![China pressured Covid-19 probe to drop lab leak theory says WHO scientist - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/14/Peter%20Ben%20Embarek.jpg.webp?itok=KZWahAgT)
పీటర్ బెన్ ఎంబరెక్ (ఫైల్ ఫోటో)
లండన్: కరోనా కేసులు తొలిసారి గుర్తించిన ప్రాంతంలోని ఒక ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై అప్పట్లోనే అనుమానాలు వచ్చాయని డబ్ల్యుహెచ్‌ఓ నిపుణుడు పీటర్ బెన్ ఎంబరెక్ చెప్పారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై చైనాలో పరిశోధనకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలో ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే సదరు ల్యాబ్ ప్రమాణాలపై తనకు అనుమానాలు వచ్చాయని డానిష్ టీవీ డాక్యుమెంటరీలో బెన్ తెలిపారు. వూహాన్‌లోని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌లను ఉంచారని, కానీ ఆ ల్యాబ్ భద్రతా ప్రమాణాలు కరోనా వైరస్ కట్టడి చేసే స్థాయిలో లేవని బెన్ తెలిపారు. చైనా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చి, మహమ్మారి మూలాలపై విచారణ సమయంలో లీక్ సిద్ధాంతాన్నివిరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారని బెన్ మాటమార్చడం సంచలనంగా మారింది.
సదరు బృందం మాత్రం అప్పట్లో వూహాన్ నుంచి కరోనా విడుదల కాలేదంటూ నివేదికనిచ్చింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన బెన్ తాజాగా అనుమానాలు వ్యక్తం చేయడంపై కలకలం రేగుతోంది. ‘‘ది వైరస్ మిస్టరీ" పేరుతో వచ్చిన తాజా డాక్యుమెంటరీలో బెన్ చైనాకు పోవడం, వూహాన్ మార్కెట్లో స్టాల్స్‌ను పరిశీలించడం, తన అనుమానాలు వ్యక్తం చేయడం తదితర దృశ్యాలున్నాయి. కరోనా వైరస్ ఏదో ఒక ప్రాణి నుంచి మనిషికి ఈ మార్కెట్లోనే వచ్చిఉంటుందని బెన్ అనుమానపడ్డారు. అలాగే వూహాన్‌లోని చైనా ల్యాబ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు దగ్గరలో ఉన్న సీడీసీ చైనా ల్యాబ్‌పై తనకు చాలా అనుమానాలున్నాయన్నారు. గబ్బిలాల నుంచి శాంపిళ్లు తీస్తున్న ల్యాబ్ వర్కర్‌కు కరోనా తొలిసారి సోకి ఉండే ప్రమాదం ఉందని గతంలో బెన్ అభిప్రాయపడ్డారు. బెన్ వ్యాఖ్యలు అనుమానాలను బలపరుస్తున్నాయని, చైనా ల్యాబ్‌పై స్వతంత్ర పరిశోధన జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చైనా నుంచి మరింత పారదర్శకతను ఆశిస్తున్నామని సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. ల్యాబుల్లో ప్రమాదాలు జరగడం సహజమన్నారు. డబ్ల్యుహెచ్‌ఓ మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సిఉందంటూ ఒక ప్రకటనతో సరిపుచ్చింది. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!)
Comments
Please login to add a commentAdd a comment