కందినైనా కాపాడుకోండి | atleast protect to red gram | Sakshi
Sakshi News home page

కందినైనా కాపాడుకోండి

Published Mon, Nov 10 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

atleast protect to red gram

 శనగపచ్చ పురుగు
 రెక్కల పురుగులు(బసవంతలు) లేత ఆకులపై పూత, పిందెలపై తెల్లని గసగసాల పరిమాణంలో గుడ్లు పెడుతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన లార్వాలు తొలి రోజుల్లో ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. తర్వాత పంట పూత దశకు చేరగానే పూత, మొగ్గలు, కాయలు, గింజలను ఆశించి అధిక నష్టం కలగజేస్తాయి.

 నివారణ చర్యలు...
  దీని నివారణకు మొక్కల మొదళ్లలో గోనె సంచులు లేదా తాటిపత్రి షీట్లను పరవాలి.
   మొక్కను సున్నితంగా ఓ వైపు వంచి దులపాలి. ఇలా చేస్తే 90 శాతం శనగపచ్చ పురుగులు, ఇతర క్రిమికీటకాలు, నల్లులు, పెంకు పురుగులు కింద పడుతాయి. రాలిన లార్వాలను, ఇతర కీటకాలను పూడ్చడం గానీ మంటలో వేయడం చేయాలి.

  ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (20శాతం ఈసీ) లేదా 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ (10శాతం ఈసీ) లేదా  2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ (50 శాతం ఈసీ) మందును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేయాలి.

 కాయతొలుచు పురుగు
 దీన్ని మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు చిన్నవిగా ఉండి పూత లోపలి మెత్తటి భాగాలను తిని నష్టపరుస్తాయి. ఆకులు, పూత, పిందెలను కలిపి గూడుగా మలిచి తింటూ ఉండిపోతుంది. ఫలితంగా పంట కాత పట్టదు. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి మెత్తటి గింజలను తినేసి కాయలను డొల్లగా మారుస్తాయి. ఈ లార్వా ఆశించిన పూతపై, కాయ లోపల వాటి విసర్జన పదార్థాన్ని చూసి నిర్ధారించుకోవచ్చు.

 నివారణ చర్యలు...
 ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (25శాతం ఈసీ) మందును కలిపి పిచికారీ చేయాలి.

ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రెండోసారి వారం రోజుల తర్వాత.. లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ట్రయాజోఫాస్ (40శాతం ఈసీ) లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమమేక్టిన్ బెంజోయేట్ (5 ఈసీ డబ్ల్యూజీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్లూబెండమైడ్ (39, 35 ఎస్‌సీ) మందును కలిపి స్ప్రే చేయాలి.

 కాయతొలుచు ఈగ
 తల్లి ఈగ గుడ్లను కాయ లోపలికి జొప్పించి పెడతాయి. కాయ లోపలే గుడ్లు పొదిగి కాళ్లు లేని పిల్లలు(మగ్గోట్స్)గా మారి లేత గింజలను తిని మగ్గేట్ దశను పూర్తి చేసుకుని ప్యూపాగా మారుతాయి. ప్యూపాలు కొంత కాలం తర్వాత పగిలి తల్లి ఈగలు తయారవుతాయి. మగ్గేట్‌లు కాయ లోపలి భాగాన్ని కొరికి తినేటప్పుడు కాయ తొక్కకి పలుచని పొర ఏర్పడుతుంది. దీన్ని చీల్చుకుంటూ తల్లి ఈగ బయటకు వస్తుంది. ఈగ లేత దశలోనే ఆశించడం వల్ల జీవిత చక్రం కాయ లోపలనే జరుపుకోవడంతో ఇది కలుగజేసే నష్టాన్ని గుర్తించడం కష్టం.

 నివారణ చర్యలు...
  మొదటి దశలో లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత రెండో విడతగా  లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ను పంటపై స్ప్రే చేయాలి.  

 వేరుకుళ్లు, ఎండుకుళ్లు
 ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి క్రమేపీ వాడిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు ధారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా కానీ పాక్షికంగా గానీ కుళ్లిపోతాయి. కొద్ది రోజుల్లోనే మొక్క చనిపోతుంది.

 నివారణ చర్యలు...
  దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.2 గ్రాముల తెబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - మొక్కను మొత్తం మందుతో తడపాలి.
  ముఖ్యంగా మొదళ్లు బాగా తడిసేలా చూడాలి.
 - పై పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఓ సూచించారు.  

 కందిపెంకు పురుగు
 పెంకు పురుగులు పూత, కాతను ఆశించి పూత నుంచి కాత రసాన్ని పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

 నివారణ చర్యలు...
 లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement