Milk Revolution
-
హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం
సాక్షి, అమరావతి: గత పాతికేళ్లలో దేశంలో హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం వృద్ధి చెందిందని నీతిఆయోగ్ పేర్కొంది. దీంతో ప్రపంచ పాల ఉత్పత్తిలో మనదేశం వాటా రెట్టింపు అయ్యిందని తెలిపింది. ఈ మేరకు దేశంలో క్షీర విప్లవంపై నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం విడుదల చేసింది. 1990 మధ్య కాలం వరకు పాల ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. అయితే రాబోయే 25 ఏళ్లలో అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాల కంటే దేశంలో రెండు రెట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయని వివరించింది. అంతేకాకుండా దేశంలో డెయిరీ రంగం వృద్ధి వ్యవసాయ రంగం వృద్ధికి దోహదపడుతోందని పేర్కొంది. పేదలకు, మహిళలకు పాల ఉత్పత్తి రంగం అనుకూలంగా ఉందని తెలిపింది. ఇన్పుట్ సబ్సిడీలు లేకుండానే డెయిరీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని వెల్లడించింది. దేశంలో పాడి పరిశ్రమ విజయం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని కొనియాడింది. వ్యవసాయ రంగం మొత్తం ఆదాయంలో నాలుగో వంతు పాలు ద్వారా వచ్చిందేనని వివరించింది. నాలుగు అంశాలు కారణం.. దేశంలో క్షీర విప్లవం విజయవంతం కావడానికి ప్రధానంగా నాలుగు అంశాలు దోహదపడినట్లు నీతిఆయోగ్ అభిప్రాయపడింది. పాల మార్కెటింగ్ కోసం సహకార సంస్థల ఏర్పాటు, పాల ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, ఆవులతో కృత్రిమ గర్భధారణ, పాల మార్కెటింగ్–వాణిజ్యంపై పరిమితులు, నిబంధనలు లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. 1950–51లో దేశంలో పాల ఉత్పత్తి సంవత్సరానికి 1.36 శాతం పెరిగింది. 1973–74 వరకు ఇది జనాభా పెరుగుదల రేటు కంటే తక్కువగా ఉంది. దీంతో ఈ కాలంలో తలసరి పాల లభ్యత 15 శాతం పడిపోయింది. దీంతో దేశంలో పాల కొరత పెరగడంతో కొంత వరకు దిగుమతుల ద్వారా పాల పొడి రూపంలో భర్తీ చేసుకున్నారు. 1970లో దేశంలో ఆపరేషన్ ఫ్లడ్‌ను ప్రారంభించడంతో పాల ఉత్పత్తి పురోగతి సాధించింది. జనాభా పెరుగుదల రేటును అధిగమించి పాల ఉత్పత్తి పెరిగింది. 1973–74లో దేశంలో తలసరి రోజు పాల ఉత్పత్తి 100 గ్రాములుండగా 2020–21 నాటికి ఇది 450 గ్రాములకు పెరిగింది. ఇటీవల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 5.3 శాతంగా ఉంది. 2005 తరువాత పాల ఉత్పత్తి వృద్ధి రేటు వేగవంతమైంది. ఇందులో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. 246.7 మిలియన్ల పాడి జంతువులు.. గత 50 ఏళ్లలో పాడి జంతువుల జనాభా కూడా బాగా పెరిగింది. దేశంలో 1972లో 122.7 మిలియన్ల పాడి జంతువులుండగా ఇప్పుడు 246.7 మిలియన్లకు పెరిగాయి. 2017–18 తర్వాత నాలుగేళ్లలో పాల ఉత్పత్తులు నాలుగు రెట్లు పెరిగాయి. అయితే వీటిని విదేశాలకు ఎగుమతులుగా పంపడంలో వెనుకబడి ఉన్నట్లు నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం పేర్కొంది. పాల ఎగుమతి 2021–22లో రెండింతలు మాత్రమే పెరిగిందని.. రూ 4,742 కోట్లకే ఎగుమతులు పరిమితమయ్యాయని వివరించింది. ఇప్పటికీ ఎగుమతులు మొత్తం దేశీయ పాల ఉత్పత్తిలో 0.5 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని బాంబుపేల్చింది. మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి.. దేశంలో పాల ఉత్పత్తి ఏడాదికి 6 శాతం పెరుగుతుందని నీతిఆయోగ్ అంచనా వేసింది. భవిష్యత్తులో మిగులు పాలను ఎగుమతి చేసేందుకు అవసరమైన మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. భవిష్యత్‌లో దేశాన్ని అతిపెద్ద డెయిరీ ఎగుమతిదారుగా మార్చేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో రోజు వారీ ఆవు, గేదె పాల దిగుబడి చాలా తక్కువగా ఉందని పేర్కొంది. పాల దిగుబడిని పెంచేందుకు, ఉత్పాదకత పెరుగుదలకు పశు జాతుల అభివృద్ధి, మెరుగైన పెంపకం పద్ధతులు చేపట్టాలని సూచించింది. పంజాబ్, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఇక దేశంలో రోజువారీ పాల దిగుబడి ఆవులకు 5.15 కిలోలు, గేదెలకు 5.9 కిలోలుగా ఉందని వెల్లడించింది. -
దేశంలో వైట్ రివల్యూషన్.. రూ. 1.60 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ మార్చితో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12 శాతం పురోగమించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక పేర్కొంది. విలువలో ఇది రూ.1.6 లక్షల కోట్లని విశ్లేషించింది. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) డిమాండ్ రికవరీ కావడం, లిక్విడ్ పాల అమ్మకాలు స్థిరంగా ఉండడం, రిటైల్ ధరలో పెరుగుదల వంటి అంశాలు శ్వేత విప్లవ పురోగతికి కారణమని పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలను పరిశీలిస్తే... - కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పదేళ్ల కనిష్టం.. ఒక శాతం పడిపోయిన భారత వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ ఆదాయాలు 2021–22లో మహమ్మారి ముందస్తు స్థాయికి క్రమంగా పరిశ్రమ కోలుకుంటున్నాయి. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) విభాగం వ్యవస్థీకృత రంగ విక్రయాలలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది. దీనితోపాటు ఈ రంగంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఉన్న లిక్విడ్ పాల విభాగానికి స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (మహమ్మారి ముందు ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా) 5–6 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. - నిర్వహణ లాభదాయకత 2020– 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉంది. వచ్చే రెండు రెండు ఆర్థిక సంవత్సరాలలో 5–5.5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. డెయిరీలు ఈ ఏడాది కేటగిరీల వారీగా రిటైల్ ఉత్పత్తుల ధరలను 3–4 శాతం పెంచడం, అధిక ముడి పాల ధరలు దీనికి కారణం. రవాణా, ప్యాకేజింగ్ వ్యయాలు పెరిగినప్పటికీ నిర్వాహణా లాభాలకు విఘాతం ఏర్పడదు. - మెరుగైన రాబడులు, వృద్ధి, స్థిరమైన నిర్వహణ లాభాలు, పటిష్ట బ్యాలెన్స్ షీట్ల వంటి అంశాలు డెయిరీ పరిశ్రమలకు ’స్థిరమైన’ క్రెడిట్ ఔట్లుక్ హోదా కల్పించే అవకాశం ఉంది. - నెయ్యి, వెన్న, జున్ను, పెరుగు వంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) కోసం డిమాండ్ భారీగా పెరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) పండుగలు, వివాహాల సీజన్, దేశ వ్యాప్తంగా వాణిజ్య సంస్థలు తిరిగి ప్రారంభమవడం వంటి అంశాలు ఈ విభాగాల్లో బలమైన పునరుద్ధరణకు కారణం. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) అమ్మకాల్లో 17 నుంచి 18 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. కరోనా ఆంక్షల అనంతరం హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు (వ్యవస్థీకృత రంగాల విక్రయాలలో 20 శాతం వాటా) తిరిగి తెరుచుకోవడం, పండుగలు, వివాహ వేడుకలు, ఉపాధి కల్పన మెరుగుపడ్డం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. - కోవిడ్–19 రెండవ, మూడవ వేవ్‌ల ప్రభావం డెయిరీ పరిశ్రమపై ఎటువంటి భౌతిక ప్రభావం చూపలేదు. ఆంక్షలు స్థానిక స్థాయికి పరిమితం కావడం, ప్రత్యక్ష ఫుడ్–డెలివరీ సేవలు, తినుబండారాలు పని చేస్తూనే ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. - 57 రేటెడ్ డెయిరీల క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వ్యవస్థీకృత సెగ్మెంట్ ద్వారా వస్తున్న రూ. లక్ష కోట్ల ఆదాయంలో ఈ 57 రేటెడ్ డెయిరీల వాటా దాదాపు 60 శాతం. చదవండి:భారీగా పామాయిల్ సాగు -
పాల ఉత్పత్తిలో దేశాన్ని అగ్ర స్థానంలో..
సాక్షి, ఒంగోలు: దేశంలో క్షీర విప్లవానికి ఆధ్యుడు డాక్టర్ వర్గీస్ కురియన్. పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో నిలబెట్టిన కురియన్ జయంతి నేడు. 1921 నవంబర్ 26న కేరళ రాష్ట్రంలోని కాలికట్లో జన్మించారాయన. దేశ ప్రజలు పౌష్టికాహర లోపంతో బాధపడకుండా కురియన్ చేసిన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. ఆయన జయంతిని ‘జాతీయ పాల దినోత్సవం’గా నిర్వహిస్తూ గౌరవిస్తోంది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లోనూ, అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన ఆయన.. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో ప్రభుత్వ క్రీమరీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్యలో చేరారు. నేషనల్ డెయిరీ డెవలెప్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా పనిచేశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పాల వెల్లువకు శ్రీకారం చుట్టారు. రైతుల్ని శక్తి సంపన్నులుగా చేయాలన్న సంకల్పంతో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ప్రస్తుత అమూల్)ను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పాలను పౌడర్‌గా మార్చే యంత్రాన్ని కురియన్ కనుగొనడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. వర్గీస్ కురియన్‌కు లెక్కకు మించిన అవార్డులు అందుకున్నారు. అందులో రామన్ మెగసెసే అవార్డు(1963), వాట్లర్ పీస్ ప్రైజ్(1986), వరల్డ్ ఫుడ్ ప్రైజ్(1989), పద్మశ్రీ(1965), పద్మభూషణ్(1966), పద్మ విభూషణ్(1999) ముఖ్యమైనవి. 2012 సెప్టెంబర్ 9న 91 ఏళ్ల వయసులో తనువు చాలించారు. ఆసియాలోనే అతిపెద్ద డెయిరీ.. ఆసియాలో రూ.52 వేల కోట్ల అతిపెద్ద టర్నోవర్ కలిగిన డెయిరీగా అమూల్ రికార్డులకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఏజెంట్ లేదా కంపెనీల నుంచి కాకుండా కేవలం రైతుల నుంచి మాత్రమే 250 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయడం, ప్రాసెస్ చేయడం దీని ప్రాముఖ్యత. ఇంత పెద్ద డెయిరీ యజమాని ఏ వృత్తి నిపుణుడో కాదు. పేరున్న వ్యాపారవేత్త అంతకంటే కాదు. గుజరాత్ రాష్ట్రంలోని గ్రామాల్లో నివసించే 3.6 మిలియన్ల మంది రైతులే డెయినీ యజమానులు. ప్రతి రైతు తమ గ్రామ డెయిరీ కో ఆపరేటివ్ సొసైటీలో ఒక లీటరు నుంచి 10 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేయడం ద్వారా అమూల్‌లో సమాన యాజమాన్య వాటా కలిగి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. ఈ పాల విప్లవం 74 ఏళ్ల క్రితం 1946లో గుజరాత్లో చిన్నదైన కైరా అనే జిల్లాలో ప్రారంభమైంది. ఏపీలో అమూల్ తరహా ఎంపీయూఎస్ఎస్లు గుజరాత్లో అమూల్ తరహా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ఎంపీయూఎస్ఎస్) ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆ సంఘం ద్వారా 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకుంటారు. ఈ 11 మంది సభ్యుల నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. గ్రామ స్థాయి కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీ ఏర్పడుతుంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లా కమిటీలు కలిసి రాష్ట్ర కమిటీ ఏర్పాటవుతుంది. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో రైతులను సంపన్నులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ఉపాధిగా అనాధిగా ఉన్న పాడి పరిశ్రమను బలోపేతం చేస్తే రైతు లోగిళ్లు సంతోషంగా ఉంటాయని గట్టిగా నమ్మారాయన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అమూల్ సంస్థను రాష్ట్రంలో పాల సేకరణకు రంగంలోకి దించారు. మొదటి ఫేజ్‌లో కేటాయించిన మూడు జిల్లాల్లో ప్రకాశం జిల్లాను చేర్చి ఈ నెల 20వ తేదీ నుంచి 201 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మక పాల సేకరణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో అమూల్ సంస్థ పాలు సేకరిస్తున్న వైనాన్ని చూస్తున్న ప్రజలు ముఖ్యమంత్రి చర్యలకు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ డెయిరీలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో స్వయంగా ప్రజలు కళ్లారా చూశారు. సొంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి పథంలో నడిపించి ఒంగోలు డెయిరీ లాంటి ప్రభుత్వ డెయిరీలను నష్టాల ఊబిలోకి నెట్టిన పాపం మూటకట్టుకున్నారు. ఆ పరిస్థితి నుంచి డెయిరీ రంగాన్ని బయటపడేసేందుకే ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గురువారం నుంచి అమూల్ పాల సేకరణ కేంద్రాలు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభం కానున్నాయి. -
డెయిరీ సిగలో మరో నగ
కరీంనగర్ డెయిరీ కిరీటంలో మరో కలికితురాయిగా నూతన ప్లాంటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న కరీంనగర్ డెయిరీ, నూతనంగా మూడు లక్షల లీటర్ల సామర్థ్యం గల మెగా ప్లాంట్‌ను స్థాపించనుంది. తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమ ద్వారా రైతుల సేవలో తరిస్తున్న డెయిరీకి మరో అరుదైన అవకాశం దక్కింది. 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న కరీంనగర్ డెయిరీ విస్తరణలో భాగంగా నూతనంగా స్థాపించనున్న ఈ ప్లాంట్‌కు రూ.63 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.10 కోట్ల సబ్సిడీని సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్రిమ్రత్ కౌర్ బాదల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’ కింద మంజూరు చేశారు. కొత్త ప్లాంటు స్థాపనతో నూతనంగా 500 మందికి నేరుగా ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా మరెందరికో ఉపాధి కలగనుంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ డెయిరీ పాడి పరిశ్రమాభివృద్ధి ద్వారా తెలంగాణలో క్షీర విప్లవానికి నాంది పలికింది. కరీంనగర్ డెయిరీలో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఈ డెయిరీ పాల మార్కెటింగ్‌కు దేశవ్యాప్తంగా పేరుంది. రెండు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి నుంచి మూడు లక్షలకు పెంచేందుకు పాలకవర్గం కృషి చేస్తోంది. ప్రభుత్వం లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహకంతోపాటు పాడిపశువుల కొనుగోలుకు పశువుకు రూ.30 వేల సబ్సిడీ పథకం కూడా ప్రకటించి గత సెప్టెంబర్ 24 నుంచి అమలు చేస్తోంది. లీటరుకు రూ.4 ప్రోత్సాహం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది సరాసరి పాలసేకరణ ఆధారంగా రోజుకు 1,47,000 లీటర్లకు లీటరుకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఈ మేరకు రోజుకు రూ.5.88 లక్షలు లబ్ధి కలుగుతుండగా, నెలకు రూ.1,76,40,000 లబ్ధి చేకూరుతోంది. కరీంనగర్ డెయిరీ పరిధిలోని రైతులకు ఈ పథకం ద్వారా రూ.21 కోట్ల 16 లక్షల 80 వేల లబ్ధి వస్తోంది. అదేవిధంగా 70 వేల పాడిరైతులకు పాడిపశువు కొనుగోలుకు ఒక్కో పశువుకు రూ.30 వేల చొప్పున 210 కోట్ల మేర సబ్సిడీ అందించేందుకు కరీంనగర్ డెయిరీ పాలకవర్గం కృషి చేస్తోంది. ఇదే సమయంలో రూ.63 కోట్లతో కరీంనగర్ డెయిరీ నూతనప్లాంటు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. 9 జిల్లాలకు ప్రయోజనం.. 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న డెయిరీ విస్తరణలో భాగంగా నూతనంగా స్థాపించనున్న ఈ ప్లాంట్ ద్వారా తొమ్మిది జిల్లాల రైతులకు ప్రయోజనం కలగనుంది. సుమారు రూ.63 కోట్ల వ్యయం కానున్న ఈ ప్లాంట్ కోసం రూ.10 కోట్లు కేంద్రం సబ్సిడీ అందనుంది. ఈ నూతన ప్లాంటుకు గ్లోబల్ అగ్రి సిస్టమ్ వారు సాంకేతిక సలహాలు అందించేలా ఒప్పందం జరిగింది. నూతన ప్లాంటుతో 15 బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను స్థాపించనున్నారు. వీటి ద్వారా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాల రైతులు ప్రయోజనం పొందనున్నట్లు డెయిరీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్ డెయిరీ చరిత్రలో మరో అధ్యాయం నూతన ప్లాంటు ఏర్పాటు తెలంగాణ రైతాంగానికి, డెయిరీ చరిత్రలో ప్రగతికి మరో ఆధ్యాయం. నూతన ప్లాంటు కు గ్లోబల్ అగ్రి సిస్టమ్ వారు సాంకేతిక సలహాలు అందించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాల రైతులు ప్రయోజనం పొందుతారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కృషి, ప్రయత్నంతో తెలంగాణ రైతాం గానికి, డెయిరీ చరిత్రలో ప్రగతికి మరో ఆధ్యాయం ప్రారంభం అవుతోంది. – చలిమెడ రాజేశ్వర్‌రావు, చైర్మన్, కరీంనగర్ డెయిరీ -
క్షీర భగీరథుడు
మన దిగ్గజాలు - జూన్1 ప్రపంచ పాల దినోత్సవం దేశంలో క్షీరవిప్లవాన్ని తెచ్చిన దార్శనికుడు ఆయన. ఒకప్పుడు పాల కోసం అల్లాడిన భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయన సొంతం. ఆయనే వర్ఘీస్ కురియన్. ‘ఆపరేషన్ ఫ్లడ్’ పేరిట ఆయన చేపట్టిన ఈ భగీరథ ప్రయత్నం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయానుబంధ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ క్షీరవిప్లవమే కురియన్ను ‘మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రజలకు చేరువ చేసింది. దేశంలో పాడి పరిశ్రమ స్వయంసమృద్ధి సాధించిందంటే, అది ఆయన చలవే! అంతేనా, వంటనూనెల ఉత్పత్తిలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి సాధించేలా చేయడంలోనూ గురుతర పాత్ర పోషించారాయన. కేరళ జన్మస్థలం... గుజరాత్ కార్యక్షేత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్‌లోని కాలికట్లో (ప్రస్తుతం ఇది కేరళలో ఉంది. దీనిపేరు కోజికోడ్గా మారింది) 1921 నవంబర్ 26న సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు వర్ఘీస్ కురియన్. కేరళలో పాఠశాల విద్య పూర్తయ్యాక కాలేజీ చదువుల కోసం మద్రాసు చేరుకున్నారు. మద్రాసులోని లయోలా కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ పొందారు. ఆ తర్వాత మద్రాసు వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కొన్నాళ్లు జెమ్షెడ్పూర్లోని టాటా స్టీల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. భారత ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మిషిగాన్ స్టేట్ వర్సిటీ నుంచి 1948లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యార్హతలతో దేశానికి తిరిగి వచ్చిన ఆయనను భారత ప్రభుత్వం గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రారంభించిన ప్రయోగాత్మక పాలకేంద్రం విధులను అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఆనంద్ ఆయన కార్యక్షేత్రంగా మారింది. మధ్యలోనే మానేద్దామనుకున్నారు ప్రభుత్వం పంపగా కురియన్ తొలుత అయిష్టంగానే ఆ పని చేపట్టారు. మధ్యలోనే ఆ ఉద్యోగం మానేసి, వేరే ఏదైనా పని వెదుక్కోవాలని భావించారు. అయితే, కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం వ్యవస్థాపకుడు త్రిభువన్దాస్ పటేల్ నచ్చచెప్పడంతో కురియన్ ఆనంద్‌లోనే ఉండిపోయారు. పటేల్ పాడి రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారందరూ ప్రభుత్వ పాల కేంద్రానికే పాలు సరఫరా చేసేలా చూశారు. అయితే, పాల కేంద్రం కార్యకలాపాల్లో తరచూ అధికారులు జోక్యం చేసుకుంటుండటంతో కురియన్ విసుగెత్తిపోయారు. దీనికి ఏదైనా పరిష్కారం సాధించాలనుకున్నారు. ఈ విషయమై తనకు మార్గదర్శిగా ఉన్న పటేల్‌తో చర్చించారు. అమూల్... అలా మొదలైంది సహకార పద్ధతిలో పాల సేకరణ మంచి ఫలితాలనే ఇస్తున్నా, అధికారుల జోక్యమే అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందని కురియన్, పటేల్ భావించారు. అందుకే స్వయంగానే ఏదైనా చేద్దామని భావించారు. వారి ఆలోచన నుంచి ‘అమూల్’ పుట్టింది. ఆనంద్‌లో ఏర్పాటు చేసిన ‘అమూల్’ ప్లాంట్‌ను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ‘అమూల్’ ద్వారా పాలపొడి, చీజ్, వెన్న ఉత్పత్తులు ప్రారంభమైన కొద్ది సంవత్సరాలలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. సహకార పద్ధతిలో పాలసేకరణ ద్వారా సాధించిన ఈ విజయం అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఆయన కురియన్ను ఆహ్వానించి, దేశానికి పాల కొరత తీర్చాలనే సంకల్పంతో జాతీయ పాడి అభివృద్ధి మండలి (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్) నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. దీంతో దేశంలో క్షీరవిప్లవానికి నాందీప్రస్తావన జరిగింది. ఇక ఆ తర్వాత కురియన్ సాధించిన విజయాలన్నీ చరిత్రను సృష్టించాయి. ఆయన సారథ్యంలోనే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికాను భారత్ అధిగమించగలిగింది. కురియన్ చలవ వల్ల లక్షలాది మంది పాడి రైతులు పేదరికం నుంచి బయటపడి స్వయంసమృద్ధిని సాధించగలిగారు. ఈ విజయాలన్నీ కురియన్‌కు ‘పద్మవిభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘అమూల్’ విజయం స్ఫూర్తితో బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనగల్ రూపొందించిన ‘మంథన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడం మరో విశేషం. - వర్ఘీస్ కురియన్