నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు తోడ్పాటునివ్వండి
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని కోరిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర– 2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని సీఎం చంద్రబాబు కోరారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చిన సుమన్ బేరీతో సీఎం సమావేశమయ్యారు. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు సహకారం అందించాలని, నూతన విధానాల అమలుకు తోడ్పాటునివ్వాలని ఆయన్ని సీఎం కోరారు. ఏపీ ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేలా, తద్వారా అందరూ 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్టు సీఎం చెప్పారు.
నీతి ఆయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్‌గా ఉంటుందని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారముందని, ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కూడా కచ్చితంగా ఉంటుందని సుమన్ బేరీ తెలిపారు.
మానవాభివృద్ధి, ఉత్తమ పాలనలో గ్లోబల్ లీడర్‌గా ఏపీని తీర్చిదిద్దాలని భావిస్తున్నామని సీఎం చెప్పారు. అయితే రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారమవకపోవడం, రాష్ట్ర ఆదాయానికి గ్రోత్ ఇంజిన్ వంటి హైదరాబాద్‌ను కోల్పోవడం, ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం వంటి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఏపీ దేశంలో 3వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉండటం, పోర్టులు, రైల్వే, హైవేలతో అతిపెద్ద కనెక్టవిటీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, తూర్పు ఆగ్నేయాసియాకు గేట్ వే కావడం, పునరుత్పాదకత విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూలాంశాలుగా తెలిపారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్)తో పాటు తిరుపతి, అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్‌లుగా మలిచేందుకు సహకారం అందించాలని సీఎం కోరారు.
డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్టనర్షిప్స్, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ, ఎఫ్‌డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర విషయాల్లోనూ నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషించాలని కోరారు. ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు.
నదుల అనుసంధానం, పీ–4 విధానం ద్వారా పేదరిక నిర్మాలన, 2047 విజన్‌లోని పది ప్రధాన సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 2029 కల్లా 11 వేలకు పైగా విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడం, అన్ని బస్ స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment