
విశ్లేషణ
వ్యవసాయంలో విత్తనాల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. హరిత విప్లవం పేరిట మొదలుపెట్టిన పరిణామం విత్తనాలతోనే మొదలైంది. అధిక దిగుబడి వంగడాల హామీతో ఇది మొదలై, క్రమంగా రైతులను విత్తనాలకు దూరం చేసింది. 1960వ దశకంలో మొదలు పెట్టిన ఈ మార్పు 2025 నాటికి తీవ్రరూపం దాల్చింది. ఆహార నాణ్యత దిగజారడానికి విత్తనాలలో వచ్చిన మార్పులే కారణం. దేశీ విత్తనాలను తులనాడి, భారత వ్యవసాయాన్ని హీనపరిచి తెచ్చిన హరిత అధిక దిగుబడి వంగడాలు క్రమంగా రైతుల విత్తన స్వావలంబనను హరించాయి.
రసాయనాల దిగుబడి
విదేశీయుల ప్రోత్సాహంతో ప్రవేశపెట్టిన వంగడాలు అధిక దిగుబడి ఇవ్వడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు. రసా యన ఎరువులు ఉపయోగించని పరిస్థితులలో ఈ వంగడాలు ఉప యోగపడలేదు, ఉపయోగపడవు. ఆ విధంగా మొదలుపెట్టిన రసా యన ఎరువుల వాడకం ఇప్పుడు విధిగా, అత్యధికంగా ఉపయోగించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎకరాకు ఒకటో రెండో ఎరువుల బస్తాల వాడకం నుంచి ఇప్పుడు 15 బస్తాలు వాడే దుఃస్థితికి రైతు చేరుకున్నాడు.
పరిశోధన చేసి ప్రవేశపెట్టిన హైబ్రిడ్ లేదా అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాల ఉపయో గాన్ని కూడా పెంచాయి. ఈ రకం విత్తనాలు మొదట్లో అధిక దిగుబడి చూపినా క్రమంగా ఉత్పాదకత తగ్గింది. దిగుబడి పెరిగి తగ్గుతోందని గుర్తించి ఒక కొత్త వాదన ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. విత్తనాలు ఎప్పటికప్పుడు మార్చాలి. మార్చితేనే దిగుబడి!
ఏ ఆధునిక విత్తనంలోనూ నూరు శాతం అంకురోత్పత్తి ఉండదు. దాంతో మభ్యపెట్టే సిఫారసు మొదలైంది. ఎకరాకు ఎన్ని గింజలు వెయ్యాలి? సాధారణంగా ఒక్కో పంటకు ఒక్క కొలమానం ఉంటుంది. ఆధునిక విత్తనాల్లో అంకురోత్పత్తి వంద శాతం ఎప్పుడూ ఉండదు కనుక ఈ కొలమానంలో మార్పులు తెచ్చి ఎకరాకు ఎక్కువ విత్తనాలు వాడే విధంగా సిఫారసు చేయడం మొదలు పెట్టారు.
వరి పంటకు కొందరు రైతులు ఎకరాకు 18 నుంచి 20 కిలోలు వాడుతుంటే, పరిజ్ఞానం ఉన్న రైతులు కేవలం 250 గ్రాముల దేశీ వరి విత్తనాలు వాడుతున్నారు. ఎంత తేడా! మిర్చి, పత్తి, వరి, గోధుమ, టమాట వంటి పంటలలో నాసి రకం విత్తనాల వల్ల లాభపడు తున్నది ప్రైవేటు కంపెనీలు, నష్టపోతున్నది రైతులు.
పోయిన జ్ఞానం, నమ్మకం
ఆధునిక విత్తనాల వల్ల సాగు ఖర్చు పెరిగింది. ఒకప్పుడు రైతు తన విత్తనాలు దాచుకుని వాడే రోజులలో విత్తనాల మీద సున్నా ఖర్చు ఉండేది. రైతుకు తన విత్తనాల మీద పరిజ్ఞానం ఉండేది. వేరే రైతు దగ్గర తెచ్చుకున్నా నమ్మకం ఉండేది. రైతు తన విత్తనాలు కోల్పోయి ఆధునిక విత్తనాలకు అలవాటు పడ్డ తరువాత విత్తనాల మీద జ్ఞానం, నమ్మకం పోయినాయి. ఆధునిక విత్తనాలకు చీడ పీడ బెడద పెరిగింది.
దానికి పరిష్కారంగా కీటక నాశనిల వాడకం పెరి గింది. వాటి వల్ల ఖర్చు పెరిగింది. ప్రమాదకరమైన రసాయనాలు కాబట్టి వాటిని వాడే క్రమంలో రైతు ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఫలితంగా వలసలు, ఆత్మహత్యలు. వ్యవసాయ కూలీ కుటుంబా లతో మొదలైన వలసలు రైతులను కూడా తాకాయి. ఇంకొక వైపు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయం మీద సలహాలు ఇచ్చే కంపెనీలు పెరిగాయి. వాటి వార్షికాదాయం యేటా పెరుగుతున్నది.
బహుశా నార్మన్ బోర్లాగ్ కూడా ఈ పరిణామం ఊహించి ఉండక పోవచ్చు. బోర్లాగ్ ప్రవేశపెట్టిన ‘అధిక దిగుబడినిచ్చే’ విత్తనా లకు ఖరీదైన ఎరువులే కాక, ఎక్కువ నీరూ అవసరం. వ్యవసాయ ఉత్పత్తిలో అద్భుతాలు లేవు అని చెప్పిన ఈ వ్యక్తి, ప్రపంచానికి ఆహార భద్రత సాధించాలని మొదలు పెట్టిన ‘ఆధునిక విత్తనాల’ వ్యవసాయం జీవ వైవిధ్యాన్ని, జీవనోపాధులను నాశనం చేస్తున్న విషయం పట్ల స్పందించలేదు. ‘అధిక వంగడాల’ వల్ల దిగుబడి పెరుగుతుందనే ఏకైక సూత్రం మీద పని చేసిన ఆ మహానుభావుడు తద్వారా నిర్మాణమైన ‘దోపిడీ’ వ్యవస్థ గురించి ఆలోచించలేదు.
పెద్ద కంపెనీల గుప్పిట్లో...
ఇప్పుడు ‘ఆధునిక విత్తనాలు’ రైతుల చేతులలో లేవు. విత్తన, పెస్టిసైడ్ కంపెనీల గుప్పిట్లో ఉన్నాయి. ‘మేధో హక్కుల సంపత్తి’ పేరిట రక్షణ పొంది విత్తన మార్కెట్లను సురక్షితం చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో యేటా కొత్త ‘విత్తనాలు’ మార్కెట్లో ప్రవేశపెట్టి అటు ప్రభుత్వాలనూ, ఇటు రైతులనూ మభ్యపెడుతూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.
మన దేశంలో విత్తనాలు, ప్రకృతి వనరుల మీద మేధో సంపత్తి హక్కులు పొందే అవకాశం లేదు కనుక ఇతర మార్గాలలో తమ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. పెద్ద కంపెనీలు సిండికేట్ అయ్యి చిన్న కంపెనీలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. మార్కెట్ ఒప్పందాలు చేసుకుని దేశీ, చిన్న కంపెనీలకు ‘బంధనాలు’ వేశారు. ప్రభుత్వం ఏదన్నా ‘చర్య’ చేపడితే కోర్టుకు వెళతారు. విత్తన కంపెనీలు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిన కేసులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి.
రైతులలో విత్తనాల విజ్ఞానం కొండలా పెరగాల్సిందిపోయి, ప్రైవేటు గుత్తాధిపత్యం వల్ల వారికి అందడం లేదు. రానురాను విత్తన విజ్ఞానాన్ని రహస్యంగా మార్చుతున్నాయి విత్తన కంపెనీలు. ఇక్రి సాట్, ఇర్రి వంటి అంతర్జాతీయ సంస్థలు విత్తన పరిశోధనల సాకుతో భారతీయ జన్యు సంపద తీసుకుని, క్రమంగా ప్రైవేటు పెట్టుబడి దారులకు అందజేస్తున్నాయి.
1966 తరువాత నిర్మాణమైన ప్రభుత్వ విత్తన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఇప్పుడు ఉన్న సంస్థలు, కమి టీల పరిశోధనలు ఉత్సవ పాత్రకే పరిమితమై, పరోక్షంగా ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఏదో జరుగుతున్న భ్రమ కల్పించటానికి ఉపయోగపడుతున్నాయి.
వ్యాపార సరళీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి, దేశాభివృద్ధికి మూలమైన విత్తన రంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ, ఉన్న ఒకే ఒక చట్టాన్ని అమలు చేయడం లేదు. 1966లో ప్రభుత్వం రంగంలో చేసే విత్తనాల నాణ్యత, సరఫరా మీద శాస్త్రీయ నియంత్రణకు తెచ్చిన విత్తన చట్టం ప్రైవేటు విత్తనాలకు వర్తింప జేయడానికి సిద్ధంగా లేదు.
2004లో ఒక కొత్త చట్టం తెచ్చే ప్రయత్నం ప్రైవేటు విత్తన కంపెనీల వ్యాపార వెసులుబాటును సరళీకృతం చేయడానికే అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 20 యేళ్ల తరువాత కూడా అది రూపుదాల్చలేదు. ఇప్పటి వరకు ప్రతిపాదించిన 4, 5 ముసాయిదాలు రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, భారత దేశంలో ఉన్న అపర విత్తన సంపద స్వచ్ఛతను పరిరక్షణకూ ఉద్దేశించినవి కావు. రైతులు, కంపెనీల ప్రయోజనాల మధ్య కంపెనీల పక్షం వహిస్తున్న కేంద్రం కొత్త చట్టం తేవడానికి భయపడుతున్నది.
విత్తనాల మీద స్వావలంబన అత్యంత మౌలికమైన అవసరం. రైతులకు విత్తన స్వాతంత్య్రం కోసం రాష్ట్రాలు చట్టాలు తేవాలి. రైతుల పరిజ్ఞానం పెంచే విధంగా విత్తన వ్యవస్థను నిర్మించాలి. విత్తన జన్యుసంపదను కలుషితం కాకుండా కాపాడాలి. పర్యావరణానికి, జన్యుసంపదకు హాని చేసే విత్తనాలను ప్రవేశపెట్టే కంపెనీలు,సంబంధిత వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. గ్రామీణ స్థాయి నుంచి విత్తనాలను రైతులు స్వేచ్ఛగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతులను ప్రోత్సహించాలి.
డా‘‘ దొంతి నరసింహా రెడ్డి
వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment