- రబ్బర్ సీల్స్ వేసినప్పటికీ..
‘కడెం’ లీకేజీకి మందు ఎండుగడ్డి
Published Fri, Aug 26 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
కడెం : కడెం ప్రాజెక్టుకు తిరిగి ఎండుగడ్డే గతి అవుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధతి తగ్గినందున కొద్దిరోజులుగా నీరు వరదగేట్ల ద్వారా వథాగా బయటికి పోతోంది. ఇలా దాదాపు రోజూ 50 క్యూసెక్కుల నీరు వథాగా పోయింది. ప్రస్తుతం ఆయకట్టుకు నీరు చాలా అవసరం. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రాజెక్టు అధికార్లు వరదగేట్ల నుంచి అవుతున్న లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా సాధారణ ఎండు గడ్డితోనే ఈ లీకేజీలున్న చోట పెడుతున్నారు. అధికార్లు నాలుగు రోజుల నుంచి లీకేజీని ఆపేందుకు ఇతర ప్రాంతం నుంచి తెప్పించిన ఎండుగడ్డితో లీకేజీ అవుతున్న చోట పెట్టి బయటకు వెళ్తున్న నీటిని ఆపుతున్నారు. శుక్రవారం కూడా ఈ పనులు జరిగాయి. ఇంకా రెండు రోజుల్లో గేట్లన్నింటికీ గడ్డిపెట్టే పని పూర్తవుతుందని ప్రాజెక్టు జేఈ శ్రీనాథ్ వివరించారు.
రబ్బర్ సీల్స్ పెట్టినప్పటికీ. .
ప్రాజెక్టు నిర్మాణ కాలంలో వరదగేట్లకు నీటి లీకేజీలను ఆపేందుకు ఉపయోగించే టాప్, బాటమ్ రబ్బర్ సీల్స్ పాతవి కావడంతో అవి దెబ్బతిన్నాయి. దీంతో రెండేళ్ల క్రితమే రు.25 లక్షలతో కొత్తవి రబ్బర్ సీల్స్ తెప్పించి ప్రాజెక్టున్న అన్ని గేట్లకు పెట్టించారు. వీటి ద్వారా నీటి చుక్క కూడా బయటకు వెళ్లకూడదు. కానీ ప్రస్తుతం నీరు చాలా వరకు లీకేజీ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే రబ్బర్ సీల్స్ ఏ మేరకు నాణ్యమైనవో తెలిపోతుంది. ఈ విషయమై ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా రబ్బర్ సీల్స్ పెట్టినప్పటికీ వాటిలో చెత్తా చెదారం రావడంతో, ఇలా నీరు లీకేజీ అవుతోందని, అన్ని ప్రాజెక్టుల్లో రబ్బర్ సీల్స్ వేసినప్పటికీ కూడా ఇలాగే లీకేజీ జరుగుతుందని వివరణ ఇచ్చారు.
Advertisement
Advertisement