Weeds
-
దుంపతెంచిన కలుపు మందులు
అవును.. ఇంగ్లండ్‌లో శాస్త్రవేత్తలు అటూఇటుగా చెబుతున్నది ఇదే. అక్కడి గోధుమ తదితర ఆహార పంటల్లో బ్లాక్ గ్రాస్ రకం కలుపు పెద్ద సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో ఎన్ని కలుపుమందులు చల్లినా ఈ గడ్డి మాత్రం చావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్ శాస్త్రవేత్తల సారథ్యంలో రొథమ్‌స్టెడ్ రీసెర్చ్, జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ నిపుణులు బ్లాక్ గ్రాస్‌పై కలుపు మందుల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి అధ్యయనం చేశారు. ఇంగ్లండ్ నలుచెరగుల నుంచి 70 వ్యవసాయ క్షేత్రాల్లో ఈ గడ్డి అడ్డూఅదుపూ లేకుండా బలిసిపోయిందట. 132 గోధుమ పొలాల నుంచి కలుపు విత్తనాలను సేకరించి పరీక్షించారు. ఫలితాలను చూసి అవాక్కయ్యారు. నమూనాల్లో 80% ఏ రకమైన కలుపు మందులకూ లొంగలేదని రొథమ్‌స్టెడ్ స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ కార్యక్రమ సారథి, కలుపు నిపుణుడు డా. పాల్ నెవె తెలిపారు. ఈ వివరాలను నేచర్ ఎకాలజీ, ఎవల్యూషన్ పత్రిక ఇటీవల ప్రచురించింది. పూర్వం నుంచే విరివిగా కలుపు రసాయనిక మందులు వాడటం వల్ల బ్లాక్ గ్రాస్ ఇప్పుడు ఏ కలుపు మందు చల్లినా చావని గడ్డు స్థితి వచ్చిందని, ఈ సమస్యను అధిగమించడానికి చేపట్టిన యాజమాన్య చర్యలేవీ ఫలించలేదని డా. పాల్ వివరించారు. కలుపు మందులకు ఎంత ఖర్చు పెట్టినా కలుపు చావలేదని, పంట దిగుబడులు తగ్గి ఆదాయం తగ్గిపోయిందని రైతులు గొల్లుమన్నారు. చాలా ఎక్కువ సార్లు కలుపు మందు చల్లడం.. అనేక రకాల కలుపు మందులు కలిపి చల్లడం లేదా వేర్వేరుగా ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేయటం.. ఇవేవీ కలుపును అరికట్టలేకపోగా సమస్యను మరింత జటిలం చేశాయని శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైంది. ఇంకేవో కొత్త రకం మందులు తెచ్చి చల్లినా ఉపయోగం ఉండబోదని, రసాయనిక కలుపు మందుల మీద ఆధారపడటం తగ్గించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఇంగ్లండ్ రైతుల చేదు అనుభవం గ్రహించైనా మన రైతులు ముందు జాగ్రత్త పడాల్సి ఉంది..! కాదంటారా? -
సరికొత్త ఐడియాతో వినూత్న సాగు
- బైక్ సాయంతో కలుపు మొక్కలను తీసేసిన యువరైతు దాచేపల్లి (గుంటూరు) ఓ ఐడియా సరికొత్త సాగుకు తెరలేపింది. ద్విచక్రవాహనంతో వ్యవసాయంలో వినూత్న ప్రయత్నానికి ఓ యువ రైతు శ్రీకారం చుట్టారు. దాచేపల్లికి చెందిన బొమ్మిరెడ్డి శివ అనే రైతు తన మిరప పంటలోని కలుపు మొక్కలను తీసేందుకు మోటారు బైక్‌ను ఉపయోగించాడు. పంటలో కలుపు మొక్కలు బాగా పెరిగాయి. వాటిని ఎద్దుల సాయంతో తీయాలంటే తన మూడెకరాలకు రూ.1800 ఖర్చు అవుతుంది. వ్యవసాయ ఖర్చులు పెరుగుతాయని భావించిన అతను ఓ ఐడియాతో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. తన బంధువుల నుంచి ద్విచక్రవాహనం తీసుకుని దానికి గుంటకు తోలే యంత్రాన్ని కట్టి వ్యవసాయం చేశాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే మూడు ఎకరాల్లోని కలుపు మొక్కలను తీసేశాడు.వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో పాటుగా అరకలకు బాగా గిరాకీ పెరిగిందని, ఖర్చును తట్టుకోలే ద్విచక్రవాహనానికి లీటర్ పెట్రోల్ పోసి మూడు ఎకరాలను గుంటకు తోలమని రైతులు శివ చెప్పారు. -
తెల్ల బంగారానికి తెగుళ్ల దెబ్బ
ఆకాశాన్నంటిన ఎరువులు, క్రిమిసంహారక మందులతో సతమతమవుతున్న పత్తి రైతుకు పిండి నల్లి, ఇతర తెగుళ్లు కూడా భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు పత్తి పంటకు దాదాపు రూ.15 నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయ దశకు చేరుకునే సమయంలో తెగుళ్లు ఆశించడంతో దిగులు పట్టుకుంది. గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో దాదాపు 10,500 హెక్టార్లలో పత్తి పంట సాగుచేశారు. పంట సాగుచేసినప్పటి నుంచి పత్తి రైతులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. పది రోజుల కిందటి వరకు వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది. అనంతరం కురిసిన వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి పెట్టుబడి భారం పెరిగింది. వర్షం నిలిచిపోయిన తరుణంలో తిరిగి పత్తి పంటకు దోమ పోటు, పిండినల్లి సమస్య తీవ్రమైంది. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఉధృతి తగ్గడం లేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లతో మొక్క పెరుగుదల నిలిచిపోయి వచ్చిన పూత, పిందెలు రాలిపోతున్నాయి. నివారణకు ఇవీ సూచనలు : పచ్చదోమ నివారణకు థయోమితాక్జిన్ లేదా, ఎసిటమిప్రైడ్ మందుల్లో ఏదో ఒకదానిని లీటరు నీటిలో 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్‌ను 10 లీటరు నీటికి 6 నుంచి 10 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చని వ్యవసాయ అధికారి జి.మీరయ్య సూచించారు. పిండి నల్లి నివారణకు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేస్తే పూర్తిగా నివారించవచ్చన్నారు. ఆకులు ఎర్రగా మారినట్లు కనిపిస్తే అందుకు కిలో మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలన్నారు. -
కలుపు మొక్కలు.. సమస్యలు
కలుపు మొక్కలు.. సమస్యలు కలుపు మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చీడపీడల మాదిరిగా పంటలపై తక్షణం కనిపించదు. కలుపు మొక్కలు ప్రధాన పైర్లతో గాలి, వెలుతురు, నీరు, పోషకాల కోసం పోటీపడి వాటిని ప్రధాన పంటకు అందకుండా చేస్తాయి. పంట దిగుబడులు 20-60శాతం వరకు తగ్గిస్తాయి. వీటి వల్ల పంట దిగుబడి తగ్గడమే కాక నాణ్యత కూడా తగ్గుతుంది. చీడపీడలకు ఆశ్రయం ఇచ్చి ప్రధాన పైరుపై వాటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. నివారణ ఆవశ్యకత పంటలను చీడపీడల నుంచి కాపాడటం ఎంత ముఖ్యమో.. కలుపు మొక్కల నుంచి పోటీ లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా, పెరిగినా పుష్పించి, విత్తనోత్పత్తి దశకు చేరుకోకుండా సకాలంలో నిర్మూలించాలి. పంట తొలిదశలోనే, అంటే పంట కాలంలో మూడింట ఒకవంతు సమయంలో పైరుకు కలుపు నుంచి ఎలాంటి పోటీ లేకుండా చూడాలి. కలుపు మందులను తేలికపాటి(ఇసుక,గరప) నేలల్లో తక్కువ మోతాదులో, ఎర్రనేలల్లో మధ్యస్థంగా, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో వాడాలి. సాధ్యమైనంత వరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ, అంతరకృషి చేయుట మొదలగు సేద్యపద్ధతులను అవలంబిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కజొన్న విత్తనం వేసిన 2-3రోజులలోపు తేలిక నేలల్లో అయితే ఎకరానికి 800గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరానికి 1200గ్రాముల అట్రజిన్‌ను 200లీటర్లల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను ఒకనెల వరకు అదుపు చేయవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం ఎకరానికి 1లీటరు పిండిమిథలిన్ను 200లీటర్ల నీటిలో కలిపి విత్తిన రెండు రోజుల్లో పిచికారి చేయాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే ఎకరానికి 500గ్రాముల 2,4-డి సోడియంసాల్ట్ను 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 30-35రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్‌తో అంతర పంట కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. జొన్న జొన్న విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల ఎకరానికి 800గ్రాముల అట్రజిన్ 50శాతం పొడి మందును 200లీటర్ల నీటిలోకలిపి తడినేలపై పిచికారి చేయాలి. జొన్న విత్తిన 35-40రోజులకు జొన్న మల్లె మొలకెత్తుతుంది. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటరు నీటికి 2గ్రాముల 2,4డి సోడియం సాల్ట్ లేదా 50గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా 200గ్రాముల యూరియాను కలిపి మల్లెపై పిచికారి చేసి నిర్మూలించవచ్చు. శనగ విత్తే ముందు ఎకరానికి 1లీటరు ప్లూక్లోరాలిన్ 45శాతం మందును పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. లేదా విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని ఎకరానికి 1.5లీటర్ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి. విత్తిన 20,25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. పెసర, మినుము విత్తనం విత్తిన వెంటనే గాని, మరుసటి రోజుగాని ఎకరానికి 1లీటరు 50శాతం అలాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. వరి మాగాణుల్లో విత్తనం చల్లిన 21-28రోజుల మధ్య ఎకరానికి 250మి.లీ. ఫినాక్సిప్రాప్ఇథైల్ (ఉదాహరణకు నివారణకు) 250 మి.లీటర్ల ఇమాజితాఫిర్(వెడల్పుకు కలుపు, బంగారుతీగ నివారణకు), 400మి.లీటర్ల క్విజాలోఫాప్ఇథైల్ (ఊవ, చిప్పిర, గరిక నివారణకు) 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పొద్దుతిరుగుడు విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ఎకరానికి లీటరు పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50%ను కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి. 30-40రోజుల వరకు పంటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. వేరుశనగ విత్తిన వెంటనే గాని లేదా 2-3రోజుల లోపు ఎకరానికి 1లీటరు అలాక్లోర్ 50శాతం లేదా 1.25-1.5లీటర్ల బుటాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండెమిథాలిన్ 30శాతం 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయరాదు. విత్తిన వెంటనే కలుపు మందులు వాడలేకపోయిన లేదా 20రోజుల వరకు కలుపు తీయలేని పరిస్థితుల్లో పైరులో మొలచిన కలుపును నిర్మూలించవచ్చు. విత్తిన 21రోజుల లోపు కలుపు 2-3ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 300మిల్లీలీటర్ల ఇమాజిలిఫిర్ 10శాతం లేదా 400మీ.లీటర్ల క్విజాలోఫాప్ఇథైల్ 5శాతంను 200లీటర్ల నీటిలో కలిపి చాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారి చేసి కలుపును నిర్మూలించవచ్చు. కుసుమ విత్తిన వెంటనే గాని, మరుస టి రోజుగాని ఎకరానికి 1లీట రు అలాక్లోర్ 50శాతం లేదా పెండమిథాలిన్ 30శాతం కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-30రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25రోజులకు, 45-50రోజుల వరకు దంతులు తొలి అంతర కృషి చేయాలి. -
‘వయ్యారిభామ’ పనిపట్టండి
మంచిర్యాల రూరల్ : కలుపు మొక్కలు అంటేనే రైతులకు ఎంతో దిగులు. వాటిని ఎలాగైనా తొలగించి, పంటను కాపాడుకోవాలని నిరంతరం శ్రమిస్తుంటారు. ఇందుకోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. అయితే పంటలపై తీవ్ర ప్రభావం చూపే కలుపు మొక్క వయ్యారిభామ(పార్థీనియం హిస్టిరోపోరస్) పంట ఎదుగుదలతోపాటు దిగుబడి రాకుండా అడ్డుకుంటుందని, పశువుల్లో వివిధ వ్యాధులు వచ్చేలా చేస్తుందని మంచిర్యాల ఏడీఏ వీరయ్య తెలిపారు. వయ్యారిభామ వల్ల కలిగే నష్టాలు, నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. మొక్క ఎలా వచ్చిందంటే.. అమెరికాలోని ఉష్ణప్రాంతంలో వయ్యారిభామ మొక్క ప్రస్థానం మొదలైంది. ఆహార ధాన్యాల దిగుమతి ద్వారా 1956లో మన దేశంలోకి ఈ మొక్క వచ్చి చేరిందని, 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కనుగొన్నట్లు ఏడీఏ తెలిపారు. ఈ మొక్క సీజన్‌తో సంబంధం లేకుండా నిరంతరం మొలుస్తుంది. ఒక్కో మొక్క పది వేలకుపైగా విత్తనాలను తయారు చేస్తుంది. ద్విదళ బీజంకు సంబంధించిన జాతి మొక్క కావడంతో ఒక్కో మొక్క ద్వారా కొన్ని వేల మొక్కలు వృద్ధి చెందుతాయి. ఇవి గాలి, నీరు, కీటకాల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లి దేశమంతా వ్యాపించాయి. ఇవి ఎక్కువగా రోడ్లు, పంటపొలాల గట్లు, బంజరు భూములు, చేలు, కాలువలు, రైల్వే ట్రాకుల వెంట ఎక్కువగా మొలుస్తుంటాయి. ఈ మొక్క ఎత్తు 0.5 మీటర్ల నుంచి 1.5 మీటర్లు ఉంటుంది. ఎక్కువ కొమ్మలను కలిగి ఉంటుంది. వీటి ఆకులు చీలి ఉండగా.. పూలు 4 నుంచి 5 మిల్లీమీటర్ల(చుట్టుకొలత) మేరకు విస్తరించి పూస్తాయి. ఈ మొక్క కేవలం విత్తనం ద్వారానే వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్క పూలు తెల్లగా ఉండడంతో వీటిని కాంగ్రెస్ గడ్డి, నక్షత్ర గడ్డి, పార్థీనియం అని పిలుస్తారు. మన వాడుక భాషలో మాత్రం వయ్యారిభామ మొక్క అని అంటాం. -
లాభాల బిందువు
నేరుగా మొక్క వేరుకు నీరు డ్రిప్పు పరికరాలను అమర్చి బిందు సేద్యం చేయడం ద్వారా నీటి వనరులు ఆదా అవుతాయి. కాల్వల ద్వారా నీరు వృథాగా పోయే అవకాశం లేదు. అంతేకాకుండా మొక్క వేరు భాగానికి నేరుగా నీరు అందుతుంది. దీనివల్ల పంట భూముల్లో కలుపు మొక్కలు పెరిగే అవకాశం లేకుండాపోతుంది. మొక్కలకు సమృద్ధిగా నీరందుతుంది. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. పంటలకు ఎరువులను డ్రిప్పు పైపుల ద్వారా సరఫరా చే సే అవకాశం ఉంది. డ్రిప్పు పైపులతో పాటు ట్యాంకును కూ డా సరఫరా చేస్తున్నారు. ట్యాంకులో యూరి యా వేస్తే చాలు పంట అంతటికీ అందుతుంది. సబ్సిడీపై పరికరాలు డ్రిప్పు పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై, పెద్ద రైతులకు 65శాతం సబ్సిడీపై డ్రిప్పు పరికరాలను అందిస్తున్నారు. రైతు పాస్‌బుక్‌లో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 1.50 ఎకరాలను ఒక యూనిట్ మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 1.5 ఎకరాల కోసం ఇచ్చే యూనిట్ పరికరాలు కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతున్నాయని రైతులు అంటున్నారు. కావాల్సినన్ని పరికరాలను సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు. డ్రిప్పు ద్వారా పసుపు, సోయా, మొక్కజొన్న, బెండ, వంగ, టామాట, పంటలను సాగు చేస్తున్నారు. -
కలుపుతో కష్టమే
నిజామాబాద్ వ్యవసాయం : వరి దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనది కలుపు. దీనిని నివారించకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. కాబట్టి కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పవన్‌చంద్రారెడ్డి సూచిస్తున్నారు. సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే పంట దిగుబడులు పెరుగుతాయంటున్నారు. కలుపు మొక్కలతో సమస్యలు కలుపు మొక్కలు పంటతో పాటే మొలుస్తాయి. వాటితోపాటే పెరుగుతూ సూర్యరశ్మి, పోషకాలు, నీటి కోసం పోటీ పడతాయి. పైరు ఎదుగుదలకు అవరోధంగా మారుతాయి. కలుపు మొక్క చీడపీడలకు ఆశ్రయం కల్పిస్తూ వాటి వ్యాప్తికి దోహదపడుతుంది. ఫలితంగా పంటకు అపార నష్టం వాటిల్లుతుంది. కలుపును సకాలంలో నిర్మూలించకపోతే సరైన దిగుబడులు రావు. ముఖ్యంగా వరి నాటిన ఆరు వారాల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ఉధృతికి కారణాలు పొలంలో దమ్ము సరిగా చేయకపోవడం, ఎరువుల ను ఎక్కువ మోతాదులో వేయడం, నీటి యాజమా న్య పద్ధతులను పాటించకపోవడం, పొట్టి వంగడాల్లో తొలి దశలో పెరుగుదల నిదానంగా ఉండడం, నారు మడిదశలో కలుపును నిర్మూలించకపోవడం వల్ల కలుపు ఎక్కువగా ఉంటుంది. సాధారణ కలుపు రకాలు గడ్డి జాతి, తుంగ, వెడల్పు ఆకుల మొక్కలు. కలుపు నివారణ పద్ధతులు యాజమాన్య పద్ధతులలో.. గట్టు మీద, సాగు నీటి కాలువల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. పొలాన్ని బాగా దమ్ము చేయాలి. పోషకాలు, సాగు నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట మార్పిడి చేయాలి. వరి తర్వాత వేరుశనగ లేదా ఇతర పంటలు వేసుకుంటే కలుపు ఉధృతి తగ్గుతుంది. నాట్లు వేసిన 15-20, 35-40 రోజుల మధ్య కూలీలతో కలుపు తీయించాలి. కూలీలు దొరకని పక్షంలో కలుపు నివారణకు రసాయనిక మందులను వినియోగించాలి. రసాయనాలతో.. నాటక ముందు మాగాణి భూముల్లో తుంగ, గరిక వంటి మొక్కలు బాగా పెరిగినట్లైతే నాట్లు వేయడానికి నెల రోజుల ముందు లీటరు నీటికి 10 మి. లీటర్ల గ్లైఫోసేట్ 41శాతం, 10 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్/యూరియా కలిపి పిచికారి చేయాలి. తర్వాత పొలాన్ని దున్ని నాట్లు వేయాలి. నాటిన 3-5 రోజుల మధ్య నాట్లేసిన 3-5 రోజులలోపు పొలంలో పలుచగా నీరు పారించి ఎకరానికి 4 కిలోల 2, 4-డి ఇథైల్ ఎస్టర్ 4 శాతం, 4 కిలోల బ్యూటాక్లోర్ 5 శాతం గుళికల్ని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతటా సమానంగా పడేలా చల్లాలి. గుళికల్ని చల్లిన మూడు రోజుల వరకు పొలంలో నీరు బయటకు పోకుండా, బయటి నీరు లోపలికి రాకుండా చూసుకోవాలి. గడ్గి జాతి మొక్కలు ప్రత్యేకించి ఊద ఎక్కువగా ఉంటే ఎకరానికి 500 మి.లీటర్ల అనిలోఫాస్ 30 శాతం లేదా 500 మి.లీ.ప్రెటిలాక్లోర్ 50 శాతం లేదా 1-1.5 లీటర్ల బ్యూటాక్లోర్ 50 శాతం, లేదా 1.5-2 లీటర్ల బెంథియోకార్బ్ 50 శాతంలలో ఏదో ఒక దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతటా సమానంగా పడేలా చల్లాలి. నాటిన 15-20 రోజుల మధ్య ఏ కారణం చేతనైనా నాట్లు వేసిన 3-5 రోజులలోపు కలుపు మందులు పిచికారి చేయలేకపోతే, నాట్లు వేసిన 15-20 రోజుల మధ్య పొలం నుంచి నీటిని తీసి వేసి, గడ్డిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి 400 మి.లీటర్ల సైహాలోఫాప్ బ్యూటైల్ 10 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. గడ్డిజాతి, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి 100 మి.లీటర్ల బిస్పైరిబాక్ సోడియం 10 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కలుపు మందులు పిచికారి చేసిన 2-3 రోజుల తర్వాత నీరు పెట్టాలి. నాటిన 35 రోజుల తర్వాత వరి నాటిన 35 రోజుల తర్వాత పిచ్చికాడ, బూరుగుకాడ, బొక్కినాకు, అగ్నివేండ్రపాకు వంటి ద్విదళబీజ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లైతే ఎకరానికి 400 గ్రాముల 2, 4-డి సోడియం సాల్ట్ 80 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి చేతి పంపుతో సాధ్యమైనంత వరకు కలుపు మొక్కలపైనే పడేలా స్ప్రే చేయాలి. మందు పిచికారి చేసిన తర్వాత పైరు ఎర్రబడే అవకాశం ఉంది. కాబట్టి నత్రజని ఎరువును తగు మోతాదులో పై పాటుగా వేసుకోవాలి. లేదా ఎకరానికి 50గ్రాముల ఇథాక్సిసల్ఫ్యూ రాన్ 20 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. -
ఇవి మహా మొండివి!
పాడి-పంట: వివిధ పంటల్లో అధికోత్పత్తులు సాధించడానికి సమగ్ర పోషక యాజమాన్యం ఎంత ముఖ్యమో సమగ్ర కలుపు నిర్మూలన కూడా అంతే అవసరం. రైతులు తమకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులనూ ఉపయోగించుకొని కలుపు మొక్కల్ని నిర్మూలించాలి. ఎందుకంటే ఇవి పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతూ గాలి, నీరు, వెలుతురు, పోషకాలను గ్రహిస్తాయి. దీనివల్ల పంట దిగుబడులు, నాణ్యత దెబ్బతింటాయి. చీడపీడల సమస్య కూడా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు) అందిస్తున్న సూచనలు... కలుపు మొక్కలు తమ జీవితకాలాన్ని త్వరగా పూర్తి చేసుకుంటాయి. ఒకే పంటకాలంలో చాలాసార్లు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు భూమి లోపల అనేక సంవత్సరాల పాటు మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి. వాతావరణం అనుకూలించినప్పుడు మొలకెత్తుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మహా మొండివి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ కూలీల కొరత, అధిక కూలి రేట్లు వంటి కారణాల వల్ల రైతులు సకాలంలో కలుపు మొక్కల్ని నిర్మూలించలేకపోతున్నారు. అయితే వాతావరణం అనుకూలిస్తే వ్యవసాయ పనిముట్లను ఉపయోగించి కూడా కలుపును నివారించవచ్చు. దీనివల్ల నేల గుల్లబారుతుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. నేలకు నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం పెరుగుతుంది. ఎలా వాడాలి? పంట విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపు భూమిలో తేమ ఉండేలా చూసుకొని లీటరుకు 5-6 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ (స్టాంప్, పెండిగార్డ్, పెండిమిన్, పెండిస్టార్) లేదా అలాక్లోర్ (లాసో, అలాటాప్) చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందుల్ని మొక్కజొన్న, పత్తి, మిరప, కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, బొబ్బర్లు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు, ఆముదంతో పాటు కూరగాయ పంటలైన టమాటా, క్యారట్, ఉల్లి, వెల్లుల్లి, బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, ధనియాలు, మెంతులు, ఆకుకూరలు, పందిరి జాతి కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు. తృణ ధాన్యపు పంటలైన జొన్న, సజ్జ, రాగిలో విత్తనాలు వేసిన 24-48 గంటల్లో లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున అట్రాజిన్ (అట్రాటాప్, సోలాలో, మిలేజిన్, సూర్య) కలిపి నేలపై పిచికారీ చేయాలి. ఇక మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి పంటల్లో పైరు, కలుపు మొక్కలు మొలకెత్తిన 15-20 రోజుల తర్వాత లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల 2,4-డీ సోడియం సాల్ట్ (ఫెర్నాక్సాన్, సాలిక్స్) చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే పత్తి, మిరప, పసుపు, కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, బొబ్బర్లు, వేరుశనగ, ఆముదంతో పాటు కూరగాయ పంటలైన ఉల్లి, వెల్లుల్లి, బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ధనియాలు, మెంతులు, ఆకుకూరలు, సొర, బీర, కాకర, గుమ్మడి, దోసలో గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల క్విజలాఫాప్-పి-ఇథైల్ (టర్గా సూపర్) లేదా 1.25 మిల్లీలీటర్ల ప్రొపాక్విజాఫాస్ (ఎజిల్) చొప్పున కలిపి పైరు మొక్కలు, కలుపు మొక్కలు మొలకెత్తిన 15-20 రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాత వాడే మెట్రిబుజిన్ (శంకర్) మందును లీటరు నీటికి 2.5-3 గ్రాముల చొప్పున (చెరకు, టమాటాలో 1.5 గ్రాములు) కలిపి 10-15 రోజుల లోపు పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి పంటకు సిఫార్సు చేసిన మందును సరైన మోతాదులో, సరైన సమయంలో వాడాలి. కలుపు మందు పక్క పొలానికి ఏమైనా నష్టం కలిగిస్తుందేమో ముందుగానే తెలుసుకోవాలి. స్ప్రేయర్ నుంచి మందు సమానంగా పడేలా చూసుకోవాలి. కలుపు మందును ఒకసారి పిచికారీ చేసిన తర్వాత మళ్లీ వాడకూడదు. ఫ్లాట్ ఫ్యాన్/ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి బాగా వీస్తున్నప్పుడు కలుపు మందు వాడకూడదు. కాబట్టి ఉదయం వేళల్లో గాలి తక్కువగా ఉన్నప్పుడే పిచికారీ చేయడం మంచిది. గాలికి ఎదురుగా మందు పిచికారీ చేయకూడదు. ఆహార, పశుగ్రాస పంటలపై కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాతే పైర్లు కోయాలి. కలుపు మందును తేలికపాటి నేలలో తక్కువ మోతాదులో, సేంద్రియ పదార్థం-బంకమట్టి ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో, ఎర్ర నేలల్లో మధ్యస్థంగా వాడుకోవాలి. మందు పిచికారీ చేసిన తర్వాత 6-8 గంటల లోపు వర్షం వస్తే దాని ప్రభావం తగ్గుతుంది. నీటిలో కరిగే పొడి మందును ఇసుకలో కలిపి వెదజల్లకూడదు. స్పష్టమైన సూచనలు లేనిదే కలుపు మందును పురుగు, తెగుళ్ల మందులతో కలపకూడదు. చేలో బాగా పదును ఉన్నప్పు డే మందులు వాడాలి. కలుపు మందును పిచికారీ చేసిన తర్వాత స్ప్రేయర్‌ను 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఎప్పుడూ ఒకే కలుపు నివారణ మందును వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు దానిని తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటాయి. -
పూతకు రాకముందే పీకేయాలి
పాడి-పంట వర్షాలు పడుతున్నాయంటే చాలు... రైతులు ముందుగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కల గురించే. ఇక్కడా... అక్కడా.... అని లేకుండా ఈ మొక్క ఎక్కడైనా పెరుగుతుంది. దీనిని వివిధ ప్రాంతాల్లో క్యారట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కపుల్లాకు, కాంగ్రెస్ గడ్డి, చేతక్ చాందిని, అపాది, గజర్ అని కూడా పిలుస్తుంటారు. పేరేదైనా ఈ మొక్క కలిగించే నష్టం అపారం. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. దూర ప్రాంతాలకు సైతం తేలికగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో వయ్యారిభామ కలుపు మొక్కల గురించి ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఒ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న ఆసక్తికరమైన విషయాలు... ఏం జరుగుతుంది? వయ్యారిభామ వల్ల పంట మొక్కలకే కాదు... మనుషులు, పశువులకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. మనుషులు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధమైన అలర్జీతో బాధపడతారు. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాయడం వంటి సమస్యలూ వస్తాయి. ఈ విషపూరితమైన మొక్కల్ని తింటే పశువులు హైపర్ టెన్షన్‌కు గురవుతాయి. వాటి వెంట్రుకలు రాలిపోతాయి. ఇక పంటల విషయానికి వస్తే... వయ్యారిభామ మొక్కలు నీరు, పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతుంటాయి. ఫలితంగా దిగుబడులు 40% వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాటా, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వుకుళ్లు, కాండంకుళ్లు తెగుళ్లు సోకవచ్చు. వేరుశనగ పైరుకు నెక్రోసిస్ తెగులు సోకుతుంది. వయ్యారిభామ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. వాటి దిగుబడిని తగ్గిస్తాయి. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న వయ్యారిభామ మొక్కల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమ గ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏం చేయాలంటే... వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని చేతితో పీకేయాలి. మొక్కలు పూత దశకు రాకముందే పీకి తగలబెట్టాలి. లేకుంటే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కల్ని పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి. రసాయనాలతో... మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలకెత్తక ముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. మొక్కజొన్న, జొన్న పంటల్లో విత్తనాలు మొలకెత్తిన 15-20 రోజులకు లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున 2,4-డి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాస పంటలు వేసే వారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి. ఆ సమయంలో చేలో వయ్యారిభామ మొక్కలు కూడా ఉండకూడదు. పశుగ్రాస పైరు మొలకెత్తి న 15-20 రోజులకు లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే లీటరు నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ లేదా 5-7 మిల్లీలీటర్ల పారాక్వాట్ చొప్పున కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. కంపోస్ట్ తయారీ ఇలా... వయ్యారిభామ మొక్కలు ఎంత హానికరమైనవి అయినప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంతను తవ్వాలి. అందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కల్ని వేసి, వాటిపై 5 కిలోల యూరియా లేదా 50 కిలోల రాక్ ఫాస్ఫేట్ చల్లుకోవాలి. వీలైతే 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కూడా చల్లవచ్చు. ఒకవేళ వయ్యారిభామ మొక్కలకు వేర్లు లేకపోతే 10-15 కిలోల బంకమట్టి కలపాలి. ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి, పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్ట్‌లో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. కూరగాయ పంటలకు ఎకరానికి 2 కిలోల కంపోస్ట్ వేసుకోవచ్చు. వయ్యారిభామ మొక్కలతో తయారైన ఎరువు మనుషులు, పశువులు, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. వయ్యారిభామలో ఉండే పార్థినిస్ అనే హానికరమైన రసాయనం ఎరువు తయారీ దశలోనే నశిస్తుంది. కంపోస్ట్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని, అన్ని పంటలకూ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందిస్తున్న సూచనలు... పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి వర్షాధార పంటల్ని నేల పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొత్తగా పండ్ల తోటలు పెట్టే వారు గుంతలు తీసుకోవాలి. టమాటా, వంగ, మిరప వంటి కూరగాయ పంటలకు నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగ జాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలి.