
నేడు ప్రపంచ జల దినోత్సవం
‘నీరు ఉన్న చోట ఊరు ఉంటుంది’ అనే మాట ఉంది. ఊరు సరే... నీటి మాట ఏమిటి?‘నీటిని డబ్బులా ఖర్చు చేయవద్దు’ అనే రోజులు వచ్చాయి.నీటి విలువ గురించి అవగాహన కలిగించడం నుంచి సంరక్షణ వరకు విమెన్ వాటర్ వారియర్స్ క్షేత్రస్థాయిలో, ఉద్యమ స్థాయిలో పనిచేస్తున్నారు...
అస్సాంలోని అమ్తోలా గ్రామానికి చెందిన అరుణా దాస్ గుస్తా సామాజిక సమస్యలపై నిర్వహించే సమావేశాలకు తరచుగా హాజరయ్యేది. ఆ అలవాటే తనని నీటి పరిరక్షణ ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది. గ్రామంలోని వాటర్ యూజర్ గ్రూప్ (డబ్ల్యూయుజీ) అధ్యక్షురాలిగా నీటి సమస్యలపై గళమెత్తడంలో గణనీయమైన పాత్ర పోషించింది. ‘ప్రతి విషయం నీటితో ఆరంభమై నీటితో ముగిసిపోతుంది’ అంటున్న అరుణ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ్రపోగ్రామ్ (ఇండియా) ద్వారా ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలోని పాలియ కాలన్ గ్రామానికి చెందిన రమణ్‌దీప్ కౌర్ నీటి సంరక్షణ నుంచి నీటి కాలుష్యం వరకు....ఎన్నో విషయాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. కౌర్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది. గ్రామంలో ‘వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీ’లు ఏర్పాటు చేసింది.ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళలను వాటర్ మేనేజ్‌మెంట్ గ్రూపులలో భాగమయ్యేలా చేసింది.
మహారాష్ట్రలోని కోటంబ గ్రామంలో మహిళలు నీటి కోసం కిలోమీటర్‌ల దూరం వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం రేణుక. కోడలుగా ఆ ఊళ్లోకి అడుగు పెట్టిన రేణుక కొంత కాలానికి ఆ గ్రామానికి సర్పంచ్ అయింది. ‘వాటర్ ఎయిడ్ ఇండియా’ సహకారంతో గ్రామంలో ప్రభుత్వ భవనాలపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసింది. నీటి వృథాను అరికట్టడానికి, నీటి సంరక్షణపై అవగాహన కలిగించడానికి గ్రామీణ మహిళలతో కమిటీని ఏర్పాటు చేసింది.
మధ్యప్రదేశ్‌లోని నయాపూరా గ్రామానికి చెందిన బబితా లిరోలియా నీటి సంరక్షణ, నీటి నాణ్యత పరీక్షించడం, నీటి పంపుల రిపేర్...మొదలైన ఎన్నో విషయాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ఇంటర్‌నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్’ బబితాను ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తించింది.
మధ్యప్రదేశ్‌లోని మహుకల గ్రామానికి చెందిన రాధ మీనా ‘విమెన్ ప్లస్ వాటర్ అలయెన్స్’ ్రపోగ్రామ్ వాలెంటరీ వర్కర్. గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయడం నుంచి కుళాయిల్లో లీకేజీ సమస్య లేకుండా చేయడం, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం వరకు ఎన్నో పనులు చేస్తోంది. ప్రతీ వీధి తిరుగుతూ నీటి సంరక్షణ గురించి లౌడ్ స్పీకర్‌తో ప్రచారం చేసేది..దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది విమెన్ వాటర్ వారియర్స్‌లో వీరు కొందరు మాత్రమే. ‘వరల్డ్ వాటర్ డే’ సందర్భంగా అందరికీ వందనాలు. – శిరీష చల్లపల్లి
నీటి నిజాలు
⇒ ప్రపంచంలో 2 బిలియన్ మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది
⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది కలుషిత నీటి వల్ల సంభవించే వ్యాధులతో మరణిస్తున్నారు
⇒భవిష్యత్తులో నీటి కొరత ఒక ప్రధాన సమస్యగా మారనుంది. పరిష్కారంగా, డీసాలినేషన్ (సముద్ర జలాన్ని తాగే నీటిగా మార్చడం), వర్షపు నీటి సేకరణ, జల పునర్వినియోగం వంటి టెక్నాలజీలు అవసరం. ప్రతి వ్యక్తి నీటిని పొదుపుగా వాడడం ముఖ్యం.
వాటర్ గర్ల్... నీటి పుస్తకాలు
‘వాటర్ గర్ల్’గా గుర్తింపు పొందిన గర్విత గుల్హాటీ ‘వై వేస్ట్?’ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, సీయివో. తన ఫౌండేషన్ ద్వారా నీటి విలువ, నీటి సంరక్షణ గురించి యువ రచయితలు రాసిన రచనలను ప్రచురిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment