Wellness Department
-
ట్రెండ్ మారింది.. ఫుడ్ మారాలి
ఫ్యాషన్ ట్రెండ్స్లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆ ట్రెండ్ ఎవరికి మంచిది, ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్‌లో రాస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి. హెల్త్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షీలా కృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యసంరక్షణ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.న్యూట్రిషన్, వెల్నెస్ రంగంలో నలభై ఏళ్ల అనుభవం ఉన్న షీలా కృష్ణస్వామి రోజూ 30 గ్రాముల నట్స్, సీడ్స్ తీసుకోవాలని చెప్పారు. ముప్ఫై గ్రాములంటే ఎన్ని అని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓ గుప్పెడు చాలు. రోజూ గ్లాసు నీరు, గుప్పెడు బాదం పప్పులతో తన రోజు మొదలవుతుందన్నారు. ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సహజాహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు. విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం కోసం మన డైట్లో పప్పులు, ధాన్యాలు, పీచు, పాలు, పండ్లను తీసుకుంటున్నాం. బాదం, గుమ్మడి విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి దాదాపుగా సంపూర్ణ ఆహారం అందినట్లే. జంక్ బదులు గింజలు! వందేళ్ల కిందట ఇప్పుడున్న అనారోగ్యాలు లేవు. గడచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఏం తినాలనిపిస్తే అది తిన్నారు. ఏం పండితే వాటినే తిన్నారు. ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్యాల్లేవు. అందుకు కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేటంతటి వ్యాయామం ఉండేది. తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది. ఈ రెండింటి వల్ల దేహక్రియలు చక్కగా జరిగేవి. గట్ హెల్త్ అంటే అదే. ఆ గట్ హెల్త్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ‘బెంగళూరులో నా కళ్లారా చూస్తుంటాను. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లడానికి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇంటికి వెళ్లేలోపు ఆకలి వేస్తుంటుంది. కారులో వెళ్తూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై, సమోసాలు, బేకరీ ఫుడ్ వంటి జంక్ తింటూ ఉంటారు. నేనేం చె΄్తానంటే జంక్ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి. ఆఫీసుకెళ్లేటప్పుడు పండ్లను బ్యాగ్‌లో తీసుకెళ్లడం కొన్నిసార్లు సాధ్యంకాకపోవచ్చు. బాదం వంటి నట్స్ ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు’ అన్నారు షీలా కృష్ణస్వామి. అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణమన్నారు. ‘అందంగా ఉండడానికి రహస్యం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉండడమే’నని నవ్వారామె. ఎలాగైనా తినండి!పరిపూర్ణ ఆరోగ్యానికి, దీర్ఘకాలం యవ్వనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలనే నియమం ఏదీ అవసరం లేదు. పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు. డ్రై రోస్ట్, నానిన వాటిని వేయించి,పోపు పెట్టి చాట్ మసాలా చల్లి తినవచ్చు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలిచేస్తుంటారు. కానీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫైబర్ కూడా దేహానికి అవసరమే. వృద్ధులకు పొట్టుతోపాటు తినడం ఇబ్బందవుతుంది. పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగా లేని వాళ్లు మాత్రమే. – షీలా కృష్ణస్వామి, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : టి.దయాకర్ -
‘సంక్షేమం’పై అదనపు వేటు!
నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే.. కచ్చితంగా నాణ్యత తగ్గుతుంది. లక్ష్యసాధనా అంతంత మాత్రంగానే ఉంటుంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో సరిగ్గా ఇదే సీను కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు లేకపోవడంతో ప్రతి ఒక్కరికీ అదనపు బాధ్యతలు అంటగట్టారు. దీంతో వారి పనితీరు మసకబారడంతోపాటు హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం గాల్లో దీపంగా మారింది. - ‘ఇన్చార్జి’లతో నెట్టుకొస్తున్న బీసీ సంక్షేమశాఖ - ఒక్కో అధికారికి రెండు మూడు ‘అదనపు బాధ్యతలు’ - వసతిగృహాల పర్యవేక్షణపై ప్రభావం - అస్తవ్యస్తంగా తయారైన సంక్షేమ హాస్టళ్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ వార్షిక బడ్జెట్ రూ.650 కోట్లకు పైమాటే. 47 పాఠశాల విద్యార్థి వసతి గృహాలు, 28 కాలేజీ విద్యార్థి వసతి గృహాలున్న ఈ శాఖ పరిధిలో లక్షలాది మంది విద్యార్థులకు యేటా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాలున్నాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న శాఖలో డివిజన్ స్థాయి అధికారులు.. వ సతి గృహ సంక్షేమాధికారులు.. ఇలా ఏ కేటగిరిలో చూసినా అదనపు బాధ్యులే కన్పిస్తున్నారు. చివరకు సిబ్బందిని పర్యవేక్షించే జిల్లా ఉన్నతాధికారి కూడా ‘ఇన్చార్జే’ కావడం గమనార్హం. రెండు డివిజన్లకు ఒక్కరే..! జిల్లా బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఎనిమిది డివిజన్లున్నాయి. ప్రతి డివిజన్‌కు ఒక సహాయ సంక్షేమాధికారి (ఏబీసీడబ్ల్యూఓ) ఉంటారు. సంక్షేమ వసతిగృహాల పర్యవేక్షణతోపాటు కాలేజీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన, ఆమోదం, నిధుల మంజూరు బాధ్యతలు చూసుకోవాలి. ఇంతటి కీలక బాధ్యతలున్న డివిజన్ స్థాయి అధికారులకు కూడా అదనపు భారం తప్పలేదు. ఒక్కో అధికారి రెండేసి డివిజన్లను పర్యవేక్షిస్తున్నారు. ఘట్కేసర్ ఏబీసీడబ్ల్యూఓకు మేడ్చల్ అదనపు బాధ్యతలు చూసుకుంటున్నారు. అదేవిధంగా హయత్‌నగర్ ఏబీసీడబ్ల్యూఓ దిల్సుఖ్నగర్ బాధ్యతలనూ నెట్టుకొస్తున్నారు. వికారాబాద్ ఏబీసీడబ్ల్యూఓ చేవెళ్లకు ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. కూకట్పల్లి ఏబీసీడబ్ల్యూఓ తాండూరు డివిజన్ బాధ్యతల్ని కూడా చక్కబెడుతున్నారు. ఏబీసీడబ్ల్యూఓలపై అదనపు భారం పడడంతో.. పారదర్శకతపై సర్కారు చెబుతున్న మాటలకు పాతరేసినట్లవుతోంది. హాస్టళ్లలో ‘చతుర్విన్యాసం’.. డివిజన్ స్థాయిలో రెండేసి అదనపు బాధ్యతలుండగా.. వసతిగృహ స్థాయిలో ఈ బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఒక్కో వసతి గృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూఓ) ఏకంగా నాలుగు హాస్టళ్ల బాధ్యతలు చూసుకుంటున్నారు. వాస్తవానికి వసతిగృహ సంక్షేమాధికారి అదే హాస్టల్లో ఉంటూ పిల్లల బాగోగులు చూసుకోవాలి. కానీ సిబ్బంది లేరనే సాకుతో జిల్లాలో ఒక్కో హెచ్‌డబ్ల్యూఓకు నాలుగు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించారు. హయత్‌నగర్‌లో పనిచేసే హెచ్‌డబ్ల్యూఓ తారామతిపేట్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం హాస్టళ్లను కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఘట్కేసర్ బాలుర వసతిగృహ అధికారి కూకట్పల్లి, మల్కాజిగిరి కాలేజీ విద్యార్థుల వసతిగృహా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలా హాస్టల్ సంక్షేమాధికారులకు ఇష్టానుసారంగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వసతిగృహాల పర్యవేక్షణ, విద్యార్థుల సంక్షేమ ఆగమ్యగోచరమవుతోంది.