Padi-panta
-
పాడికి ఆధారం పచ్చిమేతే!
పాడి-పంట కడప అగ్రికల్చర్: పాడికి ఆధారం పచ్చిమేతే అన్నారు పెద్దలు. పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు. కేవలం చొప్ప పైన మాత్రమే ఆధారపడితే ప్రయోజనం ఉండ దు. పచ్చిమేత మేపితే పశువులు ఆరోగ్యంగా ఉంటా యి. సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అయితే ఒక్క వర్షాకాలం లో మినహా మిగిలిన అన్ని కాలాలలోనూ పాడి రైతులు తగినంత పశుగ్రాసం లభించక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి కారణం... పాడి పశువులకు కావాల్సిన పచ్చిమేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉండడం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రైతు లు విధిగా పశుగ్రాస పైర్లు వేసుకోవాలి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలు పశుగ్రాసాల సాగుకు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పచ్చిమేతల సాగుపై వైఎస్ఆర్ జిల్లా పశు గణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ హేమంత్ కుమార్ అందిస్తున్న సూచనలు... ఎలా ఉండాలి? మనం పండించే పశుగ్రాస పైరు రుచికరంగా, ఎక్కువ మాంసకృత్తులను కలిగి ఉండాలి. పశువులకు ఏ మాత్రం హాని కలిగించకుం డా, సులభంగా జీర్ణం కావాలి. తక్కువ కాలంలో, ఎక్కువ దిగుబడిని ఇవ్వగలగాలి. ఎరువుల అవసరం తక్కువ ఉండే పశుగ్రాసాన్ని ఎంచుకోవాలి. కోసిన తర్వాత నిల్వకు అనువుగా ఉండాలి. పశుగ్రాసాలు రెండు రకాలు. అవి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, కాయ జాతి పశుగ్రాసాలు. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు, కాయ జాతి పశుగ్రాసాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పంటకాలాన్ని బట్టి పశుగ్రాసాలను ఏక వార్షికాలు, బహు వార్షికాలుగా విభజించారు. రైతులు తమకు అనువైన పశుగ్రాసాన్ని ఎంచుకొని సాగు చేయాలి. ఇవి ధాన్యపు జాతి పచ్చిమేతలు మొక్కజొన్న, సజ్జ వంటివి ధాన్యపు జాతికి చెందిన ఏక వార్షిక పచ్చిమేతలు. మొక్కజొన్న పైరు రుచికరంగా, ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఎకరానికి 16-20 కిలోల విత్తనాలు వేసుకుంటే 70 రోజులకు 12-16 టన్నుల గ్రాసాన్ని ఇస్తుంది. అధిక పాల ఉత్పత్తి పొందడానికి, సైలేజీ (పాతర గడ్డి)కి బాగా అనువుగా ఉంటుంది. సజ్జను పశుగ్రాసంగా సాగు చేయాలనుకుంటే ఎకరానికి 5 కిలోల విత్తనాలు కావాలి. ఇందులో అలసంద, పిల్లిపెసరను కూడా మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. ఈ పైరు 40 రోజులలో కోతకు వస్తుంది. 10-12 టన్నుల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడులను అందిస్తుంది. కాయ జాతి పచ్చిమేతలు ఇవే పిల్లిపెసర, లూసర్న్ గడ్డి, అలసంద వంటివి కాయ జాతి పచ్చిమేతలు. పిల్లిపెసర సాగుకు ఎకరానికి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఇది బలవర్ధకమైన పశుగ్రాసం. పాల దిగుబడి బాగుంటుంది. 50 రోజులకు ఒకసారి చొప్పున రెండు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల పచ్చిమేత వస్తుంది.లూసర్న్ గడ్డి మొక్క 80 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఎకరానికి 3-5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 50 రోజులకు ఒకసారి చొప్పున ఐదు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక అలసంద మొక్కలోని అన్ని భాగాలూ పశువులు తినడానికి ఉపయోగపడేవే. ఎకరానికి 12-15 కిలోల విత్తనాలు వేసుకుంటే 65 రోజుల్లో కోతకు వచ్చి 6-8 టన్నుల గ్రాసాన్ని అందిస్తుంది. మిశ్రమ పంటగా వేస్తే 6 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇవి కూడా... మెట్ట/బంజరు భూములకు అనువైన పశుగ్రాసం అంజన్ గడ్డి. ఇది నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఎకరానికి 2- 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. పైరు వేసిన 80 రోజులకు మొ దటి కోత కోసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి 60 రోజులకూ పచ్చిమేతను పొందవచ్చు. ఈ పైరు 15-20 టన్నుల పచ్చిమేతను అం దిస్తుంది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైన పశుగ్రాసపు చెట్టు అవిశ. దీని ఆకులు, కొమ్మలు పశువులకు మంచి పోషకాల తో కూడిన ఆహారాన్ని ఇస్తాయి. ఎకరానికి 5 వేల మొక్కలు నాటా లి. 60 రోజులకు ఒకసారి చొప్పున 8 సార్లు ఆకులు, కొమ్మలు కోసుకోవచ్చు. ఎకరానికి 15-20 టన్నుల దిగుబడి లభిస్తుంది. ఇక సుబాబుల్ చెట్టు ఆకులే కాకుండా కొమ్మలను కూడా పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరానికి 2-4 వేల మొక్కలు వేసుకోవాలి. ఆరు నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. అనంతరం 60 రోజులకు ఒకసారి చొప్పున 6 కోతలు కోసుకోవచ్చు. 15-20 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ పశుగ్రాసమైనా దానిని ఛాప్ కట్టర్‌తో చిన్న చిన్న ముక్కలుగా కోసి పశువులకు వేస్తే వృథా కాదు. పచ్చిమేతపై కొద్దిగా బెల్లపు నీటిని చల్లితే పశువులు ఇష్టంగా తింటాయి. -
వాన నీటిని ఒడిసి పడదామా...!
పాడి-పంట జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల్లోకదలిక కారణంగా గత రెండు మూడు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోతే అది కాలువలు, వాగులు, నదుల్లో కలిసి చివరికి సముద్రం పాలవుతుంది. వాన నీటిని వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేసుకొని, అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటే రైతుకు సాగు నీటి కష్టాలే ఉండవు. సాగు నీటి వినియోగం, సంరక్షణపై రైతులు తగిన శ్రద్ధ వహిస్తే బెట్ట పరిస్థితుల్లోనూ పంటకు నీరు అందించవచ్చు. ఈ నేపథ్యంలో వర్షపు నీటి నిల్వపై కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయు పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.నిర్మల అందిస్తున్న సూచనలు... ఎందుకు నిల్వ చేయాలి? వివిధ వనరుల ద్వారా వునకు లభిస్తున్న నీటి లో 80% వరకు పంటలకు వినియోగమవుతోం ది. అయితే వివిధ కారణాల వల్ల ఇందులోనూ 35-40% వృథా అవుతోంది. అన్ని నీటి వనరులకు వర్షపు నీరే ఆధారం. దానిని నిల్వ చేసుకొని, సకాలంలో వినియోగించుకోలేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది. భూమి పైన పడుతున్న వర్షపు నీటిలో కొంత లోపలి పొరల్లోకి వెళుతుంది. కొంత ఆవిరవుతుంది. వుట్టిలో ఇంకిన నీరే పంటలకు ప్రధాన ఆధారవువుతుంది. కాబట్టి ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా చేయుటంతో పాటు తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయకపోతే వర్షపు నీటితో పాటు విలువైన భూమి పైపొర మట్టి, మనం వేసే పోషకాలు కూడా కొట్టుకుపోతాయి. ఫలితంగా కొన్నేళ్లకు ఉత్పాదకత తగ్గి, దిగుబడులు గణనీయంగా పడిపోతాయి. పంట భూమి నిస్సారమవుతుంది. ఇలా చేయండి ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి భూమిని లోతుగా దున్నితే వర్షపు నీరు లోపలికి బాగా ఇంకుతుంది. దీనివల్ల మొక్కల వేర్లు లోపలి పొరల్లోకి చొచ్చుకుపోరుు ఎక్కువ నీటిని, పోషకాలను గ్రహిస్తారుు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ పైరు వెంటనే నీటి ఎద్దడికి గురికాదు. పొలంలో వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రదేశంలో గుంత తవ్వుకోవాలి. దానిలోకి చేరిన వాన నీటిని అవసరమైనప్పుడు పంట పొలానికి వాడుకోవాలి. గుంత వైశాల్యం తక్కువగా, లోతు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే నీరు ఆవిరి కాదు. 3-4 మీటర్ల లోతు, 35-40 మీటర్ల పొడవు, అంతే వెడల్పు ఉండేలా గుంతను తవ్వుకోవాలి. గుంతలోని నీరు ఇంకిపోకుండా అడుగున, నాలుగు వైపులా టార్పాలిన్ షీట్ వేయాలి. సూర్యరశ్మికి నీరు అవిరి కాకుండా గుంత పైభాగాన్ని కూడా కప్పాలి. అలాగే కొండ లోయులు, గుట్టల వుధ్య కందకాలు తవ్వి గట్లను ఏర్పాటు చేసుకుంటే నీటి ప్రవాహ వేగం తగ్గి, కొంత నీరైనా నిల్వ ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో... మెట్ట ప్రాంతాల్లో వర్షపు నీటిని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన అతి సులభమైన పద్ధతి కాంటూరు సేద్యం. 2-7% వాలు ఉన్న భూములకు ఇది బాగా అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో వర్షపు నీరు ప్రవహించే వాలుకు అడ్డంగా గట్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. నేల కోతకు గురికాదు. నీటి ప్రవాహ వేగం తగ్గి, భూమిలోనే ఇంకిపోతుంది. వర్షపు నీటిని పంట భూమిలో ఇంకిపోయేలా చేయాలంటే వాలుకు అడ్డంగా దున్నాలి. వర్షపు నీటిని మళ్లిస్తే... భూమిపై పడిన వర్షపు నీరు వృథా కాకుండా దానిని బావులు, కుంటల్లోకి మళ్లించాలి. దీనివల్ల సాగు నీటి సవుస్యలు చాలా వరకు తీరతాయి. అంతేకాక బావులు, కుంటల్లో భూగర్భ జల మట్టం పెరుగుతుంది కూడా. అలాగే ఇంటి పైకప్పు నుంచి పడే నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించాలి. దీనివల్ల బోరు బావుల్లో నీటి లభ్యత పెరుగుతుంది. చిన్న చిన్న పిల్ల వాగుల సమీపంలో ఓ మోస్తరు గుంతలను తవ్వాలి. వర్షాలు పడినప్పుడు ఆ వాగుల్లోని నీటిని గుంతల్లోకి పంపితే చుట్టుపక్కల ఉన్న బావులు రీచార్జ్ అవుతాయి. నేలను బట్టే నిల్వ నేల ఏ మేరకు నీటిని నిల్వ చేసుకోగలదనేది దా ని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. తేలిక నే లల కంటే సారవంతమైన నేలలే ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగలుగుతాయి. భూమిలో చేరిన నీరు మొత్తం మొక్కలకు అందుబాటులో ఉం డదు. ఎందుకంటే నేలలో ఇంకిపోయిన నీటిలో ఎక్కువ భాగం లోపలి పొరల్లోకి చేరుతుంది. దానిని మొక్కలు గ్రహించలేవు. అందుబాటు లో ఉన్న నీటినే క్రవుం తప్పకుండా గ్రహిం చడం వల్ల నీటి లభ్యత తగ్గి మొక్కలు వాడిపోతాయి. కాబట్టి నీటిని ఒకేసారిగా మొక్కలకు ఇవ్వకుండా అవసరాన్ని బట్టి దఫదఫాలుగా అందిస్తే దిగుబడులు బాగుంటాయి. -
పూతకు రాకముందే పీకేయాలి
పాడి-పంట వర్షాలు పడుతున్నాయంటే చాలు... రైతులు ముందుగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కల గురించే. ఇక్కడా... అక్కడా.... అని లేకుండా ఈ మొక్క ఎక్కడైనా పెరుగుతుంది. దీనిని వివిధ ప్రాంతాల్లో క్యారట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కపుల్లాకు, కాంగ్రెస్ గడ్డి, చేతక్ చాందిని, అపాది, గజర్ అని కూడా పిలుస్తుంటారు. పేరేదైనా ఈ మొక్క కలిగించే నష్టం అపారం. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. దూర ప్రాంతాలకు సైతం తేలికగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో వయ్యారిభామ కలుపు మొక్కల గురించి ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఒ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న ఆసక్తికరమైన విషయాలు... ఏం జరుగుతుంది? వయ్యారిభామ వల్ల పంట మొక్కలకే కాదు... మనుషులు, పశువులకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. మనుషులు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధమైన అలర్జీతో బాధపడతారు. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాయడం వంటి సమస్యలూ వస్తాయి. ఈ విషపూరితమైన మొక్కల్ని తింటే పశువులు హైపర్ టెన్షన్‌కు గురవుతాయి. వాటి వెంట్రుకలు రాలిపోతాయి. ఇక పంటల విషయానికి వస్తే... వయ్యారిభామ మొక్కలు నీరు, పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతుంటాయి. ఫలితంగా దిగుబడులు 40% వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాటా, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వుకుళ్లు, కాండంకుళ్లు తెగుళ్లు సోకవచ్చు. వేరుశనగ పైరుకు నెక్రోసిస్ తెగులు సోకుతుంది. వయ్యారిభామ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. వాటి దిగుబడిని తగ్గిస్తాయి. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న వయ్యారిభామ మొక్కల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమ గ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏం చేయాలంటే... వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని చేతితో పీకేయాలి. మొక్కలు పూత దశకు రాకముందే పీకి తగలబెట్టాలి. లేకుంటే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కల్ని పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి. రసాయనాలతో... మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలకెత్తక ముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. మొక్కజొన్న, జొన్న పంటల్లో విత్తనాలు మొలకెత్తిన 15-20 రోజులకు లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున 2,4-డి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాస పంటలు వేసే వారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి. ఆ సమయంలో చేలో వయ్యారిభామ మొక్కలు కూడా ఉండకూడదు. పశుగ్రాస పైరు మొలకెత్తి న 15-20 రోజులకు లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే లీటరు నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ లేదా 5-7 మిల్లీలీటర్ల పారాక్వాట్ చొప్పున కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. కంపోస్ట్ తయారీ ఇలా... వయ్యారిభామ మొక్కలు ఎంత హానికరమైనవి అయినప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంతను తవ్వాలి. అందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కల్ని వేసి, వాటిపై 5 కిలోల యూరియా లేదా 50 కిలోల రాక్ ఫాస్ఫేట్ చల్లుకోవాలి. వీలైతే 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కూడా చల్లవచ్చు. ఒకవేళ వయ్యారిభామ మొక్కలకు వేర్లు లేకపోతే 10-15 కిలోల బంకమట్టి కలపాలి. ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి, పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్ట్‌లో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. కూరగాయ పంటలకు ఎకరానికి 2 కిలోల కంపోస్ట్ వేసుకోవచ్చు. వయ్యారిభామ మొక్కలతో తయారైన ఎరువు మనుషులు, పశువులు, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. వయ్యారిభామలో ఉండే పార్థినిస్ అనే హానికరమైన రసాయనం ఎరువు తయారీ దశలోనే నశిస్తుంది. కంపోస్ట్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని, అన్ని పంటలకూ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందిస్తున్న సూచనలు... పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి వర్షాధార పంటల్ని నేల పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొత్తగా పండ్ల తోటలు పెట్టే వారు గుంతలు తీసుకోవాలి. టమాటా, వంగ, మిరప వంటి కూరగాయ పంటలకు నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగ జాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలి. -
చెట్టుకూ విశ్రాంతి అవసరమే!
కడప అగ్రికల్చర్: మామిడి కాయల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలా మంది రైతులు కోతల తర్వాత తోటల్ని పట్టించుకోరు. దీనివల్ల చీడపీడల దాడి పెరిగి తదుపరి పంటపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో కాయల కోత అనంతరం మామిడి రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ (రిటైర్డ్) వేంపల్లె లక్ష్మీరెడ్డి అందిస్తున్న సూచనలు... కత్తిరింపులు ఎందుకు చేయాలి? మామిడి ఆకులు సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. దీనివల్ల చెట్టుకు కావాల్సిన ఆహార పదార్థాలు సమృద్ధిగా సమకూరుతాయి. అయితే ఓ అధ్యయనం ప్రకారం... చెట్టు గుబురుగా ఉండడం వల్ల సుమారు 85% ఆకులకు తగినంత సూర్యరశ్మి తగలడం లేదు. అవి దాదాపుగా నీడలోనే ఉంటున్నాయి. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతోంది.పైగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే జామ, సీతాఫలం వంటి చెట్ల ఆకులతో పోలిస్తే మామిడి ఆకులకు సూర్యరశ్మిని గ్రహించే శక్తి కాస్త తక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెట్టుకు ఆహార పదార్థాలు (పిండి పదార్థాలు) పూర్తి స్థాయిలో లభించాలంటే అన్ని ఆకుల పైన సూర్యరశ్మి పడాలి. ఇందుకోసం కొమ్మల కత్తిరింపు తప్పనిసరి. దీనివల్ల చెట్లకు చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. ఎలా చేయాలి? కాయలు కోసిన తర్వాత 15-20 రోజుల పాటు చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే అప్పటి వరకు చెట్లు కాయల వృద్ధికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి. కోత తర్వాత అవి నీరసిస్తాయి. కాబట్టి చెట్లకు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే కొమ్మల కత్తిరింపు జరపాలి. ఆగస్ట్ మొదటి పక్షం లోగా కత్తిరింపులు పూర్తి చేయాలి. ఇందుకోసం అడ్డదిడ్డంగా పెరిగిన, తెగులు సోకి ఎండిపోయిన కొమ్మల్ని పూర్తిగా తొలగించాలి. అలాగే నేలను తాకుతూ వ్యవసాయ పనులకు అడ్డుగా ఉన్న కొమ్మల్ని కత్తిరించాలి. ఎండిన పూత కాడల (కొరడాలు) కారణంగా ఎండు తెగులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు పడకముందే వాటిని కూడా తీసేయాలి. సూర్యరశ్మి, గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా గుబురుగా పెరిగిన చెట్ల తల పైన 3-4 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని తీసేయాలి. దీనివల్ల మధ్యాహ్నపు ఎండ చెట్టు మొదలుపై పడుతుంది. అవసరమైతే తూర్పు-పడమర దిశలో కూడా 2-3 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని దిశకు ఒకటి చొప్పున తొలగించాలి. ఈ విధంగా కత్తిరింపులు చేస్తే ఆకులకు సూర్యరశ్మి బాగా తగులుతుంది. ఆల్ఫోన్సో (కాధర్), బంగినపల్లి (బేనిషాన్) రకాల చెట్లు ప్రతి సంవత్సరం కాపుకు వచ్చి, మంచి దిగుబడులు అందించాలంటే జూలైలో అన్ని చిరుకొమ్మల్ని 10 సెంటీమీటర్ల వెనక్కి (ఆకులు గుంపుగా ఉన్న చోటుకు అంగు ళం పైకి) కత్తిరించాలి. దీనివల్ల ప్రతి కొమ్మ పైన 3-4 చిగురు కొమ్మలు పుడతాయి. వాటిలో ఆ రోగ్యంగా, దృఢంగా ఉన్న కొమ్మలు డిసెంబర్ నాటికి ముదిరి, జనవరిలో పూతకు వస్తాయి. తల మార్పిడి చేయాలంటే... నాటు రకం చెట్లు, తక్కువ దిగుబడిని అందించే చెట్లు, మార్కెట్లో మంచి ధర పలకని రకాలకు చెందిన చెట్లు... ఇలాంటి చెట్ల వల్ల రైతుకు ఆదాయం సరిగా రాదు. వీటి నుంచి కూడా నాణ్యమైన, అధిక దిగుబడులు పొందాలంటే తల మార్పిడి (టాప్ వర్కింగ్) చేయాలి. కాయల కోత తర్వాత జూలైలో కొమ్మలన్నింటినీ 4-5 అడుగుల పొడవు ఉంచి, రంపంతో కోసేయాలి. వాటిపై పుట్టుకొచ్చే లేత కొమ్మలకు సెప్టెంబర్‌లో మంచి రకాల కొమ్మలతో అంట్లు కట్టాలి. కత్తిరింపుల తర్వాత... కత్తిరింపులు చేసిన వెంటనే కోసిన భాగంపై మందు ద్రావణాన్ని పూయాలి. లీటరు నీటికి 10 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+6 గ్రాముల కార్బరిల్ చొప్పున కలిపి మందు ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. అలాగే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+10 గ్రాముల యూరియా చొప్పున కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. అంతర సేద్యం చేయాలి కాయల కోత తర్వాత తోటల్లో పడిన టెంకలు, ఎండు పుల్లల్ని ఏరి కాల్చేయాలి. జూలైలో వర్షాలు పడగానే భూమిని 2-3 సార్లు దున్నాలి. చెట్ల కింద దున్నడం కుదరకపోతే పారతో మట్టిని కలపాలి. సెప్టెంబర్ తర్వాత భూమిని దున్నకపోవడమే మంచిది. ఎరువులు ఇలా... రాలిపడిన ఎండుటాకుల్ని చెట్ల పాదుల్లో వేసి, మట్టితో కప్పేస్తే ఆ తర్వాత అవి కుళ్లి సేంద్రియ పదార్థంగా మారతాయి. చెట్లకు బలాన్నిస్తాయి. జూలై-ఆగస్ట్ నెలల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు చల్లి పూత దశలో మొక్కల్ని భూమిలో కలియదున్నాలి. జూలై-ఆగస్ట్‌లో ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు వేయాలి. నీటి వసతి ఉంటే... చెట్టుకు కిలో యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసి తడి ఇవ్వాలి. వర్షాధారపు తోటల్లో ఒక్కో చెట్టుకు 2 కిలోల యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. చెట్టు మొదలుకు 4-5 అడుగుల దూరంలో గాడి తీసి, అందులో ఎరువులు వేసి మట్టితో కప్పేయాలి. -
పప్పులే కాదు.. భూమికి బలాన్నీ ఇస్తాయి!
జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రైతులు పెసర, మినుము విత్తనాలు వేసుకుంటున్నారు. మార్కెట్లో పప్పు ధాన్యాలకు మంచి రేటు పలుకుతుండడంతో చాలా మంది రైతన్నలు ఇప్పుడు వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పైగా ఇవి అతి తక్కువ కాలంలో చేతికొస్తాయి. గాలిలోని నత్రజనిని రైజోబియుం బాక్టీరియూ సాయంతో స్థిరీకరించి, పంట ఎదుగుదలకు దోహదపడడంతో పాటు ఎకరానికి 16-20 కిలోల నత్రజని ఎరువును అందిస్తాయి. పంట తీసుకున్న తర్వాత భూమిలో కలియదున్నితే పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడి భూసారాన్ని పెంచుతాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకొని, తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటయ్య. ఆ వివరాలు... పెసర పంటే ఎందుకు? పెసరను పంటమార్పిడి పైరుగా, అంతరపంటగా కూడా వేసుకోవచ్చు. ఆయుకట్టు ప్రాంతాలలోనూ, చెరువులు-వ్యవసాయ బావులు వంటి నీటి వనరుల కింద వరి పండించే భూముల్లోనూ ముందుగా పెసర వేసుకొని, ఆ తర్వాత వరి వేసుకోవచ్చు. అయితే పైరు ఒకేసారి కోతకు రాకపోవడం, చీడపీడలకు సులభంగా లోనవడం వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెసరను అన్ని రకాల నేలల్లో సాగు చేయువచ్చు. కానీ చౌడు నేలలు, మరుగు నీరు నిలిచే భూములు పనికిరావు. అనువైన రకాలివే ఎల్జీజీ-407 రకం పంటకాలం 70-75 రోజులు. మొక్కలు నిటారుగా పెరిగి కాయులు మొక్క పైభాగాన కాస్తారుు. గింజలు మెరుస్తూ వుధ్యస్థ లావుగా ఉంటారుు. ఈ రకం ఎల్లో మొజారుుక్, నల్ల ఆకువుచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎల్జీజీ-410 రకం 75 రోజుల పంట. మొక్కలు నిటారుగా, గుబురుగా పెరుగుతారుు. గింజలు పెద్దవిగా మెరుస్తూ ఉంటారు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్జీజీ-450 రకం పైరు 65-70 రోజుల్లో కోతకు వస్తుంది. మొక్కలు వుధ్యస్థ ఎత్తులో ఉండి, గుబురుగా కన్పిస్తారుు. పంట చేతికొచ్చే సవుయుంలో వర్షాలు కురిసినప్పటికీ గింజలు కొంతమేర చెడిపోవు. పూసా-105 రకం పంటకాలం 65-70 రోజులు. ఇది అన్ని ప్రాంతాలకూ అనువైనది. కాయులన్నీ పైభాగంలోనే ఉండి ఒకేసారి కోతకు వస్తాయి. ఈ రకం పల్లాకు, ఆకువుచ్చ తెగుళ్లను కొంతమేర తట్టుకుంటుంది. ఎంజీజీ -295 రకం 65-70 రోజుల పంట. మొక్కలు నిటారుగా పెరుగుతారుు. ఈ రకం నల్లవుచ్చ తెగులును తట్టుకుంటుంది. గింజ వుధ్యస్థ లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. డబ్ల్యూజీజీ-37 రకం పంటకాలం 60-65 రోజులు. గింజలు ఆకర్షణీయుంగా, పచ్చగా మెరుస్తుంటారు. దీనిని అన్ని ప్రాంతాల్లో సాగు చేయువచ్చు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్లో మెజారుక్ తెగులును తట్టుకుంటుంది. ఎల్జీజీ-460 రకం 60-65 రోజుల పంట. కాయులు గుత్తులుగా ఉండి కోయుడానికి సులువుగా ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎంఎల్-267 రకం 65 రోజుల పంట. అన్ని ప్రాంతాలకూ అనువైనది. మొక్క నిటారుగా ఉండి కింది నుండి పై దాకా కాస్తుంది. పెసర రకాలన్నీ ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని అందిస్తాయి. తేమను నిలుపుకునే నేలల్లో... మినుమును నల్లరేగడి భూవుుల్లో పొగాకు పంటకు వుుందు ఎక్కువగా సాగు చేస్తారు. పంటల సరళిలో దీనిని పంటవూర్పిడి పైరుగా, అంతరపంటగా వేస్తారు. అయితే తొలకరిలో వేసే మినువుు పంట నీటి ఎద్దడిని త ట్టుకోలేదు. కాబట్టి తేవును నిలుపుకోలేని తేలికపాటి భూవుులు, ఎర్ర నేలలు మినువుు సాగుకు పనికిరావు. ఖరీఫ్ పైరుకు పల్లాకు, ఆకుముడత తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి. ఈ రకాలు వేసుకోవచ్చు ఎల్బీజీ-20 రకం ఆకులు సన్నగా, పొడవుగా వుుదురాకుపచ్చ రంగులో ఉంటారుు. ఈ రకం పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు నల్లగా మెరుస్తుంటారుు. పైరు 70-75 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. డబ్ల్యుబీజీ-26 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. గింజలు సాదాగా ఉంటారు. ఈ రకం పల్లాకు తెగులును కొంతమేర తట్టుకోగలదు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి సుమారు 5 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఎల్బీజీ-623 రకం కాయులు పొడవుగా, లావుగా ఉంటాయి. వాటి పైన నూగు చాలా తక్కువగా ఉంటుంది. గింజలు లావుగా మెరుస్తూ ఉంటారుు. మొక్కలు గుబురుగా పెరుగుతారుు. ఈ రకం బూడిద తెగులును కొంతమేర తట్టుకుంటుంది. దీని పంటకాలం 75-80 రోజులు. ఎకరానికి 7 క్వింటాళ్లకు పైగా దిగుబడిని అందించగలదు. టీ-9 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. ఆకులు సన్నగా, వుుదురాకుపచ్చ రంగులో ఉంటారు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. సాగు ఇలా... పెసర పంటకు ఎకరానికి 6-7 కిలోలు, మినుముకు 8-10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తడానికి ముందు కిలో విత్తనాలకు 30 గ్రాముల కార్బోఫ్యూరాన్ మందును పట్టించి శుద్ధి చేయాలి. పైరును తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/థయోమిథాక్సామ్ చొప్పున కలపాలి. ఈ పైర్లను కొత్తగా సాగు చేసే వారు రైజోబియం కల్చర్‌ను కూడా కలిపితే మంచి దిగుబడులు వస్తాయి. -
ఆకుల రంగు మారిపోతుంది!
పాడి-పంట: మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలూ అవసరమేనని గత వారం తెలుసుకున్నాం. వాటిలో ఒకటైన జింక్ లోపిస్తే వివిధ పంటల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నాం. సూక్ష్మ పోషకాల్లో మరో ముఖ్యమైన ధాతువు ఇనుము. ఇది చాలా రకాల ఎంజైములకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, జీవక్రియ చురుకుగా జరిగేలా చూస్తుందని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఆ వివరాలు... వరి-మొక్కజొన్నలో... వరి పైరులో ఇనుప ధాతు లోపం లేత చిగురాకుల మీద కన్పిస్తుంది. ఇనుము లోపించిన లేత చిగురాకుల్లో ఈనెల మధ్య ఉన్న ఆకు పసుపు రంగుకు మారుతుంది. ఈనెలు మాత్రం లేత ఆకుపచ్చ లేదా లేత పసుపు రంగులో ఉంటాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు పూర్తిగా తెల్లబడతాయి. పసుపు రంగుకు మారిన ఆకు భాగాలు ఇటుక రంగుకు మారి ఎండిపోతాయి. ముందుగా ఆకుల కొనలు, పక్కలు ఎండుతాయి. అక్కడి నుంచి మొదలై లోపలి భాగాలూ ఎండిపోతాయి. క్రమేపీ ఆకుల్లోని ఆకుపచ్చ రంగు పూర్తిగా పోతుంది. ఒక్కోసారి ఆకులు రాలిపోతాయి. ఇక మొక్కజొన్న పైరులో ఇనుప ధాతువు లోపిస్తే ఆకుల ఈనెల మధ్య భాగం లేత ఆకుపచ్చ రంగు నుంచి తెలుపు రంగుకు మారుతుంది. వేరుశనగలో... సున్నం అధికంగా ఉండే నేలల్లో, ముంపుకు గురయ్యే నల్లరేగడి నేలల్లో, బైకార్బొనేట్ ఎక్కువగా ఉండే సాగు నీటితో పండిస్తున్న వేరుశనగ పంటలో ఇనుప ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది. ఈ ధాతువు లోపించడం వల్ల ఆకులు లేత ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. అవి క్రమేపీ ఈనెలతో సహా పసుపు రంగుకు మారతాయి. ఇనుప ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకు మొత్తం లేత పసుపు లేదా తెలుపు రంగుకు మారిపోతుంది. కొత్త చిగుర్లు పూర్తిగా తెల్లగా ఉంటాయి. చెరకులో... ఇనుప ధాతువు లోపించిన చెరకు తోటలో ఆకులు పాలిపోయి, లేత పసుపు లేదా తెలుపు రంగుకు మారతాయి. ముందుగా ఈనెల మధ్య భాగం పాలిపోతుంది. ఆ తర్వాత ఈనెలకు సమాంతరంగా ఆకుల పొడవునా ఉన్న భాగం రంగు మారుతుంది. ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లబడతాయి. చెరకు మొక్కలు బాగా ఎదిగిన తర్వాత ఇనుము లోపిస్తే ముదురు ఆకులు పచ్చగానే ఉన్నప్పటికీ లేత ఆకులు పాలిపోతాయి. కార్శి తోటల్లో ఈ ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది. శనగలో... శనగ పైరులో ఇనుప ధాతువు లోపిస్తే ఆకులు పసుపు రంగుకు మారతాయి. మొక్కలు కుంచించుకుపోతాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు గోధుమ రంగుకు మారతాయి. చివర్లు ఎండిపోతాయి. బత్తాయి-నిమ్మలో... ఇనుప ధాతు లోపం నిమ్మ తోటల్లో ఎక్కువగా కన్పిస్తుంది. ఈ ధాతువు లోపించిన తోటల్లో లేత ఆకుల ఈనెలు ఆకుపచ్చగానే ఉన్నప్పటికీ మిగిలిన భాగం మొత్తం పసుపు రంగుకు మారుతుంది. చివరికి ఆకు మొత్తం పాలిపోయి తెల్లగా మారుతుంది. కాయలు కూడా రాలిపోతాయి. కొన్ని కూరగాయ పంటల్లో ఇనుప ధాతువు లోపించినప్పుడు కూడా ఇవే లక్షణాలు కన్పిస్తాయి. ఎలా నివారించాలి? ఆకులపై ఇనుప ధాతు లోపాన్ని గమనించినట్లయితే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అన్నభేది (ఫై సల్ఫేట్) కలిపి పిచికారీ చేసుకోవాలి. కిలో అన్నభేదికి 100 గ్రాముల చొప్పున నిమ్మ ఉప్పు కలిపితే మంచి ఫలితం వస్తుంది. ఈ మందు ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటే ఇనుప ధాతు లోపాన్ని పూర్తిగా నివారించవచ్చు. జింక్ లోపిస్తే...? పైరు వేసే ముందు ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను వేసుకోవడం ద్వారా జింక్ లోపాన్ని నివారించవచ్చు. చౌడు భూముల్లో మాత్రం ఎకరానికి 40 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరులో జింక్ లోప లక్షణాలు కన్పిస్తే 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని (లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలపాలి) వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. -
పశువులకు వీటి అవసరమూ ఉంటుంది!
పాడి-పంట: ఖనిజ లవణాల లోపం కారణంగా పశువులు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిలో ఆలస్యంగా ఎదకు రావడం, తిరిగి పొర్లడం, గొడ్డుమోతుతనం ప్రధానమైనవి. పునరుత్పత్తి సమస్యలు కూడా ఎదురైతే ఈతల మధ్య అంతరం పెరుగుతుంది. అలాంటప్పుడు పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండదు. ఆవు జాతి పశువు సంవత్సరానికి ఒక దూడను, గేదె 15 నెలలకు ఒక దూడను అందించగలిగినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అలా ఉండాలంటే పశువులకు అవసరమైన ఖనిజాలను విధిగా అందించాలి. పశువులు ఖనిజాలను తమ శరీరంలో ఉత్పత్తి చేసుకోలేవు కాబట్టి వాటిని మేత ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మేత వనరుల్లో ఉండే ఖనిజాలు సైతం పూర్తి స్థాయిలో పశువులకు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రికెట్స్, ఆక్టియోమలేసియా, పైకా (విపరీతమైన ఆకలి), గిట్టల పెరుగుదలలో లోపం, చర్మం రంగును కోల్పోవడం, రక్తహీనత, మృత దూడలు పుట్టడం, గొంతువాపు, ఎదుగుదల లోపించడం, పాల దిగుబడి పడిపోవడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం.... ఇలా అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాడి పశువుకు జన్యుపరంగా అధిక పాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ సమతుల్యమైన పోషణ లేకపోవడం వల్ల వాటి నుంచి పూర్తి స్థాయిలో ఉత్పాదకతను పొందలేకపోతున్నాము. వీటి అవసరం ఎక్కువ పాలలో 0.12% కాల్షియం, 0.10% భాస్వరం ఉంటాయి. పాడి పశువు శరీరానికి ఇవి తగినంత లభిస్తే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆవులతో పోలిస్తే గేదెలకు కాల్షియం అవసరం ఎక్కువ. ఎందుకంటే గేదె పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మేతలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా అందించాలి. అలాగే కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉత్పత్తి కావడానికి గంధకం చాలా అవసరం. విటమిన్ల తయారీకి కూడా గంధకం అవసరమవుతుంది. పశువు రక్తంలో కాల్షియం, భాస్వరం సరైన నిష్పత్తిలో ఉండాలి. లేకపోతే ఎముకల్లో నిల్వ ఉండే కాల్షియం రక్తంలోకి చేరుతుంది. అనంతరం ఆ పశువు అందించే పాలను తాగడం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. సాధారణ పశువు ఈనిన తర్వాత పాలజ్వరం, హైపోకాల్షియం (రక్తంలో కాల్షియం తగ్గడం) వంటి లక్షణాలు కన్పిస్తాయి. వీటిని నివారించాలంటే చూడి సమయంలో పశువుకు అదనంగా కాల్షియం ఇవ్వాలి. ఎందుకంటే పాలజ్వరం వచ్చిన పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పాలజ్వరం నుంచి తేరుకున్న తర్వాత పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఓ కారణం ఉంది. పాలజ్వరం బారిన పడిన పశువుకు చనుల కండరాలు వదులవుతాయి. సూక్ష్మక్రిములు చనుల రంధ్రాల ద్వారా పొదుగులోకి ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. కాబట్టి పశువుకు కాల్షియం, భాస్వరం, సోడియం, పొటాషియం, గంధకం వంటి ఖనిల లవణాల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. అవసరం తక్కువే అయినా... పశువుకు రాగి (కాపర్), జింక్, మాంగనీస్, అయొడిన్, కోబాల్ట్, క్రోమియం వంటి ఖనిజాల అవసరం కూడా ఉంటుంది. కాకపోతే కాస్త తక్కువ పరిమాణంలో అందిస్తే చాలు. ఇవి కూడా పాల దిగుబడికి దోహదపడతాయి. ఇవి లోపిస్తే పశువులు తక్కువ మేత తింటాయి. బరువు కోల్పోతాయి. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఈనిన తర్వాత మాయ పడదు. పశువు ఈసుకుపోతుంది. దూడలు తక్కువ బరువుతో పుడతాయి. విటమిన్ ‘ఎ’తో జింక్ కలిసినప్పుడు పశువు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. జననేంద్రియాల కణాల క్రమం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రాగి ధాతువు జననేంద్రియ సంబంధమైన ఓవరీస్ పనితనాన్ని పెంచుతుంది. మాంగనీస్ ఖనిజం చాలా వరకు ఎంజైమ్ రసాయనిక చర్యల్లో పాలుపంచుకుంటుంది. ఈ ఖనిజం లోపిస్తే పశువు శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. పునరుత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. పశువు గర్భంలోని దూడ పెరగడానికి అయొడిన్ దోహపడుతుంది. ఇది లోపిస్తే పశువు గర్భంలోనే దూడలు చనిపోతాయి. చూడి పశువు ఈసుకుపోతుంది. పుట్టిన దూడలు కూడా బలహీనంగా ఉంటాయి. మగ పశువుల్లో సంపర్క సామర్థ్యం తగ్గిపోతుంది. ఖనిజాలను పశువు శరీరం ఉత్పత్తి చేయదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో... అంటే అధిక పాల దిగుబడికి, పునరుత్పత్తి సామర్థ్యం పెరగడానికి, ఎదుగుదలకు, జీర్ణ ప్రక్రియ సజావుగా సాగడానికి, వేసవిలో ఒత్తిడి లేకుండా ఉండడానికి విధిగా మేతలో ఖనిజ లవణాలను అందించాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ సీనియర్ శాస్త్రవేత్త-అధిపతి పశు పరిశోధనా స్థానం, గరివిడి విజయనగరం జిల్లా ఒత్తిడిలో ఎంతో అవసరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు ఒత్తిడికి గురవుతాయి. మేత తినడం తగ్గిపోతుంది. ఫలితంగా పశువులకు ఖనిజాల లభ్యత కూడా తగ్గుతుంది. పశువు తన శరీరంలోని వేడిని చెమట ద్వారా బయటికి పంపుతుంది. అంటే పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఖనిజాలను ఎక్కువగా కోల్పోతుందన్న మాట. కాబట్టి వీటిని... ముఖ్యంగా పొటాషియంను మేత ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ ఖనిజం పాలలో 0.15% వరకు ఉంటుంది. అధిక పాల దిగుబడిని అందించే పశువులకు, వేసవిలో ఒత్తిడికి లోనయ్యే పశువులకు ఈ ఖనిజాన్ని తప్పనిసరిగా అందించాలి. ఎండలో పశువు రొప్పుతున్నప్పుడు లాలాజలం ఎక్కువగా బయటికి పోతుంది. దీనితోపాటు శరీరంలోని సోడియం బైకార్బొనేట్ కూడా పోతుంది. దీనిని మేత ద్వారా అందిస్తే పశువు ఆహార అవసరాలు తీరతాయి. -
ఆరోగ్యవంతమైన నారు కోసం...
పాడి-పంట: అమలాపురం (తూర్పు గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. మంచి దిగుబడులు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచించిన మేలైన, తమ ప్రాంతానికి అనువైన వంగడాలను సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే చేపట్టాల్సిన చర్యలపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు అందిస్తున్న సూచనలు... విత్తన మోతాదు-శుద్ధి ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేయడానికి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. సెంటుకు ఐదు కిలోల చొప్పున ఐదు సెంట్ల నారుమడిలో విత్తనాలు చల్లుకోవాలి. వర్షాధార పంటగా వరి వేసే వారు గొర్రుతో విత్తడానికి 30-36 కిలోల విత్తనాలు వినియోగించాలి. వరిలో విత్తనశుద్ధి తప్పనిసరి. దీనివల్ల విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించవచ్చు. పొడి విత్తనశుద్ధి చేసే వారు కిలో విత్తనాలకు మూడు గ్రాముల చొప్పున కార్బండజిమ్ పట్టించి, రెండు రోజుల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. తడి విత్తనశుద్ధి కోసం లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాల్ని 24 గంటలు నానబెట్టి, ఆ తర్వాత 24-36 గంటల పాటు మండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాల్ని నారుమడిలో చల్లుకోవాలి. నారుమడి తయారీ ఇలా... దృఢమైన, ఆరోగ్యవంతమైన నారును పొందాలంటే విత్తనాలు చల్లడానికి ముందు నారుమడిని మూడుసార్లు బాగా దున్ని కలుపు మొక్కల్ని ఏరేయాలి. ఆ తర్వాత గొర్రుతో చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12-16 రోజులకు మరోసారి ప్రతి ఐదు సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వేయాలి. నారు పీకడానికి ముందు నత్రజని ఎరువు వేయకూడదు. చివరి దమ్ములో భాస్వ రం, పొటాష్లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వేయాలి. సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది. నీరు ఎలా అందించాలి? నారుమడిలో సెంటీమీటరు లోతున నీరు ఉంచి, సాయంకాలం వేళ విత్తనాలు చల్లుకోవాలి. మరుసటి రోజు ఉదయం నీటిని తీసేయాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకూ ఆరుతడులు ఇచ్చి, ఆ తర్వాత పలచగా నీరు పెట్టాలి. నారుమడిలో తగినంత నీరు లేకపోతే భూమిలో సన్నని పగుళ్లు ఏర్పడతాయి. మొక్కల వేర్లు భూమి లోపలికి పోయి, పీకేటప్పుడు తెగిపోతాయి. దీనివల్ల ప్రధాన పొలంలో నాటేందుకు నారు సరిపోకపోవచ్చు. కలుపు నివారణ ఎలా? నారుమడిలో కలుపు నివారణ కోసం విత్తనాలు చల్లిన మూడు రోజులకు లీటరు నీటికి ఐదు మిల్లీలీటర్ల బ్యూటాక్లోర్ లేదా సోఫిట్ (ప్రెటిలాక్లోర్, సేఫ్‌నర్ కలిసిన మందు) చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వరి నారుమడుల్లో ప్రధానంగా వచ్చే కలుపు ఊద. ఈ కలుపు మొక్కలు, వరి మొక్కలు తొలి దశలో ఒకే విధంగా ఉంటా యి. వీటిని గుర్తించి తొలగించడం చాలా కష్టం. విత్తనాలు చల్లిన 15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో ఊద, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు సమానంగా ఉన్నట్లయితే విత్తనాలు చల్లిన 15 రోజులకు 10 లీటర్ల నీటికి 4 మిల్లీలీటర్ల చొప్పున బిస్ పైరిబాక్ సోడియం 10% కలిపి పిచికారీ చేయాలి. చీడపీడల నివారణ కోసం... నారుమడిలో చీడపీడల నివారణ కోసం... విత్తనాలు చల్లిన 10 రోజులకు ఐదు సెంట్ల నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేసుకోవాలి. లేకుంటే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి విత్తనాలు చల్లిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు మరోసారి పిచికారీ చేయాలి. లేకుంటే నారు పీకడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గుళికల్ని పైన సూచించిన మోతాదులో వేయాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోండి నారు పీకేటప్పుడు వేర్లు ఎక్కువగా తెగిపోకుండా చూసుకోవాలి. ఇందుకోసం నారుమడికి ముందుగా నీరు పెట్టి, నేలను బురద పదును మీద ఉంచాలి. పీకిన నారు మొక్కలు వడలకుండా ఉండాలంటే వాటిని నీటిలో ఉంచాలి. నారు లేతాకుపచ్చ రంగులో ఉన్నట్లయితే నాటిన తర్వాత మొక్కలు త్వరగా కోలుకొని పిలకలు తొడుగుతాయి. ముదురాకుపచ్చగా ఉంటే మొక్కలు ఎండిపోయి త్వరగా మూన తిరగవు. నారుమడిలో జింక్ లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఈ పంటలు వేసుకోండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు ప్రస్తుతం టమాటా, వంగ, మిరప నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు. -
పంటకు ఈ పోషకాలూ అవసరమే!
పాడి-పంట: మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత అవసరమో కాల్షియం, మెగ్నీషియం, గంధ కం, జింక్, బోరాన్, ఇనుము, రాగి వంటి సూక్ష్మ పోషకాలూ అం తే అవసరం. బెట్ట పరిస్థితుల్లోనూ, వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు పంటల్లో సూక్ష్మ ధాతు లోపాలు అధికంగా కన్పిస్తుంటా యి. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల గురించి ఆచార్య ఎన్.జి.రం గా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న వివరాలు... ఎందుకు లోపిస్తున్నాయి? పంటలకు వేస్తున్న కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువుల (యూరియా, పొటాష్) వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో రైతులు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని వాడేవారు. వీటి ద్వారా మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోతోంది. ఫలితంగా చాలా పంటల్లో సూక్ష్మ పోషకాలు లోపించి, దిగుబడులు తగ్గుతున్నాయి. ఏ పంటలో ఏ లోపం? వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, శనగ, పత్తి పంటల్లో ఎక్కువగా జింక్ ధాతువు లోపిస్తోంది. మొక్కజొన్నలో ఇనుప ధాతు లోపం కూడా అధికంగానే ఉంటోంది. ఈ ధాతువు వరి, వేరుశనగ, శనగ, చెరకు పంటల్లోనూ లోపిస్తోంది. ఇక బీటీ పత్తి పంటను మెగ్నీషియం, జింక్, బోరాన్ ధాతు లోపాలు అతలాకుతలం చేస్తున్నాయి. జింక్ దేనికి ఉపయోగం? మొక్కల ఎదుగుదలకు ఎంజైములు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులు అవసరమవుతాయి. ఇవి తయారు కావడానికి జింక్ దోహదపడుతుంది. కణజాలాల్లో కొన్ని ప్రత్యేక ఎంజైములు లోపిస్తే మొక్కల్లో పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. మనం పంటకు అందిస్తున్న నత్రజని, భాస్వరం ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరగాలంటే జింక్ వాడకం తప్పనిసరి. వరిలో లోపిస్తే... నాట్లు వేసిన 2 నుంచి 6 వారాల్లో వరిలో జింక్ లోపం కన్పిస్తుంది. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. పైరు పలచబడుతుంది. మిగిలిన పిలకలు కూడా దుబ్బు కట్టవు. ఆకుల్లో మధ్య ఈనె ఆకుపచ్చ రంగును కోల్పోయి, పసుపు రంగుకు మారుతుంది. ఆకు చివర్లు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ముదురు ఆకులపై మధ్య ఈనెకు రెండు పక్కల తుప్పు రంగు మచ్చలు కన్పిస్తాయి. ఆకులు చిన్నవిగా నూలు కండె ఆకారంలో, పెళుసుగా ఉంటాయి. వాటిని విరిస్తే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పిలకలు తొడగదు. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉంటాయి. పైరు గిడసబారుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది. మొక్కజొన్నలో ఏమవుతుంది? మొక్కజొన్న పైరులో జింక్ లోపిస్తే ఆకు ఈనెల మధ్య భాగం తేలికపాటి చారలతో లేదా తెల్లని పట్టీల మాదిరిగా కన్పిస్తుంది. అయితే ఆకుల అంచులు, పెద్ద ఈనెలు, చివర్లు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. మొక్కలు గిడసబారతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తెల్ల మొగ్గ లక్షణాలు కన్పిస్తాయి. కొత్తగా వచ్చే ఆకులు దాదాపు తెల్లగా ఉంటాయి. ఆకులు చిన్నవి అవుతాయి తేలికపాటి నేలల్లో, సున్నం అధికంగా ఉండే నేలల్లో, ముంపు నేలల్లో సాగు చేసిన వేరుశనగ పైరులో జింక్ లోపం కన్పిస్తుంది. సాగునీటిలో బైకార్బొనేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ధాతువు లోపిస్తుంది. జింక్ లోపించినప్పుడు ఆకులు మామూలు సైజులో ఉండక చిన్నవిగా ఉంటాయి. రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది. ఫలితంగా ఆకులు చిన్నవిగా, గుబురుగా కన్పిస్తాయి. ఈనెల మధ్య ఉండే ఆకు భాగం లేత పసుపు రంగులోకి మారవచ్చు. శనగలో జింక్ ధాతువు లోపిస్తే ముదురు ఆకులు లేత పసుపు రంగుకు మారతాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువైన కొద్దీ ఆకులు ఎర్రగా మారతాయి. వేరుశనగ పైరులో మాదిరిగా ఆకులు చిన్నవిగా మారి, మొక్కలు కుదించుకుపోతాయి. ఆకులు తుప్పు రంగుకు మారతాయి బంకమన్ను అధికంగా ఉన్న నల్లరేగడి నేలల్లో, సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లో సాగు చేస్తున్న పత్తి పైరులో జింక్ లోపించే అవకాశం ఉంది. విత్తనాలు వేసిన 3 వారాల తర్వాత లోప లక్షణాలు కన్పిస్తాయి. పాత, కొత్త ఆకులు ఎరుపుతో కూడిన తుప్పు రంగుకు మారతాయి. లేత పైరులో మధ్య ఆకులు తమ సహజ ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఈనెల మధ్య భాగం బంగారం లాంటి పసుపు రంగుకు మారుతుంది. ఆకుల చివర్ల నుంచి మొదలుకు గోధుమ రంగు మచ్చలు వ్యాపిస్తాయి. ఆకుల చివర్లు ఎండిపోతాయి. ఆకులు పైకి లేదా కిందికి ముడుచుకుంటాయి. మొక్కల్లో పెరుగుదల సరిగా ఉండదు. ఆకులు, కాండం చిన్నవిగా మారి, గుబురుగా కన్పిస్తాయి. (మిగతా వివరాలు వచ్చే వారం) -
పసుపు సాగుకు సమయమిదే
పాడి-పంట: కమ్మర్పల్లి (నిజామాబాద్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు పసుపు సాగుకు సమాయత్తమవుతున్నారు. కొందరు ఇప్పటికే స్వల్పకాలిక, మధ్యకాలిక రకాలకు చెందిన విత్తన కొమ్ముల్ని నాటుకున్నారు. పసుపు దుంప జాతికి చెందిన ఉష్ణమండల పంట. దీనికి తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పసుపు సాగుపై నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె.ఉమామహేశ్వరి అందిస్తున్న సూచనలు... పసుపు సాగుకు నీరు ఇంకిపోయే గులక, తువ్వ, గరప, నల్ల నేలలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మురుగు నీటి పారుదల సౌకర్యం కలిగిన బరువు నేలలు, అధిక సేంద్రియ కర్బనం కలిగిన నేలలు కూడా ఈ పంట సాగుకు అనువైనవే. పసుపు పంట నీటి ముంపును తట్టుకోలేదు. కాబట్టి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పసుపు వేయకూడదు. అదేవిధంగా పల్లపు భూములు, ఉప్పు నేలలు, క్షార భూములు కూడా పనికిరావు. ఎప్పుడు-ఎలా వేయాలి? పసుపు పంటను జూలై 15 లోగా వేసుకోవాలి. ఆ తర్వాత వేస్తే దిగుబడులు తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, బలమైన మొక్కల నుంచి విత్తన కొమ్ముల్ని సేకరించాలి. తల్లి, పిల్ల కొమ్ముల్ని నాటుకోవచ్చు. 6-8 సెంటీమీటర్ల పొడవున్న, మొలకెత్తుతున్న పిల్ల కొమ్ములు అనువుగా ఉంటాయి. అవి దృఢంగా ఉండాలి. అయితే తల్లి కొమ్ముల్ని వాడితే దిగుబడి ఎక్కువ వస్తుంది. పసుపు కొమ్ముల్ని మూడు పద్ధతుల్లో నాటుకోవచ్చు. అవి ఎత్తుమడుల పద్ధతి, సమతుల మడుల పద్ధతి, బోదె సాళ్ల పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో... మడుల మధ్య 30 సెంటీమీటర్ల కాలువ ఉండేలా మీటరు వెడల్పుతో ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, కొమ్ముల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలి. ఇక సమతుల మడుల పద్ధతిలో... 30 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తూ మడకసాలు చేసి, అందులో 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలా విత్తనం వేసి, చదును చేయాలి. ఆ తర్వాత కయ్యలు చేసుకొని, వాటి మధ్య నీటి కాలువలు ఏర్పాటు చేయాలి. బోదె సాళ్ల పద్ధతిలో... 45 నుంచి 60 సెంటీమీటర్ల ఎడం ఉండేలా బోదెలు తయారు చేసుకోవాలి. వాటి మీద 20 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తూ విత్తన కొమ్ములు నాటాలి. వరుసల మధ్య ఉండే సాళ్ల ద్వారా నీటిని అందించవచ్చు. విత్తనశుద్ధి ఇలా... విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్లు, తాటాకు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల రిడోమిల్ యం.జడ్/మాంకోజెబ్ చొప్పున కలిపి ఆ ద్రావణంలో విత్తన కొమ్ముల్ని 40 నిమిషాల పాటు ముంచాలి. విత్తన కొమ్ముల్ని పొలుసు పురుగులు ఆశించి ఉన్నట్లయితే లీటరు నీటికి 3-5 గ్రాముల చొప్పున మలాథియాన్ కూడా కలపాలి. అనంతరం విత్తన కొమ్ముల్ని ఆరబెట్టాలి. లీటరు నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కలిపి, ఆ ద్రావణంలో విత్తన కొమ్ముల్ని 40 నిమిషాల పాటు ముంచి, ఆరబెట్టాలి. ఆ తర్వాత నాటుకోవాలి. అంతరపంటలూ వేసుకోవచ్చు పసుపులో మొక్కజొన్న, ఆముదం పంటల్ని అంతరపంటలుగా వేసుకుంటే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. పసుపులో మొక్కజొన్నను 2:1 నిష్పత్తిలో, ఆముదాన్ని 10:1 నిష్పత్తిలో వేసుకోవాలి. పసుపులో కందిని వేయాలనుకుంటే 9:1 నిష్పత్తిని పాటించాలి. కొబ్బరి, మామిడి తోటల్లో పసుపును అంతరపంటగా వేసుకోవచ్చు. కలుపు నివారణ-అంతరకృషి కలుపు నివారణ కోసం పొలం తయారీ దశలోనే లీటరు నీటికి 8 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్+20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్/10-15 గ్రాముల యూరియా చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొమ్ములు నాటిన మర్నాడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 500-800 గ్రాముల అట్రాజిన్ కలిపి భూమిలో తేమ ఉండేలా చూసుకొని పిచికారీ చేయాలి. కొమ్ములు నాటిన 40-45 రోజులప్పుడు అంతరకృషి చేయాలి. అవసరాన్ని బట్టి 60, 90, 120, 150 రోజులప్పుడు కూడా కలుపు తీయించాలి. నీరు-ఎరువులు కొమ్ములు నాటిన వెంటనే నీరు పెట్టాలి. మొలక వచ్చి మొక్క కనబడే వరకు 4-6 రోజులకొకసారి తడి ఇవ్వాలి. పంటకాలంలో బరువు నేలల్లో 15-20, తేలిక నేలల్లో 20-25 తడులు అవసరమవుతాయి. అందుబాటులో ఉన్న ఉద్యాన శాస్త్రవేత్తలు లేదా అధికారుల సూచనల మేరకు ఎరువులు వేసుకోవాలి. ఈ రకాలు అనువైనవి పసుపు రైతులు అధిక ‘కుర్కుమిన్’ కలిగిన రకాలను వేసుకోవడం మంచిది. స్వల్పకాలిక రకాల్లో... తూర్పు గోదావరి జిల్లా రైతులు కస్తూరి కొత్తపేట, పశ్చిమ గోదావరి జిల్లా రైతులు కస్తూరి తణుకు, కోస్తాలోని మధ్య డెల్టా రైతులు కస్తూరి అమలాపురం రకాలు వేసుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల రైతులు ఛాయ పసుపు రకాన్ని ఎంచుకోవచ్చు. మధ్యకాలిక రకాల్లో... కడప జిల్లా రైతులకు కేసరి దువ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రైతులకు అమృతపాణి కొత్తపేట రకాలు అనువుగా ఉంటాయి. ఇక దీర్ఘకాలిక రకాలకు సంబంధించి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు దుగ్గిరాల రకాన్ని వేసుకోవచ్చు. రాయలసీమ జిల్లాల రైతులకు టేకూరిపేట రకం అనువుగా ఉంటుంది. కడప జిల్లా రైతులు మైదుకూరు రకాన్ని ఎంచుకోవచ్చు. ఉత్తర తెలంగాణ రైతులు ఆర్మూర్, దుగ్గిరాల (ఎరుపు) రకాలు వేసుకోవాలి. కడప జిల్లా రైతులకు సుగంధ, వొంటిమిట్ట రకాలు అనువుగా ఉంటాయి. కర్నూలు జిల్లా రైతాంగం నంద్యాల రకాన్ని సాగు చేసుకోవచ్చు. -
వీటిని మీరూ తయారు చేయొచ్చు!
పంటల్ని ఆశించి నష్టపరిచే పురుగుల నివారణకు రైతులు రసాయన క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తుంటారు. అయితే వీటిని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి రైతులు ప్రత్యామ్నా య పద్ధతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైనది జీవ నియంత్రణ. ఈ పద్ధతిలో భాగంగా న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ (ఎన్పీవీ) ద్రావణాన్ని, వేప గింజల కషాయాన్ని వినియోగించి హానికారక పురుగుల్ని నివారించవచ్చు. ఎన్పీవీ ద్రావణం శనగపచ్చ, నామాల (దాసరి), పొగాకు లద్దె పురుగుల్ని అదుపులో ఉంచుతుంది. ఇక వేప గింజల కషా యం సుమారు 300 రకాల క్రిములపై ప్రభావం చూపుతుంది. ఈ రెండింటినీ రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? ఎన్పీవీ ద్రావణాన్ని తయారు చేయాలంటే... రైతులు తమ పైర్లలో వైరస్ వ్యాధి సోకి, తలకిందులుగా వేలాడుతున్న 200 లార్వాల్ని సేకరించాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకొని తగినంత మంచినీటిని కలపాలి. దానిని మెత్తగా నూరి, పలచని గుడ్డలో వడకట్టాలి. దీనిని 200 లీటర్ల నీరు, కిలో బెల్లం, 100 మిల్లీలీటర్ల జిగురు మందులో కలిపితే... ఎన్పీవీ ద్రావణం రెడీ. ఎకరం పొలంలో పిచికారీ చేసుకునేందుకు ఈ ద్రావణం సరిపోతుంది. ఎప్పుడు పిచికారీ చేయాలి? పంటచేలో ఏర్పాటు చేసుకున్న లింగాకర్షక బుట్టల్లో 8-10 పురుగులు పడిన రెండు వారాల తర్వాత ఎన్పీవీ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. లేకుంటే పైరుపై పురుగు గుడ్లను గమనించిన తర్వాత వారం రోజుల్లో పిచికారీ చేసుకోవచ్చు. లార్వాలను ఇలా గుర్తించవచ్చు వైరస్ వ్యాధి సోకిన లార్వాలు మెత్తబడి నల్లగా మారతాయి. పురుగు అడుగు భాగం గులాబీ రంగులో ఉంటుంది. ఈ పురుగులు ముందుగా మొక్కల పైభాగానికి పాకి, ఆ తర్వాత పై నుంచి కిందికి వేలాడుతూ చనిపోతాయి. లేకుంటే ఆకులకు అంటుకుపోయినట్లు నల్లగా కన్పిస్తాయి. వైరస్ సోకిన పురుగు చర్మాన్ని ముట్టుకుంటే వదులుగా ఉంటుంది. చర్మం పగిలి, పురుగు శరీరం నుంచి తెల్లని ద్రవం బయటికి వస్తుంది. ఈ జాగ్రత్తలు అవసరం ఎన్పీవీ ద్రావణాన్ని మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు మందును మధ్యమధ్యలో కర్రతో కలుపుతూ ఉండాలి. సాయంత్రం వేళ... అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే దీనిని పిచికారీ చేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మందును వినియోగిస్తే సూర్యరశ్మిలో ఉన్న అల్ట్రావయోలెట్ కిరణాలు ద్రావణం సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. పిచికారీ చేయడానికి ముందు మాత్రమే ఎన్పీవీ ద్రావణాన్ని నీటిలో కలపాలి. నిల్వ ఉన్న ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని సామర్ధ్యం తగ్గుతుంది. ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఎక్కడ లభిస్తాయి? ఎన్పీవీ వైరస్ ద్రావణాన్ని తయారు చేసుకోలేని రైతులు దానిని జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాల నుంచి పొందవచ్చు. ఈ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం (విజయవాడ), కాకినాడ, నిడదవోలు, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల, అనంతపూర్, విశాఖపట్నంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, రాజేంద్రనగర్ (హైదరాబాద్), నల్గొండ, వరంగల్‌లో ఉన్న జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ ద్రావణం లభిస్తుంది. వేప గింజల కషాయం కూడా... పంటల్ని ఆశించే క్రిముల నివారణకు వేప గింజల కషాయాన్ని కూడా పిచికారీ చేసుకోవచ్చు. ముందుగా ఐదు కిలోల వేప గింజల్ని తీసుకొని, వాటిని పొడి చేయాలి. దానికి ఆరేడు లీటర్ల నీటిని కలిపి, ఒకటి రెండు రోజుల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ద్రావణాన్ని గుడ్డలో పోసి, వీలైనన్నిసార్లు గట్టిగా పిండాలి. దీనివల్ల పొడిలో ఉన్న అజాడిరాక్టిన్ అనే మూలపదార్థం కషాయంలోకి చేరుతుంది. ఈ కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలపాలి. ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారీ చేయాలంటే 10 కిలోల వేపగింజలు అవసరమవుతాయి. కషాయాన్ని తయారు చేసుకోలేని వారు మార్కెట్లో దొరికే వేప మందుల్ని వాడవచ్చు. వేప మందులు సుమారు 300 రకాల క్రిములపై ప్రభావం చూపుతాయి. ప్రధానంగా తెల్ల-పచ్చదోమ, పేనుబంక, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కాయ తొలుచు పురుగు, ఎర్ర గొంగళి పురుగు, ఆకుతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, మరుకా మచ్చల పురుగు, తల పురుగుల భరతం పడతాయి. వేప మందుల్ని మామిడి, నిమ్మ వంటి పండ్ల తోటల్లో, బెండ, వంగ, టమాటా, మిరప వంటి కూరగాయ పంటల్లో కూడా పిచికారీ చేసుకోవచ్చు. వేప మందుల్ని విత్తనాలు విత్తిన/మొక్కలు నాటిన 15, 30, 45 రోజులప్పుడు పిచికారీ చేయాలి. ఆకులపై పురుగులు లేదా వాటి గుడ్లు కన్పించినప్పుడు, పురుగులు లార్వా దశలో ఉన్నప్పుడు వేప మందుల్ని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అవసరాన్ని బట్టి 7-15 రోజల వ్యవధితో మరోసారి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా రైతులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా పెట్టుబడి వ్యయమూ తగ్గుతుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు, పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు కూడా ఇవి ఉపకరిస్తాయి. ప్రధానంగా పంట ఉత్పత్తుల నాణ్యత బాగుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో వాటికి మంచి ధర లభిస్తుంది. డాక్టర్ ఎం.రాజా నాయక్, శాస్త్రవేత్త (హార్టీకల్చర్) ఉద్యాన పరిశోధనా కేంద్రం, విజయరాయి, పశ్చిమ గోదావరి జిల్లా -
‘హైడ్రోపోనిక్స్’తో అంతా ఆదాయే!
పాడి-పంట: పాడి పశువుల పోషణకయ్యే ఖర్చులో సుమారు 70% మేత కోసమే వెచ్చించాల్సి వస్తోంది. దీనిలోనూ ఎక్కువ భాగం దాణా పైనే ఖర్చవుతోంది. అయితే పచ్చిమేతలు పుష్కలంగా లభిస్తే దాణపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పచ్చిగడ్డిలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది పాడి పశువుల ఎదుగుదలకు, సంతానోత్పత్తికి, పాల దిగుబడి పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి పాడి పరిశ్రమను నిర్వహించే ప్రతి రైతు పచ్చిమేత పైర్లను సాగు చేయాలి. ఇందుకోసం తనకున్న భూమిలో పదో వంతును కేటాయించాలి. అయితే సాగు నీటి కొరత, కరువు పరిస్థితులతో పాటు పచ్చిమేతల సాగుకు రైతులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసాల సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి ఎంతో అనువుగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే... హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల్ని సాగు చేయడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కృత్రిమ పద్ధతిలో... విత్తనాలను నానబెట్టి, మొలకెత్తిస్తారు. ఆ మొలకలను 7-10 రోజుల పాటు పాక్షికంగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో (షేడ్‌నెట్ కింద) ఉంచుతారు. స్ప్రింక్లర్లు లేదా ఫాగర్ల ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందిస్తారు. దీనికి ప్రధానంగా కావాల్సింది విత్తనాలు, కొద్దిగా నీరు, వెలుతురే. తేడా ఏమిటి? సాధారణ పద్ధతిలో రోజుకు 600 కిలోల పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయాలంటే 10,000 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కేవలం 50 చదరపు మీటర్ల స్థలం చాలు. నేల సారవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎరువులు కూడా అక్కరలేదు. నీరు, విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కూలీల అవసరం కూడా తక్కువే. సాధారణ పద్ధతిలో పచ్చిమేత కోతకు రావడానికి 45-60 రోజులు పడితే ఈ పద్ధతిలో కేవలం వారం రోజులు చాలు. వాతావరణంలో ఒడిదుడుకుల ప్రభావం కూడా ఉండదు. ఎలా నిర్మించాలి? హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సూర్యరశ్మిని నియంత్రించడానికి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వెదురు కర్రలు లేదా ఇనుప పైపులతో దానికి ఆధారాన్ని కల్పించాలి. ప్రతి రోజూ 600 కిలోల పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయాలంటే 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉండేలా షేడ్‌నెట్‌ను నిర్మించాలి. దాని లోపల 3 అడుగుల వెడల్పుతో 2 వరుసల్లో 14 అరలను (ఒక్కో వరుసలో 7 అరలు) ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో దారిని వదలాలి. నీటిని అందించడానికి వీలుగా ప్రతి 2 అడుగులకు ఒక స్ప్రింక్లర్/ఫాగర్‌ను అమర్చాలి. ఏం చేయాలంటే... 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 3 అం గుళాల ఎత్తు ఉండే ట్రేలను కొనుగోలు చేయాలి. ఒక్కో ట్రేలో 1.5 కిలోల విత్తనాలను వేయవ చ్చు. ట్రే అడుగు భాగాన రంధ్రాలు ఉంటాయి. ట్రే అడుగున ప్లాస్టిక్ పేపరును పరవాలి. దానికి కూడా అక్కడక్కడ రంధ్రాలు చేయాలి. ట్రేలలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి పశుగ్రాసాల విత్తనాలను వేసుకోవచ్చు. వీటిలో మొక్కజొన్న విత్తనాలు శ్రేష్టమైనవి. కిలో విత్తనాల నుంచి ఐ దారు కిలోల పుష్టికరమైన మేతను పొందవచ్చు. ఇలా పెంచండి మొక్కజొన్న విత్తనాలను 5% కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 24 గంటల పాటు వాటిని మండె కట్టాలి. మొలకలను ట్రేలో ప్లాస్టిక్ పేపరుపై సమానంగా పరవాలి. షేడ్‌నెట్‌లో ఏర్పా టు చేసుకున్న అరల్లో పై అరలో ట్రేను ఉంచాలి. పశువుల సంఖ్యను బట్టి ఇలా ప్రతి రోజూ విత్తనాలను ట్రేలో పరిచి, అరల్లో ఉంచాలి. గంటకొకసారి స్ప్రింక్లర్లతో 5 నిమిషాల పాటు ట్రేలపై నీ టిని చిమ్మాలి. ఇందుకోసం టైమర్‌ను అమర్చుకుంటే మంచిది. ఈ పద్ధతిలో కిలో విత్తనాలకు వారం రోజులకు 3 లీటర్ల నీరు సరిపోతుంది. నీటిలో ఎలాంటి పోషకాలను కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలోని పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి. ట్రేలలోని మొక్కలు 15-20 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత వాటిని పచ్చిమేతగా వినియోగించొచ్చు. పోషక విలువలు అధికం సాధారణ పద్ధతిలో సాగు చేసే పచ్చిమేతల్లో కంటే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసిన పచ్చిమేతల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. ఎలా మేపాలి? హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన గడ్డిని వేర్లతో సహా పశువులకు మేపవచ్చు. ఈ గడ్డిని ఒక్కో పాడి పశువుకు ప్రతి రోజూ 7-8 కిలోల వరకు మేపితే, పశువులకు రోజూ అందజేసే సమీకృత దాణా మోతాదును కిలో మేరకు తగ్గించుకోవచ్చు. అంతేకాక పాల ఉత్పత్తి 15% పెరుగుతుంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయవచ్చు. భూమి లేని పాడి రైతులకు, వర్షాభావ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల సాగుకు సంబంధించి మరింత సమాచారం కావాలనుకుంటే యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం వారిని (ఫోన్ : 9493619020) సంప్రదించవచ్చు. ఎ.కృష్ణమూర్తి, పశు పోషణ శాస్త్రవేత్త జి.ధనలక్ష్మి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె కర్నూలు జిల్లా -
చీడపీడలను తట్టుకునే శక్తినిస్తుంది!
పాడి-పంట: పంటలకు అవసరమైన ప్రధాన పోషకాలలో నత్రజని, భాస్వరం ఎరువుల గురించి గతంలో తెలుసుకున్నాం. వీటితో పాటు పంటలకు పొటాషియం అవసరం కూడా ఎంతో ఉంది. ఇది పంటకు చీడపీడల్ని తట్టుకునే శక్తినిస్తుంది. మరెన్నో ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో పొటాషియం వినియోగంపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, డాక్టర్ బి.పి.వర్ధని (వీరిని కార్యాలయ పనివేళల్లో ఫోన్ నెం. 1100, 18004251110లో సంప్రదించవచ్చు) అందిస్తున్న సూచనలు... ఎప్పుడు-ఎంత వేయాలి? ఏ పైరు అయినా దాని పంటకాలం పూర్తయ్యే వరకు పొటాషియం ఎరువును గ్రహిస్తూనే ఉం టుంది. అయితే పంట చురుకుగా ఎదిగే దశలో నూ, గింజలు తయారయ్యే దశలోనూ పొటాషి యం అవసరం ఎక్కువగా ఉంటుంది. పంటకు తొలి దశలో సుమారు 30%, ఆ తర్వాత సుమా రు 70% పొటాషియం ఎరువు అవసరమవుతుం ది. కాబట్టి బరువు నేలల్లో సిఫార్సు చేసిన పొటా ష్ మోతాదు మొత్తాన్నీ దుక్కిలో లేదా దమ్ములో వేసుకోవాలి. లేకుంటే విత్తనాలు విత్తేటప్పుడు లేదా మొక్కలు నాటేటప్పుడు వేయాలి. తేలిక నేలలైతే పొటాషియం ఎరువును 2-3 దఫాలుగా యూరియాతో కలిపి వేసుకోవచ్చు. మిరప, బంగాళదుంప, కాఫీ, నిమ్మ, ద్రాక్ష, పొగాకు పంటలకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (ఎస్ఓపీ) ఎరువు వేయాలి. మిగిలిన పంటలన్నింటికీ మ్యురేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) వేసుకోవాలి. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా కూడా పంటకు పొటాష్ ఎరువును అందించవచ్చు. అయితే వాటిలో పొటాషియం శాతం కొంత తక్కువగా (0.5% నుంచి 1.8% వరకు) ఉంటుంది. ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో, ద్రవ రూపంలో పొటాష్ ఎరువును మార్కెట్ చేస్తున్నాయి. లోపిస్తే ఏమవుతుంది? పొటాషియం ఎరువు లోపిస్తే ముందుగా ముదురాకుల్లో ఆ లక్షణాలు కన్పిస్తాయి. ఆకులు అంచు ల వెంబడి ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. అవి క్రమేపీ పసుపు రంగుకు మారి కాలినట్లు కన్పిస్తాయి. చివరికి ఆకంతా మాడినట్లు కన్పిస్తుంది. కాండం బలహీనంగా ఉంటుంది. మొక్కల్లో ఎదుగుదల ఉండదు. అవి గిడసబారి పొట్టిగా, పొదల మాదిరిగా కన్పిస్తాయి. ప్రయోజనాలెన్నో... పొటాషియం ఎరువు వల్ల పంటలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఎరువు మొ క్కల్లో జరిగే జీవ రసాయనిక క్రియల్ని నియంత్రిస్తుంది. ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియ వల్ల ఉత్పత్తి అయిన పిండి పదార్థాలను మొక్కలోని ఇతర భాగాలకు చేరుస్తుంది. పత్ర రం ధ్రాలు తెరుచుకోవడానికి-మూసుకోవడానికి, ఎంజైములను క్రియాశీలకం చేయడానికి దోహదపడుతుంది. వర్షాభావ పరిస్థితులు, చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవడానికి కూడా పొటాషియం ఎరువు ఉపకరిస్తుంది. పంటలు ముంపుకు గురైనప్పుడు నేలలో ఇనుప ధాతువు అధికమవుతుంది. దీనివల్ల కలిగే నష్టాన్ని పొటాష్ తగ్గిస్తుంది. అంతేకాదు... నత్రజని ఎరువును అధికంగా వాడడం వల్ల కలిగే దుష్ఫలితాలను కూడా కొంత వరకు నివారిస్తుంది. మాగాణి పొలాల్లో తెట్టు, పాచి పేరుకుపోకుండా నిరోధిస్తుంది. వివిధ పంటలకు వేసే నత్రజని, భాస్వరం, గంధకం వంటి పోషకాలు సమర్ధవంతంగా వినియోగమయ్యేలా పొటాష్ దోహదపడుతుంది. ఏ పైరుకు ఎలా ఉపయోగం? ఆహార ధాన్యపు పంటల్లో మొక్కల కాండం గట్టి పడాలంటే పొటాష్ ఎరువు వాడాల్సిందే. అంతేకాదు... పొటాష్ ఎరువును తగిన మోతాదులో వేస్తే పైరు చేనుపై పడిపోదు. గింజలు పూర్తిగా నిండుతాయి. దృఢమైన, బరువైన గింజలు ఏర్పడతాయి. దుంప జాతి పంటల్లో పిండి పదార్థం ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. చెరకు పంటలో పంచదార శాతం, రస నాణ్యత పెరుగుతాయి. పప్పు జాతి పైర్లలో నత్రజని స్థిరీకరణకు పొటాషియం తోడ్పడుతుంది. మొక్కల్లో నూనె పదార్థాలు, పిండి పదార్థాలు తయారు కావడానికి పొటాష్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నూనె గింజల పంటల నుంచి అధిక నూనె శాతం పొందాలంటే ఈ ఎరువును తప్పనిసరిగా వాడాలి. పండ్ల తోటల్లో పొటాష్ ఎరువు వినియోగం వల్ల పండ్ల పైతోలు దృఢంగా, బలంగా తయారవుతుంది. పండ్లు ఒరిపిడిని తట్టుకోగలుగుతాయి. వాటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. జీవన ఎరువు రూపంలో... మార్కెట్లో జీవన ఎరువు రూపంలో పొటాషియం మొబిలైజర్లు లభిస్తున్నాయి. ఇవి భూమిలో మొక్కలకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెస్తాయి. ఈ జీవన ఎరువు ప్రటూరియా ఆర్షారియా అనే బాక్టీరియా రూపంలో దొరుకుతోంది. కొన్ని బాసిల్లస్ జాతుల్ని దీనితో కలిపి మిశ్రమంగా తయారు చేస్తున్నారు. రెండు కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి, ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. ప్రధానంగా నూనె గింజల పంటల్లో దీని ప్రభావం బాగా కన్పిస్తుంది. నేల బాగా తడిసిన తర్వాతే... రుతుపవనాలు ప్రవేశించే ముందు కురిసే వర్షాలను ఆసరాగా చేసుకొని వర్షాధార పంటలు వేయకూడదు. నేల పూర్తిగా తడిసిన తర్వాత... అంటే 50-75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై న తర్వాత మాత్రమే పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి వర్షాధార పంటలు విత్తుకోవాలి. ఈ లోగా విత్తనాలు, ఎ రువులు, పురుగు మందులు సేకరించుకోవాలి. కాగా తేలిక నేలల్లో పత్తి, సోయాచిక్కుడు పం టల్ని వర్షాధారంగా సాగు చేయకూడదని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు.