ఆ నివేదికలో ఏముందో తెలియదు: చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ‘నీతి అయోగ్’ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసిందని, కానీ అందులో ఏముందో తనకు తెలియదని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రధానమంత్రి దృష్టి పెడితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయన్నారు. ఏపీకి కేంద్రం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
విభజన చట్టం లో ఇచ్చిన హామీల అమలు కోరుతూ జూన్ 2న రెండోసారి నవ నిర్మాణ దీక్ష చేపడతామన్నారు. ఈ విషయంలో తాను మెతగ్గా లేనని 20-30 సార్లు కేంద్ర మంత్రుల్ని, పలుమార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తులు చేశానన్నారు. అయినా ఎందుకు కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. వారికి ఇదొక్కటే రాష్ట్రం కాదు కదా అని బాబు బదులిచ్చారు. రాజధానిలో అసెంబ్లీ నిర్మాణానికి జపాన్‌కు చెందిన మకీ అసోసియేట్స్ రూపొందించిన డిజైన్‌ను మారుస్తామని చెప్పారు. అనంతరం చంద్రబాబు జర్నలిస్టులకు ప్రమాద బీమా కార్డులను అందించారు.