Pest prevention
-
తెల్ల బంగారానికి తెగుళ్ల దెబ్బ
ఆకాశాన్నంటిన ఎరువులు, క్రిమిసంహారక మందులతో సతమతమవుతున్న పత్తి రైతుకు పిండి నల్లి, ఇతర తెగుళ్లు కూడా భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు పత్తి పంటకు దాదాపు రూ.15 నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయ దశకు చేరుకునే సమయంలో తెగుళ్లు ఆశించడంతో దిగులు పట్టుకుంది. గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో దాదాపు 10,500 హెక్టార్లలో పత్తి పంట సాగుచేశారు. పంట సాగుచేసినప్పటి నుంచి పత్తి రైతులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. పది రోజుల కిందటి వరకు వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది. అనంతరం కురిసిన వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి పెట్టుబడి భారం పెరిగింది. వర్షం నిలిచిపోయిన తరుణంలో తిరిగి పత్తి పంటకు దోమ పోటు, పిండినల్లి సమస్య తీవ్రమైంది. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఉధృతి తగ్గడం లేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లతో మొక్క పెరుగుదల నిలిచిపోయి వచ్చిన పూత, పిందెలు రాలిపోతున్నాయి. నివారణకు ఇవీ సూచనలు : పచ్చదోమ నివారణకు థయోమితాక్జిన్ లేదా, ఎసిటమిప్రైడ్ మందుల్లో ఏదో ఒకదానిని లీటరు నీటిలో 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్ను 10 లీటరు నీటికి 6 నుంచి 10 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చని వ్యవసాయ అధికారి జి.మీరయ్య సూచించారు. పిండి నల్లి నివారణకు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేస్తే పూర్తిగా నివారించవచ్చన్నారు. ఆకులు ఎర్రగా మారినట్లు కనిపిస్తే అందుకు కిలో మెగ్నీషియం సల్ఫేట్ను పిచికారీ చేయాలన్నారు. -
కందినైనా కాపాడుకోండి
శనగపచ్చ పురుగు రెక్కల పురుగులు(బసవంతలు) లేత ఆకులపై పూత, పిందెలపై తెల్లని గసగసాల పరిమాణంలో గుడ్లు పెడుతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన లార్వాలు తొలి రోజుల్లో ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. తర్వాత పంట పూత దశకు చేరగానే పూత, మొగ్గలు, కాయలు, గింజలను ఆశించి అధిక నష్టం కలగజేస్తాయి. నివారణ చర్యలు... దీని నివారణకు మొక్కల మొదళ్లలో గోనె సంచులు లేదా తాటిపత్రి షీట్లను పరవాలి. మొక్కను సున్నితంగా ఓ వైపు వంచి దులపాలి. ఇలా చేస్తే 90 శాతం శనగపచ్చ పురుగులు, ఇతర క్రిమికీటకాలు, నల్లులు, పెంకు పురుగులు కింద పడుతాయి. రాలిన లార్వాలను, ఇతర కీటకాలను పూడ్చడం గానీ మంటలో వేయడం చేయాలి. ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (20శాతం ఈసీ) లేదా 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ (10శాతం ఈసీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ (50 శాతం ఈసీ) మందును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు దీన్ని మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు చిన్నవిగా ఉండి పూత లోపలి మెత్తటి భాగాలను తిని నష్టపరుస్తాయి. ఆకులు, పూత, పిందెలను కలిపి గూడుగా మలిచి తింటూ ఉండిపోతుంది. ఫలితంగా పంట కాత పట్టదు. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి మెత్తటి గింజలను తినేసి కాయలను డొల్లగా మారుస్తాయి. ఈ లార్వా ఆశించిన పూతపై, కాయ లోపల వాటి విసర్జన పదార్థాన్ని చూసి నిర్ధారించుకోవచ్చు. నివారణ చర్యలు... ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (25శాతం ఈసీ) మందును కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రెండోసారి వారం రోజుల తర్వాత.. లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ట్రయాజోఫాస్ (40శాతం ఈసీ) లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమమేక్టిన్ బెంజోయేట్ (5 ఈసీ డబ్ల్యూజీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్లూబెండమైడ్ (39, 35 ఎస్సీ) మందును కలిపి స్ప్రే చేయాలి. కాయతొలుచు ఈగ తల్లి ఈగ గుడ్లను కాయ లోపలికి జొప్పించి పెడతాయి. కాయ లోపలే గుడ్లు పొదిగి కాళ్లు లేని పిల్లలు(మగ్గోట్స్)గా మారి లేత గింజలను తిని మగ్గేట్ దశను పూర్తి చేసుకుని ప్యూపాగా మారుతాయి. ప్యూపాలు కొంత కాలం తర్వాత పగిలి తల్లి ఈగలు తయారవుతాయి. మగ్గేట్లు కాయ లోపలి భాగాన్ని కొరికి తినేటప్పుడు కాయ తొక్కకి పలుచని పొర ఏర్పడుతుంది. దీన్ని చీల్చుకుంటూ తల్లి ఈగ బయటకు వస్తుంది. ఈగ లేత దశలోనే ఆశించడం వల్ల జీవిత చక్రం కాయ లోపలనే జరుపుకోవడంతో ఇది కలుగజేసే నష్టాన్ని గుర్తించడం కష్టం. నివారణ చర్యలు... మొదటి దశలో లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత రెండో విడతగా లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల డైమిథోయేట్ను పంటపై స్ప్రే చేయాలి. వేరుకుళ్లు, ఎండుకుళ్లు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి క్రమేపీ వాడిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు ధారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా కానీ పాక్షికంగా గానీ కుళ్లిపోతాయి. కొద్ది రోజుల్లోనే మొక్క చనిపోతుంది. నివారణ చర్యలు... దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.2 గ్రాముల తెబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - మొక్కను మొత్తం మందుతో తడపాలి. ముఖ్యంగా మొదళ్లు బాగా తడిసేలా చూడాలి. - పై పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఓ సూచించారు. కందిపెంకు పురుగు పెంకు పురుగులు పూత, కాతను ఆశించి పూత నుంచి కాత రసాన్ని పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నివారణ చర్యలు... లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. -
ముడతలు ముంచేస్తాయ్..
తామర పురుగులు ఆకుల అడుగ భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. మొక్కలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. నివారణకు కార్బరిల్ 600 గ్రాములు లేదా ఫాసలోన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా పిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు లేదా స్పైనోశాడ్ 75 మిల్లీలీటర్లు లేదా పెసగాన్ 300 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. మిరప నారు నాటిన 15, 45వ రోజు పిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయడం ద్వారా పై ముడత ను నివారించవచ్చు. పై ముడతతో పాటు కింది ముడత కూడా ఉంటే కార్బరిల్, ఎసిఫేట్ మందులు వాడకూడదు. తెల్లనల్లి (కింది ముడత) తెల్లనల్లి పురుగులు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకుని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దగా మారతాయి. కింది ముడత నివారణకు డైకోఫాల్ ఒక లీటరు లేదా నీటిలో కరిగే గంధ కం 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పంటకు ఆకులు తడి చేలా పిచికారీ చేయాలి. పై ముడత ఉధృతి ఒకేసారి గమనిస్తే ఉధృతిని బట్టి ఎకరాకు జోలోన్ 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చే సుకోవాలి. పేనుబంక లేత కొమ్మల ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గుతుంది. ఇది తియ్యటి పదార్థాలను విసర్జించడం వల్ల చీమలను ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు మసిపూసినట్లుగా నల్లగా మారిపోతాయి. పేనుబంక నివారణకు మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత పురుగులు పిల్ల పురుగులు మొగ్గలు, పూత, పిందెను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. తొలిచి చూస్తే ఈగ పిల్ల పురుగులు, ప్యూపాలను గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 40 శాతం వరకు పూత రాలిపోతుంది. కాయలు ఏర్పడవు. ముందే ఏర్పడిన కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకర్లు తిరిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధరపలకదు. నివారణకు ట్రైజోపాస్ ఎకరానికి 250 మిల్లీలీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత మరలా క్లోరోపైరిఫాస్ 500 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తే పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. కాయతొలుచు పురుగు పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగులు మొదటి దశలో మిరప ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లోకి చేరి గింజలను తినేస్తాయి. నివారణకు థయోడికార్బ్ 200 గ్రాములు లే దా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా టోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఫినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. గుడ్ల నుంచి అప్పుడే బయటికి వచ్చే పిల్లపురుగులను అరికట్టేందుకు నోవాల్యురాన్ 150 మిల్లీలీటర్లు లేదా డైప్లూబెంజురన్ 200 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి ఎకరాకు పిచికారీ చేయాలి. విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దెపురుగులను నివారించవచ్చు. విషపు ఎర తయారీకి.. 5 కిలోల తవుడుకు 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 500 గ్రాముల బెల్లం, తగినంత నీటిని కలిపి చిన్నచిన్న గుళికలుగా తయారు చేసి సాయంత్రం వేళ చేలో సమానంగా చల్లితే నెర్రెల్లో దాగి ఉన్న పురుగులు రాత్రి వేళ బయటికి వచ్చి తిని చనిపోతాయి. కాయతొలుచు పురుగుల ఉధృతిని గుర్తించడానికి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఎరలను మాత్రం 25 రోజులకు ఒకసారి మార్చాలి. ఆకర్షణ పైరుగా చేనులో ఆముదం, బంతి మొక్కలు వేసుకోవాలి. మిరప పంటకు పురుగుల మాదిరిగా పలురకాల తెగుళ్లు సోకి నష్టం కలిగిస్తాయి. -
పప్పు పంటలను ఇలా కాపాడుకోండి
పాడి-పంట: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఇప్పటికే పెసర, మినుము విత్తనాలు వేసుకున్నారు. అయితే ఈ పైర్లను ఆశించి నష్టపరుస్తున్న చీడపీడల నివారణపై వారు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఫలితంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెసలు, మినుములకు మంచి ధర లభిస్తోంది. కాబట్టి రైతులు ఆయా పంటల్లో చీడపీడల నివారణపై తగిన శ్రద్ధ కనబరిస్తే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెసర, మినుము పైర్లలో పురుగులు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు... ఇవి రసాన్ని పీలుస్తాయి పెసర, మినుము పైర్లలో రసం పీల్చే తెల్లదోమ, తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు ఆకుల నుంచి రసాన్ని పీల్చడంతో పాటు పల్లాకు (ఎల్లో మొజాయిక్) తెగులును వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ పిల్ల పురుగులు ముందుగా కొద్దిసేపు ఆకులపై తిరుగుతాయి. ఆ తర్వాత ఒకే కణానికి అతుక్కుపోయి రసాన్ని పీలుస్తూ పెరుగుతుంటాయి. తెల్లదోమ నివారణకు విత్తనాలు వేసిన 15-20 రోజుల మధ్య లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల మెటాసిస్టాక్స్ లేదా 0.2 గ్రాముల అసిటామిప్రిడ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు పైరు తొలి దశలోనూ, పూత దశలోనూ పంటను నష్టపరుస్తాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకులు, మొగ్గలను గీకి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగులు మొక్కల లేత భాగాలను ఆశ్రయించి పెరగడం వల్ల ఆకులు పెళుసుగా మారతాయి. మొక్క గిడసబారుతుంది. పురుగు ఆశించిన మొగ్గలు, పూలు కాయలుగా మారవు. ఈ పురుగులు ఆకుముడత తెగులును వ్యాపింపజేస్తాయి. తామర పురుగుల కారణంగా పైరుకు 10-20% మేర నష్టం జరుగుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్ లేదా ఒక మిల్లీలీటరు ఫిప్రోనిల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పూత దశ నుంచి ఆశిస్తుంది మరుకా మచ్చల పురుగును పూత, గూడ, బూ జు పురుగు అని కూడా అంటారు. ఇది పూత దశలో పూలను గూడుగా చేసుకొని, లోపలి పదార్థాన్ని తినేస్తుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరికి చేర్చి, గూడు కట్టి, లోపల గింజలను తింటుంది. ఈ పురుగుల నివారణకు సకాలంలో చర్యలు చేపట్టకపోతే దిగుబడులు 80% వరకూ తగ్గే ప్రమాదం ఉంది. లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఒక గ్రాము థయోడికార్బ్/ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 10 లీటర్ల నీటికి 4 మిల్లీలీటర్ల స్పైనోశాడ్ లేదా 1.5 మిల్లీలీటర్ల ప్లూబెండియమైడ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకులు జల్లెడలా మారతాయి పొగాకు లద్దె పురుగులు తొలి దశలో ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులు తెల్లగా, జల్లెడ మాదిరిగా మారతాయి. పెద్ద పురుగులు ఆకులు, పూత, పిందె, కాయలను తినేస్తాయి. ఇవి పగటి వేళ భూమిలో దాగి ఉంటూ రాత్రి సమయంలో పైరుపై దాడి చేస్తుంటాయి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పెద్ద పురుగుల నివారణకు మొక్కల మొదళ్ల వద్ద సాయంకాలం వేళ విషపు ఎరలు వేయాలి. విషపు ఎరల తయారీ కోసం 500 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్/క్లోరిపైరిఫాస్+5 కిలోల తౌడు+అర కిలో బెల్లాన్ని తగినంత నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేయాలి. అపార నష్టం కలిగిస్తుంది తెల్లదోమ ద్వారా వ్యాపించే పల్లాకు తెగులు పెసర, మినుము పైర్లకు అపార నష్టం కలిగిస్తుంది. తెగులు సోకిన లేత ఆకుల మీద ముందుగా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేపీ పెద్దవై, ఆకులు పూర్తిగా పసుపు రంగుకు మారతాయి. పిందెలు, కాయ లు కూడా పసుపు రంగుకు మారి వంకర్లు తిరుగుతాయి. కాయల్లో విత్తనాలు ఏర్పడవు. పైరు తొలి దశలో ఉన్నప్పుడు తెగులు సోకితే మొక్క లు గిడసబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు ముందుగా తెగులు సోకిన మొక్కలను పీకి దూరంగా పారేయాలి. పసుపు రంగు రేకు/అట్టకు ఆముదం/గ్రీజు పూసి పైరు మీద ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేయాలి. పసుపు రంగుకు ఆకర్షితమయ్యే తెగులు కారక తెల్లదోమలు రేకు/అట్టకు అతుక్కొని చనిపోతాయి. ఇవి కూడా... సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు సోకితే ఆకులపై ముందుగా గోధుమ రంగులో చిన్న చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి పెద్దవవుతాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. కాయల్లో గింజలు సరిగా ఏర్పడవు. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఆకుముడత తెగులు సోకుతుంది. ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాటి నివారణకు మందులు పిచికారీ చేయాలి.