leakage
-
తాజ్‌మహల్ ప్రధాన గోపురం నుంచి లీకేజీ : స్పందించిన అధికారులు
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం తాజ్‌మహల్‌కి వర్షాల బెడద తప్ప లేదు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఢిల్లీలోని ఆగ్రాలో కొలువై వున్న ప్రేమసౌథం తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకైంది. దీంతో తాజ్ మహల్ ఆవరణలో ఉద్యానవనం నీట మునిగింది. ఈ లీకేజీకి సంబంధించి 20 సెకన్ల వీడియో ఇంటర్నెట్లో వీడియో గురువారం వైరల్‌గా మారింది.అయితే, సీపేజ్ కారణంగా లీకేజీ ఉందని, పాలరాతి భవనానికి ఎలాంటి నష్టం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఆగ్రా సర్కిల్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోమ్‌ను పరిశీలించామని ప్రమాదం ఏమీలేదని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.ఏఎస్ఐ సూపరింటెండింగ్ చీఫ్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. తోటలలో ఒకటి వర్షం నీటితో మునిగి పోయింది. దీన్ని తాజ్ మహల్‌ను సందర్శించిన పర్యాటకులు వీడియో తీశారని పేర్కొన్నారు.🇮🇳 Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits India's AgraWork is ongoing to drain the water from one of the Seven Wonders of the World.pic.twitter.com/C5shcu4HZh— RT_India (@RT_India_news) September 12, 2024 తాజ్ మహల్ మొత్తం దేశానికి గర్వకారణమని వేలాది పర్యాటకులు ఆకర్షిస్తున్న ఈ ప్రదేశంలో పర్యాటక పరిశ్రమలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుందని దీనిపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే తమ ఏకైక ఆశాదీపమని టూర్ గైడ్ ఒకరు కోరారు. కాగా ఆగ్రాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాజధాని నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు జలమయ మైనాయి. వర్ష కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
విశాఖ జిల్లా గాజువాకలోని శ్రవణ్ షిప్పింగ్ లో ప్రమాదం
-
అయ్యో పాపం.. గాఢ నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి కుటుంబం
మైసూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో ఊపిరాడక మరణించిన ఘటన మైసూరు యరగనహళ్లిలో జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు సఖరాయపట్టణ నివాసులు కుమారస్వామి (45), భార్య మంజుల (39), వీరి పిల్లలు అర్చన (19), స్వాతి (17)లు మృతులు. ఈ కుటుంబం చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణ గ్రామానికి చెందిన వారు. మైసూరు యరగనహళ్లిలో మూడేళ్ల నుంచి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రజక వృత్తితో జీవనం సాగిస్తున్నారు.చిన్న ఇంట్లో, కిటికీలు మూసేసివారిది 10 ఇన్ టు 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చిన్న ఇల్లు. ఇంటి వెనుక, ముందు ఒక్కో కిటికీ ఉన్నాయి. దుస్తులను ఇసీ్త్ర చేసేందుకు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. సొంతూర్లో పెళ్లికి వెళ్లి వచ్చి సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన వారు కిటీకీలు మూసేసి నిద్రించారు. ప్రయాణం చేసిన అలసటతో గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఒక సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయింది. అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా దట్టంగా వ్యాపించడం, ఆ గ్యాస్‌ను పీల్చి స్పృహ తప్పినవారు కొన్ని గంటల తరువాత ప్రాణాలు వదిలారు. అందరి చెవులు, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఇల్లు మొత్తం గ్యాస్ వాసన వస్తోంది.ఒక రోజంతా అలాగేసోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న వారు మంగళవారం ఉదయానికి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరూ చూసుకోలేదు. బుధవారం ఉదయం కుమారస్వామికి బంధువులు ఫోన్‌కాల్ చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో వారు ఇంటి ఇరుగుపొరుగు వారికి బంధువులు తెలియజేయగా వారు ఫైర్, పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉండగా, అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 3 గ్యాస్ సిలిండర్లను విచారణ కోసం సీజ్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారు. నగర పోలీసు కమిషనర్ రమేశ్ బానోత్ ఆ ఇంటిని పరిశీలించారు. విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు. అనుకోకుండా గ్యాస్ లీక్ అయ్యిందా, లేక కావాలనే చేశారా? అనేది అనుమానాస్పదంగా ఉంది. -
యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?
ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు. రోజుకి 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ నిర్మించారు. 2023 డిసెంబర్ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్‌ను పర్యవేక్షిస్తుంది. పైప్లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్ స్టీమ్ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్ పైప్‌లైన్ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్‌ను పునరుద్ధరించారు. ప్లాంట్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్ స్టీమ్ పైప్‌లైన్‌లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో గ్యాస్ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లి మిటెడ్ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్‌నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది. ప్లాంట్‌పై ఒత్తిడి మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్ పెరగడంతో రామగుండం ప్లాంట్‌లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్‌కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. -
అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఘటన మరిచిపోక ముందే.. మరొకటి వార్తల్లోకి ఎక్కింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు చోటు చేసుకోవడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వచ్చింది. అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 5.71 టిఎంసీల నీరు ఉండగా.. ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించారు. -
టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి, చైర్మన్ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్ అధికారులే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్‌కాపీల (ప్రింటెడ్ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా అందిందని సిట్ అధికారులు తేల్చారు. రాజశేఖర్‌రెడ్డి తనకు కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) షమీమ్‌కు గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. సిట్ అధికారులు ఏప్రిల్ 11న హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్‌కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్‌కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్ డామెర రమేశ్‌కుమార్ ఇంతకుముందు కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు. కేవలం ప్రింటెడ్ పత్రాలే ఇస్తూ.. లీకైన పేపర్లలో గ్రూప్–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్ కంప్యూటర్ నుంచి ప్రవీణ్, రాజశేఖర్ చేజిక్కించుకున్నవి సాఫ్ట్కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్లైన్ షేరింగ్ జోలికి పోలేదు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్‌కు మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్‌ఔట్స్ రూపంలో ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ కోసం పేపర్ ఇచ్చి.. రాజశేఖర్ తన పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్‌రెడ్డికి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్ఓ షమీమ్ కూడా గ్రూప్–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్.. తాను ఇచ్చే పెన్‌డ్రైవ్‌ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయాలని, ఎనీడెస్క్ ద్వారా న్యూజిల్యాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు యాక్సెస్ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్ ఇచి్చన పెన్‌డ్రైవ్‌ను తీసుకువెళ్లిన షమీమ్ తన ఇంటివద్ద ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసింది. తర్వాత రాజశేఖర్ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను యాక్సెస్ చేసిన ప్రశాంత్‌రెడ్డి.. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్‌కు ప్రవీణ్ ఇదే పంథాలో తన కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్.. ఎక్కడా లీకేజ్ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ షమీమ్, రమేశ్, సురేశ్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్‌లో ఉన్నది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. మరోవైపు సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. చదవండి: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్ -
ఆయిల్ పైప్ లైన్‌ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం
పాట్నా: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌కు చెందిన గువహటి-బరౌనీ పైప్‌లైన్‌ను బిహార్‌లో ధ్వంసం చేశారు దుండగులు. ఖగడియా జిల్లా బకియా గ్రామంలో పైప్‌ను కట్ చేసి ఆయిల్‌ను లీక్ చేశారు. దీంతో వేల లీటర్ల చమురు నేలపాలైంది. ఆయిల్ పైప్ లీకైన విషయం తెలియగానే సమీప గ్రామస్థులు వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. చమురు కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పైప్ లీకైన తర్వాత వేల లీటర్ల చమురు రోడ్డుపై, పొలాలపై పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను మాత్రం ఇంకా గుర్తించలేదు. ఐఓసీ అధికారులు హుటాహుటిన పైప్ లీకైన ప్రదేశానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమ ఇంజనీర్లను పిలిపించి లీకేజీని రిపేర్ చేశారు. అయితే పైప్ ఎలా లీకైందనే విషయం ఐఓసీ ఇంజనీర్లకు మాత్రమే తెలిసి ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పొరపాటున ఇక్కడ ఏమైనా జరిగి ఉంటే పెను విపత్తు సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్
కీవ్: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం యూరప్ గుండెల్లో మరోసారి గుబులు పుట్టిస్తోంది. రష్యా కాల్పుల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో బుధవారం ప్లాంటుకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ జనరేటర్లు బ్యాకప్ పవర్ అందజేస్తూ నెట్టుకొస్తున్నాయి. కానీ వాటిలో రెండు రోజులకు సరిపడా డీజిల్ మాత్రమే అందుబాటులో ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. విద్యుత్ సరఫరా ఆగిపోయి విద్యుత్కేంద్రంలోని అణు వ్యర్థాల కూలింగ్ వ్యవస్థ దెబ్బ తింటే అణు ధార్మిక లీకేజీ తప్పదంటున్నారు. అణు, ధార్మిక భద్రత వ్యవస్థలపై నియంత్రణ చేజారి 1986ను మించిన ప్రమాదానికి దారి తీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో యూరప్ అంతా మరోసారి భయం గుప్పిట్లో గడుపుతోంది. చెర్నోబిల్ కేంద్రాన్ని రష్యా దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్ లైన్ల మరమ్మతు కోసం కాల్పులను తాత్కాలికంగా ఆపాలని రష్యా సైన్యానికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ద్మిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వాడకంలో లేని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం నుంచి తమకు డేటా అందడం ఆగిపోయిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది. అందులో పని చేస్తున్న సిబ్బంది భద్రత పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. వాళ్లు 13 రోజులుగా నిరంతరాయంగా పని చేస్తున్నారని సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ అన్నారు. అయితే, ‘‘కరెంటు కోతతో ప్లాంటు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ‘‘అణు వ్యర్థ నిల్వల నుంచి వచ్చే వేడిని చల్లార్చేందుకు ప్లాంటులో నిత్యం అందుబాటులో ఉండే కూలింగ్ వాటర్ చాలు. అందుకోసం అదనపు కరెంటు సరఫరా అవసరం లేదు’’ అని ఒక ప్రకటనలో ఐఏఈఏ పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వ అణు సంస్థ ఎనర్గోటమ్ మాత్రం విద్యుత్కేంద్రంలోని 20 వేల అణు వ్యర్థ యూనిట్లను చల్లబరిచి ఉంచేందుకు నిరంతర కరెంటు సరఫరా తప్పనిసరని అంటోంది. ‘‘లేదంటే అణు ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. గాలి ద్వారా ఉక్రెయిన్‌తో పాటు బెలారస్, రష్యా, యూరప్‌లోని ఇతర దేశాలకూ వ్యాపించి వినాశనానికి దారి తీస్తాయి’’ అని ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చింది. 1986లో ఏం జరిగింది? చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1986లో భద్రత పరీక్షల సందర్భంగా ఇందులోని నాలుగో రియాక్టర్ పేలి పెద్ద ప్రమాదానికి దారితీసింది. పేలుడులో చనిపోయింది ఇద్దరే అయినా, ఆ తర్వాత అది పెను వినాశనానికే దారి తీసింది. మంటలను ఆర్పిన సిబ్బందిలో 30 మందికి పైగా మూడు నెలల్లోపే మృత్యువాత పడ్డారు. పేలుడు వల్ల 100 రకాలకు పైగా రేడియో ధార్మిక పదార్థాలు వెలువడ్డాయి. వీటి ప్రభావం యూరప్‌పై ఏళ్ల తరబడి కొనసాగింది. రేడియో ధార్మికత బారిన పడి నానారకాల వ్యాధులతో వేలాది మంది నరకయాతన అనుభవించి మరణించారు. చెర్నోబిల్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిప్యాట్ నగరంలోని దాదాపు 50 వేల మందిని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోపే పూర్తిగా ఖాళీ చేయించారు. మొత్తమ్మీద పరిసర ప్రాంతాల నుంచి 20 లక్షల మందిని ఖాళీ చేయించినట్టు అంచనా. (చదవండి: ఉక్రెయిన్ వీడిన 10 లక్షల మంది చిన్నారులు) -
రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలకు వారం రోజులపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన 500 ఏళ్ల నాటి రాయలచెరువుకు పూర్తిస్థాయిలో ముప్పు తప్పింది. వారం కిందట భారీ వరదలతో చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలకు 55 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాదిమంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం సాయంత్రం రాయల చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు లీకేజీలను వందశాతం అరికట్టామని, పశువులతో సహా పునరావస కేంద్రాలకు వెళ్లిన దాదాపు 15 వేల మంది ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఆయన ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించామన్నారు. 120 మంది నిపుణుల పర్యవేక్షణలో 453 మంది కార్మికులు వారం రోజులుగా రోజుకు 19 గంటలపాటు యుద్ధప్రతిపాదికన పనులు చేశారన్నారు. భారతీ సిమెంట్ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్‌ను కలిపి లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్ పద్ధతిలో అరికట్టామని వివరించారు. నీటి ప్రవాహానికి ఈ బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల బోల్డర్స్ (పెద్దపెద్ద బండరాళ్లు)ను వీటికి దన్నుగా ఉంచామన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడినా కట్టకు ఇబ్బంది లేకుండా ఔట్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశామని చెవిరెడ్డి వెల్లడించారు. ఏడు రోజుల తర్వాత ఇంటికి.. నిర్వాసితులు ఇంటికి వచ్చిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానన్న చెవిరెడ్డి.. మొదటి రోజు నుంచి చెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేవీ హెలికాప్టర్లలో నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక చెవిరెడ్డి శనివారం ఇంటికి వెళ్లారు. -
సాక్షి ఎఫెక్ట్: ‘ర్యాలంపాడు’ లీకేజీల అడ్డుకట్టకు చర్యలు
గద్వాల రూరల్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిరి్మంచిన ర్యాలంపాడు రిజర్వాయర్ కట్ట లీకేజీలపై అధికారులు దృష్టిసారించారు. రిజర్వాయర్ కట్టకు బీటలు పడి పెద్ద ఎత్తున లీకేజీ ఏర్పడిన సంఘటనపై సోమవారం ‘సాక్షి’లో ‘ర్యాలంపాడు’కి బీటలు శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కట్ట నుంచి ఎక్కడెక్కడ లీకేజీలున్నాయి? ఎంత పరిమాణంలో నీరు వృథా అవుతోంది.. తదితర అంశాలపై చర్చించారు. రిజర్వాయర్ పరిస్థితిపై ఇటీవల ఇద్దరు సీఈల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికను పరిశీలించారు. ఇదిలా ఉంటే లీకేజీలకు మరమ్మతు చేయాలంటే.. ముందుగా ర్యాలంపాడులోని నీటిని బయటకు పంపాల్సి ఉంటుందని, అయితే దీనివల్ల ప్రస్తుతం 1.36 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు దెబ్బతింటాయని గద్వాల జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సీజన్‌కు సాగునీటిని అందించి వచ్చే యాసంగిలో జలాశయంలోని నీటిని పూర్తిగా బయటకు తోడేసేందుకు వీలుపడుతుందన్నారు. -
కరోనా లీక్: డబ్ల్యుహెచ్ఓ నిపుణుడి వ్యాఖ్యల కలకలం
లండన్: కరోనా కేసులు తొలిసారి గుర్తించిన ప్రాంతంలోని ఒక ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై అప్పట్లోనే అనుమానాలు వచ్చాయని డబ్ల్యుహెచ్ఓ నిపుణుడు పీటర్ బెన్ ఎంబరెక్ చెప్పారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై చైనాలో పరిశోధనకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలో ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే సదరు ల్యాబ్ ప్రమాణాలపై తనకు అనుమానాలు వచ్చాయని డానిష్ టీవీ డాక్యుమెంటరీలో బెన్ తెలిపారు. వూహాన్‌లోని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌లను ఉంచారని, కానీ ఆ ల్యాబ్ భద్రతా ప్రమాణాలు కరోనా వైరస్ కట్టడి చేసే స్థాయిలో లేవని బెన్ తెలిపారు. చైనా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చి, మహమ్మారి మూలాలపై విచారణ సమయంలో లీక్ సిద్ధాంతాన్నివిరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారని బెన్ మాటమార్చడం సంచలనంగా మారింది. సదరు బృందం మాత్రం అప్పట్లో వూహాన్ నుంచి కరోనా విడుదల కాలేదంటూ నివేదికనిచ్చింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన బెన్ తాజాగా అనుమానాలు వ్యక్తం చేయడంపై కలకలం రేగుతోంది. ‘‘ది వైరస్ మిస్టరీ" పేరుతో వచ్చిన తాజా డాక్యుమెంటరీలో బెన్ చైనాకు పోవడం, వూహాన్ మార్కెట్లో స్టాల్స్‌ను పరిశీలించడం, తన అనుమానాలు వ్యక్తం చేయడం తదితర దృశ్యాలున్నాయి. కరోనా వైరస్ ఏదో ఒక ప్రాణి నుంచి మనిషికి ఈ మార్కెట్లోనే వచ్చిఉంటుందని బెన్ అనుమానపడ్డారు. అలాగే వూహాన్‌లోని చైనా ల్యాబ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు దగ్గరలో ఉన్న సీడీసీ చైనా ల్యాబ్‌పై తనకు చాలా అనుమానాలున్నాయన్నారు. గబ్బిలాల నుంచి శాంపిళ్లు తీస్తున్న ల్యాబ్ వర్కర్‌కు కరోనా తొలిసారి సోకి ఉండే ప్రమాదం ఉందని గతంలో బెన్ అభిప్రాయపడ్డారు. బెన్ వ్యాఖ్యలు అనుమానాలను బలపరుస్తున్నాయని, చైనా ల్యాబ్‌పై స్వతంత్ర పరిశోధన జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చైనా నుంచి మరింత పారదర్శకతను ఆశిస్తున్నామని సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. ల్యాబుల్లో ప్రమాదాలు జరగడం సహజమన్నారు. డబ్ల్యుహెచ్ఓ మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సిఉందంటూ ఒక ప్రకటనతో సరిపుచ్చింది. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) -
‘సాగర్’లో లీకేజీలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి వరదనీరు లీకవుతోంది. క్రస్ట్‌గేట్లకు ఇటీవలే మరమ్మతు చేయించినా లీకేజీలకు బ్రేక్ పడలేదు. దీంతో గేట్ల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్ డ్యామ్‌కు 26 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉండగా 4 గేట్లకు గతేడాది మరమ్మతు చేశారు. ఈ ఏడాది మిగిలిన 22 గేట్ల మరమ్మతులకు రూ. 70 లక్షలు కేటాయించారు. డ్యామ్ గేట్ల నిర్వహణ విభాగంలో సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు మరమ్మతు పనులను రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. రబ్బరు సీళ్లు అమర్చడం, ఇనుప తీగలకు గ్రీజింగ్ చేయడం, గేర్లలో ఆయిల్ మార్చడం, గేట్లు ఎత్తే మోటర్ల స్టార్టర్లకు కాయిల్స్ బిగించడం వంటి పనులను ప్రైవేటు సంస్థలు చేపట్టాయి. ఆ వెంటనే జలాశయానికి వరద రావడంతో వారంలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అదనపు నీటిని దిగువకు విడుదల చేసేందుకు రేడియల్ క్రస్ట్ గేట్లను పైకి ఎత్తారు. నీటి రాక తగ్గడంతో శుక్రవారం సాయంత్రం మూసేసినా మళ్లీ శనివారం ఉదయం రెండు గేట్లను పైకెత్తి తిరిగి మధ్యాహ్నం మూసేశారు. అయితే గేట్లు మూసేసినా వాటిలోంచి నీరు ధారగా కారుతోంది. ముఖ్యంగా 6, 8, 11, 14, 15, 21, 25, 26 నంబర్ గేట్ల నుంచి నీరు ఎక్కువగా లీకవుతోంది. గేట్ల నుంచి నీరు లీకవడానికి రబ్బరు సీళ్లను సరిగ్గా అమర్చకపోవడమే కారణమని రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. దారుణంగా స్పిల్ వే... స్పిల్ వేకు మరమ్మతులు నిర్వహించక దాదాపుగా 8 ఏళ్లు దాటింది. ఏటా డ్యామ్ నిర్వహణలో భాగంగా స్పిల్ వేకు మరమ్మతులు చేయాలి. ఈ 8 ఏళ్లలో డ్యామ్ క్రస్ట్‌గేట్లను ఐదుసార్లు ఎత్తగా పైనుంచి నీటి తాకిడికి స్పిల్‌వే దెబ్బతింటుంది. అందువల్ల ఏటా స్పిల్ వే నిర్వహణ చేపట్టాలి. ప్రస్తుతం స్పిల్ వే వద్ద పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది. ఇలాగే ఉంటే డ్యామ్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లీకేజీలను తగ్గిస్తాం... గేట్ల లీకేజీలను తగ్గించే ఏర్పాట్లు చేస్తాం. అన్నింటికీ కొత్త సీళ్లు వేయడం వల్ల నీరుకారడం సహజం. నిన్నటి వరకు వరదలు కొనసాగాయి. ఇప్పటికీ గేట్ల మీద నుంచి గాలికి నీటి తెప్పలు దుముకుతున్నాయి. జలాశయంలో కొంత నీరు తగ్గగానే వాక్ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి బోల్ట్ నట్స్‌ను బిగిస్తే కొంత మేరకు లీకేజీలు తగ్గే అవకాశాలున్నాయి. నిర్వహణలో లోపాలేమీ లేకుండా చూస్తాం. – సీఈ శ్రీకాంత్‌రావు. -
‘ఊపిరి’ ఆగింది.. గాల్లోకి 22 ప్రాణాలు
సాక్షి ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో అత్యంత హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంకుకు లీకేజీ ఏర్పడి ప్రాణవాయువు అందక 24 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 150 మంది ఉండగా... అందులో 11 మంది వెంటిలేటర్‌పై... మిగతా వారు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. ఉన్నట్లుండి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి బెడ్స్‌పై గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలారు ఈ అభాగ్యులు. లీకేజీ జరిగిన కొద్దిసేపట్లోనే 22 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. అనంతరం సాయంత్రం మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 34 నుంచి 77 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారని తెలిపారు. బుధవారం 12.30 గంటల ప్రాంతంలో లీకేజీ గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది... ప్రత్యామ్నాయ సిలిండర్లను తెప్పించి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఈలోపే ఘోరం జరిగిపోయింది. సీరియస్‌గా ఉన్న పేషెంట్లను మరోచోటికి తరలించేందుకు బ్బంది పరుగులు పెట్టడం, ఏం జరుగుతుందో తెలియక రోగుల బంధువుల అర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణలో గందరగోళం నెలకొంది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 24 మంది చనిపోయారని నాసిక్ కలెక్టర్ సూరజ్ మందారే విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేమి జరిగింది? నాసిక్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రి అయిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో 150 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో 13 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకు ఉంది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ ట్యాంక్ సాకెట్ ఒకటి విరిగి లీకేజీ ప్రారంభమైంది. అయితే ట్యాంకర్ ద్వారా ట్యాంకులో ఆక్సిజన్ నింపుతుండగా ఇది జరిగిందనేది మరో వాదన. ఇది చూస్తుండగానే అధికమైంది. 12.30 ప్రాంతంలో ఆక్సిజన్ భారీగా లీకవ్వడం మొదలైంది. దీంతో అందరూ ముందుగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం ఈ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని లీకేజీ ఆగలేదు. అప్పటికి ట్యాంకులో 25 శాతం మేర మాత్రమే ఆక్సిజన్ ఉండగా... లీకేజీతో అది ఇంకా తగ్గిపోయింది. ట్యాంకులో ప్రెషర్ తగ్గి... పేషెంట్లకు ఆక్సిజన్ అందలేదు. మరోవైపు ఆసుపత్రిలో అరుపులు, కేకలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఆక్సిజన్ లీకేజీ కారణంగా ఇటువైపు ఉన్న అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు ఆక్సిజన్ అందక నీటి నుంచి బయటపడ్డ చేప పిల్లల్లా కొట్టుకోసాగారు. అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు, నర్సులు, వైద్యులు ఈ సంఘటనతో అవాక్కయ్యారు. అందుబాటులో ఉన్న సిలిండర్లతో ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నించారు. ఇతర ఆసుపత్రులు నుంచి హుటాహుటిన డ్యూరా సిలిండర్లను తెప్పించారు. ఈ సమయంలో ఆసుపత్రి వర్గాలు కొందరు రోగులకు వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు కూడా చేపట్టారు. ఆక్సిజన్ ట్యాంకు నిర్వహణ బాధ్యతను చూస్తున్న ప్రైవేటు కంపెనీకి సమాచారం ఇచ్చి వారిని పిలిపించారు. ఇలా సుమారు గంటకుపైగా చేసిన ప్రయత్నాలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లీకేజీని ఆపగలిగారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 24 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటన అనంతరం బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో ఆ పరిసరాలలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అత్యంత విషాదకరమైన ఈ సంఘటన అనంతరం మృతుల కుటుంబీకులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ... ఏం మాట్లాడాలన్నా మాట పెగలడం లేదన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంథించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించింది. మరోవైపు ఈ సంఘటన అనంతరం ఆసుపత్రికి చేరుకున్న నాసిక్ జిల్లా ఇంచార్జీ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కూడా మృతుల కుటుంబీకులకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రూ. అయిదు లక్షల మద్దతు అందించనున్నట్టు ప్రకటించారు. ఇలా మొత్తం రూ.10 లక్షలు మృతుల కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి 24 మంది కోవిడ్ రోగులు మృతిచెందడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గుండెలను మెలిపెట్టే దురదృష్టకర సంఘటన. తీవ్ర వేదనను కలిగించింది. ఆత్మీయులకు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను..’అని మోదీ ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా కూడా సంతాపం ప్రకటించారు. మిగిలిన పేషెంట్లు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. నిర్లక్ష్యం కారణంగానే.. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని మృతుల కుటుంబీకులు ఆరోపించారు. 60 ఏళ్ల తన తల్లిని మంగళవారమే ఈ ఆసుపత్రిలో చేర్చించామని, ఆమె వెంటిలేటర్‌పై ఉందని... ఇలా చనిపోవడానికి ఆమెను ఇక్కడ చేర్పించలేదని లీలా సర్కార్ అనే మహిళ గుండెలవిసేలా రోదించారు. ఊపిరి ఆడట్లేదని అమ్మ చెప్పగానే... నర్సింగ్ సిబ్బందిని పిలిచానని, ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మరోవైపు తన తమ్ముణ్ని రక్షించుకోలేకపోయానంటూ మరోవ్యక్తి రోదించడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. ఆక్సిజన్ సరిగా సరఫరా కావడంలేదని ముందునుంచే తెలుపుతూ వచ్చామని, అయినా ఆసుపత్రి వారు పట్టించుకోలేదని మరి కొందరు వాపోయారు. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఇంత మంది మరణించారని ఆరోపించారు. చదవండి: ప్రశ్నలు సంధించాల్సిన సమయమిది చదవండి: ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్ -
నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్...
-
అంబర్‌పేట్‌లో విష వాయువుల కలకలం
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో విష వాయువుల లీకేజీ కలకలం రేపింది. మారుతినగర్లో విష రసాయనాలు లీకేజీ కావడంతో శుక్రవారం ఉదయం స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెసిడెన్షియల్ ఏరియాలో డెక్కన్ కెమికల్స్ కంపెనీ యాసిడ్ నిల్వలు ఉంచింది. ఈ రసాయనాలు నిల్వ చేసిన ట్యాంకర్ పగలడంతో విష వాయువులు లీకవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఊపరి ఆడక ఇబ్బంలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డెక్కన్ కంపెనీని సీజ్ చేశారు. -
మేల్కోకపోతే ముప్పే!
అనంతపురం హాస్పిటల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల పనితీరులో ఏమ్రాతమూ మార్పు రాలేదు. ఇటీవల ఆస్పత్రిలోని ఇన్ఫెక్షన్ డీసీస్ వార్డు (ఐడీ)లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పాటు రెండు వారాల క్రితం సూపరింటెండెంట్ చాంబర్ ముందు ఆక్సిజన్ లీకేజీ జరిగినా అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో ఎఫ్ఎం వార్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు. ఇప్పటికైనా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మేలుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తవని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. పూర్తి కాని పనులు కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో సర్వజనాస్పత్రిలో కోటి రూపాయలతో పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.36 లక్షలతో 150 పడకలకు వన్ లైన్ ఎయిర్, 30 పడలకు టూ లైన్ ఎయిర్, జూన్ 12న రూ.64 లక్షలతో 60పడకలకు మెడికల్ గ్యాస్‌లైన్ త్రీ లైన్, 400 పడకలకు వన్ లైన్ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన సన్డాట్కామ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సంబంధించి 700 పాయింట్లలో ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇంకా 150 నుంచి 200 పాయింట్లలో పైప్‌లైన్ పనులు పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యతేదీ? ఆక్సిజన్ పైప్‌లైన్ పనుల్లో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైప్‌లైన్ పనులు జరిగే సమయంలో సంబంధిత ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు కానీ, కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితోనే వాల్స్‌కు తూతూమంత్రంగా వెల్డింగ్ పనులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగానే రెండు చోట్ల పైప్‌లైన్ లీకేజీలు జరిగినట్లు తెలుస్తోంది. గండం గడిచింది సర్వజనాస్పత్రిలో ఈ నెల ఆరో తేదీన జరిగిన ఆక్సిజన్ పైప్‌లైన్ లీకేజీ పట్ల ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ సకాలంలో స్పందించడంతో గండం గడిచింది. ఏమాత్రం జాప్యం చేసినా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకల మీదున్న రోగుల ప్రాణాలకే ఇబ్బంది కలిగేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. విచారణకు ఆదేశం ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్ గంధం చంద్రుడు విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్, ఆర్ఎంఓ, అనస్తీíÙయా హెచ్ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్‌తో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు అందుబాటులో ఉండి ఆస్పత్రిలో ఎక్కడైనా ప్రమాదకర ప్రాంతాలుంటే వాటిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో అధికారులు నివేదిక సమర్పించనున్నారు. ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ లక్ష్మీపతిరెడ్డి ఏమన్నారంటే..‘ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లీకేజీలు జరిగిన మాట వాస్తవమే. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మరో రెండ్రోజుల్లో విధులకు హాజరై తదుపరి వాటిపై స్పష్టత ఇస్తా. పైప్‌లైన్ పనులు అసంపూర్ణం ఆస్పత్రిలో పైప్‌లైన్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. పైప్‌లైన్ వాల్స్ ఊడిపోవడం కారణంగానే లీకేజీ జరిగింది. రెండు వారాల క్రితం తన కార్యాలయం సమీపంలోనే లీకేజీ అయ్యింది. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను కోరుతాం. ఆస్పత్రిలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ రామస్వామినాయక్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
మినీ ఆక్సిజన్ సిలిండర్ లీక్
గద్వాల అర్బన్: జిల్లా ఆస్పత్రిలో మినీ ఆక్సిజన్ సిలిండర్ లీకైంది. దీంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీస్తుండగా.. ఒకరు మృత్యువాత పడ్డారు. సోమవారం ఉదయం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఎన్బీహెచ్యూ వార్డులో అప్పుడే పుట్టిన శిశువుకు ఆక్సిజన్ పెట్టేందుకు ఓ నర్సు యత్నించగా.. మినీ సిలిండర్ స్ట్రక్ కావడంతో ఫ్లోమీటర్ కింద పడి పగిలింది. ఆ సమయంలో శబ్దంతో పాటు గ్యాస్ లీకైంది. దీంతో ఎన్బీహెచ్యూ, ఐసీయూ, జనరల్ వార్డుల్లోని రోగులు, వారి బంధువులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో శబ్దం పెద్దగా రావ డంతో రోగులు ఆందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు. భయంతో రోగి మృతి కాగా, గద్వాల మండలం శెట్టిఆత్మకూర్కు చెందిన లక్ష్మన్న (46) డయాలసిస్ పేషెంట్. బ్లడ్ షుగర్ లెవల్ తగ్గిందని సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతడికి వైద్యసిబ్బంది క్యాజువాలిటీ వార్డులో ఉంచి చికిత్స నిర్వహించారు. అయితే గ్యాస్ లీకేజీ అయిందని తెలుసుకున్న అతను భయంతో బయటకు పరుగులు తీస్తూ ఊపిరి ఆడక మృతి చెందాడు. -
కేటీపీఎస్‌లో హైడ్రోజన్ లీక్
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం 9వ యూనిట్‌లోని టర్బో జనరేటర్లో సోమవారం హైడ్రోజన్ గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైడ్రోజన్‌కు గాల్లో కలిసి బాంబులా పేలే సామర్థ్యం ఉండటంతో ఉద్యోగులు, కార్మికులు పని ప్రదేశం నుంచి పరుగులు పెట్టారు. అయితే కొందరు ఉద్యోగులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు. 250 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్లో రూ. 100 కోట్లతో రెన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్(ఆర్‌అండ్‌ఎం) పనులు చేపట్టారు. గత జూన్ మొదటి వారంలో పనులు ప్రారంభంకాగా, ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు సింక్రనైజేషన్ చేస్తున్నారు. స్టీమ్ జనరేట్ అయ్యేటప్పుడు ఏర్పడే ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జనరేటర్‌కు హైడ్రోజన్ (హెచ్2) పంపిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ పైపులైన్ దగ్గర హైడ్రోజన్ లీక్ కావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పని ప్రదేశం నుంచి వందలాది మంది దూరంగా పరుగులు తీశారు. అయితే కొందరు ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించి ఫైర్ ఇంజన్లను అందుబాటులోకి తెప్పించారు. ధైర్యసాహసాలతో హైడ్రోజన్ లీకైన చోట నుంచి కార్బన్‌డై ఆక్సైడ్‌ను పంపి ప్రమాదాన్ని అరికట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా ఊపిరి బిగపట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించారు. లీకేజీ ఉన్న ప్రదేశంలో సీల్ వేయడంతో ప్రమాదం తొలగిపోయింది. ఈ క్రమంలో కర్మాగారంలోని అన్ని ఫైర్ ఇంజన్లను, ఇతర ఫైర్ సేఫ్టీ పరికరాలను తెప్పించుకున్నారు. హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో గాలిలో కలిస్తే బాంబులా పేలి కర్మాగారం ధ్వంసమయ్యే పరిస్థితి ఉండేదని, ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం భారీగా ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఒక రోజు ఆలస్యంగా సింక్రనైజేషన్.. ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో జెన్కో యాజమాన్యం ఆదేశాల మేరకు 9వ యూనిట్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు నిర్వహిస్తోంది. పనులకు వందలాది మంది టెక్నీషియన్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కరోనా వైరస్ ఉధృతిలోనూ ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో 50 రోజుల్లోపు పూర్తి కావాలి్సన పనులకు 60 రోజులు పట్టింది. చివరి క్షణంలో హైడ్రోజన్ గ్యాస్ లీక్ కలవరానికి గురిచేసింది. దీంతో సోమవారం సింక్రనైజేషన్ చే యాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేశారు. సకా లంలో స్పందించి ప్రమాదాన్ని అరికట్టడంతో జెన్కో ఉన్నతాధికారులు సైతం ఇక్కడి ఉద్యోగులను అభినందించారు. ముప్పు తప్పింది హైడ్రోజన్ లీకేజీని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం లేకుండా బయటపడగలిగాం. పనిచేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కోవిడ్ సమయంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి పనిచేశాం. కరోనా వల్లే పనుల్లో కొంత జాప్యం జరిగింది. మంగళవారం సాయంత్రానికి విద్యుదుత్పత్తిని అందుబాటులోకి తెస్తాం. –కె.రవీంద్ర కుమార్, సీఈ -
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ లీక్..
-
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ లీక్..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కలకలం రేపుతోంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్ లీకైంది. భారీగా గ్యాస్ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలానికి పరికరాలను తరలించారు. -
కందికట్కూర్‌కు ‘లీకేజీ’ భయం
ఇల్లంతకుంట (మానకొండూర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామం వద్ద నిర్మించిన మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నుంచి రెండు రోజులుగా నాలుగైదు చోట్ల నీటి ఊటలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనకట్ట నుంచి నీరు లీకవడంతో తమకు ముప్పేమైనా ఉంటుందా? అని గ్రామస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద బోగం ఒర్రె ప్రాం తంలో బుంగపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడి మాదిరిగానే ఇక్కడ బుంగ పడుతుందని భయపడుతున్నారు. కాగా, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ సమీపంలో మధ్యమానేరు ఆనకట్ట నుంచి శనివారం మూడు చోట్ల ఊట లొచ్చాయి. దీంతో అధికారులు రాళ్లు, మట్టితో ఆ ప్రాంతాన్ని పూడ్చివేయించారు. ఆదివారం మళ్లీ రెండుచోట్ల ఊటలు రావడం ప్రారంభమైంది. ఇది చూసి గ్రామస్తులు ఆనకట్ట నుంచి వస్తున్న లీకేజీ ఊట ఎక్కడ ఉప్పెనగా మారుతుందోనని ఆందో ళన చెందుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆనకట్ట వెంట నిర్మించిన కాల్వలో సీపేజీ నీళ్లు పారుతున్నాయి. నాలుగైదు చోట్ల కట్ట నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి. భయం అవసరం లేదు: శ్రీకాంత్‌రావు, ఎస్ఈ మధ్యమానేరు ఆనకట్ట నుంచి వస్తుంది సీపేజీ వాటర్ మాత్రమే. ఆనకట్టకు ప్రమాదం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకున్న స్థాయిలో కూడా రావడం లేదు. కట్ట లీకేజీపై సీఎం పేషీ ఆరా మధ్యమానేరు ఆనకట్ట లీకేజీపై సీఎం పేషీ అధికారులు ఆదివారం ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
28,29 తేదీల్లో నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా తాగునీటిపైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడంతో ఈనెల 28, 29 తేదీల్లో పలుప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. బండ్లగూడ వద్ద కృష్ణా ఫేజ్–1కు సంబంధించి 2200 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ తాగునీటి పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడంతో రెండురోజుల పాటు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఈనెల 28 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి 29 (గురువారం) సాయంత్రం 6గంటల వరకు మొత్తం36 గంటలపాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. 28న మంచినీటి సరఫరానిలిచిపోయే ప్రాంతాలివే.. అలియాబాద్, మిరాలాం, కిషన్‌బాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్,వినయ్ నగర్, సైదాబాద్, ఆస్మాన్ ఘడ్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట్, మూసారాంబాగ్, బొగ్గులకుంట,అఫ్జల్‌గంజ్, హిందీనగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం, చిలకలగూడ, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు. ఈనెల 29న నీళ్లు బంద్ ఇక్కడే.. భోజగుట్ట, మారేడ్ పల్లి, సైనిక్ పురి పరిసర ప్రాంతాలు. -
పగిలిన మిషన్ భగీరధ పైప్‌లైన్
-
స్మార్ట్ బాల్‌తో లీకేజీలకుచెక్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న విలువైన తాగునీటి వృథాకు కారణమైన పైప్‌లైన్ లీకేజీలకు చరమగీతం పాడాలని జలమండలి నిర్ణయించింది. దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పైపులైన్ల నాణ్యత, మన్నికను త్వరలో పరిశీలించనున్నారు. అమెరికా, సింగపూర్, ఇజ్రాయిల్ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న ‘స్మార్ట్‌బాల్’ టెక్నాలజీ ఆధారంగా పురాతన తాగునీటి పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించాలని నిర్ణయించింది. ప్రధానంగా ఎనిమిదవ దశకంలో ఏర్పాటుచేసిన సింగూరు, మంజీరా పైపులైన్లతోపాటు 17 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కృష్ణా మొదటిదశ పైపులైన్లను ప్రయోగాత్మకంగా ఈ సాంకేతికత ఆధారంగా పరిశీలించనున్నారు. దీంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న విలువైన తాగునీరు పైపులైన్ల లీకేజీలతో వృథా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనుండడం విశేషం. తాగునీటి వృథా..వ్యథ ఇదీ.. మహానగరానికి వందలకిలోమీటర్ల దూరం నుంచి తరలిస్తోన్న సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి జలాల్లో సుమారు 40 శాతం విలువైన తాగునీరు లీకేజీలు, చౌర్యం కారణంగా వృథా అవుతోంది. నిత్యం జలమండలి సరఫరా చేస్తున్న 440 మిలియన్ గ్యాలన్లలో 40 శాతం మేర సరఫరా నష్టాలున్నాయి. అంటే సుమారు 176 మిలియన్ గ్యాలన్ల జలాలు వృథాఅవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నీటిని తరలించే పురాతన తాగునీటి పైపులైన్లే. వీటిలో ఆర్సీసీ(రీ ఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్)తో తయారైనవే అధికంగా ఉన్నాయి. పైపులైను మార్గంలో వాటి పైనుంచి భారీ వాహనాలు వెళ్లిన ప్రతీసారీ లీకేజీలు ఏర్పడి ఫౌంటెన్లను తలపిస్తున్నాయి. పలుమార్లు ఈ నీరంతా ప్రధాన రహదారులపైకి చేరి ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. లీకేజీలకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు, మూడు రోజులు పలు ప్రాంతాలకు నీటిసరఫరాను నిలిపివేయాల్సిన దుస్థితి తలెత్తింది. సుమారు 100 కి.మీ మార్గంలో పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరోవైపు పాతనగరంలో సుమారు 1100 కి.మీ మార్గంలో దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పంపిణీ చేసే పైపులైన్లు (చిన్నపరిమాణంలోనివి)ఉన్నాయి. వీటికి కూడా లీకేజీల పరంపర తప్పడంలేదు. స్మార్ట్ బాల్ సాంకేతికత పనిచేస్తుందిలా... రాడార్, జీపీఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేసే బంతి ఆకృతిలో ఉన్న పరికరాన్ని పురాతన తాగునీటి పైపులైన్లలోనికి తీగ ద్వారా ప్రవేశపెడతారు. పైపులైన్ లోపలకు వెళ్లిన ఈ పరికరం భూగర్భంలో ఉన్న తాగునీటి పైపులైన్ గోడలను క్షుణ్ణంగా తనిఖీచేస్తుంది. జీపీఆర్ఎస్ సాంకేతికత ఆధారంగా ఈ దృశ్యాలను పైన ఉన్న కంప్యూటర్‌కు గ్రాఫ్ రూపంలో చేరవేస్తోంది. ఈ గ్రాఫ్‌ను నిపుణులు పరిశీలించడం ద్వారా పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, దాని సామర్థ్యం, మన్నిక వంటి అంశాలను నిర్ధారించవచ్చు. అవసరమైన చోట మరమ్మతులకు తక్షణం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పురాతన భారీ ఆర్సీసీ పైపులైన్ల స్థానంలో మైల్డ్‌స్టీల్(ఎంఎస్), చిన్న పరిమాణంలో ఉన్న ఆర్సీసీ పైపులైన్ల స్థానంలో డక్టైల్ ఐరన్(డీఐ)పైపులైన్లను ఏర్పాటుచేయాలని జలమండలినిర్ణయించింది. లీకేజీలకు చరమగీతం పాడేందుకే తాగునీటి పైపులైన్ల లీకేజీలను సమూలంగా నివారించేందుకు ముందుగా పురాతన పైపులైన్ల నాణ్యత,మన్నికను నిర్ధారించాలని నిర్ణయించాము. తద్వారా విలువైన తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కలుషిత జలాల నివారణ,తాగునీటి సరఫరాలో తరచూ తలెత్తే అంతరాయాలను పూర్తిగా నివారించవచ్చు. స్మార్ట్‌బాల్ సాంకేతికత వినియోగంతో సత్ఫలితాలుంటాయని భావిస్తున్నాము. – ఎం.దానకిశోర్,జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
ఎయిర్‌పోర్ట్‌లో జలపాతం.!
గువాహటి: అస్సాంలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గువాహటి ఎయిర్పోర్ట్) జలపాతాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్పోర్ట్ పైకప్పు నుంచి వర్షపు నీరు ప్రయాణికుల లాంజ్‌లోకి చేరింది. ఏసీ, లైట్ల రంధ్రాల నుంచి కారుతున్న వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటపాటు ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు చేరడం వల్ల లగేజ్ స్ర్కీనింగ్ మెషీన్లు పాడయ్యాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అంతకు మించి ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లోకి వర్షపు నీరు చేరడం వల్ల పలువురు ప్రయాణికుల లగేజ్ తడిసిపోయింది. చాలామంది ప్రయాణికులు తమ లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గువాహటి ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించిన ప్రయాణికుల లాంజ్‌లో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని నెటిజన్లు పౌరవిమానాయాన శాఖ మంత్రి జశ్వంత్ సిన్హాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నారు.