గడ్డిని కాలిస్తే గడ్డుకాలమే!
గడ్డివామును చూసి రైతు ఘనత చెప్పొచ్చు అనేవారు పెద్దలు. భారత హరిత విప్లవ కేంద్రమైన పంజాబ్‌లో రైతులు మాత్రం గడ్డిని గడ్డు సమస్యగా భావిస్తున్నారు. ఏటా టన్నుల కొద్దీ గడ్డిని పరశురామ ప్రీతి చేస్తున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ రెండుగా విడిపోయిన తరువాత రైతాంగం పశుపోషణ నుంచి దాదాపుగా వైదొలిగారు. గృహావసరాల కోసం ఒకటో అరో గేదెలు లేదా ఆవులను పెంచుకున్నా వాటికి కొద్ది మాత్రం గడ్డి సరిపోతుంది. మిగులు గడ్డిని వాములు వేయాలంటే బోలెడు సమయంతో పాటు బాగా ఖర్చవుతుంది.
సాగునీరు అందుబాటులో ఉన్న భూముల్లో ఒక పంట పూర్తవగానే మరో పంటను వెంట వెంటనే నాటేయడం అలవాటుగా మారింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో నాటు మొదలు నూర్పు వరకు భారీ యంత్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణ రైతు ఈ యంత్రాలను వ్యక్తిగతంగా కొనుగోలు చేయలేడు. నలుగురితో నారాయణ అని అద్దె చెల్లించి, అందరితో పాటు పనులు చేయక తప్పదు. వెనుకపడిపోతే ప్రత్యేకంగా యంత్రాలను తెప్పించుకునే పరిస్థితి ఉండదు. మరోవైపు గోధుమ, వరి గడ్డిని తొలగించి, వినియోగించే ప్రత్యామ్నాయ పద్ధతులు రూపొందలేదు. ఈ పరిస్థితిలో ఉన్న కాడికి ఊడ్చి అగ్గి పెట్టడమొక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు పంజాబ్ రైతులు. ఏటా నాలుగు కోట్ల టన్నుల గోధుమ గడ్డి, 2.3 కోట్ల టన్నుల వరి గడ్డిని కాల్చి బూడిద చేస్తున్నారు.
గడ్డి దహనంతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు
గడ్డిని కాల్చడం వలన పర్యావరణ సమస్యలు అనేకం ఉత్పన్నమవడంతో పాటు భూసారం తీవ్రంగా దెబ్బతిని పోతోంది. తిరిగి భూసారం పెంచడానికి రసాయనిక ఎరువులను ఏటా పెంచుకుంటూ పోతున్నారు. ఇది రైతుకు ఆర్థికంగా నష్టదాయకమైంది. మరోవైపు గడ్డి తగలబెట్టడం వలన 2.61 లక్షల టన్నుల కార్బన్ మోనో డయాక్సయిడ్, 19,800 టన్నుల నైట్రోజన్ ఆక్సైయిడ్‌లతో పాటు ఇతర వాయువులు గాలిలో కలిసి పోతున్నాయి. ఈ పరిస్థితి రోజురోజుకూ తీవ్ర మౌతుండడంతో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు ప్రారంభించింది.
బహిరంగంగా దీన్ని కాల్చివేయడం వలన నేలలోని సూక్ష్మజీవులను నశింప జేస్తోందని వెల్లడించింది. పంట పొలాల్లో దహనకాండ ఫలితంగా 2.2 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువు, 60 లక్షల టన్నుల కర్బనం వాతావరణంలో కలిసిపోతున్నది. ఫలితంగా పర్యావరణంలో వీపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం గడ్డి దహనం మీద నిషేధం విధించినప్పటికీ అమలు కావడం లేదు. ఈ విషవాయువుల వల్ల మనుషుల్లో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తీవ్రమౌతున్నట్లు అధ్యయనంలో తేలింది.
గడ్డి పునర్వినియోగం క్షేమం, లాభం!
రైతులు గోధుమ, వరి గడ్డిని తిరిగి నేలలోనే కలియదున్నాలని, దాని వలన నేల త్వరితంగా సారవంతమౌతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంజాబ్‌లో బుగ్గిపాలవుతున్న గడ్డిని భూమిలో కలియదున్నితే ఏటా దాదాపు 38.5 లక్షల టన్నుల సేంద్రియ కర్బనం, 59 వేల టన్నుల నత్రజని, 20 వేల టన్నుల భాస్వరం, 34 వేల టన్నుల పొటాష్ నేలకందుతాయని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. అయితే మాటలతో పొద్దు పుచ్చకుండా.. పొలంలో గడ్డిని సేకరించి బేళ్లుగా చుట్టే యంత్రాలను సమకూర్చడం వంటి ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తేవడమే ఈ సమస్యకు పరిష్కారమని రైతు నేతలు అంటున్నారు.