చీపురుపల్లి: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా మండలంలో బొప్పాయి సాగుకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహక నిధుల్లో చోటు చేసుకున్న భారీ కుంభకోణంపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, విచారణ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బెల్లాన రవి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులను రక్షించి, అర్హులకు అందజేయాల్సిన తెలుగుదేశం నాయకులే స్వాహాకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు.
బొప్పాయి సాగు ప్రోత్సాహకాల్లో రూ.కోటి వరకు స్వాహా జరిగిందని, దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిధులు పక్కదారి పడుతున్న విషయాన్ని ముందుగానే ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లినప్పటికీ కనీసం పట్టించుకోలేదన్నారు. పైగా ఏడీ ప్రసాద్ ఈ విషయం తన దృష్టికి రాలేదని పత్రికలకు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
బొప్పాయి సాగు చేసుకునే అర్హులైన రైతులకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో ఉద్యానవనశాఖ అధికారులు భూములు లేని వారికి, బొప్పాయి మొక్కలు నాటని వారికి, గ్రామాల్లో లేని వ్యక్తులకు ప్రోత్సాహక నిధులు జమ చేయడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీని వెనుక తెలుగుదేశం నాయకులు హస్తం ఉందని ఆరోపించారు.
రాబోయే గ్రీవెన్స్ సెల్‌కు అర్హులైన రైతులతో వెళ్లి కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లనున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, కరిమజ్జి శ్రీనివాసరావు, మీసాల రమణ, కంది పాపినాయుడు, అధికార్ల శ్రీనుబాబు, కోరాడ సిమ్మినాయుడు, రేవల్ల సత్తిబాబు, కర్రోతి శరత్, కరణం ఆది తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టంలో ఫిర్యాదు
ఇదిలా ఉండగా ప్రోత్సాహకాల్లో జరుగుతున్న అక్రమాలపై చాలా రోజుల క్రితమే ఉద్యానవనశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పి.కె.పాలవలస గ్రామానికి చెందిన రెల్లి వెంకటేశ్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బొప్పాయి సాగుకు ఉద్యానవనశాఖ అధికారులు ఇస్తున్న నిధులు పక్కదోవ పడుతున్నాయని ఆ శాఖ ఏడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
భూములు లేని రైతులకు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. దీంతో ఏయే రైతులకు, ఎంతమంది రైతులకు బొప్పాయి ప్రోత్సాహక నిధులు ఇస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని మార్చి 31న సమాచార హక్కు చట్టంద్వారా సమాచారం కోరినట్లు ఆయన తెలిపారు. 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు వివరాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గ్రామంలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయిటపడతాయని చెప్పారు.
స్వాహాపై లోకాయుక్తకు...
Published Wed, Apr 20 2016 1:39 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement