న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ గతేడాది ప్రారంభించిన ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన’ కార్యక్రమాన్ని 2020 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 33,269 కోట్ల నిధులను తన వాటాగా కేంద్రం కేటాయించనుంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత కూడా.. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు. 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేర్చడం వల్ల వాటి పర్యవేక్షణ సులభమైందన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం), మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్), నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (ఎన్‌ఎంఎస్‌ఏ), సబ్–మిషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ (ఎస్‌ఎంఏఈ) తదితర వ్యవసాయ రంగానికి చెందిన 11 పథకాలను కేంద్రం గతేడాది ఒకే గొడుగు కిందకు తెచ్చి హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం విదితమే.
పెట్టుబడి పరిమితి రెండింతలు
వృద్ధుల పింఛను కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన్ యోజన (పీఎంవీవీవై) పథకంలో పెట్టుబడి పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గురువారమే (మే 3) చివరి తేదీగా ఉండగా, ఆ గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది. 60 లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో ఇప్పటివరకు వృద్ధులు గరిష్టంగా రూ. 7.5 లక్షలను మాత్రమే పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉండగా, తాజా నిర్ణయంతో ఆ పరిమితి రూ.15 లక్షలకు పెరిగింది. పీఎంవీవీవైలో పెట్టుబడి పెట్టిన వృద్ధులకు వారి పెట్టుబడిపై ఏడాదికి 8 శాతం రాబడి పదేళ్లపాటు వస్తుంది. ఆ మొత్తాన్ని ప్రతినెలా లేదా మూడు లేదా ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి వృద్ధులు తీసుకునే వెసులుబాటు ఉంది. పరిమితి పెంచడంతో ఇప్పుడు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టిన వృద్ధులు నెలకు రూ.10 వేల పింఛనును పదేళ్లపాటు పొందొచ్చని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.1,540 కోట్లను (మొత్తం బకాయిల్లో 10%) రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలని నిర్ణయించారు.
► చెన్నై, లక్నో, గువాహటి నగరాల్లోని విమా నాశ్రయాల్లో రూ.5,082 కోట్ల వ్యయంతో కొత్త టర్మినళ్ల నిర్మాణానికి అంగీకారం.
► ఖనిజ రంగంలో సంస్కరణలకోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)ను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం.
► ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజనని 2019–20 వరకు కొనసాగించాలని నిర్ణయం.
ఎంఎస్‌డీపీ ఇక పీఎంజీవీకే
బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్‌డీపీ–మల్టీ సెక్టోరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) పేరు మార్చి, పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంఎస్‌డీపీకి ‘ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమ్’ (పీఎంజేవీకే) అనే కొత్త పేరు ను ఖరారు చేసింది. మైనారిటీలకు మ రింత మెరుగైన సామాజిక–ఆర్థిక మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఈ పథకం పరిధిని విస్తరించేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment