వాళ్లేమీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిందిలేదు
కాంగ్రెస్ విభజన చట్టం వల్ల నష్టపోయాం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంవల్ల అమరావతి, పోలవరం నాశనమయ్యాయి
నీతి ఆయోగ్ సమావేశానంతరం జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రమే వచ్చాయని.. తాము అడిగింది కూడా పాత బకాయిలేనని, కొత్తగా కేంద్రం ఇచ్చింది ఏమీలేదని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. విభజన సమయం కంటే గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలవల్ల రాష్ట్రానికి మరింత నష్టం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఆ తర్వాత సాయంత్రం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరా యులతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించిన డిజైన్ల విషయంలో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రమంత్రిని కోరారు. సమావేశానంతరం చంద్రబాబు అక్కడున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
విభజన చట్టంవల్ల నష్టం..: విభజన చట్టాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. వాళ్లు చేసిన ఆ చట్టం ద్వారా పోలవరానికి ఎంతో నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. విభజన చట్టంలో ఏర్పడిన నష్టం నుంచి తేరుకుంటున్న సమయంలో తమ ప్రభుత్వం ఓటమి పాలైందని.. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.
అదేవిధంగా అప్పులు పెరగడం, రాష్ట్రానికి ఆదాయం తగ్గడం, అమరావతిని నాశనం చేయడం, పరిశ్రమలు పారిపోయేలా చేశారని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ పూడ్చలేరని, అందుకే పోలవరం పునర్నిర్మాణానికి పాత బకాయిలను అడుగుతున్నామని, కొత్తగా ఇచ్చిందేమీ లేదనే విషయాన్ని విమర్శించే వాళ్లు గుర్తించాలని చంద్రబాబు కోరారు. విభజన సందర్భంగా అన్యాయం జరిగిన దానిని ఇస్తే తాము నిలదొక్కుకునే అవకాశముందన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసికెళ్లినట్లు చంద్రబాబు చెప్పారు.
నవంబర్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం..: ఇక నవంబరు నెలలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని, అప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడతామని.. ఆ తర్వాత ఎర్త్‌కం రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment