సాక్షి, అమరావతి: గత పాతికేళ్లలో దేశంలో హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం వృద్ధి చెందిందని నీతిఆయోగ్ పేర్కొంది. దీంతో ప్రపంచ పాల ఉత్పత్తిలో మనదేశం వాటా రెట్టింపు అయ్యిందని తెలిపింది. ఈ మేరకు దేశంలో క్షీర విప్లవంపై నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం విడుదల చేసింది. 1990 మధ్య కాలం వరకు పాల ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది.
అయితే రాబోయే 25 ఏళ్లలో అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాల కంటే దేశంలో రెండు రెట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయని వివరించింది. అంతేకాకుండా దేశంలో డెయిరీ రంగం వృద్ధి వ్యవసాయ రంగం వృద్ధికి దోహదపడుతోందని పేర్కొంది. పేదలకు, మహిళలకు పాల ఉత్పత్తి రంగం అనుకూలంగా ఉందని తెలిపింది.
ఇన్‌పుట్ సబ్సిడీలు లేకుండానే డెయిరీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని వెల్లడించింది. దేశంలో పాడి పరిశ్రమ విజయం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని కొనియాడింది. వ్యవసాయ రంగం మొత్తం ఆదాయంలో నాలుగో వంతు పాలు ద్వారా వచ్చిందేనని వివరించింది.
నాలుగు అంశాలు కారణం..
దేశంలో క్షీర విప్లవం విజయవంతం కావడానికి ప్రధానంగా నాలుగు అంశాలు దోహదపడినట్లు నీతిఆయోగ్ అభిప్రాయపడింది. పాల మార్కెటింగ్ కోసం సహకార సంస్థల ఏర్పాటు, పాల ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, ఆవులతో కృత్రిమ గర్భధారణ, పాల మార్కెటింగ్–వాణిజ్యంపై పరిమితులు, నిబంధనలు లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది.
1950–51లో దేశంలో పాల ఉత్పత్తి సంవత్సరానికి 1.36 శాతం పెరిగింది. 1973–74 వరకు ఇది జనాభా పెరుగుదల రేటు కంటే తక్కువగా ఉంది. దీంతో ఈ కాలంలో తలసరి పాల లభ్యత 15 శాతం పడిపోయింది. దీంతో దేశంలో పాల కొరత పెరగడంతో కొంత వరకు దిగుమతుల ద్వారా పాల పొడి రూపంలో భర్తీ చేసుకున్నారు. 1970లో దేశంలో ఆపరేషన్ ఫ్లడ్‌ను ప్రారంభించడంతో పాల ఉత్పత్తి పురోగతి సాధించింది.
జనాభా పెరుగుదల రేటును అధిగమించి పాల ఉత్పత్తి పెరిగింది. 1973–74లో దేశంలో తలసరి రోజు పాల ఉత్పత్తి 100 గ్రాములుండగా 2020–21 నాటికి ఇది 450 గ్రాములకు పెరిగింది. ఇటీవల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 5.3 శాతంగా ఉంది. 2005 తరువాత పాల ఉత్పత్తి వృద్ధి రేటు వేగవంతమైంది. ఇందులో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి.
246.7 మిలియన్ల పాడి జంతువులు..
గత 50 ఏళ్లలో పాడి జంతువుల జనాభా కూడా బాగా పెరిగింది. దేశంలో 1972లో 122.7 మిలియన్ల పాడి జంతువులుండగా ఇప్పుడు 246.7 మిలియన్లకు పెరిగాయి. 2017–18 తర్వాత నాలుగేళ్లలో పాల ఉత్పత్తులు నాలుగు రెట్లు పెరిగాయి.
అయితే వీటిని విదేశాలకు ఎగుమతులుగా పంపడంలో వెనుకబడి ఉన్నట్లు నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం పేర్కొంది. పాల ఎగుమతి 2021–22లో రెండింతలు మాత్రమే పెరిగిందని.. రూ 4,742 కోట్లకే ఎగుమతులు పరిమితమయ్యాయని వివరించింది. ఇప్పటికీ ఎగుమతులు మొత్తం దేశీయ పాల ఉత్పత్తిలో 0.5 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని బాంబుపేల్చింది.
మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి..
దేశంలో పాల ఉత్పత్తి ఏడాదికి 6 శాతం పెరుగుతుందని నీతిఆయోగ్ అంచనా వేసింది. భవిష్యత్తులో మిగులు పాలను ఎగుమతి చేసేందుకు అవసరమైన మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. భవిష్యత్‌లో దేశాన్ని అతిపెద్ద డెయిరీ ఎగుమతిదారుగా మార్చేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో రోజు వారీ ఆవు, గేదె పాల దిగుబడి చాలా తక్కువగా ఉందని పేర్కొంది.
పాల దిగుబడిని పెంచేందుకు, ఉత్పాదకత పెరుగుదలకు పశు జాతుల అభివృద్ధి, మెరుగైన పెంపకం పద్ధతులు చేపట్టాలని సూచించింది. పంజాబ్, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఇక దేశంలో రోజువారీ పాల దిగుబడి ఆవులకు 5.15 కిలోలు, గేదెలకు 5.9 కిలోలుగా ఉందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment