Grass
-
vinayakachavithi 2024: గరికతో కొలిచినా వరాలే
ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ కార్యాన్నిప్రారంభించాలన్నా ముందుగా ఆయననే పూజించాలి. అప్పుడే ఆ కార్యం శుభప్రదం, శోభస్కరం.. ఆ తర్వాత జయప్రదం అవుతుంది. తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు.ఓం గణానాతాం త్వా గణపతిగ్ం హవామహేకవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతఅనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్రాజులలో జ్యేష్ఠుడు, కవులలో కవి, గణాలకు అధిపతి, బ్రహ్మణస్పతి అని వేదాలు ఆయనను స్తుతిస్తే, మంత్రశాస్త్రాలు సుముఖుడనీ ఏకదంతుడనీ, కపిలుడనీ, గణాధ్యక్షుడనీ, గజకర్ణికుడనీ, వికషుడనీ, ఫాలచంద్రుడనీ, ధూమకేతువనీ, గజకర్ణికుడనీ విష్వక్సేనుడనీ, శూర్పకర్ణికుడనీ అన్నాయి. అంతగా ఆరాధించాయి. ఇక ఉపనిషత్తులయితే వాఙ్మయమూర్తిగా.. గణపతిగా... బ్రహ్మణస్పతిగా.. శ్రీ మహాగణాధిపతిగా విశ్వసించాయి. నిండుగా కొలిచాయి. గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వ విఘ్నాలూ ఉపశమిస్తాయి. అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి,ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల పుష్పాలు, పత్రాలతోటీ పూజించి, అరటిపళ్లు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్లు, వెలగ పళ్లు, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తే చాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా ప్రసన్న గణపతి... వల్లభ గణపతీ ఆయన. ఎలా పూజించాలి?ఏ పూజలోనైనా ముందుగా హరిద్రాగణపతిని (పసుపుతో గణపతి ప్రతిమను చేసి, తమలపాకులో ఉంచాలి) పూజించడం మంచిది. వినాయక చవితినాడు తప్ప తక్కిన రోజుల్లో తులసి దళాలతో పూజించరాదు. 21 రకాల పత్రి లభ్యం కానప్పుడు గరిక దొరికినా ప్రసన్నుడవుతాడు. రక రకాల నైవేద్యాలు సమర్పించలేకున్నా నారికేళం, అరటిపండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు ఉంటే చాలంటాడు. ఈ కింది శ్లోకం చదివితే చతుర్థీ చంద్ర దర్శన దోషం పరిహారమవుతుంది.సింహః ప్రసేనమవధీః సింహా జాంబవతా హతేఃసుకుమారక మారోదీః తవహ్యేషçశ్యమంతకఃఏమి నివేదించాలి?వినాయకచవితిరోజు గణపతిని షోడశోపచారాలతో పూజించి, శక్తికొద్దీ ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, నారికేళాలు, కదళీఫలాలు, పానకం, వడపప్పులను నివేదిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది.పాలవెల్లి ఎందుకు..?ఆకాశంలో గ్రహాలూ నక్షత్రాలూ ఉంటాయనే యథార్థాన్ని గుర్తింపజేసేందుకే, భాద్రపదమాసంలో విరివిగా లభించే పాలవెల్లికి నిండుగా మొక్కజొన్న ΄÷త్తులూ, వెలక్కాయలూ, బత్తాయిలూ... వీటన్నింటినీ కడతారు.నిమజ్జనమెందుకు?భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికిప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ వినాయక చవితి మీ అందరి విఘ్నాలనూ దూరం చేయాలని, కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. అన్నట్లు పూజకు మట్టి వినాయకుడినే తెస్తున్నారు గదా!పత్రి అంటే ఎందుకంత ప్రీతి?కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. అంతేకాదు... మునుల కోరిక మేరకు అగ్నితత్త్వం గల అనలాసురుడనే రాక్షసుని ఉండలా చేసి గుటుక్కున మింగాడాయన. లోపల చేరిన ఆ రాక్షసుడు తన మంటలతో ఆయన ఉదరాన్ని బాధించకుండా చల్లదనాన్ని చేకూర్చడం కోసమే మునులు ఆయనను అనేక రకాల ఔషధ విలువలు గల పత్రితోటీ, పుష్పాలతోటీ పూజించి, మరింత ఉపశమనాన్ని కలిగించడం కోసం గరికతో తాళ్లలా పేని ఆయన ΄÷ట్ట చుట్టూ పట్టీలా కట్టారు. ఆ ఉపచారాలన్నీ ఆయనకు అమితంగా నచ్చి, ఆ నాటినుంచి ప్రతియేటా తనను పత్రితోటీ, పుష్పాలతోటీ, ముఖ్యంగా గరిక΄ోచలతో పూజించిన వారికి కోరిన వరాలనిచ్చే వేల్పు అయ్యాడాయన. -
లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటి పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్‌గ్రాస్ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం..కావాల్సినవి:నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు..దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ కేన్సర్ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్ గ్రాస్‌లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్‌తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్ డెత్‌కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్‌తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుందిబరువు తగ్గడంలో సహాయపడుతుంది జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..తల తిరగడంఆకలి పెరగటంనోరు పొడిబారడంతరుచుగా మూత్రవిసర్జన అలసటదద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్‌గ్రాస్ టీని తాగకూడదు.(చదవండి: హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్) -
సిరుల విరులు..కొండ చీపుర్లు
సాక్షి, అమరావతి: మనం ఇళ్లల్లో ఉపయోగించే మెత్తని గడ్డి మాదిరిగా ఉండే కొండ చీపుర్లు గిరిజనులకు జీవనోపాధిగా మారాయి. కొండ చీపురు గడ్డి పెంపకంతో రాష్ట్రంలోని వేలాది గిరిజన కుటుంబాలు ఉపా«ధి పొందుతున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ‘కొండ చీపురుతో ఊడ్చేద్దాం’ అనే నినాదంతో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచవచ్చని నివేదికలో తెలిపింది. మన ప్రాంతానికి వలసజాతే..! మన ప్రాంతానికి వలసవచ్చిన చీపురు గడ్డి జాతులను వృక్షశాస్త్రంలో ‘థైసనోలెనా మాక్సిమా’, ‘థైసనోలెనా లాటిఫోలియా’గా పిలుస్తారు. ఈ తరహా గడ్డి జాతులు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, తూర్పు కనుమల్లో ఎక్కువగా పెరుగుతాయి. మేఘాలయ, అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, పశి్చమ బెంగాల్లో ఈ గడ్డి జాతులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోని అనంతగిరి, అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, సీతంపేట, భామిని, కొత్తూరు, కుమారాడ, కురుపాం, గుమ్మ లక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట తదితర మండలాల పరిధిలో ఈ చీపురు గడ్డి సాగు ద్వారా వేలాది మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. ఎకరాకు రూ.50 వేలకు పైగా ఆదాయం ఎటువంటి సాగుకు ఉపయోగించని భూములను చీపురు గడ్డి పెంపకానికి గిరిజనులు వినియోగిస్తున్నారు. ఒక్కో చీపురును కనీసం రూ.35 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. ఒక ఎకరాలో చీపురు గడ్డి సాగు చేసిన గిరిజన కుటుంబానికి ఎకరాకు కనీసం రూ.50 వేల ఆదాయం వస్తోంది. చీపురు సాగు, చీపురు నేసే పద్ధతి తదితరాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే వారి జీవనోపాధిని మరింత మెరుగుపరచవచ్చని ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ నివేదికలో స్పష్టం చేసింది.ఒకసారి నాటితే.. ఇరవై ఏళ్లకు పైగా ఆదాయం ఎత్తయిన కొండవాలు ప్రాంతాలు ఈ చీపురు గడ్డి సాగుకు అనుకూలం. సముద్ర మట్టానికి కనీసం 1,500 అడుగుల నుంచి గరిష్టంగా 5 వేల అడుగుల ఎత్తులో ఉండే అటవీ భూములు ఈ గడ్డి సాగుకు దోహదం చేస్తున్నాయి. ఐదు అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చీపురు గడ్డి సాగు వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి బీడు వారిన పోడు భూములు వినియోగంలోకి వస్తున్నాయి. భూమి కోతను నివారించడంతో పాటు భూసారాన్ని కూడా కాపాడుతోంది. అలాగే ఈ గడ్డి సాగు పర్యావరణ హితంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా గిరిజనుల ఉపాధికి ఊతమిస్తోంది.హుకుంపేట, పెదబయలు, సీతంపేట, మారేడుమిల్లి తదితర మండలాల్లోని ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములు, అటవీ పోడు భూముల్లో సాగవుతున్న చీపురు గడ్డిపై ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనం చేసింది. ఈ సాగు ద్వారా ఆ మండలాల్లోని పలు గ్రామాల్లో 232 ఎకరాల్లో 300కు పైగా గిరిజన కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలు(పీవీటీజీ)లకు చెందిన మూక దొర, బగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి వంటి తెగలు ఉపాధి పొందుతున్నాయని నివేదికలో పేర్కొంది. కొండ చీపురుకు ఉపయోగించే గడ్డి రకాలను ఒకసారి నాటితే 20 ఏళ్లకుపైగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపింది. -
సాగుబడి: హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గడ్డిసాగుతో మంచి ఆదాయం
ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో పచ్చిగడ్డి లభ్యత 11 శాతం తక్కువగా ఉందని భారతీయ గడ్డి నేలలు, పశుగ్రాస పరిశోధనా సంస్థ లెక్కగట్టింది. భూతాపం ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్న ప్రస్తుత కాలంలో పచ్చి గడ్డి సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో, పది శాతం నీటితోనే ఏడాది పొడవునా మొలక గడ్డిని పెంచుకోవచ్చు. మొలక గడ్డిని పాడి ఆవులు, గొర్రెలు, మేకలకు మేపటం మన రాష్ట్రాల్లోనే కాదు.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంత పశుపోషకులను సైతం ఆకర్షిస్తోంది. అక్కడ ఏడాదిలో రెండు నెలలే వర్షం పడుతుంది. మండు వేసవిలో ఎండ వేడి 120 డిగ్రీల సెల్షియస్‌కు చేరుతుంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించే థార్ ప్రాంత రైతులు, సంచార పశుపోషకులు స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌ల తోడ్పాటుతో ఇటీవల హైడ్రోపోనిక్ మొలక గడ్డి సాగు చేపట్టారు. సునాయాసంగా నాణ్యమైన పాల దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకుల కోసం హైడ్రోపోనిక్ మొలక గడ్డిని పెంచే షెడ్లను నెలకొల్పుతున్నాయి. రైతులే వాటిలో మొక్కజొన్నలు, గోధుమలను నానబెట్టి, వర్టికల్ గార్డెన్ మాదిరిగా అనేక దొంతర్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్రేలలో మొలక గడ్డిని పెంచుతున్నారు. సాధారణంగా పొలంలో పచ్చి గడ్డిని పెంచడానికి 2 నెలలు పడుతుంది. మొలక గడ్డి 8 రోజుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా పది శాతం నీటితోనే ఈ గడ్డి పెరగటం థార్ ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకులకు ఉపయుక్తంగా మారింది. ఏడాది పొడవునా ఆదాయం స్వచ్ఛంద సంస్థ ఉర్ముల్ సీమంత్ సమితి, డిజర్ట్ రిసోర్స్ సెంటర్‌తో కలసి హైడ్రోగ్రీన్స్, బహుళ నేచురల్స్ స్టార్టప్‌లు మొలక గడ్డి ఉత్పత్తి యూనిట్లను థార్ ఎడారి గ్రామాల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొందరు మహిళా రైతులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. బహుళ నేచురల్స్ వీరి వద్ద నుంచి దేశీ ఆవు పాలను, ఒంటె పాలను సేకరించి, విలువ జోడించి ఆన్లైన్లో విక్రయిస్తోంది. వెయ్యి మంది పాడి రైతులు, 4 వేల మంది పశుపోషకులు తమ ఆవులు, మేకలకు మొలక గడ్డిని మేపుకుంటూ ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. పశుపోషణ కోసం గొడ్డు చాకిరీ చేసే మహిళా రైతులకు మొలక గడ్డి అందుబాటులోకి రావటం గొప్ప ఊరటనిస్తోంది. మొలక గడ్డి మేపుతో దేశీ ఆవు పాల దిగుబడి మూడింట ఒక వంతు పెరగడంతో పాటు, నాణ్యత కూడా పెరిగిందని రాజస్థాన్‌లోని ఘంటియాలి గ్రామానికి చెందిన దళిత మహిళా పశుపోషకురాలు ‘పలు’, ఆమె భర్త హెమారామ్ సంతోషంగా చెబుతున్నారు. వీరికి 8 ఆవులు, మేకలు ఉన్నాయి. 4 మైళ్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని, ఎండలో నెత్తిన పెట్టుకొని మోసుకు రావటం ఆమెకు కనాకష్టంగా ఉండేది. రెండేళ్ల క్రితం ఇంటి పక్కనే మొలకగడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఆ బాధ తప్పింది. మిగులు గడ్డిని, గోధుమ గడ్డి పొడిని అమ్ముతూ ఆదాయం పొందుతుండటం విశేషం. హైడ్రోపోనిక్స్.. ఎంత ఖర్చవుతుందంటే.. దూడలకు పెట్టే కాన్సంట్రేట్ మిక్చర్ దాణాను 75% తగ్గించి మొక్కజొన్న మొలక గడ్డిని మేపటం వల్ల మంచి ఫలితం కనిపించిందని బికనెర్ వెటరినరీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.కె. ధురియా అన్నారు. హైడ్రోపోనిక్ మొలక గడ్డి వల్ల మేకల్లో జీర్ణశక్తి, పెరుగుదల బాగుందని సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. మొలకగడ్డి యూనిట్ ఏర్పాటుకు రూ. 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే, ఇసుక తుఫాన్లకు మొలకగడ్డి షెడ్లు దెబ్బతినటం వల్ల నష్టం జరుగుతోంది. అందుకని, మున్ముందు షిప్పింగ్ కంటెయినర్లలో మొలకగడ్డి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయటమే దీనికి పరిష్కారమని బహుళ నేచురల్స్ భావిస్తోంది. లక్షల ఖర్చుతో కూడిన పని కావటంతో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి మొలకగడ్డి యూనిట్లను నెలకొల్పితే మేలు. అయితే, రూ. 17.500 ఖర్చుతో చిన్నపాటి మొలకగడ్డి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని హైడ్రోగ్రీన్స్ స్టార్టప్ చెబుతోంది. బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపౠరు. వివరాలకు.. 81210 08002. 17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపౠరు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే). -
విడ్డూరం!...ఆటోపై గడ్డి మొలిచింది
-
అలర్ట్: మూసీ గ్రాస్‌లో లెడ్ ఆనవాళ్లు.. పాలు, మాంసం, పశుగ్రాసంలో..
సాక్షి, హైదరాబాద్: చారిత్రక మూసీ పరివాహక ప్రాంతంలో విరివిగా సాగవుతున్న గడ్డిలోనూ మానవ ఆరోగ్యానికి హానికారకంగా పరిణమించే లెడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు నేషనల్ రీసెర్చి సెంటర్ ఫర్ మీట్ (ఎన్ఆర్సీఎం) తాజా పరిశోధనలో తేలింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి పర్యవేక్షణలో ఎన్ఆర్సీఎం ఆధ్వర్యంలో పాలు, మాంసం, పశుగ్రాసంలో లెడ్ ఆనవాళ్లను పరిశీలించగా ఈ విషయం తేలింది. మూసీలో హుస్సేన్‌సాగర్ జలాలు అధికంగా చేరే నాగోల్– ఉప్పల్ మార్గంలో ఈ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు 21 ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరీక్షించగా.. ప్రతి లీటరు నీటిలో లెడ్ మోతాదు 61 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం)గా నమోదైనట్లు ఈ సంస్థ తాజా నివేదిక తెలిపింది. పీసీబీ నిబంధనల ప్రకారం ఈ మోతాదు 20 పీపీఎంకు మించరాదు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు అధికంగా చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక స్పష్టం చేసింది. లెడ్ మోతాదు అధికమైతే మానవ, పాడి పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదని నివేదిక వెల్లడించింది. కాలుష్యానికి కారణాలివీ.. నగరంలో రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా నిత్యం 1800 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో సుమారు 900 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా నీరు శుద్ది ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తోంది. ఈ మురుగు నీటిలో కూకట్పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్‌లోకి అటు నుంచి వచ్చి మూసీలోకి చేరుతున్న సుమారు 400 మిలియన్ లీటర్ల మేర ఫార్మా, బల్క్‌డ్రగ్ వ్యర్థ జలాలు కూడా ఉన్నాయి. ఈ జలాల చేరికతోనే లెడ్ తదిర హానికారక భారలోహ అవశేషాలు మూసీలోకి చేరుతున్నాయి. కలుషిత జలాలతో దుష్ఫలితాలు.. ►ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో నదిలో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాలు చనిపోతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. జీవావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. పశువులు దాహార్తి తీర్చుకునే పరిస్థితి ఉండదు. ►పరీవాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్న గడ్డి తిన్న పశువుల పాలల్లో కాలుష్య కారకాలు చేరడంతో ఇవి మానవ దేహంలోకి ప్రవేశిస్తున్నాయి. ►ఈ నీరు తాగిన వారు న్యుమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలోకి ప్రవేశించగానే కాలుష్య కాటు.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. 90 కి.మీ ప్రవహించి బాపూఘాట్ వద్ద నగరంలోకి ప్రవేశిస్తోంది. నగరంలో ఫార్మా, వాణిజ్య, గృహ వ్యర్థ జలాలు చేరుతుండడంతోనే మూసీ కాలుష్య కాసారమవుతోంది. -
సిరుల గ్రాసం.. పచ్చగడ్డి కాదు.. పసిడి పంట!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం: ఒకప్పుడు గ్రామాలు పశువులతో కళకళలాడేవి. వాటి మేత కోసం గ్రామాల్లో బంజరు భూములు ఉండేవి. పొలం గట్లు, అంచుల వెంబడి రైతులు పశుగ్రాసం పెంచేవారు. క్రమేణా బంజరు భూములు సాగునేలలుగా మారాయి. లేదంటే కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గింది. కానీ పాడి పశువుల సంఖ్య పెరిగింది. పాలిచ్చే గేదెలు, జెర్సీ ఆవులను పెంచే రైతుల సంఖ్య గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టు పశుగ్రాసం లభించడం లేదు. అడవులు అధికంగానే ఉన్నా.. రాష్ట్రంలోనే అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పశుగ్రాసం సమస్య తీవ్రంగానే ఉంది. అడవుల సంరక్షణ పేరుతో అటవీ అధికారులు కట్టుదిట్టం చేయడంతో పశువులకు మేత దొరకడంకష్టమైపోయింది. దీంతో పాడిరైతులు పశుగ్రాసాన్ని మోపుల లెక్కన కొనాల్సి వస్తోంది. ఈ క్రమంలో పశువుల ఆహార కొరతను తీరుస్తూ రైతులకు ఆదాయాన్ని అందించే వనరుగా సూపర్ నేపియర్ రకం గడ్డి వెలుగులోకి వచ్చింది. నేపియర్ గ్రాస్‌తో పెంచుతున్న పశువులు సాగు సులభం.. అచ్చం చెరుకుగడలా కనిపించే ఈ నేపియర్ గడ్డి థాయ్‌లాండ్ నుంచి వచ్చింది. భారత్ పరిస్థితులకు తగ్గట్టుగా హైబ్రిడ్ నేపియర్, సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ గడ్డి రకాలు అభివృద్ధి చేశారు. ఇందులో ప్రస్తుతం సూపర్ నేపియర్ రకం సాగు జోరందుకుంది. పశుగ్రాసం కోసం పెంచే జొన్న, దుబ్బ వంటి గడ్డిజాతులు ఒకసారి నాటితే ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తాయి. ఏడాది తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ సూపర్ నేపియర్ గడ్డిజాతి మొక్కలు ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు తిరిగి చూడాల్సిన పనిలేదు. తొలి పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఒకసారి కోస్తే తిరిగి 45 రోజుల్లో మళ్లీ కోతకొస్తుంది. ఇలా ఎనిమిదేళ్ల పాటు రాబడిని అందిస్తోంది. రైతుల మొగ్గు... పట్టణాలకు సమీపంలో పాడి ఎక్కువగా విస్తరించిన గ్రామాల్లో రైతులు సంప్రదాయ వరి, పత్తి, మిర్చిల కంటే నేపియర్ సాగుకే మొగ్గు చూపుతున్నారు. వరి వేసి నానా కష్టాలు పడితే ఎకరానికి రూ.15 వేలకు మించి ఆదాయం రావట్లేదు. పత్తివేస్తే అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.30 వేలైనా మిగలడం లేదు. కానీ సూపర్ నేపియర్ స్టెమ్స్ ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు ఢోకాలేదు. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ.70 వేల వరకు మిగులుతున్నాయని రైతులు అంటున్నారు. రెట్టింపు లాభం.. బెంగళూరులో ఉన్నప్పుడు సొంతూరిలో పాడి పరిశ్రమ పెట్టాలనుకున్నా. అప్పుడే సూపర్ నేపియర్ గురించి తెలిసింది. మా ఊళ్లో ఫాంహౌస్ కట్టి దానిలో ఈ గడ్డి పెంచుతున్నా. సాధారణ గడ్డి ఎకరంలో పండిస్తే.. ఐదారు పశువులకే సరిపోతుంది. కానీ నేపియర్ 16 అడుగుల పొడవు పెరగడం వల్ల 10 పశువులకు సరిపోతుంది. పైగా ఇందులో ప్రొటీన్స్ ఎక్కువ. పాల దిగుబడి బాగుంటుంది. – కళ్యాణ్, రైతు, అశ్వాపురం సమయం ఆదా అవుతోంది గతంలో భూమి కౌలుకు తీసుకుని గడ్డి పెంచేవాన్ని. ప్రతీ ఏడాది దుక్కి దున్ని విత్తనాలు చల్లాల్సి వచ్చేది. సూపర్ నేపియర్‌తో ఈ సమస్య లేదు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. 6 ఏళ్లు పాడి పశువులకు ఆహార కొరత లేదు. ఉదయం ఈ గడ్డి కోసి ఇస్తే చాలు. మిగిలిన సమయంలో ఇతర పను లు చూసుకునే వెసులుబాటు కలుగుతోంది. – బాదం శ్రీనివాసరెడ్డి, రైతు, బూర్గంపాడ -
తిండిలేక గడ్డి తింటున్న బాలుడు! ఆ వీడియో సిరియాదా? ఉక్రెయిన్దా?
రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలతో విరుచుకుపడుతున్నా రష్యా వెనకడుగు వేయడం లేదు. కీలకమైన రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌లను చేజిక్కించుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ముప్పేట చుట్టుముట్టి దాడులతో భయపెడుతున్నా ఉక్రెయిన్ తలొగ్గడం లేదు. రష్యన్ సైనికులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అయితే రష్యా దాడితో వేలాది మంది పౌరులు కీవ్, ఇతర సిటీల్లో మెట్రోస్టేషన్లు, షెల్టర్లు, బేస్మెంట్లు, కారిడార్లలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణలో ఇప్పటి వరకు ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. తినడానికి తిండి లేక ఎన్నో కుటుంబాలు ఆకలితో ఆలమటిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ దృశ్యం ప్రపంచ ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో నెలకొన్న దారుణ పరిస్థితుల్లో.. బాలుడు ఆకలికి తట్టుకోలేక గడ్డి తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నవారికి దూరమై, ఓదార్చేవారు లేక ఆకలి దహించడంతో కంటికి కనిపించిన గడ్డినే ఆహరంగా తీసుకున్నాడు. చిన్నారి దయనీయ పరిస్థితి ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. చదవండి: Russia Ukraine War: భారీ ఎదురుదెబ్బ.. రష్యన్ మేజర్ జనరల్ హతం Syrian child surviving on grass pic.twitter.com/gxJfLWvOaD — Tariq Rafi (@TariqRafi14) March 2, 2022 అయితే ఈ బాలుడు ఏ దేశానికి చెందినవాడో తెలియరాలేదు. ఈ దృశ్యాలు ఉక్రెయిన్‌లోనే చోటుచేసుకున్నాయని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ ఘటన సిరియా యుద్ధ సమయంలో జరిగిందని చెప్తున్నారు. సిరియా యుద్ధ సమయంలోని పాత వీడియోనే మరోసారి వైరల్ అయిందని దాని తాలూకు లింక్స్ షేర్ చేస్తున్నారు. ఏదేమైనా ఉక్రెయిన్‌లో ఈ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే బాంబుల విధ్వంసం కంటే ఆకలితో చనిపోయేవారే అధికంగా ఉంటారేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణ్యం పుణ్యం తెలియని చిన్నారులు ఏం పాపం చేశారని వాపోతున్నారు. -
ఈ ఎమ్మెల్యే ఎవరో.. ఇవేంటో చెప్పగలరా?
సాక్షి, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సింగంపల్లి, కనుకునూర్ గ్రామాల్లో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్తున్న ఓ వాహనం మంగళవారం వాగులో దిగబడిపోయింది. ఆ సమయంలో అదే దారిలో మరో వాహనంలో వెళ్తున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయారు. తన కార్యకర్తలతో కలసి ఆయన వాగులోకి దిగి వాహనం బయటకొచ్చేలా సహకరించారు. ఈ ఫొటో చూడగానే వరి కోశాక మిగిలిన కొయ్య కాళ్ల మాదిరి కనిపిస్తున్నాయి కదూ..! కానీ, ఇవి గడ్డి మొక్కలకు సంబంధించి బెండు కర్రలు. పాడి పశువులకు పోషకాలను మెండుగా అందించే సూపర్ నేపియర్ గడ్డి పెంపకంపై రైతులు ఇటీవల ఆసక్తి చూపుతున్నారు. మొదట ఏపీకే పరిమితమైన ఈ రకం గడ్డి పెంపకం కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలకు విస్తరించగా.. ప్రస్తుతం జనగామ జిల్లా చిల్పూరు మండలం కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన రైతు సాదం రమేష్ కూడా నాటాడు. ఇది విత్తనంగా కాకుండా రూ.1కి ఒకటి చొప్పున జానెడు పొడవుతో దొరికే బెండుకర్రలు నాటాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ గడ్డి.. పాడి పశువులకు వేయడం వల్ల మొక్కజొన్న చొప్పలా మెత్తగా ఉండటంతో ఇష్టంగా తింటాయని, పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని వెల్లడించారు. – చిల్పూరు (జనగామ) -
వైరల్ వీడియో: వ్యాయామం చేస్తోన్న జిరాఫీ!
మీరు జిరాఫీ గడ్డి తినే విధానాన్ని ఎప్పుడైనా చూశారా? అబ్బో దాంట్లో ఏముంది చాలా సార్లు చూశాం అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేయకతప్పదు. ఎందుకంటే జిరాఫీ సాధారణంగా తన పొడుగాటి మెడను వంచి గడ్డిని తింటుంది. అయితే 7 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మాత్రం ఒక జిరాఫీ భిన్నంగా కాళ్లను విడిగా జరిపి మెడను వంచి గడ్డిని తింటోంది. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇది మ్యానుఫక్చర్ డిఫెక్ట్ ఏమో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, వాళ్ల పీటీ టీచర్ దీన్ని చూసి నిజంగా గర్వ పడతారు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుధారామన్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ జిరాఫీ వ్యాయమం చేయకుండా గడ్డి తింటోంది అంటూ కామెంట్ చేశారు. చదవండి: వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు.. -
సైలేజీ గడ్డి సీజన్ ఇదే!
పచ్చిమేత లేకుండా పాడి లాభసాటి కాదు. అయితే, సంవత్సరం పొడవునా మనకు పిచ్చమేత లభ్యం కాదు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మనకు కొరత మరీ ఎక్కువ. అందుచేత జనవరి నెలలోనే మాగుడు గడ్డి / సైలేజీ గడ్డి / పాతర గడ్డిని తయారు చేసుకొని, పచ్చి గడ్డి కొరత ఉండే నెలల్లో వాడుకుంటే పాల దిగుబడి తగ్గిపోకుండా ఉంటుంది. సైలేజీ గడ్డి తయారీ ఇలా.. ► పచ్చి మేత పుష్కలంగా ఉన్నప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి, గుంతలో వేసి, గాలి చొరపడకుండా కప్పి పెట్టి, పోషక విలువలు తగ్గకుండా కాపాడుకొని, అవసర సమయాల్లో పశువులకు మేపుకొనే గ్రాసాన్నే సైలేజీ గడ్డి అంటారు. ► ఎక్కువ పిండి పదార్థాలు కలిగి, సుమారుగా మాంసకృత్తులు కలిగిన పశుగ్రాసాలు అనువైనవి. ఉదా: జొన్న, మొక్కజొన్న, నేపియర్, గిన్నీ గడ్డి, సజ్జ మొదలైనవి. అలాగే గుర్రపుడెక్క, చెక్క తట్టాకు, గుంతకల్లుడు ఆకు, చెట్టింటాకు లాంటి కలుపు మొక్కలను కూడా సైలేజీకి వాడవచ్చు. ► సైలేజీ గడ్డిలో ఎండుగడ్డిని కూడా 1:4 నిష్పత్తిలో వాడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టన్ను పశుగ్రాసానికి సుమారు 30 కిలోల మొలాసిస్ వాడితే మంచిది. మొలాసిస్ లభ్యం కానప్పుడు బెల్లం నీటిని కూడా వాడవచ్చు. ఈ ద్రావణాన్ని పశుగ్రాసం పైన పిచికారీ చేసుకొని సైలేజీని తయారు చేసుకోవాలి. ► సైలేజీ తయారీకి 35 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ఎక్కువ మాంసకృత్తులున్న పశుగ్రాసాలు– లూసర్ను, బర్సీము, అలసంద, పిల్లిపెసర లాంటివి సైలేజీకి పనికిరావు. ► సైలేజీ తయారీకి వాడే గుంతలు 3 రకాలు.. అపార్ట్మెంట్ పద్ధతి, గుంత కాల్వ పద్ధతి, బంకర్ పద్ధతి. ► రైతు తన అవసరాన్ని బట్టి సైలేజీని తయారు చేసుకోవచ్చు. సైలేజీ తయారీకి వాడే గుంత ముఖ్యంగా పశువుల సంఖ్య, నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ► ఒక్కో రోజుకు సుమారుగా 20 కిలోల సైలేజీని పశువుకు మేపుకోవచ్చు. ► గుంత పరిమాణాన్ని నిర్ణయించడానికి సూత్రం– ఉదా: ఒక రైతు దగ్గర 3 పాడి పశువులున్నాయి. వేసవిలో 3 నెలల పాటు సైలేజీ అవసరం అనుకుంటే, ఒక్కోపశువుకు రోజుకు 20 కిలోలు. 90“20=1,800 కిలోల అవసరం. అదే 3 పశువులకు 5,400 కిలోలు అవసరం. ఈ సైలేజీ తయారు చేసుకోవడానికి 8,100 కిలోల పశుగ్రాసం అవసరం. ఒక ఘనపు అడుగులో 20–23 కిలోల పశుగ్రాసాన్ని పాతర వేయొచ్చు. కాబట్టి, దాదాపు 350 ఘనపుటడుగుల గుంత అవసరం. అంటే.. 12 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉన్న గుంత అవసరం. సైలేజీ గడ్డి తయారీలో జాగ్రత్తలు ► పశుగ్రాసాన్ని నింపేటప్పుడు గుంతలో గాలి చొరబడకుండా చూడాలి. ► గుంతలో నీరు లేకుండా, చేరకుండా చూడాలి. ► సైలేజీ తయారీలో పశుగ్రాసాల్లో 65 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ► జొన్న, మొక్కజొన్న చొప్ప సైలేజీ గడ్డి తయారీకి చాలా అనుకూలం. సైలేజీ గుంతను 3–4 రోజుల వ్యవధి లోపలే నింపాలి. అంతకన్నా ఆలస్యం కాకూడదు. ► జొన్న, మొక్కజొన్న, నేపియర్ గడ్డి రకాలు వాడినట్లయితే.. టన్నుకు 3 కిలోల యూరియా కలిపితే మంచిది. ► డోములాగా గుంత పై భాగాన్ని 2–3 అడుగుల ఎత్తు వరకు నింపవచ్చు. ► సైలేజీ నింపిన తర్వాత 2–3 అంగుళాల వరకు మట్టితో కప్పినట్లయితే, వత్తిడి వల్ల గుంతలోని గాలి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. ► 2–3 నెలల వ్యవధిలో సైలేజీ తయారవుతుంది. ► 2–3 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ► గుంత తెరచిన తర్వాత సైలేజీని ఒక నెల లోపల వాడాలి. లేదంటే బూజు పడుతుంది. బూజు పట్టిన సైలేజీ గడ్డిని పశువులకు మేపకూడదు. ప్రతిరోజూ పశువుకు 20 కిలోలతో బాటుగా, పచ్చిమేత ఒక భాగం, ఎండు మేత ఒక భాగం కలిపి మేపుకుంటే మంచిది. ప్రాణ వాయువు లేకుండా బ్యాక్టీరియా కారణంగా జరిగే రసాయనిక చర్య ద్వారా సైలేజీ గడ్డి తయారవుతుంది. ఈ ప్రక్రియ వల్ల సువాసనలతో కూడిన ఆమ్లాలు కూడా ఉత్పత్తవుతాయి. అందుకే సైలేజీ గడ్డి మంచి సువాసన కలిగి ఉంటుంది. పశువులు ఇష్టంగా తింటాయి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి సైలేజి తయారీకి సిద్ధం చేసిన గడ్డి ముక్కలు -
గ్రాస్ రూట్ ఆర్ట్ వరిగడ్డితో కళాఖండాలు
పచ్చని పంటచేలో మట్టితో మమేకమయ్యే ఆ చేతులు... గడ్డిపోచలతో విన్యాసాలు చేస్తాయి. గిత్తల గిట్టల చప్పుళ్లతో జత కలిసి నాగేటిచాళ్లలో తిరగాడే ఆ కాళ్లు... సన్నటి గడ్డి దారాలను రూపొందించడంలో, పేనడంలో సాయం పడతాయి. బంగారు వర్ణాల కంకులను చూసి మెరిసిపోయే ఆ కళ్లు... నిశిత దృక్కులతో పెక్కు కళాఖండాలను ఆవిష్కరిస్తాయి. సత్తువ ఉడుగుతుందని అనుకునే ఎనిమిది పదులకు చేరుతున్న ఆయన వయసు ఉరకలెత్తుతున్న ఆ నైపుణ్యం ముందు తలవాల్చి ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఆయనే కృష్ణమూర్తి అనే ఓ మామూలు రైతు. గడ్డిపరకల విన్యాసం కాదది... గడ్డిపర‘కళ’ల కళావైభవం. ఈ గరికపర‘కళ’లను ఆవిష్కరిస్తున్న ఆయన పేరు మువ్వా కృష్ణమూర్తి. ఊరు ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలానికి చెందిన వీరన్నపాలెం గ్రామం. వరిగడ్డి పశువులమేతకు తప్ప మరెందుకూ పనికిరాదని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ కృష్ణమూర్తి దాన్ని అబద్ధం చేశారు. అందరిలాగే తానూ పంటలు పండించటం వరకే పరిమితమైతే ఏం లాభం... తనకంటూ ప్రత్యేకత ఉండాలని భావించాడా కృషీవలుడు. ఆసక్తి ఉండాలేగానీ మామూలు వ్యవసాయదారుడు కూడా కళాకారుడవుతాడని నిరూపించాడా నిరుపేదరైతు. అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారాయన. ఆ కళాకృతులను చూస్తే ఆశ్చర్యాలే. వాటిని మలిచే ఆ ముడిసరుకును చూస్తే అబ్బురాలే. అటు గరికపోచలే కాదు... కొన్నిసార్లు తుంగపీచులు, జొన్నఈనెలు, ఈతఆకులు వగైరాలతో సున్నితంగా పేనుకుంటూ, వాటిని ప్రయోజనకరమైన వస్తువులుగా రూపొందించేందుకు పూనుకుంటున్నారు. కొన్ని అందమైన పనిముట్ల నమూనాలను కూడా మలుస్తుంటారు. అయితే సహజంగా సేద్యం చేసేవాడు కదా... తన వ్యవసాయాభిరుచితో, తన కళాభిరుచిని కలగలిపి ‘పొలంపనిముట్ల’ నమూనాలనూ తయారు చేస్తుంటారు. ఎవరీ కృష్ణమూర్తి... మువ్వా కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, కొమర్నేనివారిపాలెం గ్రామంలో 07–04–1942న పుట్టారు. తండ్రి పేరు సుబ్బన్న, 1965లో తన పెళ్లయినప్పట్నుంచి వీరన్నపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నారు. చదివింది ప్రాథమిక విద్య మాత్రమే. పిల్లలంతా స్థిరపడ్డారు. ప్రస్తుతం తన కూతురు వద్దే నివాసం. అందరిలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే తపన చిన్ననాటినుంచీ ఉండేది. దాంతో... కళాత్మకమైన వస్తువులు, పనిముట్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నంలో వరిగడ్డి, తుంగనార, జొన్నఈనెలు, తాటాకులు, కొబ్బరి నార, చిప్పెరకంకి, జమ్ము... ఇలా రకరకాలైన వస్తువులతో తొలుత వస్తువుల తయారీకి ప్రయత్నించాడు. ‘పరకా’యించి చూశాడు... ఒకరోజు గడిపరకను పరకాయించి చూస్తుండగా ఓ ఆలోచన వచ్చింది. గడ్డిపరకలతో చీరనేస్తే ఎలా ఉంటుందన్నదే ఆయన యోచన. తన యోచననూ... ఆలోచననూ కార్యరూపంలో పెట్టాడు. పని మొదలైంది కానీ పట్టుచిక్కలేదు. ఎన్నిసార్లు నేసినా గడ్డి విరిగిపోతోంది. దాంతో వరిగడ్డిని తొలుత బాగా ఎండనిచ్చారు. దానిని చాకుతో సన్నగా నిలువుగా కత్తిరించారు. ఆ పోగులను సన్నని దారాలుగా పేనారు. ఆ చిన్న చిన్న దారం ముక్కలను కలుపుకుంటూ పొడవైన దారంగా మలచుకున్నారు. వీటికోసం ఆయన ఎలాంటి పరికరాలనూ వాడలేదు. ఏ ఉపకరణాలనూ ఉపయోగించలేదు. అన్నీ తన చేతుల్తోనే. ఓర్పుగా, నేర్పుగా చేసుకుంటూ పోతున్నకొద్దీ తన నిపుణతలోనూ మార్పు కనిపించింది. ఎంతో శ్రమించి చెర్నోకోల, నాగలి, సిగమారలు, చిక్కాలు, కండువ, చీర, రవిక, చేతి సంచులు వంటి వస్తువులును తయారు చేశారు. వరిగడ్డి త్వరగా చేడిపోదు కాబట్టి దానిని భద్రపర^è డంలో ఇబ్బంది ఏమీ ఉండదని అంటారాయన. ఈ కళాకారుడి ప్రతిభకి స్థానికుల నుంచే కాక, రాష్ట్ర, జాతీయ స్థ్దాయిలో కూడా అనేక ప్రశంసలు అందాయి. తాను నేసిన వరికండువాను భారత రాష్ట్రపతికీ, ప్రధానమంత్రికీ బహూకరించాలన్నది కృష్ణమూర్తి ఆలోచన. వరిగడ్డితో రూపొందించిన ఆ కళాకృతులను చూసిన ఎందరో పెద్దల నుంచి ప్రశంసలే కాదు... రెండు పదులకు మించి మరెన్నో పురస్కారాలందుకున్నారు మువ్వా కృష్ణమూర్తి. రాష్ట్రస్థాయిలో పశుసంవర్ధక శాఖతో పాటు అనేక సంస్థల నుంచి నుంచి చాలా సత్కారాలనూ, పురస్కారాలను పొందారు. తనతోనే ఈ కళ అంతరించిపోకుండా తర్వాత కూడా కొనసాగాలన్నదే ఆయన కోరిక. – పాలేరు శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, పర్చూరు ముందుకెవ్వరూ రావడం లేదు నా వయసిప్పుడు 78 ఏళ్లు. ఇప్పటికీ నా పనులు నేనే చేసుకుంటుంటాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను. నాలో ఓపిక నశించేలోగా నా కళను ఇతరులకు నేర్పాలన్నది నా ఆలోచన. ఔత్సాహికులెవరైనా ముందుకొస్తే తప్పకుండా నేర్పుతాను. – మువ్వా కృష్ణమూర్తి -
‘ఇది శాఖాహార సింహం అనుకుంటా’
-
‘ఇది శాఖాహార సింహం అనుకుంటా’
గాంధీనగర్: మృగరాజు సింహం విషయంలో తరచుగా ఓ మాట వింటుంటాం. ఆకలేసినంత మాత్రానా సింహం గడ్డి తినదని. కానీ ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఈ సింహం తాపీగా గడ్డి నముల్తుంది కాబట్టి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ వింత సంఘటన గిర్ అడవుల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గుజరాత్లో గిర్ అభయారణ్యంలో ఓ సింహం గడ్డి తింటూ వీడియోకు చిక్కింది. సింహం గడ్డిని నమిలి, బయటకు ఉమ్మేయడం వీడియోలో రికార్డయ్యింది. దాన్ని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇది శాఖహార మృగరాజేమో’.. ‘ఈ సింహం భార్య డైటింగ్ చేయమన్నట్లుంది. అందుకే ఇలా గడ్డి తింటుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే జంతుశాస్త్రం తెలిసిన వారు మాత్రం ఇది అంత ఆశ్చర్యపోవాల్సిన సంఘటనేం కాదు అంటున్నారు. పేగులను శుభ్రం చేసుకోవడానికి గాను సింహాలు ఇలా గడ్డిని తింటాయన్నారు. పిల్లి జాతికి చెందిన అన్ని జీవులు గడ్డిని భేదిమందు(విరేచనాలు)గా సేవిస్తాయన్నారు. సింహం లాంటి మాంసాహార జంతువులు ఓ జీవిని చంపి ఆహారంగా తీసుకున్నప్పుడు.. అది అరగకపోతే ఇలా గడ్డిని తింటాయి. ఆ రసం భేది మందుగా పని చేస్తుంది. అందుకే సింహం గడ్డిని నమిలి.. చివరకు బయటకు ఉమ్మేసింది అని తెలిపారు. దీని గురించి షెత్రుంజి రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సింహాల కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాంతులు చేసుకునేందుకు అప్పుడప్పుడు గడ్డి తింటుంటాయని పేర్కొన్నారు. పచ్చిమాంసం కొన్నిసార్లు వాటి జీర్ణక్రియను ఇబ్బంది పెడుతుందని, అటువంటి సమయంలో దానిని మళ్లీ బయటకు పంపేందుకు ఇలా గడ్డి తింటాయని వివరించారు. ఏది ఏమైనా సింహం గడ్డి తినడం నిజంగా చాలా అరుదైన సంఘటనగానే చెప్పవచ్చు. -
రండి రండి రండి.. దయచేయండి!
సాక్షి, హైదరాబాద్: పక్క రాష్ట్ర అడవుల నుంచి పులులను ఆకర్షించడం కోసం అధికారులు అడవుల్లో గడ్డిని పెంచే పనిలో పడ్డారు. ఆహారం కోసం వేట సాగించేందుకు పులి గడ్డి ప్రాంతాలను ఎక్కువగా వాడుకుంటుందని, దీని కోసం నల్లమల, కవ్వాల్‌లో గడ్డిని పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కవ్వాల్ అభయారణ్యంలోని 2,700 హెక్టార్లు కేటాయించి ప్రణాళికలు రూపొందించారు. శాఖాహార అటవీ జంతువులు ఇష్టంగా తినే 14 రకాల గడ్డి జాతులను గుర్తించి ప్రతి బీట్‌లో కనీసం 2.5 హెక్టార్ల చొప్పున పెంచనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా జన్నారం ఫారెస్టు డివిజన్లోని 500 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ దశలవారీగా పనులు చేపట్టనున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోనూ గడ్డిని పెంచే ప్రక్రియను మొదలుపెట్టారు. 55 వాగులు, 21 కుంటలు, 163 నీటి తొట్టెల చుట్టూ గడ్డిని పెంచుతున్నారు. మూడు నెలల్లో ఇది పెరిగి క్షేత్రాలుగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విత్తన సేకరణకు, ఆహారంగా.. వన్యప్రాణులకు ఆహారంగా ఉపయోగపడేలా, విత్తనాలను సేకరించి భద్రపరిచేలా రెండు రకాలుగా గడ్డిని పెంచనున్నారు. విత్తన సేకరణ కోసం కవ్వాల్‌లోని తాళ్లపేట రేంజ్ లింగాపూర్ బీట్‌లో 30 హెక్టార్లు, నల్లమలలో అమ్రాబాద్ బీట్‌లోని బుగ్గ వాగు, తోళ్లవాగు పరిసర ప్రాంతాలను గుర్తించారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో 2,7000 హెక్టార్లలో కవ్వాల్ అభయారణ్యాన్ని అభివృద్ధి చేసి 2012లో టైగర్ సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. మహారాష్ట్రలోని తాడోబా ఫారెస్టు నుంచి పులులు ఇటుగా వస్తాయని అధికారులు భావించారు. అయితే వచ్చిన పులులు తిరిగి వెళ్లిపోతుండటంతో దానిపై దృష్టి సారించారు. నల్లమలలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ఈ అడవుల్లోకి వచ్చిన పులులను ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం ఆహారం సులువుగా లభించేలా, తక్కువ వేటకు వీలుగా, శాఖాహార జంతువులను ఆకర్శించేందుకు గడ్డిని పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. -
కుందేళ్లు చిన్నవి.. లాభాలు పెద్దవి!
అరకొరగా చదువుకున్న మహిళలు చాలా మంది వంటింటికే పరిమితం అవుతున్నప్పటికీ.. దృఢసంకల్పంతో ముందడుగేస్తున్న రాధమ్మ వంటి మహిళా రైతులు ఆదర్శప్రాయమైన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. వివిధ పంటల సాగుతోపాటు బర్రెలు, కుందేళ్ల పెంపకం చేపట్టారు. వివిధ నగరాల్లో తమ కుందేలు మాంసాన్ని గిట్టుబాటు ధరకు అమ్మడం ద్వారా చేతినిండా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ ఇంటర్ వరకు చదువుకున్నారు. తొలినాళ్లలో టైలరింగ్ చేసిన ఆమె ఆ తర్వాత వ్యవసాయం, పశుపోషణ, కుందేళ్ల పెంపకంపై దృష్టిపెట్టారు. గ్రామ సమీపంలో ఓ షెడ్డు నిర్మించి రూ. 5 లక్షల పెట్టుబడితో మూడేళ్ల క్రితం కుందేళ్ల పెంపకం ప్రారంభించారు. 300 కుందేళ్లతో పెంపకం ప్రారంభించగా ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు చేరింది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్‌లూజర్ రకం గడ్డిని సాగు చేస్తున్నారు. దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్క పొడిని దాణాగా ఇస్తున్నారు. నలుగురు కూలీలను నియమించారు. ఆడ కుందేలు నెలకోమారు 5–10 పిల్లలు పెడుతుంది. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుంది. పిల్లలు నాలుగు నెలల్లో రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు పెరుగుతాయి. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్‌పై కుందేళ్ల మాంసం సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో కుందేలు మాంసం కిలోకి రూ.650 ధర పలుకుతున్నది. కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ.లక్ష నికరాదాయం వస్తున్నదని రాధమ్మ తెలిపారు. పదెకరాలలో మూడు బోర్లు వేయించి వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతోపాటు 10 బర్రెలను పోషిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని, రైతుగా తనకు చాలా సంతృప్తిగా ఉందని రాధమ్మ(89855 97106) సంతోషంగా తెలిపారు. – ఈటి సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా -
నాటు కోళ్ల హేచరీ!
మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటు కోళ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతూ వస్తున్నది. అయితే, షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే, ఉన్నత విద్యావంతులైన అరుణ్ క్రాంతి, నవత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. వినూత్నంగా మొలక గడ్డినే మేతగా వేస్తున్నారు. అంతేకాదు, స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి పిల్లల హేచరీని నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 10 వేల నాటు కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఖర్చులు బాగా తగ్గించుకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు. తమ ప్రాంతంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచారు. వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత ఎంబీఏ చదివారు. ఇద్దరికీ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ రెండెకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్ వేసి, ఒక షెడ్డు వేసుకొని, ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు. తొలుత, 2005 నుండి 2012 వరకు ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి, మార్కెటింగ్ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. తదనంతరం కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటు కోళ్ల పెంపకంతోపాటు హేచరీపై దృష్టి పెట్టి నిలదొక్కుకున్నారు. నెలకు రూ. లక్ష ఆదాయం పొందేలా ఎదిగారు. 800 నాటు కోళ్లు.. 10 వేల కోడి పిల్లలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు. నాటుకోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దాణా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి, నాటు కోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తొలుత 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టగా, నేడు 800 కోళ్లతో పాటు, నెలకు 5–10 వేల కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేయకుండా.. అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకున్నారు. 21 రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి. మరికొద్ది రోజుల పాటు లైట్ల కింద అతి జాగ్రత్తగా పెంచిన తర్వాత, కోడి పిల్లలను బయటకు వదులుతారు. ట్రేలలో పెంచే మొలక గడ్డి, ఆకుకూరలు, అజొల్లా.. ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోపోనిక్ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్నగడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితోపాటు.. ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్‌నెట్ హౌస్‌లో అజొల్లాలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్వీడ్తోపాటు మినరల్స్ కూడా ఇస్తుంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటుంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే.. మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి తవుడును కలిపిన దాణా వేస్తుంటారు. సాధారణంగా పెరటి కోళ్లు పెంచే వారు పెట్టే ఖర్చులో 20% ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. గ్రామాల నుంచి నాటు గుడ్ల సేకరణ నాటు కోడి పిల్లలకు డిమాండ్ రావడంతో, ప్రతి వారానికి జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి 3–4 వేల గుడ్లను సేకరిస్తారు. వీటితో పాటు, తన ఫామ్‌లో కోళ్ల నుండి వచ్చిన గుడ్లను ముందుగా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తారు. తర్వాత, 6 గంటల పాటు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్ లేకుండా ఉండేందుకు ప్యూమిగేషన్ చేస్తారు. ఎందుకంటే, 21 రోజుల పాటు ఎలాంటి వైరస్ గుడ్లకు సోకకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్వయంగా తయారు చేసిన గుడ్లను ఉంచే పరికరంలో లైట్ల వెలుతురులో గుడ్లను పెడుతుంటారు. ఇలా.. దాదాపు ఆరు గుడ్ల నుండి పిల్లలు వచ్చే పరికరాలు ఉన్నాయి. దాదాపు నెలకు 5–10 వేల నాటు కోడి పిల్లలు అందిస్తున్నాడు. 80 రోజుల్లో కిలో–కిలోన్నర బరువు నాటు కోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ రీతిన పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి పిల్లను రూ. 35 పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు.. 80 రోజుల్లో మార్కెట్లో అమ్మే వరకు ఏ రోజు ఏమి చేయాలో షెడ్యూల్ ఇస్తుంటారు. కోడి కిలో నుండి కిలోన్నర బరువు పెరగ్గానే అమ్మితే, కిలో రూ. 200 పలుకుతోంది. నాటు కోళ్లకు డిమాండ్ బాగా ఉండటంతో, వీరి నాటు కోళ్ల ఫారాన్ని ప్రతి రోజూ చాలా మంది చూసి వెళ్తుంటారు. ఓటమే రేపటి విజయానికి నాంది! ఏదో సాధించాలన్న తపనతోనే కోళ్ల పెంపకం చేపట్టాము. ఈము కోళ్ల పెంపకంతో చేతులు కాల్చుకున్నాం. విదేశీ కోళ్ల సాగులో గుణపాఠం నేర్చుకొని అత్యంత శ్రద్ధతో నాటు కోళ్లు, పిల్లల పెంపకం చేపట్టాం. ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి మేమే నిదర్శనం. ప్రతి రోజూ కోళ్ల ఫారానికి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిశితంగా గమనిస్తూ ఉంటే ఏ కోడి గుడ్డు పెడుతుందో, ఏ కోడి పెట్టడం లేదో మాకు తెలిసిపోతుంది. కోళ్లకు వివిధ రకాల గడ్డిని ట్రేలలో పెంచుతుంటాం. ఆరోగ్యంగా ఆరుబయట తిరుగాడుతూ పెరుగుతున్న నాటు కోళ్లను చూస్తే తృప్తిగా ఉంటుంది. – నవత, అరుణ్ క్రాంతి (90005 67121), జగిత్యాల కృత్రిమంగా గుడ్లను పొదిగే ఏర్పాటు విద్యుత్ దీపాల వెలుగులో నాటు కోడి పిల్లలు ట్రేలలో పెరుగుతున్న మొలక గడ్డి మొక్కజొన్న మొలక గడ్డిని తింటున్న కోళ్లు – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
పశుగ్రాసం కొరతను..నివారించండి ఇలా..
విజయనగరం ఫోర్ట్: వేసవిలో పశువులను ఎక్కువగా వేధించే సమస్య పశుగ్రాసం కొరత. మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎండ తీవ్రత ఎక్కువ. ఆ నెలల్లో పశుగ్రాసం దొరకదు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రాయితీపై పశుగ్రాసాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నామని పశుసంవర్థక శాఖ జేడీ వై.సింహాచలం తెలిపారు. ఈ మేరకు రైతులకు పశుసంవర్థకశాఖ ద్వారా రైతులకు అందించే పథకాల గురించి వివరించారు. సైనేజ్గడ్డి.. సైనేజ్గడ్డిని బేళ్లు రూపంలో రైతులకు అందిస్తున్నారు. కిలో గడ్డి ధర రూ. 6.92. కానీ రాయితీపై కిలో రూ.2కే అందిస్తున్నారు. ఒక రైతుకు గరిష్టంగా 3600 కేజీల గడ్డి ఇస్తారు. కావాల్సిన వారు సంబంధిత పశువైద్యాధికారిని గాని, గోపాలమిత్రను గాని సంప్రదించాలి. ఈ గడ్డి వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. వారం పాటు పశువులకు అలవాటు చేయాలి. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు.. ఈ పథకంలో భాగంగా గడ్డిని సాగు చేసే రైతులకు భూమి లీజు, ఉత్పత్తి వ్యయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు భూమి లీజు చెల్లిస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని ఉపాధి పథకం ద్వారా చెల్లిస్తారు. బహువార్షిక గడ్డి అయితే ఎకరానికి రూ.37వేలు, ఏకవార్షిక గడ్డి అయితే రూ.15వేల చొప్పన అందిస్తారు. గడ్డిని సాగు చేసిన రైతు కిలో గడ్డిని రూ.1కే మిగతా రైతులకు అందించాలి. దాణామృతం.. దాణామృతం గడ్డిలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని రోజుకి ఒక పశువుకు 10 నుంచి 12 కిలోలు పెట్టాలి. గరిష్టంగా ఒక రైతుకు 3500 కిలోలు ఇస్తాం. కిలో విలువ రూ.12.50 కాగా రాయితీపై రైతులకు రూ.3.50 పైసలకు అందిస్తాం. -
కరెంటు ఫుల్...నీళ్లు నిల్
కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న విధంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి విద్యుతే ప్రాణాధారం. ప్రభుత్వం ఇప్పుడు 24గంటల ఉచిత నిరంతర విద్యుత్ ఇస్తున్నా ఆయకట్టేతర ప్రాంతాలకు చెందిన రైతులు ఏమాత్రం సంతోషంగా లేరు. విద్యుత్‌ను అవసరాల మేరకే సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో రైతులను చైతన్య పరచడంలో విద్యుత్‌శాఖ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల విద్యుత్ మోటార్లు ఆగకుండా నడుస్తుండడంతో భూగర్భ జలమట్టం అంతకంతకూ పడిపోతోంది. ఫలితంగా బోర్లు వట్టిపోయి, పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు. పైన ఫొటో చూడండి.. పశువులు మేస్తున్న ఎండిన పంట నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలోనిది. ఈ గ్రామంలో 350 ఎకరాల్లో ఈ సీజన్లో వరి సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో డీ–40 కాల్వ ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు వరి పంటలను సాగు చేశారు. అయితే కాల్వ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో పరిస్థితి తారుమారు అయ్యింది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో సాగు చేసిన వరి చేలు ఎండి పోతున్నాయి. మరో నెల రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో 200 ఎకరాల వరకు వరి ప్రస్తుతం పూర్తిగా ఎండి పోయింది. దీంతో కొంతమంది రైతులు కొత్తగా బోర్లు వేసి ఫలితం లేక చేతులు కాల్చుకుంటున్నారు. చేసేది లేక పశువులను మేపుతున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ: వానాకాలం అంతగా కలిసి రాకపోవడంతో యాసంగి పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. కరెంటు ఫుల్‌గా ఉన్నా, సరిపడా నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు బోరుమంటున్నారు. నల్లగొండ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 10.91 మీటర్లపైనే నీరందగా, వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భూగర్భజలమట్టం 11.30 మీటర్ల లోతుకు పడిపోయింది. నెల రోజుల్లో యాదాద్రి జిల్లా పరిధిలో రెండు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఆటో స్టార్టర్లతో నడుస్తున్న మోటార్లు కాలిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పంటను కాపాడుకోవాలనే తపనతో రైతులు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం.. విద్యుత్ వినియోగం గత యాసంగి సీజన్ కంటే ఈ సీజన్లో సాగు విస్తీర్ణం, విద్యుత్ వినియోగం పెరిగిపోయాయి. సాగర్, మూసీ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో భూగర్భజలంపై ఆధారపడే రైతులే ఎక్కువ. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3.87లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క నల్లగొండ పరిధిలోనే గత ఏడాది ఫిబ్రవరిలో 297 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 466 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అదేస్థాయిలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిపోయింది. నల్లగొండలో గతేడాది యాసంగిలో 57వేల హెక్టార్లలో సాగు చేస్తే, ఈ సారి 74వేల హెక్టార్లకు పెరిగిపోయింది. సూర్యాపేట జిల్లాలో గతేడాది 74వేల హెక్టార్లలో సాగుచేయగా, ఈ సారి 80వేల హెక్టార్లకు పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యాసంగిలో 25వేల హెక్టార్లలో వరి సాగైంది. దీంతో నిరంతరం విద్యుత్ వాడుతున్న ఫలితంగా బోర్లు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్, నాగారం, మద్దిరాల మండలాల పరిధిలో 7240 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇప్పటికే 50 శాతం పొలాలు ఎండిపోయాయి. తమ పంటలు ఎండిపోవడానికి కారణం 24గంటల విద్యుత్ అని రైతులు వాపోతున్నారు. 24 గంటల విద్యుత్ వద్దని రైతులు గ్రామాల్లో రాస్తారోకో, ధర్నాలు చేస్తున్న విషయం విదితమే. రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది మాకున్న రెండు ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాం. ఉన్న రెండు బోర్లు నెల రోజుల్లో వట్టిపోయాయి. 20 రోజుల క్రితం కొత్తగా రూ.50 వేలు ఖర్చు పెట్టి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. మొత్తం రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులను మేపుతున్నాం. పెట్టిన పెట్టుబడి పోగా మరో రూ.70 వేల వరకు అప్పు మిగిలింది. – మల్లేపల్లి సైదమ్మ, సర్వారం, తిప్పర్తి మండలం 12గంటలు ఇస్తే చాలు ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇస్తుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు తగ్గి బోర్లు సన్నని ధారగా పోస్తున్నాయి. నాటు పెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో 12 గంటల కరెంట్ విడుతల వారీగా ఇస్తేచాలు. వ్యవసాయం చేయగలం. నీటి వసతి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 24 గంటలు ఇచ్చుకుంటే సరిపోతుంది. – గంగేశ్వర్, రైతు, అడ్డగూడూరు ఆటోస్టార్టర్లు తొలగించుకోమని చెప్పాం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న నాటి నుంచే రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించుకోమని చెబుతున్నాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. అవసరం మేరకు విద్యుత్ వాడుకుని ఆ తర్వాత రైతులు తమతంటతాముగానే స్టార్టర్లు బంద్ చేసుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిరోజుల నుంచి జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. ప్రతీ రోజూ నల్లగొండ జిల్లాలో 29.86 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. వాస్తవానికి జిల్లా కోటా 18.30 మిలియన్ యూనిట్లు మాత్రమే. – కృష్ణయ్య, విద్యుత్ శాఖ, ఎస్ఈ, నల్లగొండ -
నాలుగు పోచలు వేస్తే సరి!..
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలో గడ్డి జాతికి చెందిన ‘దర్భ’ ముఖ్యమైనది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. అపర కర్మలలో దర్భలు లేకుండా పని జరగదు. దీని ఆవిర్భావం వెనక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. అయితే, కూర్మ పురాణం ఏమి చెబుతోందంటే, విష్ణుమూర్తి కూర్మావతారంలో మంధర పర్వతాన్ని మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మం వంటిమీద ఉండే కేశాలు సముద్రంలో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశలుగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వల్ల అవి అంతటి పవిత్రతను సంతరించుకున్నాయంటుంది. వరాహ పురాణం. ఈ దర్భలు వరాహావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశాలని చెబుతోంది. అందువలననే దర్భగడ్డికి ఎంతో ప్రత్యేకత ఉంది. దర్భలకు వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. దీన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు వంటి వాటికి మందుగా వాడుతున్నారు. అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం పూర్వం నుంచి ఉన్న అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే... సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు అంటే అల్ట్రా వయొలెట్ రేస్ ఉత్పన్నమవుతాయట. అయితే, ఈ అతినీలలోహిత కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ ఇళ్లను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు ఎప్పుడో గుర్తించబట్టే, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొనమని శాసనం చేశారు. బహుశా అందుకే పూర్వం గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారనుకుంటా. కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. నేడు చంద్రగ్రహణం కాబట్టి, చాలామంది ఇళ్లలోని పచ్చడి జాడీలు, ఇతర ఆహార పదార్థాలపై నాలుగు దర్భపరకలు వేస్తారు. పెద్దవాళ్లు పాటించే ఈ ఆచారం అంత తేలికగా కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే, నిల్వ ఉండే ఊరగాయలు వంటివి గ్రహణ సమయంలో రేడియేషన్ ప్రభావానికి పాడవుతాయట. వాటి మీద దర్భలు వేయడం వల్ల రేడియో ధార్మిక కిరణాల ప్రభావం ఉండదట. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లోఉండేలా చూసుకోవడం మరువకండి. -
వెదురు.. చెట్టు కాదు గడ్డే!
అటవీయేతర ప్రాంతాల్లో గిరిజనులు వెదురును అమ్ముకునేందుకు వీలుగా పార్లమెంట్ 1926 నాటి అటవీ చట్టాన్ని సవరిస్తూ బిల్లును ఆమోదించింది. రిజర్వ్ ఫారెస్టు మినహా మిగిలిన చోట్ల వెదురును చెట్టుగా పిలవరాదని పేర్కొంది. దానిని గడ్డిగానే పరిగణించాలి. రిజర్వ్ ఫారెస్టులో చెట్టుగా వెదురును పిలవాలని దానిలో తెలిపింది. తాజా సవరణ ప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. కొయ్యూరు (పాడేరు) : మహారాష్ట్రలో మాదిరిగా రాష్ట్రంలో కూడా వెదురును నేరుగా గిరిజనులు అమ్ముకునేందుకు వీలుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2011లో అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఆయన నాతవరం మండలంలో దానిని ప్రారంభించారు. తరువాత అది అలానే ఉండిపోయింది తప్ప గిరిజనులకు వెదురుపై అధికారం రాలేదు. గిరిజనుల నుంచి మావోయిస్టులను వేరు చేయాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే తరువాత గిరిజనులకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. తాజాగా కేంద్రం వెదురును అటవీయేతర ప్రాంతాల్లో కూడా అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని మూలంగా కొన్నిచోట్ల గిరిజనులు నేరుగా వెదురును అమ్ముకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. జిల్లాకు సంబంధించి నర్సీపట్నం అటవీ డివిజన్‌లోనే ఎక్కువగా వెదురు కూపీలున్నాయి. వాటి నుంచి యేడాదికి 40–50 లక్షల వెదుర్లను తీస్తారు. మన్యం వెదురుపై హక్కుకు నోచని గిరిజనం ప్రభుత్వం 2011లో ఇచ్చిన సడలింపు ప్రకారం గిరిజన మహిళలు గ్రూపులుగా ఏర్పడి వెదురును నరికి వ్యాపారులకు విక్రయించవచ్చు. అలా విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాలి. దీని మూలంగా గిరిజనుల ఆదాయం పెరిగి మావోయిస్టులకు దూరంగా ఉంటారని నాడు భావించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. నర్సీపట్నం అటవీ డివిజన్లో వెదురు ద్వారా అటవీ శాఖ యేడాదికి రూ.రెండు నుంచి రెండున్నర కోట్ల ఆదాయాన్ని అర్జిస్తుంది. మొత్తం వెదురు ఉత్పత్తిలో అటవీ శాఖ తీస్తున్నది 40 శాతం మాత్రమే. మిగిలినదంతా తీసేందుకు వీలు లేక వదిలిపెడుతున్నారు. అదంతా వృథా అవుతుంది. కొండలపై నుంచి వెదురును తీసుకురావడం కూడా కష్టంగా మారింది. వెదురు సైజ్‌ను అనుసరించి అటవీ శాఖ గిరిజనులకు కూలి చెల్లిస్తుంది. తరువాత దానిని రవాణా చేసి నిల్వ కేంద్రాల వద్ద ఉంచుతుంది. నెలకు ఒకసారి వ్యాపారులకు వేలం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి వెదురును ఎక్కడ నుంచి తీసుకువచ్చినా దానిని అటవీ శాఖ పట్టుకుంటుంది. తాజాగా పార్లమెంట్ సవరించిన 1926 నాటి చట్టం çప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. రూ.60–75 మధ్యలో వెదురు ఒకప్పుడు రాజమండ్రి పేపర్మిల్లుకు మన్యంలో వెదురును సరఫరా చేసేవారు. అయితే మైదాన ప్రాంతంలో సుబాబుల్ పెంపకంతో పేపర్‌మిల్లు వెదురును వదిలిపెట్టింది. నాటి నుంచి అటవీ శాఖ వ్యాపారులకు వేలంలో విక్రయిస్తుంది. ప్రస్తుతం ఒక్కో వెదురు ధర రూ.60–75 మధ్య పలుకుతుంది. ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొని వీటిని కొనుగోలు చేస్తున్నారు. వెదురుతో అందమైన వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. మర్రిపాకల రేంజ్‌కు సంబంధించి వై రామవరం మండలం వెదురునగరం వద్ద, గొలుగొండ, నర్సీపట్నం, చింతపల్లి, సీలేరులో డిపోలను ఏర్పాటు చేసింది. నెలకోసారి అక్కడ వేలం నిర్వహిస్తారు. -
వర్షాకాలంలో పశుసంరక్షణ
ధర్మవరం అర్బన్ : వర్షాకాలం వచ్చిందంటే పశువులు రకరకాల వ్యాధులకు గురవుతాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, చిటిక వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ప్రాణాంతకం కూడా. దీంతో పశువులను కాపాడుకోవడానికి పశు వైద్యుల వద్దకు రైతులు పరుగులు తీస్తుంటారు. పశువులకు ఏఏ వ్యాధులు సోకుతాయో ఇలా వివరిస్తున్నారు. – గొంతువాపు వ్యాధి... ఇది నల్లజాతి రకాలైన గేదెలు, దున్నల్లో వస్తుంది. దీని కారణంగా గొంతు వాచిపోయి ఉంటుంది. ఓ రకమైన సూక్ష్మజీవి వల్ల పశువుల్లో ఈ వ్యాధి వస్తుంది. పల్లపు ప్రాంతాలు, వర్షం నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నీరసంగా ఉండే పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. ఇది జూన్ నుంచి సెప్టెంబరు మాసాల్లో కనిపిస్తుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో ఎక్కువగా గొంతు వాపు కూడా వస్తుంది. ఈ వ్యాధి వల్లే ఎక్కువ పశువులు మరణిస్తాయి. – వ్యాధి లక్షణాలు... వ్యాధి సోకిన పశువుకు శ్వాస పీల్చినప్పుడు ఆయాసం వస్తుంది. గురక వినిపిస్తుంది. గొంతు పైభాగం, మెడ కింది భాగాన వాపు వస్తుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. తీవ్ర జ్వరం వచ్చి పశువు మరణిస్తుంది. – వ్యాధి నివారణ చర్యలు... జూన్, జులై, ఆగస్టులో రైతులు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారాన్ని అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలిన వాటి నుంచి వేరుచేయాలి. వాటి స్థావరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. – జబ్బవాపు వ్యాధి... ఇది తెల్లజాతి రకాలైన ఆవులు, ఎద్దులకు సోకుతుంది. ఆరోగ్యంగా బలంగా ఉండే పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తొలకరి చినుకులు పడ్డాక ఉష్ణ ప్రాంతాలు, తేమగా ఉండే ప్రాంతాల్లో ఉన్న పశువులకు ఈ వ్యాధి సోకుతుంది. బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వస్తుంది. కలుషితమైన ఆహారం తినడం వల్ల కలుషిత నీరు తాగడం వల్ల కూడా సంక్రమిస్తుంది. – దీని లక్షణాలు.. ఆరోగ్యంగా, బలంగా ఉన్న ఆరుమాసాలు నుంచి రెండేళ్ల వయసున్న పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వ్యాధి లక్షణాలను గుర్తించేలోగానే పశువు మరణిస్తుంది. జబ్బ, తొడ కండరాలపై వాపు వస్తుంది. వాపు ఉన్నచోట తాకితే శబ్దం వస్తుంది. వ్యాధి సోకినప్పటి నుంచి పశువులు నీరసించి ఆహారం తీసుకోలేవు. తీవ్రమైన జ్వరంతో చనిపోతాయి. వ్యాధి సోకిన 12 నుంచి 36 గంటల్లో పశువులు మరణిస్తాయి. – వ్యాధి నివారణ చర్యలు... వర్షాలకు ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, అవి విడిచిపెట్టిన గడ్డిని కాల్చివేయాలి. మరణించిన పశువును సున్నపు గోతిలో పూడ్చాలి. – చిటిక వ్యాధి... ఇది గొర్రెల్లో వస్తుంది. ఎంటరోటాక్సీమియా అనే బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి గొర్రెలకు సోకుతుంది. ఏడాది వయసు గల గొర్రెల్లో ఇది ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది. – వ్యాధి లక్షణాలు.. వ్యాధి సోకిన గొర్రెలు నీరసిస్తాయి. కొద్ది సేపటికే గొర్రెలు గిలగిలా కొట్టుకుని, గాలిలోకి ఎగిరి కిందపడి మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో గొర్రెల్లో కనిపిస్తాయి. – ఇవి నివారణ చర్యలు... వర్షాలకు ముందే గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను గొర్రెల మంద నుంచి వేరు చేయాలి. – గాలికుంటు వ్యాధి... వర్షాకాలంలో గాలికుంటువ్యాధి పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒకసారి ఈ వ్యాధి సోకితే జీవితకాలం ఆ పశువులో పాల ఉత్పత్తి సగానికిపైగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా పాడి పశువులకు టీకాలు వేయాలి. ఈ వ్యాధి ఎక్కువగా పందులు, గేదెలు, దున్నల్లో కనిపిస్తుంది. ఇది పశువులకు ఆగస్టు, సప్టెంబరు నెలల్లో వస్తుంది. సూక్ష్మజీవి కారణంగా పశువుకు సోకుతుంది. వ్యాధి సోకిన ఆవు, గేదెల పాల నుంచి వాటి చూడలకు వ్యాపిస్తుంది. – ఇవీ లక్షణాలు... నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. ఒకటి నుంచి 4 వారాల్లో ఆ బొబ్బలు చితికి గాయాలవుతాయి. పశువుల నోటిలో చిగుళ్లపై పొక్కులు వస్తాయి. దీంతో పశువు నీరసించిపోయి నోటి నుంచి చొంగ కారుతుంది. పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. – రైతులు అప్రమత్తంగా ఉండాలి... పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి. పశువులకు వివిధ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యులను సంప్రదించాలి. పశువులను గాలి, వెలుతురు వచ్చేలా పాకల్లో కట్టాలి. ఈగలు, దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ఎక్కువగా వానలో తడిసిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. గాలికుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 14 వరకు టీకాలు వేయించాలి. నట్టల నివారణకు ఏటా రెండుసార్లు టీకాలు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు విడతలుగా టీకాలు వేయనున్నారు. -
మూగజీవాలకు మేత కరువు
► కరువు దెబ్బకు అల్లాడుతున్న పశువులు ► జిల్లాలో తగ్గిన పాల ఉత్పత్తి సాక్షి ప్రతినిధి – నెల్లూరు : జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం కారణంగా మూగ జీవాలకు మేత, నీటి సమస్య ఏర్పడింది. వర్షాలు కురవక పోవడంతో గడ్డి కొరత ఏర్పడింది. దీంతో రైతులు పశువులను పోషించలేక కబేళాలకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అరకొర సహాయక చర్యలు రైతుల్లో ధైర్యం నింపలేక పోతున్నాయి. దీంతో రెండు నెలలుగా జిల్లాలో పాల దిగుబడి సైతం గణనీయంగా తగ్గింది. మూడేళ్లుగా జిల్లాలో తిష్ట వేసిన కరువు ఈ సారి తన ఉగ్ర రూపం చూపింది. జిల్లాలో దాదాపు 70 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. దీంతో జలాశయాల్లో నీరు అడుగంటడంతో పాటు, జిల్లాలోని చెరువులన్నీ నీళ్లు లేక బీటలు వారాయి. రైతులు ఖరీఫ్‌కు సెలవు ప్రకటించారు. కరువు పరిస్థితుల్లో పాడిని నమ్ముకుని బతుకు సాగించే పాడి రైతులు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 1,17,966 ఆవులు ఉండగా, ఇందులో 54,505 ఆవులు పాలు ఇస్తున్నాయి. 6,24,654 గేదెలు ఉంటే, ఇందులో 2,93,587 గేదెలు పాలు ఉత్పత్తి చేస్తూ రైతులను ఆదుకుంటున్నాయి. రోజుకు సరాసరి 2 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. అయితే కరువు కారణంగా మేత, నీరు లేక పోవడంతో రెండు నెలలుగా 25 శాతం దాకా పాల ఉత్పత్తి తగ్గి పోయింది. తగ్గిన పాల దిగుబడి పెంచుకోవడం కోసం పశుసంవర్ధక శాఖ జిల్లాకు 728 సూటు గేదెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రూ.60 వేల విలువయ్యే ఈ గేదెను రూ.15 వేలకే రైతులకు అందించనున్నారు. కరువు మండలాల్లో పశువులను రక్షించుకోవడం కోసం పశుసంవర్ధక శాఖ సబ్సిడీ మీద 2వేల మెట్రిక్ టన్నుల దాణా, 1000 మెట్రిక్ టన్నుల సమీకృత దాణా, 500 టన్నుల పాతర గడ్డి సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో పాటు ప్రతి పంచాయతీలో పశువుల కోసం రెండు నీటి తొట్టెలు నిర్మించి అందులో నీరు నింపేలా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రామాల్లో ప్రజలు తాగడానికే నీరు లేక పోతే ఇక పశువులకు ఎక్కడి నుంచి తెచ్చి పోయాలని, పశువుల కోసం నిర్మించే తొట్లలో ప్రభుత్వమే తాగునీటిని నింపేలా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. -
గడ్డితో విమాన ఇంధనం..!
లండన్: భవిష్యత్ తరాల కోసం మరింత సుస్థిర ఇంధన వనరులను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో పరిశోధకులు ‘గ్రాసోలైన్’ అనే ఇంధనాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇది వాస్తవ రూపం దాల్చనుంది. గడ్డితో తయారు చేసే ఈ ఇంధనాన్ని విమానాల్లో ఉపయోగిస్తారు. ‘ఇప్పటి వరకు మీరు గడ్డిని కేవలం పశువులకు దాణగా ఉపయోగించడమే చుశారు. కానీ ఇప్పటి నుంచి గడ్డి ఒక జీవ ఇంధనంగా మారనుంది. సమృద్ధిగా లభించే గడ్డి ఇకపై మంచి శక్తి వనరుగా మారనుంది’ అని బెల్జియంలోని గేంట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వేసెర్న్కోర్ తెలిపారు. గడ్డి నుంచి ఇంధనం తయారుచేయడానికి అందులోని చక్కెరలను లాటిక్ యాసిడ్‌గా మార్చడానికి కొన్ని రకాల బ్యాక్టిరియాలను జోడించారు. ‘బయోడిగ్రేడేబుల్ ప్లాస్టిక్టస్ (పీఎల్ఏ)’ అనే రసాయన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేయడంలో లాటిక్ యాసిడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ముందుగా కార్పిక్ యాసిడ్‌గా మారి తర్వాత డెకెన్ అనే రసాయనంగా రూపొందుతుంది. డెకెన్ను విమాన ఇంధనాల్లో ఉపయోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు ప్రయత్నిస్తే జీవన ఇంధన ధర తగ్గడంతోపాటు కొన్నేళ్లలోనే ‘గడ్డి ఇంధనం’తో ఆకాశంలో ప్రయాణిస్తామని ప్రొఫెసర్ కోర్ ధీమా వ్యక్తం చేశారు. -
నిరంతరం పచ్చిగడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : అజొల్లా, హైడ్రోఫోనిక్ పద్ధతుల ద్వారా ఏడాది పొడవునా పచ్చిగడ్డి తీసుకోవచ్చని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. పశుశాఖ ద్వారా ఈ ఏడాది 90 శాతం రాయితీతో అజొల్లా, 75 శాతం రాయితీతో హైడ్రోఫోనిక్ యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. అవసరమైన రైతులు పశుశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అజొల్లా రోజుకు నాలుగు కిలోల అజొల్లా ఉత్పత్తి చేయుటకు 2.50 ‘‘ 1.5 మీటర్ల సైజులో ఒక తొట్టి తయారు చేసుకుని ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల తాజా మదర్ కల్చర్ అజొల్లా బెడ్‌పై సమానంగా పడేలా చల్లాలి. జాగ్రత్తలు పాటించి 8వ రోజు నుంచి ప్రతిరోజూ ఒక్కో తొట్టి నుంచి కిలో అజొల్లా గడ్డి తీసుకోవచ్చు. అజొల్లాను సూటిగా సూర్యకాంతి పడని, మరీ ఎక్కువ నీడ పడని ప్రదేశంలో పెంచాలి. ఎండబెట్టిన అజొల్లా పొదిలో 25–35 శాతం మాంసపు కృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్, బీ–12 విటమిన్లు ఉంటాయి. ఇందులో లిగ్నైట్ తక్కువగా ఉండటంతో పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. రోజూ 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువుకు తినిపించవచ్చు. ఫలితంగా పాల డిగుబడి 15 నుంచి 20 శాతం పెరుగుతుంది. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. హైడ్రోఫోనిక్ గడ్డి బార్లీ, సజ్జ, మొక్కజొన్న, జొన్న వంటి విత్తనాలతో మొలకగడ్డి తయారు చేసుకోవచ్చు. మన ప్రాంతానికి మొక్కజొన్నతోనే లాభదాయకం. అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంతో అవసరం. ప్లాస్టిక్ ట్రేలలో కొన్ని పద్ధతులు పాటించి పెంచితే 8 రోజుల్లో కిలో విత్తనం నుంచి 12–15 కిలోల పచ్చి మేత పొందవచ్చు. ఈ గడ్డిలో 17.2 శాతం ప్రోటీన్లు, 25.4 శాతం పీచు పదార్థం, 84.8 శాతం నీరు ఉన్నట్లుగా ప్రయోగాల్లో రుజువైంది. అలాగే దాణాలో ఉన్న విధంగా విటమిన్లు ఏ, ఈ, లవణాలు, క్యాల్షియం, భాస్వరం ఇతరత్రా పోషక పదార్థాలు ఉన్నట్లుగా తేలింది. మొలకగడ్డిని 9వ రోజు వేర్లతో సహా పశువుకు పెట్టాలి. ఒక్క పశువుకు 15–20 కిలోల గడ్డి పెట్టవచ్చు. నీరు, భూమి, కరెంటు ఖర్చు తక్కువతోనే ఇంటి వద్ద పెంచవచ్చు. పైగా పాల ఉత్పత్తి 15–20 శాతం పెరుగుతుంది. పశువులు సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.