ఆకాశాన్నంటిన ఎరువులు, క్రిమిసంహారక మందులతో సతమతమవుతున్న పత్తి రైతుకు పిండి నల్లి, ఇతర తెగుళ్లు కూడా భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు పత్తి పంటకు దాదాపు రూ.15 నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయ దశకు చేరుకునే సమయంలో తెగుళ్లు ఆశించడంతో దిగులు పట్టుకుంది.
గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో దాదాపు 10,500 హెక్టార్లలో పత్తి పంట సాగుచేశారు. పంట సాగుచేసినప్పటి నుంచి పత్తి రైతులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది.
పది రోజుల కిందటి వరకు వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది. అనంతరం కురిసిన వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి పెట్టుబడి భారం పెరిగింది.
వర్షం నిలిచిపోయిన తరుణంలో తిరిగి పత్తి పంటకు దోమ పోటు, పిండినల్లి సమస్య తీవ్రమైంది. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఉధృతి తగ్గడం లేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లతో మొక్క పెరుగుదల నిలిచిపోయి వచ్చిన పూత, పిందెలు రాలిపోతున్నాయి.
నివారణకు ఇవీ సూచనలు : పచ్చదోమ నివారణకు థయోమితాక్జిన్ లేదా, ఎసిటమిప్రైడ్ మందుల్లో ఏదో ఒకదానిని లీటరు నీటిలో 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్‌ను 10 లీటరు నీటికి 6 నుంచి 10 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చని వ్యవసాయ అధికారి జి.మీరయ్య సూచించారు. పిండి నల్లి నివారణకు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేస్తే పూర్తిగా నివారించవచ్చన్నారు. ఆకులు ఎర్రగా మారినట్లు కనిపిస్తే అందుకు కిలో మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలన్నారు.
తెల్ల బంగారానికి తెగుళ్ల దెబ్బ
Published Thu, Nov 20 2014 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement