రెండు వారాల క్రితం ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ ముందు ఆక్సిజన్ లీకేజీ జరిగిన ప్రాంతం, ఈ నెల 6న ఎఫ్‌ఎం వార్డులో ఆక్సిజన్ లీకైన ప్రాంతం
అనంతపురం హాస్పిటల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారుల పనితీరులో ఏమ్రాతమూ మార్పు రాలేదు. ఇటీవల ఆస్పత్రిలోని ఇన్‌ఫెక్షన్ డీసీస్ వార్డు (ఐడీ)లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పాటు రెండు వారాల క్రితం సూపరింటెండెంట్ చాంబర్ ముందు ఆక్సిజన్ లీకేజీ జరిగినా అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో ఎఫ్‌ఎం వార్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు. ఇప్పటికైనా ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు మేలుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తవని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.
పూర్తి కాని పనులు
కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో సర్వజనాస్పత్రిలో కోటి రూపాయలతో పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.36 లక్షలతో 150 పడకలకు వన్ లైన్ ఎయిర్, 30 పడలకు టూ లైన్ ఎయిర్, జూన్ 12న రూ.64 లక్షలతో 60పడకలకు మెడికల్ గ్యాస్‌లైన్ త్రీ లైన్, 400 పడకలకు వన్ లైన్ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన సన్‌డాట్‌కామ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సంబంధించి 700 పాయింట్లలో ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇంకా 150 నుంచి 200 పాయింట్లలో పైప్‌లైన్ పనులు పూర్తి కాలేదు.
పనుల్లో నాణ్యతేదీ?
ఆక్సిజన్ పైప్‌లైన్ పనుల్లో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైప్‌లైన్ పనులు జరిగే సమయంలో సంబంధిత ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు కానీ, కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితోనే వాల్స్‌కు తూతూమంత్రంగా వెల్డింగ్ పనులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగానే రెండు చోట్ల పైప్‌లైన్ లీకేజీలు జరిగినట్లు తెలుస్తోంది.
గండం గడిచింది
సర్వజనాస్పత్రిలో ఈ నెల ఆరో తేదీన జరిగిన ఆక్సిజన్ పైప్‌లైన్ లీకేజీ పట్ల ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ సకాలంలో స్పందించడంతో గండం గడిచింది. ఏమాత్రం జాప్యం చేసినా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకల మీదున్న రోగుల ప్రాణాలకే ఇబ్బంది కలిగేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.
విచారణకు ఆదేశం
ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్ గంధం చంద్రుడు విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్, ఆర్‌ఎంఓ, అనస్తీíÙయా హెచ్‌ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్‌తో పాటు అన్ని విభాగాల హెచ్‌ఓడీలు అందుబాటులో ఉండి ఆస్పత్రిలో ఎక్కడైనా ప్రమాదకర ప్రాంతాలుంటే వాటిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో అధికారులు నివేదిక సమర్పించనున్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ లక్ష్మీపతిరెడ్డి ఏమన్నారంటే..‘ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లీకేజీలు జరిగిన మాట వాస్తవమే. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మరో రెండ్రోజుల్లో విధులకు హాజరై తదుపరి వాటిపై స్పష్టత ఇస్తా.
పైప్‌లైన్ పనులు అసంపూర్ణం
ఆస్పత్రిలో పైప్‌లైన్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. పైప్‌లైన్ వాల్స్ ఊడిపోవడం కారణంగానే లీకేజీ జరిగింది. రెండు వారాల క్రితం తన కార్యాలయం సమీపంలోనే లీకేజీ అయ్యింది. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను కోరుతాం. ఆస్పత్రిలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.
– డాక్టర్ రామస్వామినాయక్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment