ట్రెండ్‌ మారింది.. ఫుడ్‌ మారాలి | Sheela Krishnaswamy talks about Nutrition Food | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌ మారింది.. ఫుడ్‌ మారాలి

Published Fri, Nov 22 2024 12:53 AM | Last Updated on Fri, Nov 22 2024 12:53 AM

Sheela Krishnaswamy talks about Nutrition Food

ఫ్యాషన్‌ ట్రెండ్స్‌లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ  ఆ ట్రెండ్‌ ఎవరికి మంచిది, ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్‌లో రాస్తూ సమాజాన్ని  ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి. హెల్త్‌ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షీలా కృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యసంరక్షణ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

న్యూట్రిషన్, వెల్‌నెస్‌ రంగంలో నలభై ఏళ్ల అనుభవం ఉన్న షీలా కృష్ణస్వామి రోజూ 30 గ్రాముల నట్స్, సీడ్స్‌ తీసుకోవాలని చెప్పారు. ముప్ఫై గ్రాములంటే ఎన్ని అని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓ గుప్పెడు చాలు. రోజూ గ్లాసు నీరు, గుప్పెడు బాదం పప్పులతో తన రోజు మొదలవుతుందన్నారు. ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సహజాహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు. విటమిన్‌లు, ప్రొటీన్‌లతో కూడిన ఆహారం కోసం మన డైట్‌లో పప్పులు, ధాన్యాలు, పీచు, పాలు, పండ్లను తీసుకుంటున్నాం. బాదం, గుమ్మడి విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి దాదాపుగా సంపూర్ణ ఆహారం అందినట్లే.  

జంక్‌ బదులు గింజలు! 
వందేళ్ల కిందట ఇప్పుడున్న అనారోగ్యాలు లేవు. గడచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఏం తినాలనిపిస్తే అది తిన్నారు. ఏం పండితే వాటినే తిన్నారు. ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్‌ వంటి అనారోగ్యాల్లేవు. అందుకు కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేటంతటి వ్యాయామం ఉండేది. తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది. ఈ రెండింటి వల్ల దేహక్రియలు చక్కగా జరిగేవి. గట్‌ హెల్త్‌ అంటే అదే. ఆ గట్‌ హెల్త్‌ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ‘బెంగళూరులో నా కళ్లారా చూస్తుంటాను.

 ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లడానికి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇంటికి వెళ్లేలోపు ఆకలి వేస్తుంటుంది. కారులో వెళ్తూ చిప్స్, ఫ్రెంచ్‌ ఫ్రై, సమోసాలు, బేకరీ ఫుడ్‌ వంటి జంక్‌ తింటూ ఉంటారు. నేనేం చె΄్తానంటే జంక్‌ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి. ఆఫీసుకెళ్లేటప్పుడు పండ్లను బ్యాగ్‌లో తీసుకెళ్లడం కొన్నిసార్లు సాధ్యంకాకపోవచ్చు. బాదం వంటి నట్స్‌ ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు’ అన్నారు షీలా కృష్ణస్వామి. అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణమన్నారు. ‘అందంగా ఉండడానికి రహస్యం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉండడమే’నని నవ్వారామె. 

ఎలాగైనా తినండి!
పరిపూర్ణ ఆరోగ్యానికి, దీర్ఘకాలం యవ్వనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలనే నియమం ఏదీ అవసరం లేదు. పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు. డ్రై రోస్ట్, నానిన వాటిని వేయించి,పోపు పెట్టి చాట్‌ మసాలా చల్లి తినవచ్చు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలిచేస్తుంటారు. కానీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫైబర్‌ కూడా దేహానికి అవసరమే. వృద్ధులకు పొట్టుతోపాటు తినడం ఇబ్బందవుతుంది. పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగా లేని వాళ్లు మాత్రమే.  
– షీలా కృష్ణస్వామి, న్యూట్రిషనిస్ట్, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్, బెంగళూరు 

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 
ఫొటో : టి.దయాకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement