పసుపు సాగుకు సమయమిదే | Now right time for Yellow cultivars | Sakshi
Sakshi News home page

పసుపు సాగుకు సమయమిదే

Published Tue, Jun 17 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

పసుపు సాగుకు సమయమిదే

పసుపు సాగుకు సమయమిదే

పాడి-పంట: కమ్మర్‌పల్లి (నిజామాబాద్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు పసుపు సాగుకు సమాయత్తమవుతున్నారు. కొందరు ఇప్పటికే స్వల్పకాలిక, మధ్యకాలిక రకాలకు చెందిన విత్తన కొమ్ముల్ని నాటుకున్నారు. పసుపు దుంప జాతికి చెందిన ఉష్ణమండల పంట. దీనికి తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పసుపు సాగుపై నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె.ఉమామహేశ్వరి అందిస్తున్న సూచనలు...
 
 పసుపు సాగుకు నీరు ఇంకిపోయే గులక, తువ్వ, గరప, నల్ల నేలలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మురుగు నీటి పారుదల సౌకర్యం కలిగిన బరువు నేలలు, అధిక సేంద్రియ కర్బనం కలిగిన నేలలు కూడా ఈ పంట సాగుకు అనువైనవే. పసుపు పంట నీటి ముంపును తట్టుకోలేదు. కాబట్టి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పసుపు వేయకూడదు. అదేవిధంగా పల్లపు భూములు, ఉప్పు నేలలు, క్షార భూములు కూడా పనికిరావు.
 
 ఎప్పుడు-ఎలా వేయాలి?
 పసుపు పంటను జూలై 15 లోగా వేసుకోవాలి. ఆ తర్వాత వేస్తే దిగుబడులు తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, బలమైన మొక్కల నుంచి విత్తన కొమ్ముల్ని సేకరించాలి. తల్లి, పిల్ల కొమ్ముల్ని నాటుకోవచ్చు. 6-8 సెంటీమీటర్ల పొడవున్న, మొలకెత్తుతున్న పిల్ల కొమ్ములు అనువుగా ఉంటాయి. అవి దృఢంగా ఉండాలి. అయితే తల్లి కొమ్ముల్ని వాడితే దిగుబడి ఎక్కువ వస్తుంది.
 
 పసుపు కొమ్ముల్ని మూడు పద్ధతుల్లో నాటుకోవచ్చు. అవి ఎత్తుమడుల పద్ధతి, సమతుల మడుల పద్ధతి, బోదె సాళ్ల పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో... మడుల మధ్య 30 సెంటీమీటర్ల కాలువ ఉండేలా మీటరు వెడల్పుతో ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, కొమ్ముల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలి. ఇక సమతుల మడుల పద్ధతిలో... 30 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తూ మడకసాలు చేసి, అందులో 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలా విత్తనం వేసి, చదును చేయాలి. ఆ తర్వాత కయ్యలు చేసుకొని, వాటి మధ్య నీటి కాలువలు ఏర్పాటు చేయాలి. బోదె సాళ్ల పద్ధతిలో... 45 నుంచి 60 సెంటీమీటర్ల ఎడం ఉండేలా బోదెలు తయారు చేసుకోవాలి. వాటి మీద 20 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తూ విత్తన కొమ్ములు నాటాలి. వరుసల మధ్య ఉండే సాళ్ల ద్వారా నీటిని అందించవచ్చు.
 
 విత్తనశుద్ధి ఇలా...
 విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్లు, తాటాకు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల రిడోమిల్ యం.జడ్/మాంకోజెబ్ చొప్పున కలిపి ఆ ద్రావణంలో విత్తన కొమ్ముల్ని 40 నిమిషాల పాటు ముంచాలి. విత్తన కొమ్ముల్ని పొలుసు పురుగులు ఆశించి ఉన్నట్లయితే లీటరు నీటికి 3-5 గ్రాముల చొప్పున మలాథియాన్ కూడా కలపాలి. అనంతరం విత్తన కొమ్ముల్ని ఆరబెట్టాలి. లీటరు నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కలిపి, ఆ ద్రావణంలో విత్తన కొమ్ముల్ని 40 నిమిషాల పాటు ముంచి, ఆరబెట్టాలి. ఆ తర్వాత నాటుకోవాలి.
 
