ఆగని సాగర్ గేట్ల లీకేజీలు
- గత నెలలోనే గేట్లకు అమర్చిన రబ్బర్ సీళ్లు
- నాణ్యత పాటించకపోవడంతోనే లీకేజీలంటున్న రిటైర్డ్ ఇంజినీర్లు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాం గేట్ల నుంచి నీరు లీకవుతోంది. 2013 సంవత్సరంలో అమర్చిన రబ్బరు సీళ్లు కొన్నిగేట్ల వద్ద నలిగిపోయినీరు లీకేజీ అవుతుండడంతో రూ.2.7లక్షల వ్యయంతో గత నెలలోనే రబ్బరు సీళ్లను అమర్చారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడం.. రబ్బరు సీళ్ల అమరిక సరిగా లేక గేట్ల వెంటనీరు కారుతుందని రిటైర్ ఇంజినీర్లు తెలిపారు. నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతున్నపు్పుడు నీరు కారే దగ్గర గతంలోనైతే పుట్టీలో ఈతగాళ్లను గేట్ల వద్దకు పంపి జనప, గోగునార, పీచును పెట్టించేవారు.
ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం 6, 9, 10, 11 గేట్లనుంచి బాగా నీరు లీకవుతోంది. మరికొన్నిచోట్ల మామూలుగా ఉంది. రబ్బరు సీళ్లు వేసిన తర్వాత కూడా నీరు కారుతుందంటే మరేదైనా సమస్య ఉండొచ్చని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గేటు కూర్చునే ఎస్‌ఎస్ ప్లేటుకు అమర్చిన రాడ్లకు ఆవలివైపునుంచి సిమెంటు దెబ్బతిని నీరు చిమ్ముతుందా అనేది కూడా చూడాల్సి ఉందని తెలుపుతున్నారు. ఈలీకేజీలను అరికట్టకపోతే లీకేజీలు పెరిగి గేటు అలైన్‌మెంటు దెబ్బతినే అవకాశాలు ఉంటాయని అనుభవజ్ఞులైన ఇంజినీర్లు తెలుపుతున్నారు.