హరిత విప్లవం
భారతదేశం తన 48 కోట్ల జనాభా కోసం 1966–67లో 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంది. ఆ నేపథ్యం నుంచి వ్యవసాయ మంత్రి సి. సుబ్రహ్మణ్యం హరిత విప్లవ రూపశిల్పిగా అవతరించారు. మేలురకం వంగడాలు, రెండు పంటలు, బ్యాంకుల జాతీయకరణ వంటి వాటి పుణ్యమా అని రుణాలు తేలిగ్గా అందుబాటులోకి రావడంతో ఒక దశాబ్దంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 70 శాతం పెరుగుదల కనిపించింది.
నాగార్జున సాగర్ ప్రారంభం
సుమారు 55 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తూ దేశ ప్రథమ ప్రధాని దీనిని ‘ఆధునిక దేవాలయం’గా అభివర్ణించారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ మట్టి ఆనకట్ట ఎత్తు 124 మీటర్లు. మొదట నందికొండ పేరుతో రూపకల్పన చేసిన ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ప్రాంతీయ పక్షపాతాలతో మార్పులు చేశారన్న ఆరోపణలు వచ్చినా క్రమంగా అవి సద్దుమణిగాయి. నల్గొండ–గుంటూరు సరిహద్దులో కొండల మధ్య 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మాణమైన సాగర్ ఎడమ కాల్వ వల్ల నల్గొండ, కృష్ణా జిల్లాల్లోని మెట్ట భూములు; కుడి కాల్వ వల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని బీళ్లు సస్యశ్యామలం అయ్యాయి. ప్రముఖ ఇంజనీరు, నెహ్రూ మంత్రి వర్గంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన డా. కానూరి లక్ష్మణరావు ఈ ప్రాజెక్టు సాకారం అయేందుకు కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment