Krishi Vikas Yojana
-
2020 వరకు ‘కృషి ఉన్నతి’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ గతేడాది ప్రారంభించిన ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన’ కార్యక్రమాన్ని 2020 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 33,269 కోట్ల నిధులను తన వాటాగా కేంద్రం కేటాయించనుంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత కూడా.. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు. 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేర్చడం వల్ల వాటి పర్యవేక్షణ సులభమైందన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం), మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్), నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (ఎన్ఎంఎస్ఏ), సబ్–మిషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ (ఎస్ఎంఏఈ) తదితర వ్యవసాయ రంగానికి చెందిన 11 పథకాలను కేంద్రం గతేడాది ఒకే గొడుగు కిందకు తెచ్చి హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం విదితమే. పెట్టుబడి పరిమితి రెండింతలు వృద్ధుల పింఛను కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన్ యోజన (పీఎంవీవీవై) పథకంలో పెట్టుబడి పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గురువారమే (మే 3) చివరి తేదీగా ఉండగా, ఆ గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది. 60 లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో ఇప్పటివరకు వృద్ధులు గరిష్టంగా రూ. 7.5 లక్షలను మాత్రమే పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉండగా, తాజా నిర్ణయంతో ఆ పరిమితి రూ.15 లక్షలకు పెరిగింది. పీఎంవీవీవైలో పెట్టుబడి పెట్టిన వృద్ధులకు వారి పెట్టుబడిపై ఏడాదికి 8 శాతం రాబడి పదేళ్లపాటు వస్తుంది. ఆ మొత్తాన్ని ప్రతినెలా లేదా మూడు లేదా ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి వృద్ధులు తీసుకునే వెసులుబాటు ఉంది. పరిమితి పెంచడంతో ఇప్పుడు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టిన వృద్ధులు నెలకు రూ.10 వేల పింఛనును పదేళ్లపాటు పొందొచ్చని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.1,540 కోట్లను (మొత్తం బకాయిల్లో 10%) రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలని నిర్ణయించారు. ► చెన్నై, లక్నో, గువాహటి నగరాల్లోని విమా నాశ్రయాల్లో రూ.5,082 కోట్ల వ్యయంతో కొత్త టర్మినళ్ల నిర్మాణానికి అంగీకారం. ► ఖనిజ రంగంలో సంస్కరణలకోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)ను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం. ► ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజనని 2019–20 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఎంఎస్‌డీపీ ఇక పీఎంజీవీకే బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్‌డీపీ–మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పేరు మార్చి, పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంఎస్డీపీకి ‘ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమ్’ (పీఎంజేవీకే) అనే కొత్త పేరు ను ఖరారు చేసింది. మైనారిటీలకు మ రింత మెరుగైన సామాజిక–ఆర్థిక మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఈ పథకం పరిధిని విస్తరించేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. -
సాగులో సమూల మార్పులు
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యవసాయం కేంద్రం యోచన...రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ నోట్ సాక్షి, హైదరాబాద్: సాగులో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్రం నడుంబిగించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా పలు చర్యలు చేపడుతోంది. ఈ రంగం వైపు యువతను ఆకర్షిం చేవిధంగా మార్పులు తీసుకురావాలని ప్రయత్ని స్తోంది. ప్రధానంగా వ్యవసాయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) పథకం లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్కేవీవై పేరు ను ప్రధాన మంత్రి రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన గా మార్పు చేయాలని భావిస్తోంది. అనేక కీలక మార్పులు చేసే ఈ పథకంపై రాష్ట్రాల అభిప్రా యాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం కాన్సెప్ట్ నోట్‌ను రాష్ట్రాలకు పంపించింది. యువతను ఆకర్షించేలా...: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతోపాటు యువతను ఆకర్షించే లక్ష్యంతో ఆర్కేవీవైని అధికారులు తీర్చిది ద్దనున్నారు. దీన్ని 14వ ఫైనాన్స్ కమిషన్ హయాం లోనే అమలు చేయనున్నారు. కొత్త పద్దతుల్లో వ్యవసాయం చేసేందుకు యువతను, రైతులను, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో)కు చేయూతని వ్వాలని భావిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు అవసర మైన నిధుల సమీకరణకు పీపీపీని అనుసరించాలని యోచిస్తు న్నారు. వచ్చే మూడేళ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం తయారు చేసింది. నష్టాలు చవిచూసే పంటలను కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కలిగించే పంటలపై దృష్టి సారిస్తారు. 50% నిధులు మౌలిక సదుపాయాల కోసమే... ఆర్కేవీవై నిధుల ఖర్చుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఆహారధాన్యాలు, ఇతర పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే మౌలిక సదుపా యాలకు 20% కేటాయిస్తారు. విత్తనం, భూసా రం, పురుగుమందులు, ఎరువుల నాణ్యత పరీక్షల లేబోరేటరీల ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగిస్తారు. పంట చేతికి వచ్చాక మార్కె టింగ్ మౌలిక సదుపాయాలకు 30, ప్రత్యేక పథకాల కోసం 20, వ్యవసాయ ఔత్సాహిక వేత్తలు, నైపుణ్య అభివృద్ధికి 8, అగ్రి బిజినెస్ ద్వారా అదనపు ఆదాయం కోసం 20%, పరి పాలనా ఖర్చులకు 2% చొప్పున కేటాయిస్తారు. వీటన్నింటిలో 25 నుంచి 30% నిధులను పశుసంవర్థకశాఖకు కేటాయిస్తారు. -
స్వాహాపై లోకాయుక్తకు...
చీపురుపల్లి: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా మండలంలో బొప్పాయి సాగుకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహక నిధుల్లో చోటు చేసుకున్న భారీ కుంభకోణంపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, విచారణ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బెల్లాన రవి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులను రక్షించి, అర్హులకు అందజేయాల్సిన తెలుగుదేశం నాయకులే స్వాహాకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. బొప్పాయి సాగు ప్రోత్సాహకాల్లో రూ.కోటి వరకు స్వాహా జరిగిందని, దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిధులు పక్కదారి పడుతున్న విషయాన్ని ముందుగానే ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లినప్పటికీ కనీసం పట్టించుకోలేదన్నారు. పైగా ఏడీ ప్రసాద్ ఈ విషయం తన దృష్టికి రాలేదని పత్రికలకు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. బొప్పాయి సాగు చేసుకునే అర్హులైన రైతులకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో ఉద్యానవనశాఖ అధికారులు భూములు లేని వారికి, బొప్పాయి మొక్కలు నాటని వారికి, గ్రామాల్లో లేని వ్యక్తులకు ప్రోత్సాహక నిధులు జమ చేయడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీని వెనుక తెలుగుదేశం నాయకులు హస్తం ఉందని ఆరోపించారు. రాబోయే గ్రీవెన్స్ సెల్‌కు అర్హులైన రైతులతో వెళ్లి కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లనున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, కరిమజ్జి శ్రీనివాసరావు, మీసాల రమణ, కంది పాపినాయుడు, అధికార్ల శ్రీనుబాబు, కోరాడ సిమ్మినాయుడు, రేవల్ల సత్తిబాబు, కర్రోతి శరత్, కరణం ఆది తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంలో ఫిర్యాదు ఇదిలా ఉండగా ప్రోత్సాహకాల్లో జరుగుతున్న అక్రమాలపై చాలా రోజుల క్రితమే ఉద్యానవనశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పి.కె.పాలవలస గ్రామానికి చెందిన రెల్లి వెంకటేశ్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బొప్పాయి సాగుకు ఉద్యానవనశాఖ అధికారులు ఇస్తున్న నిధులు పక్కదోవ పడుతున్నాయని ఆ శాఖ ఏడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. భూములు లేని రైతులకు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. దీంతో ఏయే రైతులకు, ఎంతమంది రైతులకు బొప్పాయి ప్రోత్సాహక నిధులు ఇస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని మార్చి 31న సమాచార హక్కు చట్టంద్వారా సమాచారం కోరినట్లు ఆయన తెలిపారు. 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు వివరాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గ్రామంలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయిటపడతాయని చెప్పారు.