పూతకు రాకముందే పీకేయాలి | Before coating the remove | Sakshi
Sakshi News home page

పూతకు రాకముందే పీకేయాలి

Published Mon, Jul 7 2014 9:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

పూతకు రాకముందే పీకేయాలి - Sakshi

పూతకు రాకముందే పీకేయాలి

పాడి-పంట
వర్షాలు పడుతున్నాయంటే చాలు... రైతులు ముందుగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కల గురించే. ఇక్కడా... అక్కడా.... అని లేకుండా ఈ మొక్క ఎక్కడైనా పెరుగుతుంది. దీనిని వివిధ ప్రాంతాల్లో క్యారట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కపుల్లాకు, కాంగ్రెస్ గడ్డి, చేతక్ చాందిని, అపాది, గజర్ అని కూడా పిలుస్తుంటారు. పేరేదైనా ఈ మొక్క కలిగించే నష్టం అపారం.

మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. దూర ప్రాంతాలకు సైతం తేలికగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో వయ్యారిభామ కలుపు మొక్కల గురించి ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఒ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న ఆసక్తికరమైన విషయాలు...
 
ఏం జరుగుతుంది?

వయ్యారిభామ వల్ల పంట మొక్కలకే కాదు... మనుషులు, పశువులకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. మనుషులు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధమైన అలర్జీతో బాధపడతారు. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాయడం వంటి సమస్యలూ వస్తాయి. ఈ విషపూరితమైన మొక్కల్ని తింటే పశువులు హైపర్ టెన్షన్‌కు గురవుతాయి. వాటి వెంట్రుకలు రాలిపోతాయి.
 
ఇక పంటల విషయానికి వస్తే... వయ్యారిభామ మొక్కలు నీరు, పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతుంటాయి. ఫలితంగా దిగుబడులు 40% వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాటా, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వుకుళ్లు, కాండంకుళ్లు తెగుళ్లు సోకవచ్చు. వేరుశనగ పైరుకు నెక్రోసిస్ తెగులు సోకుతుంది. వయ్యారిభామ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. వాటి దిగుబడిని తగ్గిస్తాయి. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న వయ్యారిభామ మొక్కల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమ గ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
 
ఏం చేయాలంటే...
వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని చేతితో పీకేయాలి. మొక్కలు పూత దశకు రాకముందే పీకి తగలబెట్టాలి. లేకుంటే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కల్ని పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి.
 
రసాయనాలతో...
మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలకెత్తక ముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. మొక్కజొన్న, జొన్న పంటల్లో విత్తనాలు మొలకెత్తిన 15-20 రోజులకు లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున 2,4-డి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాస పంటలు వేసే వారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి.

ఆ సమయంలో చేలో వయ్యారిభామ మొక్కలు కూడా ఉండకూడదు. పశుగ్రాస పైరు మొలకెత్తి న 15-20 రోజులకు లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే లీటరు నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ లేదా 5-7 మిల్లీలీటర్ల పారాక్వాట్ చొప్పున కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు.
 
కంపోస్ట్ తయారీ ఇలా...
వయ్యారిభామ మొక్కలు ఎంత హానికరమైనవి అయినప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంతను తవ్వాలి. అందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కల్ని వేసి, వాటిపై 5 కిలోల యూరియా లేదా 50 కిలోల రాక్ ఫాస్ఫేట్ చల్లుకోవాలి. వీలైతే 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కూడా చల్లవచ్చు. ఒకవేళ వయ్యారిభామ మొక్కలకు వేర్లు లేకపోతే 10-15 కిలోల బంకమట్టి కలపాలి.

ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి, పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్ట్‌లో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. కూరగాయ పంటలకు ఎకరానికి 2 కిలోల కంపోస్ట్ వేసుకోవచ్చు.
 వయ్యారిభామ మొక్కలతో తయారైన ఎరువు మనుషులు, పశువులు, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. వయ్యారిభామలో ఉండే పార్థినిస్ అనే హానికరమైన రసాయనం ఎరువు తయారీ దశలోనే నశిస్తుంది. కంపోస్ట్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని, అన్ని పంటలకూ వేసుకోవచ్చు.
 
ఇప్పుడు ఏం చేయాలి?
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందిస్తున్న

సూచనలు...
పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి వర్షాధార పంటల్ని నేల పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొత్తగా పండ్ల తోటలు పెట్టే వారు గుంతలు తీసుకోవాలి. టమాటా, వంగ, మిరప వంటి కూరగాయ పంటలకు నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగ జాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement