సాక్షి, కడప: కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో టికెట్ చిచ్చు రగులుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ కడప టీడీపీ టికెట్ ముస్లింలకేనని ఓ వర్గం వాదిస్తుండగా.. వరుసగా ఓడిపోతున్న వారికి టికెట్ ఇచ్చేది లేదని, ఈసారి నాన్ మైనార్టీ వర్గానికే అని మరోవర్గం వాదిస్తోంది. పార్టీ అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో కడప టీడీపీ మైనారీ్ట, నాన్ మైనార్టీ వర్గాలుగా విడిపోయి రోడ్డుకెక్కింది.
గత ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగాపోటీ చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అమీర్‌బాబు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లోనూ తనకే టీడీపీ టికెట్ వస్తుందని, అధిష్టానం మద్దతు తనకేనని, కచ్చితంగా పోటీలో ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన వర్గీయులకు ఇదే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కడప సీటును మైనారీ్టల నుంచి తప్పించాలని టీడీపీలోని నాన్ మైనార్టీ వర్గం వేగంగా పావులు కదుపుతోంది. మైనార్టీలు అధికంగా ఉండే కడప నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఉంది.
ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారీ్టతో వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రధానంగా ముస్లింలు వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో కడప అసెంబ్లీ టీడీపీ టికెట్ ముస్లింలకు కేటాయించినా మైనార్టీలు టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికే పరిస్థితి లేదని టీడీపీలోని నాన్ మైనార్టీ వర్గం చంద్రబాబు, లోకేష్‌లకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మైనార్టీలకు టికెట్ ఇచ్చినా ఓడిపోవడం మినహా గత్యంతరం లేదని, ఈసారి ఎన్నికల్లో నాన్ మైనార్టీ వర్గానికి టికెట్ ఇస్తే మిగిలిన వర్గాలను దగ్గర చేసుకోవచ్చని కడప అసెంబ్లీ పరిధిలోని కొందరు టీడీపీ నేతలు, జిల్లా స్థాయి టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు చెబుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: (శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్)
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి (వాసు), టీడీపీ సీనియర్ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి పోటీ పడుతున్నారు. శ్రీనివాసులురెడ్డి కడప పార్లమెంట్ అభ్యరి్థగా పోటీ చేయిస్తున్నట్లు ఇటీవల అన్నమయ్య జిల్లా పర్యటనలో చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఇదే జరిగితే శ్రీనివాసులురెడ్డి కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కడప బరిలో ప్రధాన పోటీ దారుగా ఉన్నారు. లక్ష్మిరెడ్డి లేదా ఆయన కోడలు, కడప నగరం 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి పోటీలో నిలిచే అవకాశం ఉంది. కడప నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీలోని ఓ వర్గం లక్ష్మిరెడ్డికే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీలో ఆది నుంచి పనిచేస్తున్న గోవర్దన్‌రెడ్డి, ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగి టీడీపీలో చేరిన హరిప్రసాద్‌లు సైతం కడప నుంచి పోటీకి సిద్ధమంటూ ప్రచారం చేస్తున్నారు.
అమీతుమీకి సిద్ధమవుతున్న అమీర్‌బాబు
కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న అమీర్‌బాబు రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన అమీర్‌బాబు ఆర్థికంగా భారీగా నష్టపోయినట్లు పార్టీలోని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. కడప నియోజకవర్గంలో ముస్లిం మైనారీ్టలు కీలక ఓటర్లుగా ఉన్నారు. అమీర్‌బాబు పోటీలో ఉంటే అంతో ఇంతో ముస్లిం వర్గం సైతం మద్దతు పలికే అవకాశం ఉందని, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే పారీ్టకి ముస్లిం మైనార్టీలు పూర్తిగా దూరమవుతారని ఆయన వర్గం వాదిస్తోంది. ఇదే జరిగితే టీడీపీ నుంచి నాన్ మైనార్టీ అభ్యర్థి పోటీ చేసినా డిపాజిట్ దక్కదని ఆ వర్గం తేల్చి చెబుతోంది.
రోడ్డున పడిన వర్గ విబేధాలు
అమీర్‌బాబుకు టిక్కెట్‌రాకుండా సొంత పార్టీలోని మరోవర్గం అడుగడుగునా అడ్డుకుంటోంది. అమీర్‌బాబు ఇప్పటివరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇటీవల ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అమీర్‌బాబు హాజరు కాకముందే ఆయన వ్యతిరేకవర్గం కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించింది. అక్కడికి చేరుకున్న అమీర్‌బాబు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తాను రాకుండానే కార్యక్రమం ఎలా చేస్తారంటూ ప్రశ్నించే ప్రయత్నం చేయగా, వైరివర్గం ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు ఆలస్యంగా వస్తే మేము చూస్తుండాలా...అంటూ ఏకంగా ఘర్షణకు దిగింది. దీంతో ఇరు వర్గాలు రోడ్డుపైనే కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో కడప టీడీపీ వర్గాలుగా విడిపోయి రోడ్డున పడింది.
Comments
Please login to add a commentAdd a comment