 అంతరపంటలూ వేసుకోవచ్చు
 పసుపులో మొక్కజొన్న, ఆముదం పంటల్ని అంతరపంటలుగా వేసుకుంటే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. పసుపులో మొక్కజొన్నను 2:1 నిష్పత్తిలో, ఆముదాన్ని 10:1 నిష్పత్తిలో వేసుకోవాలి. పసుపులో కందిని వేయాలనుకుంటే 9:1 నిష్పత్తిని పాటించాలి. కొబ్బరి, మామిడి తోటల్లో పసుపును అంతరపంటగా వేసుకోవచ్చు.
 
 కలుపు నివారణ-అంతరకృషి
 కలుపు నివారణ కోసం పొలం తయారీ దశలోనే లీటరు నీటికి 8 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్+20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్/10-15 గ్రాముల యూరియా చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొమ్ములు నాటిన మర్నాడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 500-800 గ్రాముల అట్రాజిన్ కలిపి భూమిలో తేమ ఉండేలా చూసుకొని పిచికారీ చేయాలి. కొమ్ములు నాటిన 40-45 రోజులప్పుడు అంతరకృషి చేయాలి. అవసరాన్ని బట్టి 60, 90, 120, 150 రోజులప్పుడు కూడా కలుపు తీయించాలి.
 
 నీరు-ఎరువులు
 కొమ్ములు నాటిన వెంటనే నీరు పెట్టాలి. మొలక వచ్చి మొక్క కనబడే వరకు 4-6 రోజులకొకసారి తడి ఇవ్వాలి. పంటకాలంలో బరువు నేలల్లో 15-20, తేలిక నేలల్లో 20-25 తడులు అవసరమవుతాయి. అందుబాటులో ఉన్న ఉద్యాన శాస్త్రవేత్తలు లేదా అధికారుల సూచనల మేరకు ఎరువులు వేసుకోవాలి.
 
 ఈ రకాలు అనువైనవి
 పసుపు రైతులు అధిక ‘కుర్కుమిన్’ కలిగిన రకాలను వేసుకోవడం మంచిది. స్వల్పకాలిక రకాల్లో... తూర్పు గోదావరి జిల్లా రైతులు కస్తూరి కొత్తపేట, పశ్చిమ గోదావరి జిల్లా రైతులు కస్తూరి తణుకు, కోస్తాలోని మధ్య డెల్టా రైతులు కస్తూరి అమలాపురం రకాలు వేసుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల రైతులు ఛాయ పసుపు రకాన్ని ఎంచుకోవచ్చు. మధ్యకాలిక రకాల్లో... కడప జిల్లా రైతులకు కేసరి దువ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రైతులకు అమృతపాణి కొత్తపేట రకాలు అనువుగా ఉంటాయి.
 
 ఇక దీర్ఘకాలిక రకాలకు సంబంధించి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు దుగ్గిరాల రకాన్ని వేసుకోవచ్చు. రాయలసీమ జిల్లాల రైతులకు టేకూరిపేట రకం అనువుగా ఉంటుంది. కడప జిల్లా రైతులు మైదుకూరు రకాన్ని ఎంచుకోవచ్చు. ఉత్తర తెలంగాణ రైతులు ఆర్మూర్, దుగ్గిరాల (ఎరుపు) రకాలు వేసుకోవాలి. కడప జిల్లా రైతులకు సుగంధ, వొంటిమిట్ట రకాలు అనువుగా ఉంటాయి. కర్నూలు జిల్లా రైతాంగం నంద్యాల రకాన్ని సాగు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement