‘సంక్షేమం’పై అదనపు వేటు!
నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే.. కచ్చితంగా నాణ్యత తగ్గుతుంది. లక్ష్యసాధనా అంతంత మాత్రంగానే ఉంటుంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో సరిగ్గా ఇదే సీను కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు లేకపోవడంతో ప్రతి ఒక్కరికీ అదనపు బాధ్యతలు అంటగట్టారు. దీంతో వారి పనితీరు మసకబారడంతోపాటు హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం గాల్లో దీపంగా మారింది.
- ‘ఇన్‌చార్జి’లతో నెట్టుకొస్తున్న బీసీ సంక్షేమశాఖ
- ఒక్కో అధికారికి రెండు మూడు ‘అదనపు బాధ్యతలు’
- వసతిగృహాల పర్యవేక్షణపై ప్రభావం
- అస్తవ్యస్తంగా తయారైన సంక్షేమ హాస్టళ్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ వార్షిక బడ్జెట్ రూ.650 కోట్లకు పైమాటే. 47 పాఠశాల విద్యార్థి వసతి గృహాలు, 28 కాలేజీ విద్యార్థి వసతి గృహాలున్న ఈ శాఖ పరిధిలో లక్షలాది మంది విద్యార్థులకు యేటా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాలున్నాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న శాఖలో డివిజన్ స్థాయి అధికారులు.. వ సతి గృహ సంక్షేమాధికారులు.. ఇలా ఏ కేటగిరిలో చూసినా అదనపు బాధ్యులే కన్పిస్తున్నారు. చివరకు సిబ్బందిని పర్యవేక్షించే జిల్లా ఉన్నతాధికారి కూడా ‘ఇన్‌చార్జే’ కావడం గమనార్హం.
రెండు డివిజన్లకు ఒక్కరే..!
జిల్లా బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఎనిమిది డివిజన్లున్నాయి. ప్రతి డివిజన్‌కు ఒక సహాయ సంక్షేమాధికారి (ఏబీసీడబ్ల్యూఓ) ఉంటారు. సంక్షేమ వసతిగృహాల పర్యవేక్షణతోపాటు కాలేజీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల పరిశీలన, ఆమోదం, నిధుల మంజూరు బాధ్యతలు చూసుకోవాలి. ఇంతటి కీలక బాధ్యతలున్న డివిజన్ స్థాయి అధికారులకు కూడా అదనపు భారం తప్పలేదు. ఒక్కో అధికారి రెండేసి డివిజన్లను పర్యవేక్షిస్తున్నారు. ఘట్‌కేసర్ ఏబీసీడబ్ల్యూఓకు మేడ్చల్ అదనపు బాధ్యతలు చూసుకుంటున్నారు. అదేవిధంగా హయత్‌నగర్ ఏబీసీడబ్ల్యూఓ దిల్‌సుఖ్‌నగర్ బాధ్యతలనూ నెట్టుకొస్తున్నారు. వికారాబాద్ ఏబీసీడబ్ల్యూఓ చేవెళ్లకు ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. కూకట్‌పల్లి ఏబీసీడబ్ల్యూఓ తాండూరు డివిజన్ బాధ్యతల్ని కూడా చక్కబెడుతున్నారు. ఏబీసీడబ్ల్యూఓలపై అదనపు భారం పడడంతో.. పారదర్శకతపై సర్కారు చెబుతున్న మాటలకు పాతరేసినట్లవుతోంది.
హాస్టళ్లలో ‘చతుర్విన్యాసం’..
డివిజన్ స్థాయిలో రెండేసి అదనపు బాధ్యతలుండగా.. వసతిగృహ స్థాయిలో ఈ బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఒక్కో వసతి గృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూఓ) ఏకంగా నాలుగు హాస్టళ్ల బాధ్యతలు చూసుకుంటున్నారు. వాస్తవానికి వసతిగృహ సంక్షేమాధికారి అదే హాస్టల్లో ఉంటూ పిల్లల బాగోగులు చూసుకోవాలి. కానీ సిబ్బంది లేరనే సాకుతో జిల్లాలో ఒక్కో హెచ్‌డబ్ల్యూఓకు నాలుగు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించారు. హయత్‌నగర్‌లో పనిచేసే హెచ్‌డబ్ల్యూఓ తారామతిపేట్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం హాస్టళ్లను కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఘట్‌కేసర్ బాలుర వసతిగృహ అధికారి కూకట్‌పల్లి, మల్కాజిగిరి కాలేజీ విద్యార్థుల వసతిగృహా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలా హాస్టల్ సంక్షేమాధికారులకు ఇష్టానుసారంగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వసతిగృహాల పర్యవేక్షణ, విద్యార్థుల సంక్షేమ ఆగమ్యగోచరమవుతోంది.