green revolution
-
వ్యవసాయ రంగ మేరు నగం
ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ కొన్ని రోజుల కిందట (సెప్టెంబర్ 28) మనకు దూరమయ్యారు. వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన ఓ దార్శనికుడిని మన దేశం కోల్పోయింది. భారతదేశానికి ఆ దిగ్గజం చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. మాతృభూమిని అమితంగా ప్రేమించే స్వామినాథన్ మన దేశం సదా సుభిక్షంగా ఉండాలనీ, మన రైతులోకం సౌభాగ్యంతో వర్ధిల్లాలనీ ఆకాంక్షించారు. ఒక తెలివైన విద్యార్థిగా తన ఉజ్వల భవిష్యత్తుకు బాటవేసుకునే వీలున్నా 1943 నాటి బెంగాల్ క్షామం ఆయనను చలింపజేసింది. ఆ రోజుల్లో ఎంతగా ప్రభావితులయ్యారంటే– ఆరు నూరైనా వ్యవసాయ రంగమే తన భవిష్యత్తుగా ఆయన తిరుగులేని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాస్త్రంలో చదువు ముగించిన స్వామినాథన్‌కు తొలినాళ్లలోనే ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నార్మన్ బోర్లాగ్‌తో పరిచయం ఏర్పడింది. నాటి నుంచీ పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 1950 లోనే అమెరికాలో అధ్యాపకుడిగా ఆయనకు అవకాశం వచ్చింది. కానీ, జన్మభూమి సేవలో తరించడమే తన ధ్యేయమంటూ దాన్ని తిరస్కరించారు. పెను సవాళ్లతో నిండిన అప్పటి పరిస్థితుల్లో... స్వామినాథన్ మన దేశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వావలంబన వైపు నడిపించడాన్ని ఒకసారి ఊహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి రెండు దశాబ్దాల్లో మనకు ఎదురైన సవాళ్లలో ఆహార కొరత ప్రధానమైనది. 1960వ దశకం తొలినాళ్లలో భారతదేశం కరువు కాటకాలు కమ్ముకుని అల్లాడుతోంది. అటువంటి గడ్డు పరిస్థితుల నడుమ స్వామినాథన్ మొక్కవోని పట్టుదల, నిబద్ధత, ముందుచూపుతో ఉజ్వల వ్యవసాయ శకానికి నాంది పలికారు. వ్యవసాయం రంగంలో, ముఖ్యంగా గోధుమ సాగు వంటి నిర్దిష్ట ఆహార పంటల సమృద్ధి దిశగా మార్గదర్శకుడై నిలిచారు. తద్వారా ఆహార కొరతతో అల్లాడిన భారత్ స్వయం సమృద్ధ దేశంగా రూపొందింది. వ్యవసాయ రంగంలో దేశం సాధించిన ఈ అద్భుత విజయమే ఆయనకు ‘భారత హరిత విప్లవ పితామహుడు’ బిరుదును ఆర్జించి పెట్టింది. ‘ఏదైనా సాధించగలం’ అనే భారత ఆత్మస్థైర్యానికి హరిత విప్లవం ఒక సమగ్ర ఉదాహరణగా నిలిచింది. మనకు లక్ష సవాళ్లున్నా, ఆవిష్కరణల ఆలంబనగా వాటిని అధిగమించగల పది లక్షల మేధావుల అండ ఉన్నదని రుజువైంది. హరిత విప్లవం శ్రీకారం చుట్టుకున్న ఐదు దశాబ్దాల తర్వాత నేడు భారత వ్యవసాయ రంగం అత్యధునాతనం, ప్రగతిశీలమైనదిగా మారిందంటే కారణం స్వామినాథన్ వేసిన పునాదులేననే వాస్తవాన్ని మరువలేం. దేశ ఆహార కొరతను అధిగమించడంలో విజయం తర్వాత, ఏళ్ల తరబడి బంగాళాదుంప పంటను దెబ్బతీస్తున్న పరాన్నజీవుల ప్రభావాన్ని అరికట్టే దిశగా ఆయన పరిశోధన చేపట్టి సఫలమయ్యారు. అంతేకాకుండా ఈ పంట చలి వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగింది. ఇక ప్రపంచం నేడు చిరుధాన్యాలు లేదా ‘శ్రీఅన్న’ను అద్భుత ఆహార ధాన్యాలుగా పరిగణిస్తోంది. స్వామినాథన్ 1990లలోనే చిరుధాన్యాలపై చర్చను ముమ్మరం చేయడమేగాక వాటి సాగును ఇతోధికంగా ప్రోత్సహించారు. స్వామినాథన్‌తో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉండేవి. 2001లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో గుజరాత్ వ్యవసాయపరంగా పెద్దగా నైపుణ్యంగల రాష్ట్రం కాదు. దీనికితోడు వరుస కరువులు, తుపానులు, భూకంపం వంటివి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మేం ప్రారంభించిన అనేక కార్యక్రమాలలో భూసార కార్డుల పథకం ఒకటి. ఇది భూసారాన్ని చక్కగా అర్థం చేసుకోవడంలో తోడ్పడింది. సమస్యలు తలెత్తినపుడు వాటిని సులువుగా పరిష్కరించడం సాధ్యమైంది. ఈ పథకం అమలు సమయంలోనే నేను స్వామినాథన్‌ను కలిశాను. ఆయన ఈ పథకాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. దాన్ని మరింత మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైనా పథకంపై సందేహాలు వెలిబుచ్చేవారు స్వామినాథన్ మాటతో ఒక్కసారిగా ఏకాభిప్రాయానికి వచ్చేవారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రమేగాక, ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కూడా మా మధ్య సంబంధాలు కొనసాగాయి. 2016 నాటి అంతర్జాతీయ వ్యవసాయ–జీవవైవిధ్య మహాసభలలో ఆయనను కలిశాను. మరుసటేడాది 2017లో ఆయన రెండు భాగాలుగా రాసిన పుస్తకాన్ని నేనే ఆవిష్కరించాను. ప్రపంచాన్ని పరస్పరం అనుసంధానించే సూదితో ‘తిరుక్కురళ్’లోని ఒక ద్విపద రైతుల గురించి అభివర్ణిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అన్నదాత రైతే! ఈ సూక్తిని స్వామినాథన్ చక్కగా జీర్ణించుకున్నారు. కాబట్టే, ప్రజలు ఆయనను ‘వ్యవసాయ శాస్త్రవేత్త’గా పిలుస్తారు. కానీ, ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు అంతకుమించినవని నా విశ్వాసం. ఆయన నిజమైన ‘రైతు శాస్త్రవేత్త’. ‘రైతుల శాస్త్రవేత్త’. ఆయన మెదడులో శాస్త్రవేత్త ఉంటే, హృదయంలో రైతు ఉన్నాడన్నది నా అభిప్రాయం. స్వామినాథన్ పరిశోధనలు కేవలం ఆయన విద్యా నైపుణ్యానికి పరిమితం కాదు; వాటి ప్రభావం ప్రయోగశాలల వెలుపలకు... వ్యవసాయ క్షేత్రాలు–పొలాలకు విస్తరించాయి. శాస్త్రీయ జ్ఞానం–ఆచరణాత్మక అనువర్తనాల మధ్య అంతరాన్ని ఆయన పనితీరు తగ్గించింది. వ్యవసాయం రంగంలో సుస్థిరత కోసం ఆయన సదా పాటుపడ్డారు. మానవ పురోగమనం, పర్యావరణ సుస్థిరత నడుమ సున్నిత సమతౌల్యాన్ని నొక్కిచెప్పారు. సన్న–చిన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడం, ఆవిష్కరణల ఫలాలు వారికి అందించడంలో స్వామినాథన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని నేను తప్పక ప్రస్తావించాలి. ముఖ్యంగా మహిళా రైతుల జీవితాల సాధికారతపై ఆయనెంతో శ్రద్ధాసక్తులు చూపారు. స్వామినాథన్‌లోని మరో విశిష్ట కోణం గురించి కూడా చెప్పాలి. ఆవిష్కరణల విషయంలోనే కాకుండా మార్గదర్శకత్వం వహించడంలోనూ ఆయనొక ఆదర్శమూర్తి. 1987లో ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి విజేతగా, దానికింద లభించిన సొమ్ముతో లాభాపేక్ష రహిత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఇప్పటిదాకా వివిధ రంగాలలో విస్తృత, విశిష్ట పరిశోధనలు నిర్వహించింది. అలాగే ఆయన ఎందరో పరిశోధకులను తీర్చిదిద్దారు. అభ్యాసం, ఆవిష్కరణలపై ఎందరిలోనో శ్రద్ధాసక్తులు రగిలించారు. వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచ పరిస్థితుల నడుమ విజ్ఞానం, మార్గదర్శకత్వం, ఆవిష్కరణలకు గల శక్తిసామర్థ్యాలను ఆయన జీవితం ప్రతిబింబిస్తుంది. ఆయన స్వయంగా ఓ సంస్థ స్థాపకులేగాక శక్తిమంతమైన పరిశోధనలు సాగిస్తున్న మరెన్నో సంస్థల స్థాపనకు ఊపిరి పోసినవారు. మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం డైరెక్టర్‌గానూ ఆయన పనిచేయడం ఇందుకు నిదర్శనం. ఈ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధన కేంద్రం 2018లో వారణాసి నగరంలో ప్రారంభమైంది. డాక్టర్ స్వామినాథన్‌కు నివాళి అర్పిస్తున్న ఈ సందర్భంలో నేను మరో ద్విపదను ప్రస్తావించదలిచాను. ‘ప్రణాళిక రూపకర్త దృఢ మనస్కుడైతే... తానేది ఏ రీతిలో ఆకాంక్షించాడో ఆ రీతిలో దాన్ని సాధించగలడు’ అని ఈ ద్విపద చెబుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనీ, రైతులకు సేవలందించాలనీ చిరుప్రాయంలోనే నిర్ణయించుకున్న మహనీయుడాయన. ఆ విధంగానే వినూత్నంగా, ఆవిష్కరణాత్మకంగా, భావోద్వేగాలతో తాను నిర్దేశించుకున్న లక్ష్యం సాధించారు. వ్యవసాయ ఆవిష్కరణలు, సుస్థిరత దిశగా మన పయనంలో స్వామినాథన్ కృషి, పరిశ్రమ మనకు సదా స్ఫూర్తిదాయక మార్గనిర్దేశం చేస్తాయి. మనం కూడా ఆయనెంతో ప్రీతిగా అనుసరించిన సూత్రాల అమలుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ముందుకు సాగాలి. రైతుల సంక్షేమం ప్రాతిపదికగా శాస్త్రీయ ఆవిష్కరణల ఫలాలు మూలాలకు చేరేలా చూడాలి. తద్వారా భవిష్యత్తరాలను వృద్ధి, సుస్థిరత, సౌభాగ్యం వైపు ప్రోత్సహించాలి. - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి -
చెన్నైలో తుదిశ్వాస విడిచిన స్వామినాథన్
-
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూత
-
ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
-
MS Swaminathan: ఎమ్.ఎస్ స్వామినాథన్ కన్నుమూత
ఢిల్లీ: భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు స్వామినాథన్. దీంతో ఎంతో మంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటునిచ్చారు. స్వామినాథన్ చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎమ్.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 1971లో స్వామినాథన్‌కు రామన్‌మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ సైన్స్ అవార్డ్‌లతో సత్కరించారు. పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. బాల్యంలోనే నిర్ణయం.. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్ జన్మించారు. డా.ఎం.కె. సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. ఆయన 11 యేట తండ్రి మరణంచగా.. ఆయన మామయ్య సంరక్షణలో చదువు కొనసాగించారు. కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1943 నాటి బెంగాల్ కరువు పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన.. ఆ దుర్భర పరిస్థితులను దేశం నుంచి పారదోలాలని నిర్ణయించుకున్నారు. మొదట జంతుశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాసు వ్యవసాయ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్రవేత్తగా ఎదిగారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో స్వామినాథన్‌కు పరిచయమైన మీనాతో ఆయన వివాహం అయింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. Father of India's Green Revolution, MS Swaminathan passes away in Chennai, Tamil Nadu. (Pic: MS Swaminathan Research Foundation) pic.twitter.com/KS4KIFtaP2 — ANI (@ANI) September 28, 2023 ఎన్నో బాధ్యతలు.. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్‌గా స్వామినాథన్ పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు భారత వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు కూడా ఆయన తన సేవలను అందించారు. 2014 వరకు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. #WATCH | Dr Soumya Swaminathan, former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, says, "...He was not keeping well for the last few days... His end came very peacefully this morning... Till the end, he was committed to the… https://t.co/n8B313Q2et pic.twitter.com/0BKDqqXbse — ANI (@ANI) September 28, 2023 భారత్‌లో చేసిన సేవల కంటే స్వామినాథన్ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం -
హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం
సాక్షి, అమరావతి: గత పాతికేళ్లలో దేశంలో హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం వృద్ధి చెందిందని నీతిఆయోగ్ పేర్కొంది. దీంతో ప్రపంచ పాల ఉత్పత్తిలో మనదేశం వాటా రెట్టింపు అయ్యిందని తెలిపింది. ఈ మేరకు దేశంలో క్షీర విప్లవంపై నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం విడుదల చేసింది. 1990 మధ్య కాలం వరకు పాల ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. అయితే రాబోయే 25 ఏళ్లలో అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాల కంటే దేశంలో రెండు రెట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయని వివరించింది. అంతేకాకుండా దేశంలో డెయిరీ రంగం వృద్ధి వ్యవసాయ రంగం వృద్ధికి దోహదపడుతోందని పేర్కొంది. పేదలకు, మహిళలకు పాల ఉత్పత్తి రంగం అనుకూలంగా ఉందని తెలిపింది. ఇన్పుట్ సబ్సిడీలు లేకుండానే డెయిరీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని వెల్లడించింది. దేశంలో పాడి పరిశ్రమ విజయం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని కొనియాడింది. వ్యవసాయ రంగం మొత్తం ఆదాయంలో నాలుగో వంతు పాలు ద్వారా వచ్చిందేనని వివరించింది. నాలుగు అంశాలు కారణం.. దేశంలో క్షీర విప్లవం విజయవంతం కావడానికి ప్రధానంగా నాలుగు అంశాలు దోహదపడినట్లు నీతిఆయోగ్ అభిప్రాయపడింది. పాల మార్కెటింగ్ కోసం సహకార సంస్థల ఏర్పాటు, పాల ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, ఆవులతో కృత్రిమ గర్భధారణ, పాల మార్కెటింగ్–వాణిజ్యంపై పరిమితులు, నిబంధనలు లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. 1950–51లో దేశంలో పాల ఉత్పత్తి సంవత్సరానికి 1.36 శాతం పెరిగింది. 1973–74 వరకు ఇది జనాభా పెరుగుదల రేటు కంటే తక్కువగా ఉంది. దీంతో ఈ కాలంలో తలసరి పాల లభ్యత 15 శాతం పడిపోయింది. దీంతో దేశంలో పాల కొరత పెరగడంతో కొంత వరకు దిగుమతుల ద్వారా పాల పొడి రూపంలో భర్తీ చేసుకున్నారు. 1970లో దేశంలో ఆపరేషన్ ఫ్లడ్‌ను ప్రారంభించడంతో పాల ఉత్పత్తి పురోగతి సాధించింది. జనాభా పెరుగుదల రేటును అధిగమించి పాల ఉత్పత్తి పెరిగింది. 1973–74లో దేశంలో తలసరి రోజు పాల ఉత్పత్తి 100 గ్రాములుండగా 2020–21 నాటికి ఇది 450 గ్రాములకు పెరిగింది. ఇటీవల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 5.3 శాతంగా ఉంది. 2005 తరువాత పాల ఉత్పత్తి వృద్ధి రేటు వేగవంతమైంది. ఇందులో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. 246.7 మిలియన్ల పాడి జంతువులు.. గత 50 ఏళ్లలో పాడి జంతువుల జనాభా కూడా బాగా పెరిగింది. దేశంలో 1972లో 122.7 మిలియన్ల పాడి జంతువులుండగా ఇప్పుడు 246.7 మిలియన్లకు పెరిగాయి. 2017–18 తర్వాత నాలుగేళ్లలో పాల ఉత్పత్తులు నాలుగు రెట్లు పెరిగాయి. అయితే వీటిని విదేశాలకు ఎగుమతులుగా పంపడంలో వెనుకబడి ఉన్నట్లు నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం పేర్కొంది. పాల ఎగుమతి 2021–22లో రెండింతలు మాత్రమే పెరిగిందని.. రూ 4,742 కోట్లకే ఎగుమతులు పరిమితమయ్యాయని వివరించింది. ఇప్పటికీ ఎగుమతులు మొత్తం దేశీయ పాల ఉత్పత్తిలో 0.5 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని బాంబుపేల్చింది. మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి.. దేశంలో పాల ఉత్పత్తి ఏడాదికి 6 శాతం పెరుగుతుందని నీతిఆయోగ్ అంచనా వేసింది. భవిష్యత్తులో మిగులు పాలను ఎగుమతి చేసేందుకు అవసరమైన మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. భవిష్యత్‌లో దేశాన్ని అతిపెద్ద డెయిరీ ఎగుమతిదారుగా మార్చేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో రోజు వారీ ఆవు, గేదె పాల దిగుబడి చాలా తక్కువగా ఉందని పేర్కొంది. పాల దిగుబడిని పెంచేందుకు, ఉత్పాదకత పెరుగుదలకు పశు జాతుల అభివృద్ధి, మెరుగైన పెంపకం పద్ధతులు చేపట్టాలని సూచించింది. పంజాబ్, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఇక దేశంలో రోజువారీ పాల దిగుబడి ఆవులకు 5.15 కిలోలు, గేదెలకు 5.9 కిలోలుగా ఉందని వెల్లడించింది. -
స్వతంత్ర భారతి 1967/2022
హరిత విప్లవం భారతదేశం తన 48 కోట్ల జనాభా కోసం 1966–67లో 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంది. ఆ నేపథ్యం నుంచి వ్యవసాయ మంత్రి సి. సుబ్రహ్మణ్యం హరిత విప్లవ రూపశిల్పిగా అవతరించారు. మేలురకం వంగడాలు, రెండు పంటలు, బ్యాంకుల జాతీయకరణ వంటి వాటి పుణ్యమా అని రుణాలు తేలిగ్గా అందుబాటులోకి రావడంతో ఒక దశాబ్దంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 70 శాతం పెరుగుదల కనిపించింది. నాగార్జున సాగర్ ప్రారంభం సుమారు 55 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తూ దేశ ప్రథమ ప్రధాని దీనిని ‘ఆధునిక దేవాలయం’గా అభివర్ణించారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ మట్టి ఆనకట్ట ఎత్తు 124 మీటర్లు. మొదట నందికొండ పేరుతో రూపకల్పన చేసిన ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ప్రాంతీయ పక్షపాతాలతో మార్పులు చేశారన్న ఆరోపణలు వచ్చినా క్రమంగా అవి సద్దుమణిగాయి. నల్గొండ–గుంటూరు సరిహద్దులో కొండల మధ్య 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మాణమైన సాగర్ ఎడమ కాల్వ వల్ల నల్గొండ, కృష్ణా జిల్లాల్లోని మెట్ట భూములు; కుడి కాల్వ వల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని బీళ్లు సస్యశ్యామలం అయ్యాయి. ప్రముఖ ఇంజనీరు, నెహ్రూ మంత్రి వర్గంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన డా. కానూరి లక్ష్మణరావు ఈ ప్రాజెక్టు సాకారం అయేందుకు కృషి చేశారు. -
భారత రైతన్న వెన్నెముక ఆయనే!
ఆకలి చావులను తరిమి కొట్టాలి,పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆయన సంకల్పమే ఆహార ధాన్యాల కొరతతో బాధపడే భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేర్చింది. ఆయన మరెవరో కాదు భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామి నాథన్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సాక్షి డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
దిగుబడి మాటున దాగిన వేదన
గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని మధ్యప్రదేశ్ నమోదు చేసింది. ఇది ఓటర్లలో గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. కానీ ఆ రాష్ట్ర సీఎం చౌహాన్ తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పక్కకు వెళ్లి అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? ఉత్పత్తి పెరిగినా రైతుకు గిట్టుబాటుధర లభించకపోతే హరిత విప్లవ కేంద్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు తప్పవు. అధిక దిగుబడి నేపథ్యంలో రైతుల జీవితాల్లో దయనీయమైన వేదనకు ఇదే మూల కారణం. గోడలపై రాతలు అనేది ప్రత్యేకించి ఎన్నికల ప్రచార సమయంలో భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా ఉనికిలోకి వచ్చే పదబంధం. మన నగరాలకేసి లేక వేగంగా పట్టణీకరణకు గురవుతున్న గ్రామీణప్రాంతం కేసి చూస్తే మీ కళ్లూ చెవులూ ఒక్కసారిగా విచ్చుకుంటాయి. ప్రతిచోటా గోడలపై రాసి ఉన్న విషయం లేదా దాని ప్రతిధ్వనులు దేశంలో మారుతున్నదేమిటి, మారనిదేమిటి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాయి. ఇక్కడ గోడలు అంటే పరిమిత స్థలం అని వాచ్యార్థం కాదు. గుజరాత్ హైవేల పొడవునా కనిపించే ఫ్యాక్టరీల వరుసను కూడా ఈ అర్థంలోనే చూడాల్సి ఉంటుంది. లేక కాంచీపురంలోని పాత పెరియార్ విగ్రహం మీద రాసిన అక్షరాలు కూడా కావచ్చు. లేదా, ప్రస్తుతం ఎన్నికల వాతావరణంలోని మధ్యప్రదేశ్‌లో ఆహారధాన్యాలు, సోయాబీన్ రాశులను, కళకళలాడుతున్న మండీలను మనం గమనించవచ్చు. పంజాబ్‌లో పంటకోతల కాలంలో మీరు చూసే లెక్కలేనన్ని ట్రాక్టర్ల ట్రాలీలను కూడా గమనించవచ్చు. ఇప్పుడు వ్యవసాయ గిడ్డంగుల గోడలు హైవేల పొడవునా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నిజంగానే హరిత విప్లవం సాధించిన రాష్ట్రం. గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని ఈ రాష్ట్రం నమోదు చేసింది. ప్రత్యేకించి గత అయిదేళ్లలో మధ్యప్రదేశ్ అసాధారణ స్థాయిలో 18 శాతం వ్యవసాయరంగ అభివృద్ధిని నమోదు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేష్ రజోరా తెలిపారు. ఇక టీఎన్ నినాన్ తన ‘వీకెండ్ రుమినేషన్స్’ (వారాంతపు చింతన) కాలమ్‌లో రాసినట్లుగా, 2010 నుంచి 2015 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ వ్యవసాయ దిగుబడిలో 92 శాతం వృద్ధి నమోదైంది. చాలావరకు వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఉంటూ 77 శాతం గ్రామీణప్రాంతాలను కలిగి ఉన్న మధ్యప్రదేశ్ జనాభాలో ప్రతి పదిమందికీ ఏడుగురు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఇది ఓటర్ల సంఖ్య పరంగా గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. గత 15 ఏళ్లుగా ఇంత అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగో దఫా పాలనను ఆశిస్తూ ఎంతో స్థిమితంగా కూర్చోవాలి. కానీ కాస్త వేచి ఉండండి. 2018లో మధ్యప్రదేశ్ గోడలపై రాసి ఉన్న చిత్రణ ఇది కాదు. తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను చౌహాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీపై 9 శాతం ఆధిక్యతతో గెలుపు సాధించారన్నది పట్టించుకోవద్దు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా మేం పర్యటిస్తున్నప్పుడు మేం సమాధానం కోసం ప్రయత్నించిన ప్రశ్నలు ఇవే. వ్యవసాయరంగంలో సాధించిన అభివృద్ధి పక్కకు వెళ్లి వ్యవసాయ రంగ అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? ప్రస్తుతం మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? మీరు కలుసుకుంటున్న అక్కడి రైతులు ఎందుకింత ఆగ్రహంతో ఉంటున్నారు? ఒక దశాబ్ది కాలం వ్యవసాయ రంగ వికాసం ఇప్పుడు పెద్ద శిక్షలాగా ఎందుకు మారిపోయింది? కళ్లూ, చెవులూ, మనసు పెట్టుకుని ఈ వ్యవసాయ ప్రధాన రాష్ట్రానికి వచ్చి చూడండి. భారతీయ వ్యవసాయంలో ఎక్కడ తప్పు జరుగుతోందో అది మీకు తెలియజేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం సెహోర్‌కు వెళ్లండి. రాష్ట్ర రాజధాని భోపాల్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అతిపెద్ద మండీలకు నెలవుగా ఉంటోంది. అయితే మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు.. రైతునా, వ్యాపారినా, మధ్యదళారినా లేక ప్రభుత్వాధికారినా అనే దానిమీదే సమాధానాలు ఆధారపడి ఉంటాయి. తన ట్రాక్టర్ ట్రాలీపై కూర్చొని ఉన్న రామేశ్వర్ చంద్రవంశీతో మేం మాట్లాడాం. సూర్యుడి ఎండలో ఈ రైతు ముఖం మాడిపోయినట్లు కనిపిస్తోంది. ‘గోధుమలకు గిట్టుబాటుధరలు తప్ప మాకేమీ అవసరం లేదు. వంద కేజీల గోధుమలకు రూ.3,000లు సోయాబీన్కి రూ. 4,000లు వచ్చేలా చేస్తే చాలు’ అని చెప్పాడా రైతు. ప్రస్తుతం మార్కెట్ ధరలకు ఇది 30 శాతం కంటే ఎక్కువే. పంటమీద వచ్చే నష్టాన్ని తానెందుకు భరించాలి? ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించనీయండి, లేదా ఎగుమతి చేయనివ్వండి అని తేల్చేశాడు. ‘అంతకంటే మేమిక ఏదీ కోరుకోం. ఫిర్యాదులూ చేయం’ అని చెబుతూ తాను 15 ఎకరాలున్న సంపన్న రైతునే కానీ దారిద్య్రానికి దిగువన ఉంటున్న బీపీఎల్ రైతును కాదు అని రెట్టించి మరీ గుర్తు చేశాడాయన. చౌహాన్ ప్రభుత్వం దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది. గోధుమ, వరి పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీలు)ను పెంచారు. దీనికి అదనంగా బోనస్ కూడా ప్రకటించారు. సోయాబీన్ వంటి కనీస మద్దతు ధర పరిధిలో లేని పంటలకు క్వింటాలుకు రూ.500లు రైతు ఖాతాలోకి బోనస్‌గా వెళ్లింది. తర్వాత తృణధాన్యాల వంతు. ప్రత్యేకించి పెసరపప్పు, ఉద్దిపప్పు. వీటి కనీస మద్దతు ధర వ్యాపారి చెల్లిస్తున్న ధర కంటే 60 నుంచి 90 శాతం ఎక్కువగా ఉంది. తృణధాన్యాల ధరలు పడిపోవడం వినియోగదారుడికి వరంగా మారితే రైతుకు పెను ముప్పుగా తయారవుతుంది. ఈ అంశంపై వ్యవసాయ ఆర్థికవేత్త, ఐసీఆర్ఆఇఆర్ సంస్కర్త అశోక్ గులాటిను ఈ విషయమై ప్రశ్నించండి చాలు. మార్కెట్ ధరకంటే కనీస మద్దతు ధర దాదాపు రెట్టింపు ధరను ప్రతిపాదిస్తున్నప్పటికీ రైతు ఖర్చులను అది చెల్లించలేకపోతోందని మీరు తెలుసుకుంటారు. కాబట్టి, రైతు ఎక్కువగా పండించే కొద్దీ ప్రభుత్వం ఎక్కువగా చెల్లిస్తుంటుంది. కానీ ఇద్దరూ కలిసి ఎక్కవ డబ్బును నష్టపోతుంటారు. మనం మూర్ఖంగా నష్టపోవడానికే చాలా కష్టపడి పని చేస్తున్నామా? గులాటి ఆయిన తోటి స్కాలర్లు రూపొందించిన ఐసీఆర్‌ఐఇఆర్ వర్కింగ్ పేపర్ 339 పేజీని చదవండి. మార్కెట్లతో సమన్వయం లేకపోయినట్లయితే, ఉత్పత్తిని మాత్రమే పెంచడం అనేది ప్రతీఘాతకంగా మారిపోతుందని ఈ నివేదిక మనకు తెలుపుతుంది. దీనికి మంచి ఉదాహరణ కాయధాన్యాలు. సంవత్సరాల తరబడి భారతీయ మొత్తం కాయధాన్యాల ఉత్పత్తి కనీసం 3–4 మిలియన్ టన్నుల కొరతను నమోదు చేస్తింది. ప్రపంచం తగినన్ని కాయధాన్యాలను పెంచడానికి సతమతమవుతోంది కానీ ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. రిటైల్ ధరలు వంద రూపాయలకు చేరుకోగానే మీడియాలో జనాగ్రహం కొట్టొచ్చినట్లు కనబడుతుంటుంది. అప్పుడు ప్రభుత్వం నిద్రమేలుకుని కనీస మద్దతు ధరను పెంచుతుంది. కాయధాన్యల ఉత్పత్తికి సాంకేతిక మిషన్‌ను నిర్మిస్తుంది, ఉత్పత్తిని పెంచుతుంది. దేశీయంగా కాయధాన్యాల డిమాండును 20 లక్షల టన్నుల మేరకు అధిగమించినట్లు ఐసీఆర్‌ఐఇఆర్ డేటా మనకు తెలుపుతుంది. కానీ పాత ఒడంబడికల వల్ల కాయధాన్యాల దిగుమతులు కొనసాగుతూనే ఉంటాయి. దీనిఫలితంగా భారత్‌కు ఏటా 22 లేక 23 మిలి యన్ టన్నుల కాయధాన్యాల ఉత్పత్తి సరిపోతుండగా, దేశంలో 30 మిలియన్ టన్నుల పంట చేరుతుంటుంది. అన్ని దిగుమతులూ జీరో పన్నుతో వస్తున్నందున వీటి ధరలు మన కనీస మద్దతు ధరలో సగమే ఉంటాయి. అంటే రైతు వ్యవసాయ ఖర్చులకు కూడా సమానం కావన్నమాట. కాయధాన్యాల వ్యవహారం మన కళ్లను తెరిపించకపోతే, మధ్యప్రదేశ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి విషయంలో ఏం జరుగుతోందో పరి శీలించండి. గత సంవత్సరం మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంత జిల్లా మాండసూర్లో రైతుల ఆగ్రహం జాతీయ పతాక శీర్షికల్లో చోటు చేసుకుంది. ఆగ్రహావేశాలతో మండుతున్న రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు. ఉల్లిపాయల ఉత్పత్తి కేంద్రంగా ఉంటున్న మాండసూర్లో వాటి ధర కిలోకు రూపాయికంటే తక్కువకు పడిపోయింది. రైతుల ఆత్మహత్యలకు జడిసిన చౌహాన్ ప్రభుత్వం నిల్వ ఉన్న ఉల్లిపాయలన్నింటినీ కిలోకు 8 రూపాయల లెక్కన కొంటానని ప్రకటించింది. ఈ వార్త ప్రచారం కాగానే మాండసార్లో పది కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్ ట్రాలీలు ఉల్లిపంటతో బారులు తీరాయి. సుదూరంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కూడా రైతులు తమ ఉల్లిపాయల పంటను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ధర వద్ద కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఏంచేయాలో తోచలేదు. ప్రభుత్వానికి నిల్వ సౌకర్యాలు లేవు. వర్షాలు కుమ్మరించాయి. దీంతో భారీ నిల్వను వదిలించుకోవడానికి కిలో 2 రూపాయలకు అమ్ముతానని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఉన్మాదం కారణంగా మధ్యప్రదేశ్‌లో పన్ను చెల్లింపుదారులు రూ.785 కోట్లు నష్టపోయారు. ఇలా నష్టపోయే జాబితాలో ఈ ఏడు వంతు వెల్లుల్లికి దక్కింది. కిలో వెల్లుల్లి ఉత్పత్తికి రైతుకు రూ. 15–20లు ఖర్చు అవుతుండగా ధరలు మాత్రం కిలో రూ‘‘ 7కి పడిపోయాయి. మనది ఎంత విచిత్రమైన దేశం అంటే, మన రైతులు పండించిన వెల్లుల్లి ధరలు కుప్పగూలిపోతాయి. అదే సమయంలో చైనానుంచి భారీగా దిగుమతులు వస్తుం టాయి. ఎందుకంటే మన ప్రభుత్వ మెదడులో సగం వ్యవసాయం వైపు చూస్తుంటుంది. మిగతా సగం వినియోగదారు ధరలకేసి చూస్తుం టుంది. కానీ వీరు ఇద్దరూ ఎన్నడూ పరస్పరం చర్చించుకోరు. ఎన్నికల్లో మునిగితేలుతున్న మధ్యప్రదేశ్ నుంచి నేర్పవలసిన పాఠం ఏమిటి? రైతులు తమ ఉత్పత్తిని పెంచేలా ఏర్పాట్లు చేసినందుకు మన రాజకీయ నేతలకు అప్పనంగా ఓట్లు పడవు. కాస్త మంచిగా ఆలోచింది వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించకపోతే, దశాబ్ది కాలపు అమోఘమైన వ్యవసాయాభివృద్ధి సాధించినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపు సాధిస్తుందని చెప్పలేం. డబ్బు వెదజల్లడం పరిష్కారం కాదు. కనీస మధ్దతు ధర పెంపు అధిక ధరలకు గ్యారంటీ ఇవ్వదు. పైగా ఆహారధరలు పెరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. ఎందుకంటే అక్కడ వినియోగదారుడు ఉన్నాడు. పప్పు, ఉల్లిపాయ, టమేటో, బంగాళదుంపల ధరలు కాస్త పెరిగితే చాలు విమర్శలతో విరుచుకుపడే మీడియా ఉండనే ఉంది. అందుకే ఈ రోజు నిజమైన, చురుకైన రాజకీయనేత వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించడంపైనే దృష్టిపెడతాడు. దీనిపైనే వనరులను వెచ్చిస్తాడు. అవేమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ చైన్లు, ప్రైవేట్ రంగం ద్వారా స్టోరేజ్, ప్యూచర్ మార్కెట్లను తెరవడం. ప్రభుత్వ వ్యతిరేకత లేక భావజాలం కంటే మధ్యప్రదేశ్ గోడలపై ఇవ్వాళ స్పష్టంగా వ్యక్తమవుతున్న సందేశం ఇదే మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
గ్రీన్ రెవల్యూషన్తోనే కాలుష్యం!?
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట దుబ్బులను తగుల బెట్టడం వల్ల ఢిల్లీ నగరాన్ని కాలుష్య భూతం కమ్ముకుంది. ఈసారి గాలులు మందగమనాన్ని మించకపోవడం, టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల కాలుష్య కణాలు దిగువ వాతావరణంలోనే స్థిరపడిపోయి ఇటు ఢిల్లీ వాసులనే కాకుండా అటు ఉత్తరాది ప్రాంతంవైపు కూడా ప్రయాణిస్తూ అక్కడి ప్రజలనూ భయకంపితుల్ని చేస్తున్నాయి. అసలు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఎందుకు పంట దుబ్బులను తగులబెడుతున్నారు. అందుకు కారణాలేమిటీ? ఒకప్పుడులేని ఈ పద్ధతి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? గ్రీన్ రెవల్యూషన్ నుంచే వచ్చిందా? అసలు గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? దాని వల్ల ప్రజలకు కలిగిన లాభాలేమిటీ, నష్టాలేమిటీ? పంట దుబ్బులను తగులబెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఉంటే అవేమిటీ? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ సరైన, స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. 1960 ప్రాంతంలో భారత్‌కు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అమెరికా సరఫరా చేసే ఆహార పదార్థాలపై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. దేశంలో ఆహారోత్పత్తిని బాగా పెంచాలని అప్పటి భారత ప్రభుత్వం భావించింది. అందుకు వ్యవసాయ సంస్కరణలు అవసరమని రెండు కమిటీలు అభిప్రాయపడ్డాయి. ఒక కమిటీ వ్యవసాయ రంగంలో తీసుకరావాల్సిన సాంకేతిక మార్పులను సూచించగా, సామాజిక మార్పులు అవసరమని మరో కమిటీ అభిప్రాయపడింది. ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు హైబ్రీడ్ విత్తనాలను ప్రవేశపెట్టాలని సాంకేతిక కమిటీ సూచించింది. ఎక్కువ దిగుబడి నిచ్చే వంగడాలను ప్రవేశపెట్టాలని 1961లో అప్పటికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సూచించారు. ఖరీదైన విత్తనాలను, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, వీటి విషయంలో రైతులను ప్రోత్సహించాలంటే సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడమే కాకుండా రైతుల పెట్టుబడులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. చర్చోపచర్చల అనంతరం దీన్ని అమలు చేయాలని 1964లో అప్పటి వ్యవసాయ మంత్రి సీ. సుబ్రమణియం నిర్ణయించారు. ఈ విధానం వల్ల పెద్ద రైతులు బాగు పడతారని, వినియోగదారులు నష్టపోతారని ప్రతిపక్షాలు గొడవ చేశాయి. దాంతో ప్రతిపాదన అటకెక్కింది. ఆహార సహాయంపై అమెరికా ఆంక్షలు భారత ప్రజలకు తేరగా ఆహారాన్ని సాయం చేయడానికి తాము సిద్ధంగా లేమని 1965లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బీ జాన్సన్ ప్రకటించి ఆంక్షలు విధించారు. 1966 నుంచి తాము నిల్వ ఉండే ఆహార పదార్థాలకు బదులుగా రెడీమేడ్ ఆహార పదార్థాలను పంపిస్తామంటూ ‘షిప్ టూ మౌత్’ పాలసీని ప్రకటించారు. అదే సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపక్షాల అభ్యంతరాలను లెక్క చేయకుండా గ్రీన్ రెవెల్యూషన్‌ను అమలు చేశారు. ఏడాది కాలంలోనే గోధుమ పంట 40 శాతం పెరిగింది. అంటే 120 లక్షల టన్నుల నుంచి 170 లక్షల టన్నులకు పెరిగింది. ఆ తర్వాత వరి ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. గ్రీన్ రెవల్యూషన్ కాలాన్ని 1965 నుంచి 1980 వరకని పేర్కొనవచ్చు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను వాడేందుకు పలు రాష్ట్రాల్లోని రైతులు నిరాకరించారు. సంప్రదాయ వంగడాలకే వారు మొగ్గు చూపారు. అప్పటి వరకు గోధుమ పంటలకే అలవాటు పడిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ వరి వంగడాలను వాడేందుకు ముందుకు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం రైతులు కూడా సరేనన్నారు. జాతీయంగా వరి ఉత్పత్తిలో 1960లో పంజాబ్ వాటా 0.7 శాతం ఉండగా, 1979 వరకల్లా దాని వాటా ఏడు శాతానికి చేరుకుంది. ఓ పంట వరి, మరో పంట గోధుమ (ఆర్డబ్లూసీఎస్) వేసే విధానాన్ని అమలు చేయడంతో అమోఘ ఫలితాలు వచ్చాయి. హర్యానా కూడా పంజాబ్‌తో పోటీ పడుతూ వచ్చింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు వరి సంప్రదాయ వరి వంగడాలకు భిన్నంగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను జూన్‌లో వేస్తే అక్టోబర్‌లో పంట చేతికి వస్తోంది. మళ్లీ అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలోనే గోధుమలను వేయాల్సి ఉంటుంది. ఇరు పంటల మధ్య వ్యవధి ఉండేది 15 రోజులే. ఈ రోజుల్లో వరి పంట నూర్పుడు అయిపోవాలి. వరి దుబ్బును తొలగించాలి. రెండో పంట గోధుమకు పొలాన్ని సిద్ధం చేయాలి. దుబ్బును తగులబెట్టడానికి సవాలక్ష కారణాలు వరి దుబ్బును తొలగించడానికి కూలీలు దొరకరు. దొరికినా చాలా ఖర్చు. ఎకరాకు ఆరేడు వేల రూపాయలు అవుతుంది. మన మసూరు బియ్యం లాగా పంజాబ్, హర్యానాలో పండించే విదేశీ వంగడం ఉండదు. ఏపుగా పెరుగుతుంది. భూమిలో బలంగా పాతుకు పోతుంది. లాగితే ఓ మానాన రాదు. వాటి పొలుసు చాకులా ఉండడం వల్ల లాగేటప్పుడు గీసుకుపోయి రక్తం కారుతుంది. మిగతా వరిదుబ్బును ఇష్ట పడినట్లు ఈ రకం దుబ్బును పశువులు అంతగా ఇష్టపడవు. పశు గ్రాస మార్కెట్లో దీన్ని ఎవరూ కొనరు. రైతుకు రవాణా ఖర్చులు కూడా రావు. ఈ దుబ్బును ఇంటి పశువులకు వేయాలంటే కొన్ని తరాలుగా ఇక్కడి రైతులు పశువులకు బదులుగా యంత్రాలనే వాడుతున్నారు. ఇప్పుడు దుబ్బును కోసే ధ్వంసంచేసే యంత్రాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అవి ఖరీదైనవి. అద్దెకు ఇంకా అందుబాటులోకి రాలేదు. భారీ ఎత్తున వ్యవసాయం చేసే రైతులు, ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. స్వతంత్ర రైతులు ఉపయోగించడం లేదు. అలాంటి వారు ఒక్క పంజాబ్ రాష్ట్ర రైతుల్లో 25 శాతం మంది ఉన్నారు. వారు పొలంలో కిరోసిన్ పోసి తగుల బెడితే తెల్లారే సరికి మొత్తం వరి దుబ్బు మాయం అవుతుంది. వారే కాలుష్యానికి కారణం అవుతున్నారు. 1980 తర్వాతే ఈ పద్ధతి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. (గమనిక: సిద్ధార్థ్ సింగ్ రాసిన ‘ది గ్రేట్ స్మాగ్ ఆఫ్ ఇండియా’లోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
ఇక ‘జైవిక్ భారత్’
సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమబద్ధీకరించే ప్రక్రియకు తొలి అడుగు పడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.) ఏడాది క్రితం ప్రకటించిన నిబంధనావళి ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 2017 డిసెంబర్ 29న గజెట్లో ప్రకటితమైన ఈ నియమావళి.. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది. నిబంధనలు పాటించడంలో విఫలమైన సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తోంది. కఠినమైన సర్టిఫికేషన్ నిబంధనల కారణంగా సేంద్రియ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. సేంద్రియ మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశాలపై ‘సాగుబడి’ ఫోకస్.. మన దేశంలో రైతులు అనాదిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయాన్ని ప్రభుత్వం వ్యాప్తిలోకి తెచ్చిన తర్వాత.. ఇప్పటికీ చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. అయితే, వీరంతా అసంఘటితంగానే ఎవరికి వారు అనువంశిక సేంద్రియ సేద్యాన్ని ఒక జీవన విధానంగా, అవిచ్ఛిన్న వ్యవసాయక సంస్కృతిగా కొనసాగిస్తున్నారు. ఈ దశలో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు చిన్న, సన్నకారు రైతులతో ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని చేయిస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ సర్టిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. రైతులే స్వచ్ఛందంగా తమకు తామే పరస్పరం తనిఖీలు చేసుకుంటూ.. సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చుకునే వ్యవస్థను ‘పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) ఆర్గానిక్ కౌన్సిల్’ పేరిట 2011లో ఏర్పాటు చేశాయి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ఈ నేపథ్యంలో ఏటా 20–25% విస్తరిస్తున్న సేంద్రియ వ్యవసాయాన్ని క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుము బిగించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ‘పి.జి.ఎస్. ఇండియా’ సంస్థను ఏర్పాటు చేసింది. దేశంలో హోల్‌సేల్/రిటైల్ మార్కెట్లో ప్యాక్ చేసి వ్యాపారులు అమ్మే సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు విధిగా ప్యాకింగ్, లేబెలింగ్ నిబంధనలు వర్తింపజేయడానికి రంగం సిద్ధమైంది. పిజిఎస్ ఇండియా అనేది కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), ఘజియాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధ్రువీకరణ వ్యవస్థ. వార్షిక టర్నోవర్ రూ. 12 లక్షల కన్నా తక్కువగా ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లేబిలింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. అయితే, అంతకుమించి వ్యాపారం చేసే రైతు కంపెనీలకు ప్యాకింగ్, లేబిలింగ్ ఖర్చు కిలోకు రూ. 10ల మేరకు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో, సేంద్రియ ఉత్పత్తుల ధరలు ఆ మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ అస్తిత్వానికి ముప్పు! ప్రభుత్వ హయాంలో ‘పిజిఎస్ ఇండియా’ ఏర్పాటు కావడంతో.. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న ‘పీజిఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’కు అస్తిత్వ సమస్య ఏర్పడింది. సేంద్రియ ఉత్పత్తులపై జూలై 1 నుంచి ‘జైవిక్ భారత్’ లోగోను విధిగా ముద్రించాలని, సేంద్రియ నాణ్యతా ప్రమాణాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్. ఎస్. ఎస్.ఎ.ఐ.) నిర్దేశించిన నేపథ్యంలో ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనాదిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రారంభించిన నెట్వర్క్. డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ(పస్తాపూర్, సంగారెడ్డి జిల్లా), టింబక్టు కలెక్టివ్(చెన్నేకొత్తపల్తి, అనంతపురం జిల్లా) వంటి సంస్థలు ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ను ఏర్పాటు చేసి నిర్వహించడంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. ‘పీజీఎస్ ఇండియా’ను సమాంతర ప్రభుత్వ వ్యవస్థగా ఏర్పాటు చేసినప్పటికీ.. సేంద్రియ రైతుల హక్కులను పరిరక్షిస్తున్న ‘పీజిఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’కున్న గుర్తింపు రద్దు చేయవద్దని డీడీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, దీనిలో సభ్యులైన సేంద్రియ రైతులు కూడా ‘పిజిఎస్ ఇండియా’లో సభ్యులుగా చేరడం ద్వారా ఖర్చు లేకుండానే ప్రభుత్వ వ్యవస్థ పరిధిలోకి రావచ్చని ఎన్.సి.ఓ.ఎఫ్. చెబుతోంది. రూ. 12 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు! సేంద్రియ ఉత్పత్తులను దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులకు, రూ. 12 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతుల సహకార సంఘాలకు మాత్రం లేబిలింగ్ నిబంధనలు వర్తించవు. అయితే, వీరి వద్ద నుంచి కొని విక్రయించే రిటైల్ దుకాణదారులు, సూపర్ మార్కెట్ వ్యాపారులు(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) మాత్రం ఈ నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడానికి, శిక్ష విధించడానికి కూడా అవకాశాలున్నాయి. కాబట్టి, వీరి ఉత్పత్తులను రిటైల్ డీలర్ల నుంచి కొనుగోలు చేసే సేంద్రియ ఆహార వినియోగదారులపై భారం మరింత పడనుంది. సేంద్రియ ఆహారోత్పత్తులను దేశంలో అమ్మకానికి ‘పీజిఎస్ ఇండియా’ సర్టిఫికేషన్ పొందితే చాలు. స్థానిక వ్యవసాయ అధికారుల ద్వారా, రీజినల్ కౌన్సిళ్ల ద్వారా రైతులు పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ పొందే వీలుంది. అయితే, విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్.పి.ఓ.పి.) నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ సేంద్రియ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా కంపెనీలు ఎన్.పి.ఓ.పి. ధ్రువీకరణ పొందవచ్చు. ఎన్.పి.ఓ.పి. ధ్రువీకరణ వ్యవస్థ 2001 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా.. ‘అపెడా’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అయితే, ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్లిష్టమైనది. అంతేకాక, అత్యంత ఖరీదైనది. సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్.పి.ఓ.లు) ఎటువంటి ధ్రువీకరణనూ విధిగా పొందాలన్న నిబంధనేదీ లేదు. ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా సర్టిఫికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి అనేక ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఐచ్ఛికంగానే ఉన్నాయి. అయితే, ‘జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా ఇప్పుడు మేం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్ చేస్తాం’ అని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. హెచ్చరిస్తోంది. కొత్త నియమావళి ప్రకారం.. మన దేశంలోని దుకాణాల్లో/ షాపింగ్ మాల్స్‌లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులేవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న రెండు ధ్రువీకరణ వ్యవస్థల్లో (ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా) ఏదో ఒక దాని నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతోపాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్.పి.ఓ.పి. ప్రకారం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లోగో లేదా పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ లోగోలలో ఏదో ఒకదానితో పాటుగా.. ‘జైవిక్ భారత్’ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాలని సరికొత్త నిబంధనావళి నిర్దేశిస్తోంది. అయితే, వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు జైవిక్ భారత్ లోగోను సేంద్రియ ఉత్పత్తుల ప్యాకెట్‌పై నాన్–డిటాచబుల్ స్టిక్కర్ రూపంలో విధిగా ముద్రించాలన్న నిబంధనకు వచ్చే సెప్టెంబర్ 30 వరకు సడలింపు ఇచ్చినట్టు ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. తాజాగా ప్రకటించింది. జైవిక్ భారత్ లోగోకు సంబంధించిన పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. టర్నోవర్ పరిమితి పెంచాలి! సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ క్రమబద్ధీ్దకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తరఫున మేం స్వాగతిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులందరూ పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయాలి. రైతులు మరో 2, 3 ఏళ్ల పాటు గడువు అవసరం ఉంది. రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు రూ. 12 లక్షల టర్నోవర్ వరకు నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నారు. ఈ పరిమితిని రూ. కోట్లకు పెంచాలి. ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న రైతుల కంపెనీలకు ప్రభుత్వ తోడ్పాటు మరికొంత కాలం ప్రోత్సాహం అవసరం. తాజా నిబంధనల వల్ల ప్యాకింగ్ ఖర్చు కిలోకు రూ. 10 మేరకు పెరుగుతుంది. దీని వల్ల చిన్న రిటైలర్లు దెబ్బతింటారు. ఒకే ఊళ్లో ఒకటో, రెండో దుకాణాలు పెట్టుకొని సేంద్రియ ఉత్పత్తులను అమ్మే రిటైలర్లకు రూ. 50 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు ఇవ్వాలి. లేబుల్ ముద్రించే బాధ్యత కేవలం సేంద్రియ రైతులకే పరిమితం చేయకూడదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వాడే రైతుల ఉత్పత్తులపై కూడా ‘ఇవి రసాయనాలు వాడి పండించినవి’ అని లేబుల్ వేసేలా నిబంధనలు పెట్టాలి. అప్పుడు ప్రజల్లోనూ సేంద్రియ ఉత్పత్తులపై చైతన్యం ఇనుమడిస్తుంది. – డా. జీ వీ రామాంజనేయులు (90006 99702), సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, సికింద్రాబాద్ రైతుల హక్కును లాక్కోవద్దు! జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయాన్ని జీవన విధానంగా అనుసరిస్తున్న చిన్న, సన్నకారు రైతులే కలసి దేశవ్యాప్తంగా 21 స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ‘పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్’ను పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకొని స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో కనీసం 10 వేల మంది రైతులు సేంద్రియ సర్టిఫికేషన్ సదుపాయం ఖర్చులేకుండా పొందారు. ఇప్పుడు ప్రభుత్వం ‘పీజీఎస్ ఇండియా’ను ఏర్పాటు చేసి సర్టిఫికేషన్ హక్కును లాగేసుకోవటం అన్యాయం. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను పెట్టుకోవచ్చు. మేం ప్రమాణాలు పాటించకపోతే కేసులు పెట్టి జైలులో పెట్టండి. అంతే కానీ సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చే హక్కును మాత్రం పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ నుంచి లాగేసుకోవటం సమంజసం కాదు. రైతుల హక్కును కాలరాయాలనుకోవడం తగదు. – పీ వీ సతీష్, పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యులు, డీడీఎస్, పస్తాపూర్ (వివరాలకు.. జయశ్రీ: 94402 66012) – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అజొల్లాతోనే దేశీ వరి సాగు!
హరిత విప్లవం రాకతో దేశీ వంగడాలు, పద్ధతులు, పంటల వైవిధ్యం ప్రాభవాన్ని కోల్పోయాయి. సంకరజాతి వంగడాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల రాకతో తొలినాళ్లలో కళ్లు చెదిరే దిగుబడులు వచ్చాయి. కానీ కాలక్రమంలో తిరిగి సేంద్రియ విధానంలో సంప్రదాయ వంగడాల సాగే రైతుకు ఆశాదీపం అంటున్నారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అనుపమ్ పాల్. కేవలం అజొల్లాతోనే దేశీ వరి వంగడాల సాగును చేపట్టవచ్చని ఆయన అంటున్నారు. దేశీ వరి వంగడాలతో దిగుబడులు తక్కువనే విస్తృత ప్రచారంతో వాటి ఊసే రైతులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దశలో పశ్చిమ బెంగాల్‌లోని ఫూలియా వ్యవసాయ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ పాల్ దేశీ వరి వంగడాల పరిరక్షణకు నడుం బిగించారు. 400 రకాలకు పైగా సంప్రదాయ వరి వంగడాలను సేకరించి, సాగు చేస్తూ సంరక్షిస్తున్నారు. తద్వారా ఈ వంగడాలను తిరిగి రైతులకు అందిస్తున్నారు. కేవలం అజొల్లాతోనే సేంద్రియ విధానంలో దేశీ వరి వంగడాల సాగుపై రైతులకు శిక్షణ నిస్తున్నారు. నదియా జిల్లాలోని ఫులియా వద్ద గల వ్యవసాయ శిక్షణా కేంద్రంలో 400 రకాల సంప్రదాయ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. 15 రోజుల నారును పొలంలో నాటుకుంటారు. అంతకు ముందునుంచే విడిగా మడుల్లో నిల్వ కట్టిన నీటిలో అజొల్లా అనే నాచును పెంచుతూ ఉంటారు. నాట్లు వేసుకున్న 25 రోజులు తర్వాతనే వరి పొలంలో నీటిపైన అజొల్లా చల్లుతారు. ఇతరత్రా ఎలాంటి రసాయన ఎరువులే కాదు సేంద్రియ ఎరువులు పంటలకు అందించరు. గాలిలో 78 శాతం ఉండే నత్రజనిని అజొల్లా గ్రహించి, మొక్కలకు అందిస్తుంది. పులియా వ్యవసాయ క్షేత్రంలోని మాగాణి భూమిలో ప్రధాన పోషకాలు చాలా తక్కువగా ఉన్నాయట. పీహె చ్ 7 శాతం, సేంద్రియ కర్బనం 0.6–0.8 వరకు ఉంది. రసాయనాలు వాడకపోవడం వల్ల నేల సారవంతమై.. సంప్రదాయ వంగడాలతో మంచి దిగుబడులు రావటం విశేషం. డాక్టర్ అనుపమ్ పాల్ ఇలా అంటారు.. ‘మేము పూలియాలోని వ్యవసాయ శిక్షణ కేంద్రంలో సంప్రదాయ వరి వంగడాలను సాగు చేస్తున్నాం. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు, ఇతర సేంద్రియ ఎరువులు వాyýటం లేదు. కేవలం అజొల్లాను మాత్రమే ఎరువుగా వాడుతున్నాం. ఎకరాకు 32 బస్తా(75 కిలోలు)ల ధాన్యం దిగుబడి వస్తోంది. గత పదిహేనేళ్లుగా ఇదే విధానంలో వరిని సాగు చేస్తున్నాం. దేశీ వరి వంగడాలను కేవలం దిగుబడి కోణంలో మాత్రమే చూడకూడదు. ‘ఐలా’ తుపాను సృష్టించిన విలయాన్ని కూడా తట్టుకొని నిలబడటం కేవలం సంప్రదాయ వరి రకాలకు మాత్రమే సాధ్యమైంది. 90–110 రోజుల్లోనే కోతకు వచ్చే స్వల్పకాలిక సంప్రదాయ వరి వంగడాలు వెయ్యి వరకు ఉన్నాయి. ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. విస్తృత ప్రచారం కల్పిస్తారు. కానీ వీటిలో ఏ ఒక్క రకం కూడా పోషకాలు, పంట నాణ్యత, నాణ్యమైన గ్రాసం, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోవటం వంటి అంశాల్లో సంప్రదాయ వంగడాలకు సాటి రాగలవి లేవు. సంప్రదాయ వరి వంగడాల విలువను, ఆవశ్యకతను గుర్తెరిగిన రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా 26 విత్తన కేంద్రాలను దీనికోసం ఏర్పాటు చేశాం. సంప్రదాయ వరి వంగడాలను సాగు చేయటం, వాటి జన్యువులను గుర్తించటం, విత్తనోత్పత్తిని చేపట్టటం వంటి పనులను ఆటవిడుపుగానో వినోదం కోసమో మేము చేయటం లేదు. విజ్ఞాన శాస్త్రం, జీవ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వంగడాల కన్నా సంప్రదాయ వంగడాలు అనేక అంశాలలో మెరుగైనవి కాబట్టే వాటిపై మేం దృష్టి సారించాం’ అన్నారు డా. అనుపమ్ పాల్. -
2020 వరకు ‘కృషి ఉన్నతి’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ గతేడాది ప్రారంభించిన ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన’ కార్యక్రమాన్ని 2020 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 33,269 కోట్ల నిధులను తన వాటాగా కేంద్రం కేటాయించనుంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత కూడా.. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు. 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేర్చడం వల్ల వాటి పర్యవేక్షణ సులభమైందన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం), మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్), నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (ఎన్ఎంఎస్ఏ), సబ్–మిషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ (ఎస్ఎంఏఈ) తదితర వ్యవసాయ రంగానికి చెందిన 11 పథకాలను కేంద్రం గతేడాది ఒకే గొడుగు కిందకు తెచ్చి హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం విదితమే. పెట్టుబడి పరిమితి రెండింతలు వృద్ధుల పింఛను కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన్ యోజన (పీఎంవీవీవై) పథకంలో పెట్టుబడి పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గురువారమే (మే 3) చివరి తేదీగా ఉండగా, ఆ గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది. 60 లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో ఇప్పటివరకు వృద్ధులు గరిష్టంగా రూ. 7.5 లక్షలను మాత్రమే పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉండగా, తాజా నిర్ణయంతో ఆ పరిమితి రూ.15 లక్షలకు పెరిగింది. పీఎంవీవీవైలో పెట్టుబడి పెట్టిన వృద్ధులకు వారి పెట్టుబడిపై ఏడాదికి 8 శాతం రాబడి పదేళ్లపాటు వస్తుంది. ఆ మొత్తాన్ని ప్రతినెలా లేదా మూడు లేదా ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి వృద్ధులు తీసుకునే వెసులుబాటు ఉంది. పరిమితి పెంచడంతో ఇప్పుడు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టిన వృద్ధులు నెలకు రూ.10 వేల పింఛనును పదేళ్లపాటు పొందొచ్చని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.1,540 కోట్లను (మొత్తం బకాయిల్లో 10%) రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలని నిర్ణయించారు. ► చెన్నై, లక్నో, గువాహటి నగరాల్లోని విమా నాశ్రయాల్లో రూ.5,082 కోట్ల వ్యయంతో కొత్త టర్మినళ్ల నిర్మాణానికి అంగీకారం. ► ఖనిజ రంగంలో సంస్కరణలకోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)ను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం. ► ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజనని 2019–20 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఎంఎస్‌డీపీ ఇక పీఎంజీవీకే బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్‌డీపీ–మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పేరు మార్చి, పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంఎస్డీపీకి ‘ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమ్’ (పీఎంజేవీకే) అనే కొత్త పేరు ను ఖరారు చేసింది. మైనారిటీలకు మ రింత మెరుగైన సామాజిక–ఆర్థిక మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఈ పథకం పరిధిని విస్తరించేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. -
మీ ఇల్లు చల్లగుండ
మొక్కే కదా అని పీకేశామో మన పీక కోసేవారెవరూ ఉండకపోకవచ్చు గాని, మన పరిసరాల్లోని మొక్కలను పీకి పారేస్తే మన పీక మనమే కోసుకున్నంత పని అవుతుంది. మొక్కలను పెంచడం మన ప్రాణావసరం. మొక్కలే మనకు ప్రాణదాతలు. మీ ఇల్లు, ఇంటిల్లిపాదీ చల్లగా ఉండాలంటే మొక్కలను పెంచాల్సిందే. మొక్కలే లేకుంటే భూమి కూడా మరో నిర్జీవ గ్రహంగా మిగిలిపోతుంది. మొక్కల అవసరాన్ని ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి. అలాగని మొక్కల పెంపకం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత కూడా! ఇది వానాకాలం. మొక్కలు నాటడానికి అనువైన కాలం. ఈ వానాకాలాన్ని ఊరకే కరిగిపోనివ్వకుండా మొక్కవోని దీక్షతో మొక్కలను నాటుదాం. మన వంతుగా పచ్చదనాన్ని పెంపొందిద్దాం. ఇళ్లలో అందం కోసం, అలంకరణ కోసం తీగలు, పూల మొక్కలు, ముళ్ల చెట్లు మాత్రమే కాదు, ఆహారం కోసం, ఆరోగ్యం కోసం ఆకు కూరలు, కూరగాయల మొక్కలు, ఔషధ మొక్కలు వంటివి పెంచుకోవడానికి కొద్దిపాటి స్థలం చాలు. వీటిలో చాలా రకాల మొక్కలను చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి ముందు ఎలాంటి ఆవరణ లేని అపార్ట్మెంట్లలో నివసించే వారికి ఇలాంటి మొక్కలు అనుకూలంగా ఉంటాయి. మొక్కలపై ఆసక్తి ఉంటే అపార్ట్మెంట్ వాసులు కుండీల్లో బోన్సాయ్ వృక్షాలను పెంచుకోవచ్చు. వీటిలో పండ్లు, కాయలు కాసే రకాలు కూడా దొరుకుతాయి. ఇంటి ముందు కొంచెం విశాలమైన ఆవరణ ఉన్నట్లయితే నీడనిచ్చే రకరకాల చెట్లు పెంచుకోవచ్చు. నీడతో పాటు పండ్లు, కాయలు ఇచ్చే చెట్లు కూడా పెంచుకోవచ్చు. తీగ మొక్కలతో పందిరి వేసుకోవచ్చు. ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం ఏమంత కష్టమైన పని కాదు. ఖర్చుతో కూడిన పని కూడా కాదు. వాటి పెంపకానికి ఖర్చుతో కూడిన రసాయన ఎరువుల వంటివేవీ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో వాడి పారేసిన కూరగాయల తొక్కలు, కాఫీ పొడి, టీ పొడినే ఎరువుగా కాస్త తీరిక చేసుకుని మొక్కలను పెంచితే వాటితో వచ్చే ఆనందమే వేరు. ఇళ్లలో పెంచుకోదగ్గ వివిధ వృక్షజాతుల గురించి... తీగ మొక్కలు * తీగజాతి మొక్కల్లో కొన్ని రకాలు అలంకరణ కోసం ఉపయోగపడతాయి. మరికొన్ని రకాల కూరగాయల మొక్కలు కూడా తీగలుగా పెరిగి ఆహార అవసరాలకు ఉపయోగపడతాయి. * మల్లె, జాజి,మాలతి, గోకర్ణ, శంఖపుష్పి, లిల్లీ, మనీప్లాంట్, బోగన్విల్లా, అల్లామందా క్రీపర్, రంగూన్ క్రీపర్, మండెవిల్లా వంటి తీగజాతి మొక్కలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. మనీప్లాంట్లోని వివిధ రకాల తీగ మొక్కలకు పూలు పూయవు. అయితే, చాలా వరకు తీగ మొక్కలకు అందమైన పూలు పూస్తాయి. * తీగ మొక్కలను కుండీల్లో నాటుకుని ఇళ్లల్లో కిటికీలకు పాకేలా పెంచుకోవచ్చు. కొంత స్థలం ఉన్నట్లయితే, పందిరి వేసి ఈ తీగలను పందిరి మీదకు పాకించవచ్చు. తీగ మొక్కలను పందిరిగా వేసుకుంటే చల్లని నీడ కూడా దొరుకుతుంది. * బచ్చలి, తమలపాకు, బఠాణీ, చిక్కుడు, కాకర, దోస, ఆనప, పొట్ల, బీర, టొమాటో, గుమ్మడి వంటి ఆకుకూరలు, కూరగాయల మొక్కలు తీగలుగా పెరుగుతాయి. * తీగ మొక్కలకు పందిరి ఏర్పాటు చేయవచ్చు. లేకుంటే పైకప్పుల మీదకు పాకేలా కూడా ఏర్పాటు చేయవచ్చు. * ఇంటి చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నట్లయితే, ప్రహారీని ఆనుకున్న స్థలంలో వెదురు పొదలను తీగ మొక్కలకు ఆసరాగా పెంచవచ్చు. ఇంటికి నలువైపులా దట్టంగా పొదలను పెంచినట్లయితే శబ్దకాలుష్యం నుంచి, వాయు కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు, ఇంటి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. పుష్ప విలాసం పూల మొక్కలను పెంచుకోవడానికి దాదాపు అందరూ ఇష్టపడతారు. పూలనిచ్చే వృక్షజాతుల్లో కొన్ని లతలు, తీగలుగా పెరిగితే, ఇంకొన్ని చిన్న చిన్న మొక్కలుగా, మరికొన్ని గట్టి కాండంతో చెట్లుగా ఎదుగుతాయి. చిన్న చిన్న మొక్కలుగా ఎదిగేవాటిని కుండీల్లో పెంచుకోవచ్చు. బాల్కనీల్లో, టైపై కుండీలను ఏర్పాటు చేసుకుని పెంచుకోవడానికి గులాబి, బంతి, చామంతి, కనకాంబరం, చంద్రకాంతం, దాలియా, తులిప్, లావెండర్ వంటి పూల మొక్కలను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఆరుబయట స్థలంలో కూడా వీటిని పెంచుకోవచ్చు. మందార, గన్నేరు, నందివర్ధనం, సంపెంగ, పొగడ, పారిజాతం, నూరు వరహాలు, గుల్మొహర్ వంటి పూల చెట్లు కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉండవు. ఇవి గట్టి కాండంతో ఏపుగా ఎదుగుతాయి. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో కాస్తంత స్థలం ఉంటే వీటిని పెంచుకోవచ్చు. * పూల మొక్కలను సాధారణంగా అలంకారం కోసం పెంచుకుంటారు. మన దేశంలోనైతే పూజాదికాలకు పనికొస్తాయనే ఉద్దేశంతో కూడా పూల మొక్కలను పెంచుకుంటారు. * మల్లె, జాజి, సంపెంగ, లావెండర్, నైట్ క్వీన్ వంటి కొన్ని పూలు సుగంధ పరిమళాలతో ఆకట్టుకుంటాయి. తోటకు అందానివ్వడమే కాకుండా, ఆహ్లాదభరితమైన పరిమళాల కోసం ఇలాంటి పూల మొక్కలను చాలామంది ఇష్టపడతారు. మొక్కల పెంపకంలో జాగ్రత్తలు * మొక్కలకు తగిన కుండీలను ఎంపిక చేసుకోవాలి. కుండీల్లో నీరు నిల్వ ఉండిపోకుండా ఉండేందుకు వాటి అడుగున చిన్న చిన్న రంధ్రాలు ఉండాలి కుండీల్లో పెంచుకునే మొక్కలు అడ్డదిడ్డంగా ఎదిగిపోకుండా, వాటిని అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. వాటికి కాస్త ఎండ సోకే ప్రదేశంలో ఉంచాలి మొక్కలకు అవసరం మేరకు తగుమాత్రంగా నీరు పోస్తూ ఉండాలి. వాటికి పోషకాలను అందించేందుకు సేంద్రియ ఎరువులను వాడవచ్చు వంటింటి సేంద్రియ వ్యర్థాలను మొక్కల కుండీల్లో నేరుగా వేయకూడదు. వాటిని ఒక కుండీలో నింపి నేలలో తవ్విన గొయ్యిలో వేసి కంపోస్టుగా మార్చాలి. ఆ తర్వాతే మొక్కలకు వేయాలి. పెరటి మొక్కల పెంపకంలోనూ దాదాపు ఇవే పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. మొక్కల వద్ద నీరు ఎక్కువగా నిల్వ చేరకుండా చూసుకుంటూ ఉండాలి. * మట్టిని గుల్లగా తవ్వుకుని, సేంద్రియ ఎరువు కలిపిన తర్వాత మొక్కలు నాటుకుంటే అవి బాగా ఎదుగుతాయి. ఇళ్లల్లో చెట్లు ఉంటే... ≈ భూమ్మీద దాదాపు 80 వేలకు పైగా వృక్షజాతులు మన ఆహార అవసరాలకు ఉపయోగపడగలవు. అయితే, వీటిలో 30 శాతం వృక్షజాతులను మాత్రమే మనుషులు ఆహార అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇవి కాకుండా, భూమ్మీద 70 వేల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ≈ ప్రపంచంలోనే అతి పురాతనమైన చెట్టు ‘మెథుసెలా’ కాలిఫోర్నియాలో ఉన్న ఈ చెట్టు వయసు 4848 సంవత్సరాలు. కాలిఫోర్నియాలోని వైట్ మౌంటెయిన్స్‌లో ఉన్న బ్రిసెల్కోన్ పైన్ అడవుల్లో ఈ ప్రాచీన వృక్షం ఉంది. ఇది కచ్చితంగా ఎక్కడ ఉందో కొద్దిమంది శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ≈ భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చూడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ≈ చెట్లు లేని చోట వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు తగిన ఆస్కారం ఉండదు. విస్తారంగా చెట్లు ఉన్న ప్రదేశాల్లో భూగర్భ జలాలకు లోటు ఉండదు. ≈ సుగంధాలను వెదజల్లే వాటిలో చెప్పుకోవాలంటే, పూలు పూయకపోయినా మరువం, దవనం వంటి మొక్కలను కూడా చేర్చుకోవచ్చు. సుగంధం కారణంగానే మరువం, దవనం వంటి ఆకులను పూలతో కలిపి మాలలుగా అల్లి అలంకరణలో ఉపయోగిస్తుంటారు. ≈ పూర్తిగా ఎదిగిన ఒక చెట్టు నుంచి ఏడాదికి 260 పౌండ్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. అంటే, ఇద్దరు మనుషులకు ఏడాది మొత్తానికి సరిపోయేటంత ప్రాణవాయువు అన్నమాట. నలుగురు మనుషుల కుటుంబం ఉండే ఒక ఇంటి ఆవరణలో కనీసం రెండు చెట్లు ఉన్నట్లయితే ఆ కుటుంబానికి ప్రాణవాయువుకు లోటు ఉండదు. ≈ చెట్టును నరికి ఆ కలప అమ్మితే అంత మొత్తం రాకపోవచ్చు, పండ్ల చెట్టయితే ఆ చెట్టు ఇచ్చే పండ్ల నుంచి కూడా అంత ఆదాయం రాకపోవచ్చు. చెట్ల నుంచి పరోక్షంగా లభించే పర్యావరణ సేవలకు విలువ కడితే పూర్తిగా ఎదిగిన ఒక చెట్టు విలువ 10 వేల డాలర్లు (రూ.6.69 లక్షలు) ఉంటుందని నిపుణుల అంచనా. ≈ ఇంటి ఆవరణలో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు పెంచినట్లయితే ఇంట్లో ఏసీ వినియోగించాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. వీటి వల్ల ఏసీ కోసం అయ్యే ఖర్చు 30 శాతం వరకు తగ్గుతుంది. ఆరుబయటి వాతావరణం కంటే దట్టంగా చెట్లు ఉన్న చోట వాతావరణం చల్లగా ఉంటుంది. ≈ కర్బన ఉద్గారాల కట్టడికి చెట్టును మించిన విరుగుడు ఇంకేదీ లేదు. జీవితకాలంలో ఒక చెట్టు దాదాపు ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగలదు. వాయుకాలుష్యాన్ని నివారించడంలో చెట్లను మించినవేవీ లేవు. ≈ పూర్తిగా ఎదిగిన చెట్టు తన నీడలో ఉన్న మనుషులపై అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ప్రభావాన్ని దాదాపు 50 శాతం మేరకు నివారించగలదు. పూర్తిగా ఆరుబయట ఆడుకోవడం కంటే చెట్ల నీడన ఆటలాడుకోవడం పిల్లలకు క్షేమంగా ఉంటుంది. ≈ చెట్ల వల్ల గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. పూర్తిగా ఎదిగిన చెట్టు గాలిలోని ధూళి కణాలను 20 శాతం మేరకు, బ్యాక్టీరియాను 50 శాతం మేరకు అరికట్టగలదు. ఇలా చెట్లు మన ఆరోగ్యానికి కూడా రక్షణ ఇస్తాయి. ≈ ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో లేదా పైకప్పు మీద కుండీలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు, ఆకుకూరల మొక్కలు వంటివి పెంచితే అవి చాలా వరకు ఆహార అవసరాలు తీరుస్తాయి. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పండ్ల చెట్లు పెంచితే అవి చల్లని నీడనివ్వడమే కాకుండా, పోషకాలనిచ్చే పండ్లను ఇస్తాయి. ≈ మొక్కలు, చెట్లు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయి. ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి బయటకు చూస్తూ చుట్టూ పచ్చదనం కనిపిస్తే మనసు ఆహ్లాదంగా మారుతుంది. పచ్చని వాతావరణం వల్ల దిగులు, గుబులు, ఆందోళన, అలజడి వంటి ప్రతికూల భావోద్వేగాలు సద్దుమణుగుతాయి. ≈ దృఢమైన కాండంతో పెద్దగా ఎదిగే చెట్లను పెరట్లో నాటినట్లయితే, అవి కొంత ఎదిగేంత వరకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏపుగా ఎదిగిన తర్వాత చాలా చెట్లకు రోజూ నీరు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ≈ కూరగాయల మొక్కలు, పండ్ల చెట్లు ఇంట్లోనే పెంచుకుంటే ఖర్చు కన్నా ముందు ఆరోగ్యాన్ని విషరసాయనాల బారి నుండి చాలావరకు కాపాడుకోవచ్చు. నిత్యం బజారుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ≈ ఇంట్లో పెంచుకున్న మొక్కలు, చెట్ల నుంచి ఒకవేళ అవసరానికి మించి పండ్లు, కూరగాయల దిగుబడి వచ్చినట్లయితే వాటిని అమ్మి ఆదాయం కూడా పొందవచ్చు. ≈ వృక్షసంపద శాంతిభద్రతలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చదనమే లేని కాంక్రీట్ వనాలను తలపించే పట్టణాల కంటే పచ్చని పరిసరాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో నేరాల సంఖ్య తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది. పచ్చదనం వల్ల మానసిక ప్రశాంతత నెలకొనడమే దీనికి కారణమని ఫిలడెల్ఫియాలోని టెంపుల్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్ల చెట్లు పూల మొక్కల తర్వాత ఇళ్లలో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడేది పండ్ల చెట్లనే. ఇంటి ఆవరణలోనో, పెరట్లోనో కొంచెం స్థలం ఉంటే ఇష్టమైన పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. పండ్ల చెట్లను కుండీల్లో పెంచుకునే అవకాశాలు తక్కువ. వీటిని పెంచుకోవాలంటే ఇంటి ఆవరణలోనైనా, పెరట్లోనైనా, డాబాలపైనా అన్నిరకాల పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. మామిడి, జామ, పనస, బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, దానిమ్మ, నేరేడు, మారేడు, సపోటా, సీతాఫలం, రేగు, అంజీర, ఉసిరి, నేల ఉసిరి, వెలగ, బొప్పాయి, అరటి వంటి పండ్ల చెట్లు ఇళ్లలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. పండ్ల చెట్ల వల్ల చల్లని నీడ దొరకడమే కాకుండా, రుచికరమైన పండ్లు లభించడం అదనపు లాభం. అంతేనా! పండ్ల చెట్లు రక రకాల పక్షులకూ ఆవాసంగా ఉంటాయి. దృఢమైన కాండం గల పండ్ల చెట్ల మీదకు పాకేలా రకరకాల తీగమొక్కలనూ పెంచుకోవచ్చు. పండ్ల వర్గంలో చేర్చకపోయినా, కొంత విశాలమైన స్థలం ఉన్నట్లయితే ఏపుగా ఎదిగే కొబ్బరి, పోక, బాదం వంటి చెట్లు కూడా పెరటి తోటల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి కాకుండా, తీగలుగా పాకే పుచ్చ, కర్బూజా వంటి మొక్కలను పందిరి పైకి లేదా పైకప్పు పైకి పాకించి పెంచుకోవచ్చు. కుండీల్లో పెంచుకోదగ్గ పండ్ల రకాలు చాలావరకు పండ్ల చెట్లను ఆరుబయటే పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని రకాల పండ్ల చెట్లను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కాస్త పెద్దసైజు కుండీలను ఏర్పాటు చేసుకుంటే పీచ్, ఆప్రికాట్, మల్బరీ, కేప్ గూస్బెర్రీ, చిన్న దానిమ్మ (డ్వార్ఫ్ పోమగ్రనేట్), ఫిగ్ వంటి చెట్లను పెంచుకోవచ్చు. ఇవి కాస్త గట్టి కాండంతో చెట్లుగా ఎదిగే రకాలే అయినా, వీటి ఎత్తు మూడు నాలుగు అడుగులకు మించి ఉండదు. అందువల్ల వీటిని విశాలమైన వరండాల్లో, బాల్కనీల్లో లేదా పైకప్పు మీద కాస్త పెద్దసైజు కుండీలను ఏర్పాటు చేసుకుని పెంచుకోవచ్చు. ఇవే కాకుండా తీగజాతికి చెందిన ద్రాక్ష మొక్కలను కూడా కుండీల్లో పెంచుకోవచ్చు. కూరగాయల మొక్కలు కూరగాయలు, ఆకు కూరల మొక్కల్లో చాలావరకు ఇళ్లలో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. రోజువారీ వినియోగించే కూరగాయలు, ఆకు కూరల్లో చాలా రకాలను కుండీల్లో సైతం తేలికపాటి పద్ధతుల్లో పెంచుకోవచ్చు. కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే పెరటి తోటలుగా కూడా కూరగాయల మొక్కలను సాగు చేయవచ్చు. బయట కొనుగోలు చేసే కూరగాయలు, ఆకుకూరల కంటే ఇంట్లో పెంచుకునే మొక్కల నుంచి సేకరించే కూరగాయలు, ఆకుకూరలు సురక్షితంగా ఉంటాయి. బయట పొలాల్లో వీటి సాగు కోసం యథేచ్ఛగా పురుగు మందులు, రసాయనిక ఎరువులు వినియోగిస్తుంటారు. ఇళ్లలో పెంచుకున్నట్లయితే, పురుగు మందులు, రసాయనాలు వాడకుండానే వీటిని సేంద్రియ పద్ధతుల్లో పెంచుకుని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఇళ్లలో పెంచుకోవడానికి అనువైన కొన్ని కూరగాయల రకాల గురించి... * బచ్చలి, బఠాణీ, చిక్కుడు, దొండ, దోస, ఆనప, పొట్ల, బీర, గుమ్మడి వంటి తీగజాతి మొక్కలను కుండీల్లో నాటుకుని, వాటి తీగలను ఇంటి పైకి పాకించవచ్చు. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో ఆరుబయట స్థలం ఉంటే వాటికి పందిరి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. * ఆవాలు, మెంతులు, ధనియాలు, పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, మిర్చి, టొమాటో, బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం, వంగ, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి ఆకు కూరలు, కూరగాయలను వాటిని కుండీల్లో తేలికగా పెంచుకోవచ్చు. * బాల్కనీల్లో లేదా టైపై, బీమ్లపైన కాస్త పెద్దసైజు కుండీలను, తొట్టెలను ఏర్పాటు చేసుకోగలిగితే ఉల్లి, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప, చిలకడ దుంప, కంద, చేమ, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి నేలలో పెరిగే కూరగాయలనూ సాగు చేసుకోవచ్చు. పెరట్లో తగినంత స్థలం ఉన్నట్లయితే, వీటిని నేరుగా మట్టిలోనే పెంచుకోవచ్చు. కూరగాయలు, పండ్లు... ప్రపంచ రికార్డులు కూరగాయల మొక్కలను, పండ్ల చెట్లను ఇళ్లల్లో పెంచుకునే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొందరు ఔత్సాహికులు ఎంతో శ్రద్ధాసక్తులతో వీటిని పెంచుకుంటూ ఉంటారు. కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం ద్వారా ప్రపంచ రికార్డులు నెలకొల్పిన వారు కూడా ఉన్నారు. రికార్డులకెక్కిన అలాంటి విశేషాలు కొన్ని... అతిపెద్ద చిలకడ దుంప: చిలకడ దుంప ఎంత పెద్దగా కనిపించినా మహా అయితే దాని బరువు పావు కిలోకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. అయితే, ఇది అలాంటిలాంటి చిలకడ దుంప కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మహా భారీ చిలకడ దుంప. దీని బరువు ఏకంగా 11.2 కిలోలు. లెబనాన్‌లోని టైర్ నగరంలో ఖలీల్ సెమ్హాట్ అనే ఔత్సాహికుడి పెరటి తోటలో పండింది ఈ చిలకడ దుంప. అతిపెద్ద పనసపండు: పనసపండు సాధారణంగానే పెద్దగా ఉంటుంది. కాస్త పెద్దసైజు పనసపండు అయితే అయిదారు కిలోలు కూడా తూగుతుంది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత భారీ పనసపండు. దీని బరువు 34.6 కిలోలు. హవాయిలోని జార్జ్, మార్గరెట్ షాట్యూర్ దంపతుల ఇంటి ఆవరణలోని చెట్టుకు కాసింది ఈ బకాసుర పనసపండు. అతిపెద్ద క్యాబేజీ: క్యాబేజీ సాధారణంగా ఎంత పెద్దగా కనిపించినా ఒకటి రెండు కిలోల వరకు ఉంటుంది. ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి భారీ క్యాబేజీ. అమెరికాలో అలాస్కా రాష్ట్రంలోని పామేర్ ప్రాంతంలో జాన్ ఇవాన్స్ అనే మెకానికల్ డిజైనర్ పెరటి తోటలో కాసింది ఈ రాకాసి క్యాబేజీ. దీని బరువు ఎంతంటారా? కేవలం 34.4 కిలోలు మాత్రమే! అతిపెద్ద పుచ్చకాయ: చూడగానే భూగోళాన్ని తలపించే పుచ్చకాయలు సాధారణంగానే పెద్దగా ఉంటాయి. కాస్త పెద్దసైజు పుచ్చకాయలు ఐదారు కిలోల వరకు కూడా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పుచ్చకాయ. దీనిని ఒక మనిషి మోయడం అసాధ్యం. దీని బరువు ఏకంగా 122 కిలోలు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రానికి చెందిన లాయిడ్ బ్రైట్ కుటుంబానికి చెందిన పొలంలో పండింది ఇది. అతిపెద్ద క్యారెట్: అతిపెద్ద క్యారెట్ రికార్డు కూడా అతిపెద్ద క్యాబేజీని పండించిన జాన్ ఇవాన్స్ పేరు మీదే ఉంది. అలాస్కాలోని ఈ పామేర్ పెద్దమనిషి తన పెరటితోటలో పండించాడు దీన్ని. దీని బరువు ఏకంగా 8.5 కిలోలు. అతిపెద్ద గుమ్మడిపండు: గుమ్మడిపండ్లు సహజంగానే పెద్దగా ఉంటాయి. ఎంత పెద్ద గుమ్మడిపండునైనా ఒక మనిషి కాస్త కష్టంగానైనా మోసేందుకు వీలవుతుంది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న గుమ్మడి పండును మోయాలంటే మనుషులు చాలరు. క్రేన్లు ఉపయోగించాల్సిందే! ఎందుకంటే దీని బరువు 951 కిలోలు మరి. బెన్ మీయర్ అనే స్విస్ తోటమాలి తోటలో పండింది ఇది. అతిపెద్ద కాలిఫ్లవర్: ఇది కూడా అలాస్కాలోని పామేర్ పెద్దమనిషి జాన్ ఇవాన్స్ పెరటితోటలో పూసినదే. ఎంత పెద్ద కాలిఫ్లవర్ అయినా ఒకటి రెండు కిలోలకు మించి ఉండదు. అయితే ఇవాన్స్ తోటలో పూసిన ఈ కాలిఫ్లవర్ మాత్రం ఏకంగా 14.1 కిలోలు తూగింది. అతిపెద్ద బ్రకోలి: కాలిఫ్లవర్ మాదిరిగానే ముదురాకుపచ్చ రంగులో కనిపించే బ్రకోలీ విషయంలోనూ అలాస్కాలోని పామేర్కు చెందిన జాన్ ఇవాన్స్దే రికార్డు. ఆయన పెరటితోటలో పండిన ఈ బ్రకోలి బరువు 15.8 కిలోలు. అతిపెద్ద యాపిల్: ఎర్రగా బుర్రగా కనిపించే యాపిల్ పండు సాధారణంగా చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటుంది. జపాన్‌లోని హీరోసాకి నగరంలో చిసాతో ఇవాసాకి అనే రైతు తోటలో పండిన ఈ యాపిల్‌ను పట్టుకోవడానికి రెండుచేతులు చాలవు. దీని బరువు 1.849 కిలోలు. అతిపెద్ద నిమ్మకాయ: నిమ్మకాయలు మామూలుగా ఎంత ఉంటాయి? గుప్పిట్లో రెండు మూడు నిమ్మకాయల వరకు అవలీలగా ఇమిడిపోతాయి. ఇజ్రాయెలీ రైతు కఫార్ జీతిమ్ తోటలో పండిన ‘గజ’నిమ్మకాయను పెకైత్తాలంటే కాస్త ప్రయాస పడాల్సిందే! ఈ నిమ్మకాయ బరువు 5.265 కిలోలు మరి. అతిపెద్ద ఉల్లిపాయ: సాధారణంగా బజారులో దొరికే ఉల్లిపాయల్లో ఎంత పెద్ద ఉల్లిపాయ అయినా మహా అయితే అరకిలోకు కాస్త అటు ఇటుగా తూగుతుందేమో! ఇంగ్లాండ్‌లోని పీటర్ గ్లేజ్బ్రూక్ అనే పెద్దాయన తన తోటలో పండించిన ఉల్లిపాయ ప్రపంచంలోనే అతి భారీ ఉల్లిపాయ. దీని బరువు 7.7 కిలోలు. అతిపెద్ద బంగాళదుంప: ప్రపంచంలోనే అతిపెద్ద బంగాళదుంపను పండించిన ఘనత కూడా అతిపెద్ద ఉల్లిపాయను పండించిన ఇంగ్లాండ్ పెద్దాయన పీటర్ గ్లేజ్బ్రూక్కే దక్కుతుంది. ఆయన తోటలో పండిన ఈ బంగాళ దుంప బరువు 3.8 కిలోలు. ఇళ్లలో పెంచుకోగల ఔషధ మొక్కలు పెరటి తోటల్లోను, కుండీల్లోను చాలా రకాల ఔషధ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనే సామెత ఉంది గాని, అదంతా ఉత్తుత్తదే! పెరట్లోనో, ఇంట్లో కుండీల్లోనో పెంచుకున్న ఔషధ మొక్కలు కూడా వైద్యానికి భేషుగ్గానే పనికొస్తాయి. అత్యవసరమైన ఔషధ మొక్కలు కొన్నయినా ఇంట్లో ఉన్నట్లయితే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి అనువైన కొన్ని ఔషధ మొక్కల గురించి... * తులసి, పుదీనా, కొత్తిమిర, మెంతికూర, లావెండర్, రోజ్మేరీ, కలబంద వంటివి చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. * మన దేశంలో దాదాపు హిందువులందరి ఇళ్లల్లోనూ తులసి కోట ఉంటుంది. పూజ కోసం తులసి మాలలు, తీర్థంలోకి తులసి ఆకులను విరివిగా వాడుతుంటారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు తులసిలో చలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. * తులసి ఆకులను నమిలి తిన్నా, తులసి ఆకుల రసంలో కాస్త తేనె కలిపి తీసుకున్నా గొంతుకు సంబంధించిన ఇబ్బందులు నయమవుతాయి. ఆకలి తగ్గుదల, వికారం, తలనొప్పి, మొటిమలు, చిన్న చిన్న గాయాలు వంటివి నయం చేయడానికి కూడా తులసి ఉపయోగపడుతుంది. * యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు గల పుదీనాను వాంతులు, కడుపునొప్పి, అజీర్ణం, నోటి దుర్వాసన, తలనొప్పి వంటివి నయం చేయడానికి ఉపయోగిస్తారు. * యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా గల కొత్తిమీరను మూత్రాశయ సమస్యలు, కిడ్నీ సమస్యలు, జాండిస్, రక్తపోటు, డయాబెటిస్, ఉబ్బసం, కీళ్లనొప్పులు నయం చేయడానికి వాడతారు. * మెంతికూరలోనూ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్, అజీర్తి, కడుపునొప్పి, చిగుళ్లవాపు వంటివి నయం చేయడానికి మెంతికూర ఉపయోగపడుతుంది. * సుగంధం వెదజల్లే రోజ్మేరీ మొక్క వాతావరణంలోని ఎలాంటి హెచ్చుతగ్గులనైనా తట్టుకోగలదు. జలుబు, తలనొప్పి, అజీర్తి, బట్టతల, చుండ్రు, కండరాల నొప్పులు, డిప్రెషన్ నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. * సుగంధాలు వెదజల్లే లావెండర్‌ను సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. యాంటీ సెప్టిక్ లక్షణాలు, యాంటీ డిప్రెసంట్ లక్షణాలు లావెండర్లో పుష్కలంగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, వాంతులు, మైగ్రేన్, పంటినొప్పి, జుట్టురాలడం వంటి సమస్యలను లావెండర్ సమర్థంగా నయం చేయగలదు. * దళసరిగా కనిపించే కలబంద ఆకులు తోటకు అందానివ్వడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఇళ్లలో పండించే కూరగాయల మొక్కలకు కాసే కూరగాయలకు కలబంద గుజ్జును పట్టిస్తే, చాలా రకాల బ్యాక్టీరియా వాటికి సోకకుండా ఉంటుంది. * విటమిన్-సి పుష్కలంగా ఉండే కలబంద గుజ్జు మౌత్‌వాష్‌గా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోను, జీర్ణకోశ సమస్యలను నియంత్రించడంలోను, గాయాలను నయం చేయడంలోను కలబంద సమర్థంగా పనిచేస్తుంది. * కుండీలో పెంచుకోగల మరో అద్భుతమైన ఔషధ మొక్క చెంగల్వ కోష్టు. దీని మూలిక డయాబెటిస్‌ను అదుపు చేయడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని ‘ఇన్సులిన్ ప్లాంట్’ అని కూడా అంటారు. ఇది చర్మవ్యాధులను, అధిక రక్తపోటును కూడా అరికడుతుంది. * కుండీలో పెంచుకునే అవకాశం లేకపోయినా, ఇంటి వద్ద కొంత ఖాళీ స్థలం ఉంటే తప్పనిసరిగా పెంచాల్సిన ఔషధ వృక్షం వేపచెట్టు. వేప ఆకులు, బెరడు, పూతలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. * చుండ్రు, మొటిమలు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, కడుపులోని క్రిమిదోషాలు, మలేరియా, డయాబెటిస్ వంటివి నయం చేయడంలో, శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో వేప సాటిలేనిది. * ఔషధ గుణాలు గల వృక్షాల్లో ఉసిరి చెట్టు కూడా ముఖ్యమైనది. ఆయుర్వేద ఔషధాల తయారీలో త్రిఫలాల్లో ఒకటైన ఉసిరిని విరివిగా వాడతారు. * విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరికాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. జుట్టురాలడం, కంటి జబ్బులు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులను నయం చేయడంలోనూ ఉసిరి సమర్థంగా పనిచేస్తుంది. ♦ పండ్లు, కాయలు ఇవ్వకున్నా, కేవలం నీడనిచ్చే చెట్లను కూడా పెరటి తోటల్లో పెంచుకోవచ్చు. కాస్త విశాలమైన స్థలం ఉన్నట్లయితే దేవదారు, అశోక, వేప, రావి, జమ్మి, మద్ది, టేకు, సరుగుడు, నీలగిరి వంటి చెట్లను పెరట్లో పెంచుకోవచ్చు. బలమైన కాండంతో ఎదిగే ఇలాంటి చెట్లపైకి వివిధ రకాల తీగ మొక్కలను పాకించవచ్చు. చల్లని నీడనిచ్చే ఇలాంటి చెట్లు దీర్ఘకాలంలో కలప కోసం ఉపయోగపడతాయి. వీటి ద్వారా వచ్చే కలపను వంటచెరకు కోసం, ఫర్నిచర్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. ♦ కొన్ని పెరటి మొక్కలు అత్యంత అరుదుగా దొరుకుతాయి. వీటిని పెంచడం వల్ల పెరటి తోటకే ఒక అందం వస్తుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే బ్రహ్మకమలం మొక్కలను అక్కడక్కడా కొందరు ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ♦ అరుదైన మొక్కల్లో కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయని వృక్ష శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ♦ మెజెంటా ఘోస్ట్ ఫ్లవర్, మౌంటైన్ బాల్సాన్, సిరోయి లిల్లీ, స్ట్రైప్డ్ డ్యూ ఫ్లవర్ వంటి పూల మొక్కలు మన దేశంలో అరుదుగా కనిపిస్తాయి. ఈ మొక్కలు కుండీల్లో కూడా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. ♦ అరుదైన మొక్కలను అంతరించిపోకుండా కాపాడుకుంటేనే పర్యావరణ సమతుల్యత బాగుంటుందని చెబుతున్నారు. ఉద్యాన ఉత్పత్తుల్లో మనది రెండోస్థానం హరిత విప్లవం ప్రభావంతో మన దేశంలో 1960, 70 దశకాల నాటి ఆహార కొరత పరిస్థితి చాలా వరకు తీరింది. వ్యవసాయ విధానంలో మన ప్రభుత్వాలు ఇప్పటికీ తిండిగింజలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నా, ఉద్యాన ఉత్పత్తుల్లోనూ మన దేశం గడచిన నాలుగు దశాబ్దాలలో గణనీయమైన పురోగతినే సాధించింది. ఉద్యాన ఉత్పత్తుల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో ఉంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు వంటి ఉద్యాన ఉత్పత్తుల సాగు విస్తీర్ణం 2014-15 నాటికి 2.34 కోట్ల హెక్టార్లు కాగా, ఈ ఉత్పత్తుల పరిమాణం 283.5 మిలియన్ టన్నులు. మన దేశంలో ఉద్యాన ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణలోని నల్లగొండ, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా, మధ్యప్రదేశ్‌లోని సాగర్, షాదోయి, పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్, మహారాష్ట్రలోని పుణే, ఔరంగాబాద్, జల్గాంవ్, సాంగిల్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. మొక్కలు - వాస్తు చల్లని నీడ కోసం, పరిమళాలు వెదజల్లే పూల కోసం, ఆహార అవసరాలు తీర్చే కూరగాయలు, పండ్లు వంటి వాటి కోసం చాలామంది మొక్కలను పెంచుతుంటారు. అయితే, కొందరు వాస్తుపరమైన నమ్మకాలతో కూడా ఇళ్లలో మొక్కలను పెంచుతూ ఉంటారు. భారతీయ వాస్తుశాస్త్రంతో పాటు చైనీస్ ‘ఫెంగ్‌షుయి’ నమ్మకాల ఆధారంగా అరిష్టాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో, అదృష్టం కలసి వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలామంది మొక్కలు పెంచుతూ ఉంటారు. నమ్మకాలతో ముడిపడ్డ కొన్ని మొక్కల గురించి... * ‘ఫెంగ్‌షుయి’ ప్రకారం కుండీలో లాటస్బాంబూ మొక్కను పెంచితే అదృష్టం కలసి వస్తుందని చాలామంది నమ్ముతారు. * జెండాలా రెపరెపలాడే పూలు పూసే పీస్లిల్లీ మొక్కలను కుండీలో పెంచుకున్నట్లయితే ఇంటికి లేదా కార్యాలయానికి ఆకర్షణశక్తి పెరుగుతుందనే నమ్మకం ఉంది. * మనీప్లాంట్‌ను ఇంటి గుమ్మం వద్ద కుండీలో పెంచుకున్నట్లయితే డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చాలామంది నమ్ముతారు. * ఇంట్లో లేదా కార్యాలయంలో అంబ్రెల్లా ప్లాంట్‌ను పెంచుకుంటే కార్యసాఫల్యతతో పాటు అదృష్టం కలసి వస్తుందనే నమ్మకం ఉంది. * తులసిచెట్టు ప్రతి ఇంటా ఉండి తీరవలసిందని, దీనివల్ల సకల శుభాలు కలుగుతాయనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. * ఇంటికి తూర్పు, ఉత్తర దిశలలో చిన్న చిన్న మొక్కలను పెంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే, ఈశాన్య మూలలో మాత్రం ఎలాంటి మొక్కలు లేకుండా ఖాళీగా ఉండేలా చూసుకోవాలనేది వాస్తు నిబంధన. * గులాబీని మినహాయిస్తే మిగిలిన ఎలాంటి ముళ్ల చెట్లను ఇళ్లలో పెంచరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తుమ్మ వంటి ముళ్ల చెట్లను ఇంట్లో పెంచితే అవి ప్రతికూల శక్తులకు ఆలవాలంగా మారుతాయనే నమ్మకం ఉంది. * ఇంటికి నైరుతి దిశలో పూల మొక్కలను పెంచడం వల్ల అదృష్టం కలసి వస్తుందని వాస్తుశాస్త్ర నమ్మకం. * రాతి నిర్మాణాలతో కూడిన రాక్‌గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవడానికి నైరుతి మూల అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే, రాక్ గార్డెన్స్‌ను ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకుంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. -
విద్యుత్ సమస్యను రాజకీయం చేయొద్దు
‘విద్యుత్ సంక్షోభం’ సదస్సులో వక్తలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశంలో హరిత విప్లవం రావాలంటే సమృద్ధిగా నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ అశోక్‌రావు అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ అభివృద్ధి-విద్యుత్ సంక్షోభం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అశోక్‌రావు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ బోర్డులు గ్రీన్ రెవల్యూషన్కోసం చేసిన కృషిని ఎవరూ గుర్తించలేదని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను రాజకీయం చేస్తున్నారేగానీ పరిష్కరించడంలేదన్నారు. ప్రైవేటీకరణ వల్ల పెద్ద మొత్తంలో నష్టాలు జరిగాయని అన్నారు. కొత్త చట్టాల వల్ల ప్రజలకు నష్టమే ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయన్నారు. విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, దీనికి ప్రధాన కారణం ఖరీఫ్ పంట ఆలస్యంగా రావడం, ఎయిర్ కండీషన్ల వినియోగం తీవ్రంగా పెరగడమని అన్నారు. రాష్ట్రంలో వనరులు ఉన్నప్పటికీ విద్యుత్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదని, ఎక్కువ భాగం ఆంధ్రాకు తరలి వెళ్లాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వల్ల తెలంగాణకు రావాల్సిన 54 శాతం వాటా రావడం లేదన్నారు. అలాగే 500 మెగావాట్ల గాలిమరల విద్యుత్ ఆగిపోయిందని, కృష్ణపట్నం నుంచి 400 మెగావాట్లు, విజయవాడ, రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రాల నుంచి రావాల్సిన విద్యుత్ తక్కువగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 20 మిలియన్ల యూనిట్ల వరకు నష్టపోతున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాలకు విద్యుత్ పంచుతామన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. కేంద్రం చొరవ చూపి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం 6 నెలల వ్యవధిలో 3 వేల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన కోరారు. భూపాల్పల్లి, సింగరేణి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, టి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
గడ్డిని కాలిస్తే గడ్డుకాలమే!
గడ్డివామును చూసి రైతు ఘనత చెప్పొచ్చు అనేవారు పెద్దలు. భారత హరిత విప్లవ కేంద్రమైన పంజాబ్‌లో రైతులు మాత్రం గడ్డిని గడ్డు సమస్యగా భావిస్తున్నారు. ఏటా టన్నుల కొద్దీ గడ్డిని పరశురామ ప్రీతి చేస్తున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ రెండుగా విడిపోయిన తరువాత రైతాంగం పశుపోషణ నుంచి దాదాపుగా వైదొలిగారు. గృహావసరాల కోసం ఒకటో అరో గేదెలు లేదా ఆవులను పెంచుకున్నా వాటికి కొద్ది మాత్రం గడ్డి సరిపోతుంది. మిగులు గడ్డిని వాములు వేయాలంటే బోలెడు సమయంతో పాటు బాగా ఖర్చవుతుంది. సాగునీరు అందుబాటులో ఉన్న భూముల్లో ఒక పంట పూర్తవగానే మరో పంటను వెంట వెంటనే నాటేయడం అలవాటుగా మారింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో నాటు మొదలు నూర్పు వరకు భారీ యంత్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణ రైతు ఈ యంత్రాలను వ్యక్తిగతంగా కొనుగోలు చేయలేడు. నలుగురితో నారాయణ అని అద్దె చెల్లించి, అందరితో పాటు పనులు చేయక తప్పదు. వెనుకపడిపోతే ప్రత్యేకంగా యంత్రాలను తెప్పించుకునే పరిస్థితి ఉండదు. మరోవైపు గోధుమ, వరి గడ్డిని తొలగించి, వినియోగించే ప్రత్యామ్నాయ పద్ధతులు రూపొందలేదు. ఈ పరిస్థితిలో ఉన్న కాడికి ఊడ్చి అగ్గి పెట్టడమొక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు పంజాబ్ రైతులు. ఏటా నాలుగు కోట్ల టన్నుల గోధుమ గడ్డి, 2.3 కోట్ల టన్నుల వరి గడ్డిని కాల్చి బూడిద చేస్తున్నారు. గడ్డి దహనంతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు గడ్డిని కాల్చడం వలన పర్యావరణ సమస్యలు అనేకం ఉత్పన్నమవడంతో పాటు భూసారం తీవ్రంగా దెబ్బతిని పోతోంది. తిరిగి భూసారం పెంచడానికి రసాయనిక ఎరువులను ఏటా పెంచుకుంటూ పోతున్నారు. ఇది రైతుకు ఆర్థికంగా నష్టదాయకమైంది. మరోవైపు గడ్డి తగలబెట్టడం వలన 2.61 లక్షల టన్నుల కార్బన్ మోనో డయాక్సయిడ్, 19,800 టన్నుల నైట్రోజన్ ఆక్సైయిడ్లతో పాటు ఇతర వాయువులు గాలిలో కలిసి పోతున్నాయి. ఈ పరిస్థితి రోజురోజుకూ తీవ్ర మౌతుండడంతో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు ప్రారంభించింది. బహిరంగంగా దీన్ని కాల్చివేయడం వలన నేలలోని సూక్ష్మజీవులను నశింప జేస్తోందని వెల్లడించింది. పంట పొలాల్లో దహనకాండ ఫలితంగా 2.2 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువు, 60 లక్షల టన్నుల కర్బనం వాతావరణంలో కలిసిపోతున్నది. ఫలితంగా పర్యావరణంలో వీపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం గడ్డి దహనం మీద నిషేధం విధించినప్పటికీ అమలు కావడం లేదు. ఈ విషవాయువుల వల్ల మనుషుల్లో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తీవ్రమౌతున్నట్లు అధ్యయనంలో తేలింది. గడ్డి పునర్వినియోగం క్షేమం, లాభం! రైతులు గోధుమ, వరి గడ్డిని తిరిగి నేలలోనే కలియదున్నాలని, దాని వలన నేల త్వరితంగా సారవంతమౌతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంజాబ్‌లో బుగ్గిపాలవుతున్న గడ్డిని భూమిలో కలియదున్నితే ఏటా దాదాపు 38.5 లక్షల టన్నుల సేంద్రియ కర్బనం, 59 వేల టన్నుల నత్రజని, 20 వేల టన్నుల భాస్వరం, 34 వేల టన్నుల పొటాష్ నేలకందుతాయని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. అయితే మాటలతో పొద్దు పుచ్చకుండా.. పొలంలో గడ్డిని సేకరించి బేళ్లుగా చుట్టే యంత్రాలను సమకూర్చడం వంటి ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తేవడమే ఈ సమస్యకు పరిష్కారమని రైతు నేతలు అంటున్నారు. -
భూసారంతోనే భవిష్యత్తు!
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై.ఎల్. నెనె హరిత విప్లవ కాలంలో వనరుల దుర్వినియోగంతో సర్వనాశనమైన భూసారాన్ని.. తిరిగి పెంపొందించుకోవడంపైనే జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. వెయ్యేళ్ల నాటి భారతీయ వ్యవసాయ విజ్ఞానం ఇప్పటికీ ఉపయుక్తమేనని ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. యశ్వంత్ లక్ష్మణ్ నెనె స్పష్టం చేస్తున్నారు. పంటల్లో జింక్ లోపం వస్తున్నదని గుర్తించిన తొలి వ్యవసాయ శాస్త్రవేత్తగా డా. యశ్వంత్ లక్ష్మణ్ నెనె ప్రసిద్ధులు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఆయన స్వస్థలం. యూపీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ‘ఇక్రిశాట్’లో చేరి 1989లో డిప్యూటీ డెరైక్టర్ జనరల్‌గా ఎదిగినా.. భారతీయ పురాతన వ్యవసాయ విజ్ఞానాన్ని వెలికితీయాలన్న తపన ఆయనను ఉద్యోగంలో కొనసాగనివ్వలేదు. ఐదేళ్లు ముందుగానే 1996లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సికింద్రాబాద్‌లో ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. గత 15 ఏళ్లలో 8 పురాతన, మధ్యయుగం నాటి గ్రంథాలతోసహా మొత్తం 11 పుస్తకాలను ప్రచురించారు. మూలగ్రంథాల్లో విషయాన్ని యథాతథంగా ఆంగ్లంలోకి అనువదించడంతోపాటు.. ఈ కాలానికి అవి ఎలా ఉపయోగపడతాయో విశ్లేషించే వ్యాసాలను సైతం ఈ గ్రంథాల్లో చేర్చడం విశేషం. మన పూర్వీకుల వ్యవసాయ విజ్ఞాన గని మనకు ఇప్పటికీ ఉపయుక్తమేనంటున్న నెనె.. రసాయనాలతో సర్వనాశనమైన భూమిలో సేంద్రియ పదార్థం పెంపుదలతోనే వ్యవసాయాభివృద్ధి ఆధారపడి ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆయనతో ‘సాక్షి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నత స్థితికి ఎదిగిన మీరు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి ‘ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్’ను నెలకొల్పడానికి ప్రేరణ ఏమిటి? భారతీయ పురాతన వ్యవసాయ సంస్కృతి సుసంపన్నమైనది. మన పూర్వీకులు వ్యవసాయాభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. అయితే, ప్రపంచ వ్యవసాయ చరిత్రలో మన కృషికి బొత్తిగా చోటులేదు. మొదట్లో బ్రిటిష్ వాళ్లు, ఇప్పుడు అమెరికన్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. బ్రిటిషర్లు మనల్ని చూసి వ్యవసాయం నేర్చుకున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా చెప్పరు! 50 ఏళ్ల క్రితం ఇలినాయిస్ యూనివర్సిటీ (అమెరికా)లో నేను పీహెచ్డీ చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ అన్న మాటలు నాలో ఆలోచన రేకెత్తించాయి. ‘చైనా, మెసపటోమియా, రోమన్ తదితర పురాతన వ్యవసాయ సంస్కృతులు, విజ్ఞానం గురించి వివరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, భారతీయ పురాతన వ్యవసాయ విజ్ఞానం గురించి ఇదమిత్థంగా సాహిత్యం ఏమీ అందుబాటులో లేదెందుకు?..’ అని ప్రొఫెసర్ అన్న మాటలు దశాబ్దాలు గడచినా నా మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ ప్రేరణతోనే 1996లో ఐదేళ్లు ముందుగానే ‘ఇక్రిశాట్’ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మరో పది మంది శాస్త్రవేత్తలతో కలిసి ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్‌ని నెలకొల్పాను. ‘వృక్షాయుర్వేదం’ మొదలుకొని పదకొండు పురాతన సంస్కృత వ్యవసాయ సంబంధ గ్రంథాలను సేకరించాం. వీటిని ఆంగ్లంలోకి అనువదించి, విశ్లేషణలతో పాటు ప్రచురించి ప్రపంచం ముందుంచాం. మన పూర్వీకుల సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానాన్ని మన వ్యవసాయ విద్యార్థులకు, రైతులకు అందించాలన్నదే మా అంతిమ లక్ష్యం. ‘ఫౌండేషన్’ లక్ష్యం ఏమిటి? భారతీయ పురాతన వ్యవసాయ విజ్ఞానం ఇదీ అని చెప్పడానికి ఒక్క గ్రంథమూ ఆధునికులకు అందుబాటులో లేకపోవడం విషాదం. భారతీయ రచయితలు కూడా ఈ వైపు దృష్టి సారించలేదు. పురాతన సంస్కృత గ్రంథాల్లో ప్రస్తావనలున్నాయే తప్ప ఇదమిత్థంగా తెలీదు. ఈ కొరత తీర్చడం కోసమే ఈ ఫౌండేషన్ 1994లో ఏర్పడింది. రూ. 60 లక్షల కార్పస్ ఫండ్‌ను సేకరించాం. ‘వృక్షాయుర్వేదం’ మొదలుకొని ఇప్పటికి 11 పురాతన సంస్కృత వ్యవసాయ సంబంధ గ్రంథాలను సేకరించాం. వీటిని ఆంగ్లంలోకి అనువదించి, విశ్లేషణలతో పాటు పుస్తకాలను ప్రచురించి ప్రపంచం ముందుంచాం. మన పూర్వీకుల సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానాన్ని మన వ్యవసాయ విద్యార్థులకు, రైతులకు అందించాలన్నదే మా అంతిమ లక్ష్యం. మన పురాతన వ్యవసాయ విజ్ఞానంలో శాస్త్రీయత ఎంత? సైన్సు పుట్టింది 14వ శతాబ్దంలో. ఈ విజ్ఞానం పది వేల ఏళ్ల నాటిది. ఇది శాస్త్రీయమైనది కాకుండాపోతుందా? వరి సాగు తూర్పు భారత్, దక్షిణ చైనాలో సుమారు 10 వేల ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. 1200 ఏళ్ల నాటి ‘కాష్యపీయ కృషి సూక్తి’ గ్రంథంలో 26 వరి వంగడాల సాగు విశేషాలున్నాయి. ‘వృక్షాయుర్వేదం’ గురించి..? సుమారు వెయ్యేళ్ల క్రితం సురాపాల మహర్షి రాసిన ‘వృక్షాయుర్వేదం’ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రంథాలయంలో మాత్రమే ఉంది. మైక్రోఫిల్మ్ తెప్పించి ఆంగ్లంలోకి అనువదించి, శాస్త్రీయ విశ్లేషణ వ్యాసాలతో కలిపి ప్రచురించాం. ప్రచురించిన పది గ్రంథాల్లో 9 ఆహార/ఉద్యాన పంటల సాగు పద్ధతులకు సంబంధించినవి కాగా, మృగపక్షి శాస్త్రం ఒక్కటే పక్షులకు సంబంధించినది. 250 ఏళ్ల క్రితం పాలకాప్య రుషి రచించిన ‘హస్త్యాయుర్వేదం’ను ఇటీవలే సేకరించాం. ఇందులో ఏనుగులపై సమస్త సమాచారం ఉంది. నాటి వ్యవసాయ విజ్ఞానం నేటి రైతులకు ఉపయోగపడుతుందా? మన సంప్రదాయ విజ్ఞానం ఈ కాలపు వ్యవసాయానికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. భూసారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని 2500 ఏళ్ల క్రితమే పరాశర ముని చెప్పారు. సారవంతమైన భూమి వ్యవసాయానికి పట్టుగొమ్మ వంటిది. సేంద్రియ పదార్థం అటవీ భూమిలో పుష్కలంగా (3- 5% వరకు) ఉంటుంది. కానీ మన పొలాల్లో 1960 తర్వాత బాగా తగ్గి ఇప్పుడు 0.4 నుంచి 0.6 శాతానికి అడుగంటింది. రైతులు ఇప్పటికీ అనుసరించదగిన పురాతన వ్యవసాయ సాగు పద్ధతులను ప్రచారం చేయాలన్న దృష్టితో ఐసీఏఆర్‌తో కలసి గోవాలో వచ్చే డిసెంబర్ 11,12 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహించబోతున్నాం. భూములను తిరిగి సారవంతం చేయడం ఎలా..? పశువుల ఎరువు వాడకం పూర్తిగా మానేయడమే సమస్య. ప్రతి రైతుకూ తప్పనిసరిగా పశువులుండాలి. వేరే దారి లేదు. ఆవులు, గేదెలు, గొర్రెలు.. ఏవైనా సరే. పశువుల్లేకుండా పంట లేదు. భూమిలోని సేంద్రియ పదార్థం ద్వారానే మొక్కల వేళ్లు పోషకాలను గ్రహిస్తాయి. సేంద్రియ పదార్థం లేకపోతే రసాయనిక ఎరువులూ పనిచేయవు. భూమిలో సేంద్రియ పదార్థం కనీసం 1.5 నుంచి 2% వరకు పెంచుకోవడమే ప్రభుత్వం, రైతుల తక్షణ కర్తవ్యం కావాలి. రైతుకు పశువుల్లేకుండా ఇది అసాధ్యం. పట్టణాలు, నగరాల చెత్తతో వర్మీకంపోస్టు తయారుచేసి ప్రభుత్వం రైతులకివ్వాలి. ‘వృక్షాయుర్వేదం’ నుంచి మన రైతులు నేర్చుకోదగినవేమిటి? ‘కునప జలం’ అనే సేంద్రియ ద్రవ ఎరువును మన పూర్వీకులు వెయ్యేళ్ల క్రితమే వాడారు. జంతువుల పేడ, మాంసం, చేపల మాంసం, మినుములు, నువ్వుల చెక్క, తేనె, నెయ్యితో కునప జలం తయారు చేసేవారు. నీటిలో ఉడకబెట్టి, తర్వాత మురగబెట్టేవారు. దీన్ని నీటితో కలిపి పంటలపై పిచికారీ చేసి, పాదుల్లో పోసి ఫలసాయం పొందేవారు. ఇప్పటికీ కొందరు రైతులు ఇలా చేస్తున్నారు. కోళ్ల మాంసం వ్యర్థాలు, రొయ్యల తలల వంటి వ్యర్థాలను నీటిలో మూడు నెలలు మురగబెడితే.. దుర్వాసన పోయి చక్కని కునప జలం తయారవుతుంది. పావు కేజీ వేప ఆకులు, లీటరు ఆవు లేక బర్రె మూత్రం కలిపి మరిగించిన ద్రావణానికి పది రెట్లు నీరు కలిపి పంటలపై చల్లితే పురుగులు నశిస్తాయి. పంచ గవ్య గురించి గరుడ పురాణం, వరాహ పురాణం చెబుతున్నాయి. కొద్ది మంది రైతులు వీటిని అనుసరిస్తున్నా ఏ శాస్త్ర వేత్తా పట్టించుకోవడం లేదు. విదేశీ శాస్త్రవేత్తలు వీటిని అనుసరిస్తే.. మన శాస్త్రవేత్తలు అలవాటు ప్రకారం తీరికగా వారిని అనుసరిస్తారు. అందు వల్లే.. తమకు ఎటువంటి సాగు పద్ధతి నప్పుతుందో, ఏ సాంకేతికత అవసరమో నిర్ణయించు కోవాల్సింది అంతిమంగా రైతులే. ఏసీగదుల్లో కూర్చునే వాళ్లు మాత్రం కాదు! మొదట రైతులు అనుసరించిన సాగు పద్ధతులనే ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆనక తీరిగ్గా ఆమోదిస్తాయి. సంప్రదాయ విజ్ఞానం దన్నుతో రైతు నిలబడగలడా? నిక్షేపంగా! చిన్న రైతైనా జత ఎద్దుల్ని, ఆవును సమకూర్చుకోవాలి. కనీసం దూడలనైనా కొని పెంచుకోవాలి. భూమిని తిరిగి సారవంతం చేసుకోవడం మీద ఎంత ఎక్కువ దృష్టి పెడితే సాగులో అంత తొందరగా సుస్థిరత లభిస్తుంది. ప్రభుత్వం రసాయనిక ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం మానేసి ఇటువంటి వాటికి సబ్సిడీ ఇవ్వాలి. (ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్‌ను ఫోన్: 040-27755774 లేదా asianagrihistory94@gmail.com ద్వారా గానీ సంప్రదించవచ్చు) - పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్ ఫొటోలు: వెంకట్ పులిపాటి దిగుబడిని పెంచే కునప జలం! కునప జలాన్ని ఇలా కూడా తయారు చేయొచ్చు: మాంసం కిలో, మంచి నీరు 5 లీటర్లు, పావు కేజీ చొప్పున పచ్చిమినప్పప్పు పిండి, నువ్వులు, నల్లబెల్లం, లీటరు ఆవు పాలు, 50 గ్రాముల ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. తయారు చేసే విధానం: మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్లీ మరగించాలి. పొంగు వచ్చిన తరువాత మినపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ కాయాలి. పొంగు రాగానే పాత్రను దించి, చల్లార్చి మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసెన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంటలో పాతిపెట్టాలి. 11వ రోజున బయటకు తీసి, ద్రావణాన్ని వడపోయాలి. ఈ ద్రావణాన్ని వేరొక కుండలో పోసి, దానికి నెయ్యి లేక నూనె కలిపి, పాత్రపై మూకుడు ఉంచి, ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి, గట్టిగా తాడుతో కట్టి పది రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. తయారైన 3 లీటర్ల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పైరు మీదైనా పిచికారీ చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారీ చేయొచ్చు. ఇది ప్రభావశీలమైన ఔషధం. దిగుబడి 20% పెంచుతుంది. - సామినేని హిమవంతరావు, రైతు (98665 63556) -
సబ్సిడీ వద్దన్న బీహార్ రైతులు: కలాం
అనంతపురం: రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరముందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించాలని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో ‘జన్మభూమి- మాఊరు’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించారు. దేశంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని, సాగుబడిలో 16 శాతం మాత్రమే ఆదాయం వస్తోందని అబ్దుల్ కలాం తెలిపారు. సమస్యను గుర్తించి పరిష్కరించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్ అందిస్తే తమకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని బీహార్ రైతులు తనతో చెప్పారని వెల్లడించారు. తక్కుత నీటితో అధిక దిగుబడి సాధించే విత్తనాలు తయారుచేయాలని సూచించారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయడం ద్వారా నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. -
అలంకారప్రాయమే..
నిరుపయోగంగా భూసార పరీక్ష కేంద్రాల రైతులకు అందుబాటులో లేని అధికారులు పరీక్షలపై కొరవడిన ప్రచారం పాత పద్ధతుల్లోనే సాగు చేస్తున్న అన్నదాతలు ఖమ్మం :అధునాతన వ్యవసాయ పద్ధతులు, హరిత విప్లవ ఫలితాలను అందించి రైతులను రాజుగా చూడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంతో పాటు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ కేంద్రాలు నెలకొల్పారు. ఇందులో ఒక ఏడీ స్థాయి అధికారి, నలుగురు ఇతర అధికారులు, సిబ్బంది ఉండాలి. అయితే ప్రస్తుతం ఖమ్మం మినహా ఏ కేంద్రంలోనూ సరిపడా ఉద్యోగులను నియమించడం లేదు. వీటి ద్వారా ప్రతి సంవత్సరం ఖమ్మం వంటి పెద్ద కేంద్రంలో ఆరువేల మట్టి నమూనాలు, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం కేంద్రాలలో రెండువేల చొప్పున సేకరించి పరీక్షలు నిర్వహించి ఆ వివరాలును రైతులకు చేరవేయాలి. కానీ భద్రాచలంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని ఇంతవరకూ తెరిచిన పాపాన పోలేదు. ఇక ఖమ్మంలో ఇప్పటి వరకు కేవలం రెండువేల నమూనాలు, కొత్తగూడెం, సత్తుపల్లిలో వెయ్యి మేరకు మాత్రమే పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు లెక్కలే చెపుతున్నాయి. జిల్లాలో మొత్తం సుమారు ఆరు లక్షల మంది రైతులు 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఇలా జాప్యం జరిగితే రానున్న 20 సంవత్సరాల్లో కూడా జిల్లాలో ఉన్న భూమి మొత్తాన్ని పరీక్షించలేరని స్పష్టం అవుతోంది. ఇక పరీక్షలు నిర్వహించిన భూముల్లోనూ ఆ వివరాలను ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారి ద్వారా రైతులకు చేరవేసి, ఆ భూమికి అనుకూలంగా పంటలు సాగుచేసేలా సూచనలు ఇవ్వాలి. కాగా, ఇటీవల కొత్త విధానం పేరుతో రైతుల సెల్‌ఫోన్ నంబర్లు సేకరించి మెసేజ్ ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు చెపుతున్నారు. అయితే ఆ మెసేజ్ వివరాలు అర్థం కాక, చేసేదేమీలే పాత పద్ధతిలోనే వ్యవసాయం చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగానే పరీక్షలు.. భూమిలో ఉన్న పోషక విలువలు ఏమిటి..? ఏ పోషకాలు అధికంగా ఉన్న నేలల్లో ఏ పంటలు వే యాలి. ఏవి సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుంది.. అనే వివరాలను భూసార పరీక్షల ద్వారా అధికారులు రైతులకు తెలియజేయాలి. దీనికి ముందు రైతులకు దీనిపై అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో అత్యధిక మంది రైతులకు భూసార పరీక్షలు నిర్వహిస్తారనే విషయమే తెలియక పోవడం శోచనీయం. ఇక కొంతమేర అవగాహన ఉన్న రైతులు మట్టి నమూనాలు ఇచ్చినా.. పరీక్షలు చేసే నాథుడే లేడు. కొన్ని కేంద్రాల్లో అధికారులు ఉన్నా.. అవసరమైన పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇదంతా తెలిసినా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొరవడిన ప్రచారం... భూసారం తెలుసుకుని వ్యవసాయం చేస్తే లాభదాయకమనే ప్రచారం చేయడంలో జిల్లా వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో నల్లరేగడి, ఎర్రచెక్క, చౌడు, ఇసుక నేలలు ఉన్నాయి. ఈ నేలల్లో కొన్నింటిలో భాస్వరం, పొటాష్ విలువలు, మరి కొన్నింటిలో నత్రజని అధికంగా ఉన్నాయి. అయితే ఏ నేలల్లో ఏ పంటలు వేయాలో అధికారులు రైతులకు వివరించాలి. ఇందుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ఆదర్శ రైతులను నియమించి వారికి భూసార పరీక్ష కిట్లను అందజేశారు. అయితే ఆయన మరణానంతరం రైతులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రైతు చైతన్య సదస్సులు, పొలంబడి, ఇతర కార్యక్రమాలు నిర్వహించడంలో అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు చేసేదేమీ లేక పురాతన వ్యవసాయ పద్ధతులనే పాటిస్తూ.. దేవుడిపై భారం వేసి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి రైతు భూమిని పరీక్షించి ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుంది.. తమ చేలల్లో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి.. వాటిని అధిగమించేందుకు ఏం చేయాలి అనే విషయాలపై అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
భారతదేశం లో హరిత విప్లవం ప్రారంభమైంది?
SBI Pos Special 1. Which of the following countries/ organizations banned the import of Alphonso mangoes from India after authorities found consignments infested with fruit flies? (The ban came into force from May 1, 2014) 1) Australia 2) USA 3) New Zealand 4) ASEAN 5) European Union 2. Thomas Cup and Uber Cup badminton tournaments will be held from May 18-25, 2014 in? 1) Mumbai 2) New Delhi 3) Pune 4) Bangalore 5) Hyderabad 3. As per a report published by Freedom House, an NGO, on May 1, 2014 what is India's rank in press freedom? 1) 57 2) 67 3) 78 4) 76 5) 68 4. Who became the new Chief Executive Officer of Nokia on May 1, 2014? 1) Rakesh Kapur 2) Shantanu Narayan 3) Anshu Jain 4) Rajeev Suri 5) Sunil Kaushal 5. Ashok Vemuri, an Indian-American business executive is the current Chief Executive Officer of? (He joined this company in September last year) 1) Infosys 2) Wipro 3) Cognizant Technology Solutions 4) Tata Consultancy Services 5) iGATE Corporation 6. Which of the following Bollywood actors has been conferred with the 'Pride of the Nation' award for his role in Madras Cafe? 1) Salman Khan 2) Ajay Devgan 3) Farhan Akhtar 4) John Abraham 5) Aamir Khan 7. Which of the following is the capital city of Ukraine? 1) Ashgabat 2) Dushanbe 3) Vaduz 4) Crimea 5) Kiev 8. Green Revolution in India began in the? 1) 1960s 2) 1970s 3) 1980s 4) 1990s 5) 1950s 9. Thomas Bach is the President of the International Olympic Com- mittee (IOC). He belongs to? 1) Belgium 2) Spain 3) Germany 4) Switzerland 5) Netherlands 10. Who was appointed as the Chairman of the Intellectual Property Appellate Board (IPAB) in 2013? 1) Justice K. N. Basha 2) Justice P.C. Pant 3) Justice T. Nandakumar Singh 4) Justice Swatantar Kumar 5) None of these 11. Intellectual Property Appellate Board has its headquarters at? 1) Mumbai 2) New Delhi 3) Kolkata 4) Chennai 5) Ahmadabad 12. Which one of the following world leaders never won the Indira Gandhi Prize for Peace, Disarmament and Development? 1) Sheikh Hasina 2) Luiz Inacio Lula da Silva 3) Ellen Johnson Sirleaf 4) Angela Merkel 5) Dilma Roussef 13. Malala Yousafzai was given the International Children's Peace Prize 2013. The prize is an initiative of the Kids Rights Fou- ndation, an organization based in? 1) New York, USA 2) London, UK 3) Stockholm, Sweden 4) Amsterdam, Netherlands 5) Oslo, Norway 14. Identify the mismatched pair? PLAYER SPORT 1) Chekrovolu Swuro Archery 2) Gagan Jeet Bhullar Golf 3) Neha Rathi Wrestling 4) Dharmender Dalal Wrestling 5) Mouma Das Shooting 15. Shaheen 2 is the name of the joint exercise between the air forces of Pakistan and? 1) USA 2) China 3) Iran 4) Afghanistan 5) None of these 16. The second ADMM (ASEAN Defense Ministers' Meeting) Plus was held in 2013 in? 1) India 2) Malaysia 3) Brunei 4) Indonesia 5) Philippines 17. Which city will host the 9th G20 Summit in November 2014? 1) Istanbul 2) London 3) Seoul 4) Brisbane 5) New Delhi 18. RIKEN is the largest research institute in? 1) China 2) Russia 3) Sweden 4) Norway 5) Japan 19. The Central Bank of Japan is? 1) The Senshu Bank 2) The Master Trust Bank of Japan 3) Mizuho Bank 4) Fuji Bank 5) Bank of Japan 20. The Social Security Agreement between India and which of the following countries will benefit 40 thousand persons of Indian origin in Quebec province? 1) Canada 2) Luxembourg 3) Netherlands 4) Malaysia 5) Belgium 21. Ahimsa Messenger program, an initiative to curb violence against women, was launched on August 31, 2013 in? 1) Kolkata 2) New Delhi 3) Mumbai 4) Rae Bareli 5) Amethi 22. Ahimsa Messenger program is implemented through? 1) Anganwadi centres 2) Panchayati Raj Institutions 3) Sabla Girls 4) Both 1and 2 5) All 1, 2 and 3 23. Ahimsa Messenger is an initiative of the Union Ministry of? 1) Home Affairs 2) Health and Family Welfare 3) Social Justice and Empowerment 4) Information and Broadcasting 5) None of these 24. Bio360 is the first Life Sciences Park in which of the following states? 1) Kerala 2) Tamil Nadu 3) Andhra Pradesh 4) Gujarat 5) Karnataka 25. An expert committee appointed to examine the current monetary policy framework of the Reserve Bank of India was headed by? 1) Anand Sinha 2) Bimal Jalan 3) Usha Thorat 4) Urjit Patel 5) Arvind Maaram 26. Federal Bank has launched the electronic version of conventional passbook called FedBook. Federal Bank is a? 1) Regional Rural Bank 2) Public Sector bank 3) Nationalized Bank 4) New Generation Private Bank 5) Old Private Bank 27. The Central Government has set up the National Institute of Solar Energy (NISE) in? 1) Kangra 2) Kathua 3) Gurgaon 4) Leh 5) Udhampur 28. Which of the following games will be added in the 2016 Olympic Games in Rio de Janeiro, Brazil? 1) Rugby Sevens 2) Golf 3) Squash 4) Both 1 and 2 5) All 1, 2 and 3 29. Tokyo will host the 2020 Summer Olympic Games. It had previously hosted the Games in? 1) 1952 2) 1956 3) 1968 4) 1960 5) 1964 30. The government has set up a panel to assess the status of Scheduled Tribes (STs) with an aim of ensuring their uplift, particularly in socio-economic, health and education fields. The committee is headed by? 1) Virginius Xaxa 2) Aruna Roy 3) Narendra Jadhav 4) Ashis Mondal 5) Pramod Tandon 31. Which is the only state in India that has increased its forest cover in the past two decades? 1) Assam 2) Sikkim 3) Manipur 4) Meghalaya 5) Tripura 32. Pakyong Airport is under construction in? 1) West Bengal 2) Sikkim 3) Assam 4) Meghalaya 5) Tripura 33. The Ambassador of Conscience Award is the most prestigious human rights award given by the? 1) European Parliament 2) Amnesty International 3) Red Cross 4) United Nations Organization 5) UN High Commissioner for Human Rights 34. Who was/ were presented the Ambassador of Conscience Award for 2013? 1) Malala Yousafzai 2) Harry Belafonte 3) Peter Gabriel 4) Both 1 and 2 5) All 1, 2 and 3 35. Which of the following Indian-Americans is the current Dean of Harvard Business School? 1) Vijay P. Singh 2) Kapil Parakh 3) Nitin Nohria 4) Adam Habib 5) None of these 36. Who has been reappointed as the Chairman and Chief Executive Officer of the Jammu and Kashmir Bank for a three-year period? 1) Mushtaq Ahmad 2) Parvez Ahmad 3) Abdul Hamid Banday 4) Meera Jamwal 5) Surjeet Singh 37. A Street in Winnipeg has been named after Mahatma Gandhi. Winnipeg is a city in? 1) Russia 2) UK 3) Canada 4) South Africa 5) Germany 38. Which country will host the 2015 edition of the SAFF (South Asian Football Federation) championship? 1) Nepal 2) Maldives 3) Afghanistan 4) India 5) Bangladesh KEY 1) 5 2) 2 3) 3 4) 4 5) 5 6) 4 7) 5 8) 1 9) 3 10) 1 11) 4 12) 5 13) 4 14) 5 15) 2 16) 3 17) 4 18) 5 19) 5 20) 1 21) 2 22) 5 23) 5 24) 1 25) 4 26) 5 27) 3 28) 4 29) 5 30) 1 31) 2 32) 2 33) 2 34) 4 35) 3 36) 1 37) 3 38) 4 -
పర్యావరణ స్ఫూర్తి ప్రదాతలకు ‘గ్రీన్ అవార్డులు’
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు కృషిచేసిన ఇద్దరిని గ్రీన్ అవార్డులు -2013తో సత్కరించాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్), తూర్పు కనుమల పర్యావరణ పరిరక్షణ వేదిక (గ్రేస్) సంయుక్తంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డిని జీవన సాఫల్య పురస్కారానికి, రిటైర్డు అటవీ అధికారి డాక్టర్ తులసీరావును గ్రీన్ లీడర్ పురస్కారానికి ఎంపిక చేశాయి. మూడు దశాబ్దాలపాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తోన్న ప్రొ. పురుషోత్తంరెడ్డిని 2013 సంవత్సరం జీవన సాఫల్య పురస్కారానికి, రెండు దశాబ్దాలుగా తూర్పు కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా స్ఫూర్తివంతంగా పనిచేస్తున్నందున డాక్టర్ తులసీరావును గ్రీన్ లీడర్ అవార్డు -2013కు ఎంపిక చేశామని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్పర్సన్ నీలా లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం జూబ్లీహాలులో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి అవార్డులు ప్రదానం చేస్తారని నీలా లక్ష్మారెడ్డి, గ్రేస్ చైర్మన్ ఆర్.దిలీప్‌రెడ్డి మీడియాకు తెలిపారు.