పాడికి ఆధారం పచ్చిమేతే! | Green source of dairy forage | Sakshi
Sakshi News home page

పాడికి ఆధారం పచ్చిమేతే!

Published Sun, Jul 27 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

పాడికి ఆధారం పచ్చిమేతే!

పాడికి ఆధారం పచ్చిమేతే!

 పాడి-పంట

కడప అగ్రికల్చర్: పాడికి ఆధారం పచ్చిమేతే అన్నారు పెద్దలు. పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు. కేవలం చొప్ప పైన మాత్రమే ఆధారపడితే ప్రయోజనం ఉండ దు. పచ్చిమేత మేపితే పశువులు ఆరోగ్యంగా ఉంటా యి. సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అయితే ఒక్క వర్షాకాలం లో మినహా మిగిలిన అన్ని కాలాలలోనూ పాడి రైతులు తగినంత పశుగ్రాసం లభించక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి కారణం... పాడి పశువులకు కావాల్సిన పచ్చిమేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉండడం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రైతు లు విధిగా పశుగ్రాస పైర్లు వేసుకోవాలి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలు పశుగ్రాసాల సాగుకు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పచ్చిమేతల సాగుపై వైఎస్‌ఆర్ జిల్లా పశు గణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ హేమంత్ కుమార్ అందిస్తున్న సూచనలు...

ఎలా ఉండాలి?

మనం పండించే పశుగ్రాస పైరు రుచికరంగా, ఎక్కువ మాంసకృత్తులను కలిగి ఉండాలి. పశువులకు ఏ మాత్రం హాని కలిగించకుం డా, సులభంగా జీర్ణం కావాలి. తక్కువ కాలంలో, ఎక్కువ దిగుబడిని ఇవ్వగలగాలి. ఎరువుల అవసరం తక్కువ ఉండే పశుగ్రాసాన్ని ఎంచుకోవాలి. కోసిన తర్వాత నిల్వకు అనువుగా ఉండాలి.

పశుగ్రాసాలు రెండు రకాలు. అవి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, కాయ జాతి పశుగ్రాసాలు. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు, కాయ జాతి పశుగ్రాసాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పంటకాలాన్ని బట్టి పశుగ్రాసాలను ఏక వార్షికాలు, బహు వార్షికాలుగా విభజించారు. రైతులు తమకు అనువైన పశుగ్రాసాన్ని ఎంచుకొని సాగు చేయాలి.

ఇవి ధాన్యపు జాతి పచ్చిమేతలు

మొక్కజొన్న, సజ్జ వంటివి ధాన్యపు జాతికి చెందిన ఏక వార్షిక పచ్చిమేతలు. మొక్కజొన్న పైరు రుచికరంగా, ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఎకరానికి 16-20 కిలోల విత్తనాలు వేసుకుంటే 70 రోజులకు 12-16 టన్నుల గ్రాసాన్ని ఇస్తుంది. అధిక పాల ఉత్పత్తి పొందడానికి, సైలేజీ (పాతర గడ్డి)కి బాగా అనువుగా ఉంటుంది. సజ్జను పశుగ్రాసంగా సాగు చేయాలనుకుంటే ఎకరానికి 5 కిలోల విత్తనాలు కావాలి. ఇందులో అలసంద, పిల్లిపెసరను కూడా మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. ఈ పైరు 40 రోజులలో కోతకు వస్తుంది. 10-12 టన్నుల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడులను అందిస్తుంది.

కాయ జాతి పచ్చిమేతలు ఇవే

పిల్లిపెసర, లూసర్న్ గడ్డి, అలసంద వంటివి కాయ జాతి పచ్చిమేతలు. పిల్లిపెసర సాగుకు ఎకరానికి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఇది బలవర్ధకమైన పశుగ్రాసం. పాల దిగుబడి బాగుంటుంది. 50 రోజులకు ఒకసారి చొప్పున రెండు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల పచ్చిమేత వస్తుంది.లూసర్న్ గడ్డి మొక్క 80 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఎకరానికి 3-5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 50 రోజులకు ఒకసారి చొప్పున ఐదు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక అలసంద మొక్కలోని అన్ని భాగాలూ పశువులు తినడానికి ఉపయోగపడేవే. ఎకరానికి 12-15 కిలోల విత్తనాలు వేసుకుంటే 65 రోజుల్లో కోతకు వచ్చి 6-8 టన్నుల గ్రాసాన్ని అందిస్తుంది. మిశ్రమ పంటగా వేస్తే 6 కిలోల విత్తనాలు సరిపోతాయి.

ఇవి కూడా...

మెట్ట/బంజరు భూములకు అనువైన పశుగ్రాసం అంజన్ గడ్డి. ఇది నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఎకరానికి 2- 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. పైరు వేసిన 80 రోజులకు మొ దటి కోత కోసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి 60 రోజులకూ పచ్చిమేతను పొందవచ్చు. ఈ పైరు 15-20 టన్నుల పచ్చిమేతను అం దిస్తుంది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైన పశుగ్రాసపు చెట్టు అవిశ. దీని ఆకులు, కొమ్మలు పశువులకు మంచి పోషకాల తో కూడిన ఆహారాన్ని ఇస్తాయి. ఎకరానికి 5 వేల మొక్కలు నాటా లి. 60 రోజులకు ఒకసారి చొప్పున 8 సార్లు ఆకులు, కొమ్మలు కోసుకోవచ్చు. ఎకరానికి 15-20 టన్నుల దిగుబడి లభిస్తుంది.

 ఇక సుబాబుల్ చెట్టు ఆకులే కాకుండా కొమ్మలను కూడా పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరానికి 2-4 వేల మొక్కలు వేసుకోవాలి. ఆరు నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. అనంతరం 60 రోజులకు ఒకసారి చొప్పున 6 కోతలు కోసుకోవచ్చు. 15-20 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ పశుగ్రాసమైనా దానిని ఛాప్ కట్టర్‌తో చిన్న చిన్న ముక్కలుగా కోసి పశువులకు వేస్తే వృథా కాదు. పచ్చిమేతపై కొద్దిగా బెల్లపు నీటిని చల్లితే పశువులు ఇష్టంగా తింటాయి.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement