ఢిల్లీ: పసుపు బోర్డు(Turmeric Board) సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాసిచ్చానని తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్( Dharmapuri Arvind) స్పష్టం చేశారు. పట్టువదలకుండా కేంద్రం చుట్టూ తిరిగి దీన్ని సాధించగలిగానన్నారు. ఈ అంశానికి సంబంధించి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘పసుపు బోర్డు సాధనతో నాకు ఎంతో సంతృప్తి కల్గింది. బోర్డుతో పసుపు రైతుల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. బోర్డు తీసుకొచ్చామని చెప్పే బిఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలవి చిల్లర మాటలు.
దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలి. నిజామాబాద్ లో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరగబోతోంది. పవర్‌లోకి తీసుకొచ్చే వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పడంలో తప్పేంలేదు. మా పార్టీలో అధ్యక్ష రేసులేదు. అధ్యక్షుడు ఎవరనేది నరేంద్ర మోదీ నిర్ణయిస్తారు. పవర్‌లోకి రావడం ఏ పార్టీకైనా ఒక ఆశయంగా ఉంటుంది. నా తదుపరి టార్గెట్ నిజామాబాద్‌లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడమే’ అని పేర్కొన్నారు.
ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరిన వేళ..
కాగా, రైతుల పండుగ సంక్రాంతి(Makara Sankranti) నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది.
.అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.
సాకారమైన రైతుల పోరాటం
పసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే..
నిజామాబాద్‌లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది.
Comments
Please login to add a commentAdd a comment