దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు | Abolition of judicial review | Sakshi
Sakshi News home page

దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు

Published Thu, Oct 24 2024 5:52 AM | Last Updated on Thu, Oct 24 2024 5:52 AM

Abolition of judicial review

ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చట్టం –2019 రద్దుకు మంత్రివర్గం ఆమోదం

టెండర్లలో పారదర్శకతకు పాతర.. ప్రజా భాగస్వామ్యానికి తెర

అంచనాలు అడ్డగోలుగా పెంచినా అడిగే వారుండరు

ఇక నచ్చిన కాంట్రాక్టర్‌కే పనులొచ్చేలా టెండర్లు

కమీషన్లు దండుకోవడానికి మార్గం సుగమం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో ఖజానాను అప్పటి ప్రభుత్వ పెద్దలు దోచేశారు. ప్రజా ధనాన్ని ఇలా దోపిడీ చేయకుండా అడ్డుకట్ట వేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ (జ్యుడిషియల్‌ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను తెచ్చింది. ఈ చట్టం ద్వారా టెండర్లలో పారదర్శకత, సూచనలు చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రవేశ పెట్టింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసింది. 

కానీ, ఇటీవలి ఎన్నికల్లో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమే మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ దోపిడీ పర్వానికి తెర తీస్తూ చంద్రబాబు కూటమి జ్యుడిషియల్‌ ప్రివ్యూను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ (జ్యుడిషియల్‌ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ప్రతిపాదనను  బుధవారం మంత్రివర్గం ఆమోదించింది. 

ఇప్పటికే రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జ్యుడిషియల్‌ ప్రివ్యూ అడ్డునూ తొలగించుకుంది. మళ్లీ 2014–19 తరహాలోనే అడ్డగోలుగా అంచనాలు పెంచేసి.. కమీషన్లు ఎక్కువ ఇచ్చే కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్లు పిలిచి, కోరుకున్న కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి, మొబిలైజేషన్‌ అడ్వాన్సులిచ్చి, కమీషన్లు వసూలు చేసుకునేందుకు మళ్లీ సిద్ధమయ్యారని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

జ్యుడిషియల్‌ ప్రివ్యూకు నీతి అయోగ్‌ ప్రశంసలు
రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్ట్రాస్టక్చర్‌ యాక్ట్‌ (జ్యుడిషియల్‌ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్‌ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ  వ్యయం ఉన్న పనుల టెండర్‌ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్‌ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. 

ఆ ముసాయిదాపై జ్యుడిషియల్‌ ప్రివ్యూ జడ్జి ఆన్‌లైన్‌లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్‌ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్‌ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. 

ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్‌ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే..
విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఇప్పటిలానే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్లాది రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్‌ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. 2014 – 19 మధ్య బాబు సర్కారు దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..

» గాలేరు–నగరి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై  60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి, దొడ్డిదారిన తన సన్నిహితుడైన సి.ఎం. రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు.

»హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.99 లక్షల విలువైన పనులు, 3–బి ప్యాకేజిల్లో రూ.రూ.8.69 కోట్ల విలువైన పను మిగిలాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. 2–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేశారు. 3–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. ఈ రెండింటినీ సి.ఎం. రమేష్‌కే అప్పగించారు. ఇలా 2–బి ప్యాకేజీలో రూ.114.09 కోట్లు, 3–బి ప్యాకేజీలో 140.45 కోట్లు పెంచేసి, సి.ఎం.రమేష్‌కు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. 

»హంద్రీ–నీవా రెండో దశ 4–బి ప్యాకేజీలో 2014 నాటికి రూ.1.34 కోట్లు, 5–బీ ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటి కాంట్రాక్టర్లను కూడా 60–సీ నిబంధన కింద చంద్రబాబు తొలగించారు. 4–బి ప్యాకేజీ పనుల వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, తన సన్నిహితుడైన ఆర్‌.మహేశ్వరనాయుడు, ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.

»వెలిగొండ రెండో టన్నెల్‌లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటిని చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. జీవో 22, జీవో 63ను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. వాటిని సి.ఎం. రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకు­న్నారు.  

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికా­రం­లోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, సి.ఎం. రమేష్‌ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్‌ పనిని పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కాVŠ  జీవో 22, జీవో 63ను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.­57 కోట్లను దోచి­పె­ట్టినట్లు తేల్చడం బాబు అవినీతికి తార్కాణం.

» 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. 

» ఇప్పుడూ అదే రీతిలో ఖజానాను కొల్లగొట్టేందుకు జ్యుడిషియల్‌ ప్రివ్యూను ప్రభుత్వం రద్దు చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement