చెట్టుకూ విశ్రాంతి అవసరమే! | lakshmi reddy best Instructions to mango farmers | Sakshi
Sakshi News home page

చెట్టుకూ విశ్రాంతి అవసరమే!

Published Thu, Jul 3 2014 10:07 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

చెట్టుకూ విశ్రాంతి అవసరమే! - Sakshi

చెట్టుకూ విశ్రాంతి అవసరమే!

కడప అగ్రికల్చర్: మామిడి కాయల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలా మంది రైతులు కోతల తర్వాత తోటల్ని పట్టించుకోరు. దీనివల్ల చీడపీడల దాడి పెరిగి తదుపరి పంటపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో కాయల కోత అనంతరం మామిడి రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ (రిటైర్డ్) వేంపల్లె లక్ష్మీరెడ్డి అందిస్తున్న సూచనలు...
 
కత్తిరింపులు ఎందుకు చేయాలి?
మామిడి ఆకులు సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. దీనివల్ల చెట్టుకు కావాల్సిన ఆహార పదార్థాలు సమృద్ధిగా సమకూరుతాయి. అయితే ఓ అధ్యయనం ప్రకారం... చెట్టు గుబురుగా ఉండడం వల్ల సుమారు 85% ఆకులకు తగినంత సూర్యరశ్మి తగలడం లేదు. అవి దాదాపుగా నీడలోనే ఉంటున్నాయి. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతోంది.పైగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే జామ, సీతాఫలం వంటి చెట్ల ఆకులతో పోలిస్తే మామిడి ఆకులకు సూర్యరశ్మిని గ్రహించే శక్తి కాస్త తక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెట్టుకు ఆహార పదార్థాలు (పిండి పదార్థాలు) పూర్తి స్థాయిలో లభించాలంటే అన్ని ఆకుల పైన సూర్యరశ్మి పడాలి. ఇందుకోసం కొమ్మల కత్తిరింపు తప్పనిసరి. దీనివల్ల చెట్లకు చీడపీడల బెడద కూడా తగ్గుతుంది.
 
ఎలా చేయాలి?

కాయలు కోసిన తర్వాత 15-20 రోజుల పాటు చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే అప్పటి వరకు చెట్లు కాయల వృద్ధికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి. కోత తర్వాత అవి నీరసిస్తాయి. కాబట్టి చెట్లకు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే కొమ్మల కత్తిరింపు జరపాలి. ఆగస్ట్ మొదటి పక్షం లోగా కత్తిరింపులు పూర్తి చేయాలి. ఇందుకోసం అడ్డదిడ్డంగా పెరిగిన, తెగులు సోకి ఎండిపోయిన కొమ్మల్ని పూర్తిగా తొలగించాలి. అలాగే నేలను తాకుతూ వ్యవసాయ పనులకు అడ్డుగా ఉన్న కొమ్మల్ని కత్తిరించాలి. ఎండిన పూత కాడల (కొరడాలు) కారణంగా ఎండు తెగులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు పడకముందే వాటిని కూడా తీసేయాలి.
 
సూర్యరశ్మి, గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా గుబురుగా పెరిగిన చెట్ల తల పైన 3-4 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని తీసేయాలి. దీనివల్ల మధ్యాహ్నపు ఎండ చెట్టు మొదలుపై పడుతుంది. అవసరమైతే తూర్పు-పడమర దిశలో కూడా 2-3 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని దిశకు ఒకటి చొప్పున తొలగించాలి. ఈ విధంగా కత్తిరింపులు చేస్తే ఆకులకు సూర్యరశ్మి బాగా తగులుతుంది.
 
ఆల్ఫోన్సో (కాధర్), బంగినపల్లి (బేనిషాన్) రకాల చెట్లు ప్రతి సంవత్సరం కాపుకు వచ్చి, మంచి దిగుబడులు అందించాలంటే జూలైలో అన్ని చిరుకొమ్మల్ని 10 సెంటీమీటర్ల వెనక్కి (ఆకులు గుంపుగా ఉన్న చోటుకు అంగు ళం పైకి) కత్తిరించాలి. దీనివల్ల ప్రతి కొమ్మ పైన 3-4 చిగురు కొమ్మలు పుడతాయి. వాటిలో ఆ రోగ్యంగా, దృఢంగా ఉన్న కొమ్మలు డిసెంబర్ నాటికి ముదిరి, జనవరిలో పూతకు వస్తాయి.
 
 తల మార్పిడి చేయాలంటే...

 నాటు రకం చెట్లు, తక్కువ దిగుబడిని అందించే చెట్లు, మార్కెట్‌లో మంచి ధర పలకని రకాలకు చెందిన చెట్లు... ఇలాంటి చెట్ల వల్ల రైతుకు ఆదాయం సరిగా రాదు. వీటి నుంచి కూడా నాణ్యమైన, అధిక దిగుబడులు పొందాలంటే తల మార్పిడి (టాప్ వర్కింగ్) చేయాలి. కాయల కోత తర్వాత జూలైలో కొమ్మలన్నింటినీ 4-5 అడుగుల పొడవు ఉంచి, రంపంతో కోసేయాలి. వాటిపై పుట్టుకొచ్చే లేత కొమ్మలకు సెప్టెంబర్‌లో మంచి రకాల కొమ్మలతో అంట్లు కట్టాలి.
 
కత్తిరింపుల తర్వాత...

కత్తిరింపులు చేసిన వెంటనే కోసిన భాగంపై మందు ద్రావణాన్ని పూయాలి. లీటరు నీటికి 10 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+6 గ్రాముల కార్బరిల్ చొప్పున కలిపి మందు ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. అలాగే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+10 గ్రాముల యూరియా చొప్పున కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.
 
అంతర సేద్యం చేయాలి      

కాయల కోత తర్వాత తోటల్లో పడిన టెంకలు, ఎండు పుల్లల్ని ఏరి కాల్చేయాలి. జూలైలో వర్షాలు పడగానే భూమిని 2-3 సార్లు దున్నాలి. చెట్ల కింద దున్నడం కుదరకపోతే పారతో మట్టిని కలపాలి. సెప్టెంబర్ తర్వాత భూమిని దున్నకపోవడమే మంచిది.
 
ఎరువులు ఇలా...

రాలిపడిన ఎండుటాకుల్ని చెట్ల పాదుల్లో వేసి, మట్టితో కప్పేస్తే ఆ తర్వాత అవి కుళ్లి సేంద్రియ పదార్థంగా మారతాయి. చెట్లకు బలాన్నిస్తాయి. జూలై-ఆగస్ట్ నెలల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు చల్లి పూత దశలో మొక్కల్ని భూమిలో కలియదున్నాలి. జూలై-ఆగస్ట్‌లో ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు వేయాలి. నీటి వసతి ఉంటే... చెట్టుకు కిలో యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసి తడి ఇవ్వాలి. వర్షాధారపు తోటల్లో ఒక్కో చెట్టుకు 2 కిలోల యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. చెట్టు మొదలుకు 4-5 అడుగుల దూరంలో గాడి తీసి, అందులో ఎరువులు వేసి మట్టితో కప్పేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement