో పశువులు అమ్ముతాం’... ఇదీ నీతూ యాదవ్, కీర్తి జంగ్రా తమ ఇళ్లల్లో చెప్పింది. వాళ్లిద్దరూ ఐఐటి ఢిల్లీలో చదివారు. రూమ్మేట్స్. జీవితంలో ఏదైనా సాధించాలని ఎన్నో కలలు కన్నారు. ఐఐటి అయ్యాక నీతూ బెంగళూరులో ‘ప్రతిలిపి’లో పని చేయడానికి వెళ్లింది. కీర్తి గుర్గావ్లో ‘పెంగ్విన్’ పబ్లిషింగ్ హౌస్‌లో పని చేయడానికి వెళ్లింది. ఇద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఇద్దరికీ తాము చేస్తున్న ఉద్యోగాలు అంత సంతృప్తినివ్వడం లేదు. ఏదైనా సొంతగా సాధించాలనే తపన. నీతూ యాదవ్ తండ్రి పాడి రైతు. నీతూకు పశువులతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. కీర్తి తండ్రి టీచర్. కాని అతని మేనమామలు పాడి రైతులు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ పశువుల సంతలు చూశారు. పశువుల లావాదేవీల సమయంలో రైతుల హైరానా చూశారు. ఇద్దరికీ ఒకేసారి ‘అసలు ఆన్లైన్లో పశువులు ఎందుకు అమ్మకూడదు’ అనే ఆలోచన వచ్చింది. ఇక్కడే కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం ఎదురైంది.పశువులంటే ఉప్పులో పప్పులో కాదు. బట్టలు కాదు ఆన్లైన్లో కొనడానికి. రైతులు సంతకు వచ్చి ఒకటికి రెండుసార్లు చూసుకొని కొనుక్కుంటారు. మరి ఆన్లైన్లో వీళ్లు ఎలా అమ్ముతారు? ఇదే ప్రశ్న అందరూ వేశారు ఇద్దరినీ. వాళ్లు సమాధానం చెప్పలేదు. చివరకు ఇద్దరి ఇళ్లలోనూ ‘సరే.. మీకు నచ్చిందే చేయండి’ అన్నారు. 2019 చివరలో బెంగళూరులో 11 వేల రూపాయల అద్దెతో ఒక చిన్న గది నుంచి నుంచి నీతూ, కీర్తిల ‘యానిమాల్’ కార్యకలాపాలు మొదలయ్యాయి. ‘యానిమల్’ పశువు. ‘యానిమాల్’ పశువుల సంత. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. వర్చువల్ సంత. కొనాలనుకున్న రైతు అమ్మాలనుకున్న రైతు వీళ్లు తయారు చేసిన ‘యానిమాల్’ ద్వారా లావాదేవీలు ముగించవచ్చు. ‘అసలు జనం టిక్‌టాక్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లాంటి కాలక్షేపం యాప్‌లను కాకుండా పనికొచ్చే ఉపాధికి అవసరమయ్యే యాప్‌లను ఎందుకు చూడరు. దేశంలో 30 కోట్ల పశువులు ఉన్నాయి. ఇవి ఏడున్నర కోట్ల పాడి రైతుల దగ్గర ఉన్నాయి. భారతదేశంలో ఇది పెద్ద మార్కెట్. ఆన్లైన్ అమ్మకాలలో వీటిని తేవచ్చునని చాలామంది అనుకోలేదు. ఎందుకంటే సంప్రదాయ సంతల్లోనే వీటి అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి. కాని మేము వీటిని ఆన్లైన్లో తేదలుచుకున్నాం. యాప్ తయారు చేశాం. సక్సెస్ అయ్యాం’ అంటుంది నీతూ యాదవ్. అయితే ఇలా సక్సెస్ కావడం అంత సులభం కాలేదు. 2019 చివరి వరకూ వీళ్లు కేవలం 50 పశువులే తమ యాప్ ద్వారా అమ్మారు. కాని 2020లో లాక్డౌన్ వచ్చాక వీరి యాప్ ఊపందుకుంది. దీనిని రైతుల సౌలభ్యం కోసం హిందీలో కూడా డెవలప్ చేశారు. దాంతో రాజస్థాన్‌లోనే ఐదులక్షల మంది పాడిరైతులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్లలో యానిమాల్ కార్యకలాపాలు విస్తరించాయి. 2020 నవంబర్ నాటికి 30 వేల పశువుల లావాదేవీలు సాగితే డిసెంబర్‌కు వాటి సంఖ్య 40 వేలు అయ్యింది. 2021 నుంచి సగటున నెలకు 50 వేల పశువులు ‘యానిమాల్’ ద్వారా అమ్మకమో కొనుగోలో జరుగుతోంది. ఇప్పటికి 80 లక్షల మంది రైతులు ‘యానిమాల్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘ఇన్వెస్టర్లు భారీగా మాకు ఫండ్ చేయడానికి ముందుకు వచ్చారు. చేశారు కూడా’ అని మెరుస్తున్న కళ్లతో అంటుంది కీర్తి. ఇప్పటికి 160 కోట్ల రూపాయల ఫండ్స్ వీరికి ఏజెన్సీల నుంచి దక్కాయి. కీర్తి, నీతూ చేసింది ఏమిటంటే అమ్మే రైతును, కొనే రైతును అనుసంధానం చేయడమే. ‘మేం చెప్పామని కొనొద్దు. పాలు పితికి చూసి మరీ తీసుకోండి’ అని వీరు అంటారు. ఈ యాప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువులను పశువైద్యులు సర్టిఫై చేసే ఏర్పాటు చేశారు. అలాగే పాడిరైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇస్తారు. పశువులు కొనడానికి ఫైనాన్స్ ఎలా పొందాలో కూడా తెలియ చేస్తారు. ఉత్తర భారతదేశంలో యానిమాల్ పెద్ద విప్లవమే తీసుకొచ్చింది. ఇది రైతుల మాటే. ‘ఇలా మేము ఎప్పుడూ పశువులను కొనలేదు’ అని వారు అంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక కొత్త ఆలోచన మెరిపించారు. అది ఇవాళ వేల కోట్ల రూపాయల లావాదేవీలకు కారణమైంది. ‘నీ తెలివి సంతకెళ్లా’ అనేది మనకు తిట్టు. కాని తెలివి నిజంగా సంతకెళితే ఏమవుతుందో చూశారుగా! -
మల్లన్నసాగర్లో చిక్కుకున్న పశువులు
మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో పశువులు చిక్కుకుపోయాయి. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామానికి చెందిన బర్రెంకల చిన చంద్రయ్యకు 40 వరకు ఎడ్లు, ఆవులు ఉన్నాయి. శనివారం ఉదయం ఆయన పశువులను మేతకోసం అడవిలోకి వదిలిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం మల్లన్నసాగర్ చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో చంద్రయ్య పశువుల వద్దకు వెళ్లలేకపోయాడు. ఆదివారం తెల్లవారు జామున మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలను వదలడంతో పశువులు పక్కనే ఉన్న బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులోని గుట్ట సమీపంలోకి వెళ్లాయి. మరొక పక్కన గతంలో కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించిన కాల్వ ఉంది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా నీరు మల్లన్నసాగర్‌లోకి వెళుతోంది. కాగా తుక్కాపూర్‌కు చెందిన మరో రైతుకు చెందిన నాలుగు గేదెలు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.– తొగుట (దుబ్బాక) అక్కడే నిరసన..అక్కడే నిద్ర వీరంతా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలానికి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో తొమ్మిది గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల పట్టాభూములు అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. ఈ తప్పును సరిదిద్దాలంటూ బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నిరసన దీక్షను ప్రారంభించి.. రాత్రంతా సమావేశపు గదిలోనే పడుకున్నారు. గురువారం కూడా నిరసన కొనసాగించారు. మరోపక్క వీరికి మద్దతుగా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. విధులకు హాజరయ్యేందుకు వచి్చన తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 15 రోజుల్లో రికార్డులు సరిచేసి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రజాప్రతినిధులకు, రైతులకు హామీనివ్వడంతో ఆందోళనకు తెరపడింది.– జఫర్‌గఢ్ -
థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్టులు.. బకరా అయిన డాక్టర్
సాక్షి, హైదరాబాద్: పశువుల వ్యాక్సిన్ల తయారీకి వినియోగించే ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను భారత్‌లోనే ఖరీదు చేసి, తమకు ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఎన్నారై వైద్యుడికి టోకరా వేశారు. వివిధ దఫాల్లో మొత్తం రూ.11.94 కోట్లు (16,11,025 డాలర్లు) కాజేశారు. గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు. ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు ఎ.చంద్రశేఖర్ రావు (82) అమెరికా పౌరసత్వం ఉండగా... అక్కడ సుదీర్ఘకాలం వైద్యుడిగా పని చేసి వచ్చారు. ఈయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లో ఉంటున్న డాక్టర్ బెంజిమన్ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఈ–మెయిల్ వచ్చింది. తాను పని చేస్తున్న సంస్థ పశువులకు వేసే వ్యాక్సిన్లు తయారు చేస్తుందని నమ్మబలికాడు. దీనికోసం తాము నిత్యం భారత్ నుంచి ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను ఖరీదు చేస్తామని చెప్పాడు. ఈ ఆయిల్‌పై చంద్రశేఖర్‌కు పరిజ్ఞానం ఉండటంతో నమ్మారు. ఇప్పటి వరకు తమకు ఆయిల్ సరఫరా చేసిన వారితో అనివార్య కారణాల నేపథ్యంలో ఒప్పందం రద్దయిందని పేర్కొన్నాడు. ఆయిల్‌ను మీరే లీటర్ 14,625 డాలర్లకు (రూ.10.84 లక్షలు) ఖరీదు చేసి తమకు సరఫరా చేస్తే 22 వేల డాలర్లకు (రూ.16.31 లక్షలు) కొంటామంటూ ఎర వేశాడు. మహిళ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓపక్క ఈ సంప్రదింపులు జరుగుండగానే డాక్టర్ గీత నారాయణగా చెప్పుకున్న మహిళ నుంచి ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అలా పరిచయమైన ఈమె వైద్యుడిని తెలివిగా ముగ్గులోకి దింపి సదరు ఆయిల్‌ను రాయ్‌గఢ్‌కు చెందిన మిల్లులో తయారు చేస్తారంటూ నమ్మించింది. అక్కడ పని చేసే లక్ష్మీ అనే మహిళతో తనకు పరిచయం ఉందంటూ చెప్పి ఆ పేరుతో సంప్రదింపులు జరిపింది. ఈ కథ ఇలా నడుస్తుండగా... మరోసారి టచ్‌లోకి వచ్చిన బెంజిమన్ శాంపిల్‌గా ఒక లీటర్ ఖరీదు చేసి పంపాలని, ఆ కంపెనీ ఖాతాలో డబ్బు జమ చేస్తే వాళ్లే తమకు ఆయిల్ పంపేస్తారంటూ చెప్పాడు. నగదు మాత్రం మీరే పేర్కొన్న ఖాతాలో వేస్తామంటూ పూర్తిగా నమ్మించాడు. చంద్రశేఖర్ ఒక లీటర్ ఆయిల్ కోసం లక్ష్మీని సంప్రదించారు. దాని నిమిత్తం 14,625 డాలర్లు పంపించారు. ఈలోపు మళ్లీ సీన్లోకి వచ్చిన బెంజిమన్... లీటర్‌తో తమకు ఉపయోగం లేదని, కనీసం 350 పంపిస్తే ఒక బ్యాచ్ వ్యాక్సీన్లు తయారవుతాయని చెప్పాడు. చంద్రశేఖర్ దానికి సంబంధించిన మొత్తం లక్ష్మీ పేర్కొన్న ఖాతాలకు పంపిన తర్వాత మరో కథ మొదలైంది. విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ.. ఆ ఆయిల్‌ను లండన్ విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ బెంజిమన్ చెప్పాడు. రిలీజ్ చేయడానికి కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కట్టాలని చెప్పి మరికొంత మొత్తం కాజేశాడు. ఇలా ఈ ఏడాది మార్చ్ నుంచి మే వరకు వివిధ విడతల్లో మొత్తం 16,11,025 డాలర్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. మరో 2 వేల డాలర్లు పంపాలంటూ నేరగాళ్ల కోరడంతో చంద్రశేఖర్ అనుమానించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి చంద్రశేఖర్‌కు మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో ఆయిల్ పేరుతో జరుగుతోంది పెద్ద మోసమంటూ అతడు పేర్కొన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన లండన్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులను సంప్రదించగా మొత్తం ఓ స్కామ్‌గా తేలింది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయటకు రాలేదు. చివరకు గురువారం తన సమీప బంధువు మురళీమోహన్ ద్వారా సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా, దుబయ్ బ్యాంకులకు నగదు బదిలీ ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో చంద్రశేఖర్‌కు అమెరికాలోని వెల్స్ మార్గో బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి అమెరికా, దుబయ్ల్లో ఉన్న మొరిల్లా బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్‌లకు చెందిన తొమ్మిది ఖాతాల్లోకి ఈ నగదు వెళ్లినట్లు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఇలానే ఓ వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.5 కోట్లు కాజేశారు. ఇప్పటి వరకు ఇదే పెద్ద కేసుగా రికార్డుల్లో ఉంది.