ఇంట్లో వంట గ్యాస్ లీకై .. కుటుంబం మృత్యువాత
మైసూరులో విషాద సంఘటన
మైసూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో ఊపిరాడక మరణించిన ఘటన మైసూరు యరగనహళ్లిలో జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు సఖరాయపట్టణ నివాసులు కుమారస్వామి (45), భార్య మంజుల (39), వీరి పిల్లలు అర్చన (19), స్వాతి (17)లు మృతులు. ఈ కుటుంబం చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణ గ్రామానికి చెందిన వారు. మైసూరు యరగనహళ్లిలో మూడేళ్ల నుంచి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రజక వృత్తితో జీవనం సాగిస్తున్నారు.
చిన్న ఇంట్లో, కిటికీలు మూసేసి
వారిది 10 ఇన్ టు 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చిన్న ఇల్లు. ఇంటి వెనుక, ముందు ఒక్కో కిటికీ ఉన్నాయి. దుస్తులను ఇసీ్త్ర చేసేందుకు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. సొంతూర్లో పెళ్లికి వెళ్లి వచ్చి సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన వారు కిటీకీలు మూసేసి నిద్రించారు. ప్రయాణం చేసిన అలసటతో గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఒక సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయింది. అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా దట్టంగా వ్యాపించడం, ఆ గ్యాస్‌ను పీల్చి స్పృహ తప్పినవారు కొన్ని గంటల తరువాత ప్రాణాలు వదిలారు. అందరి చెవులు, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఇల్లు మొత్తం గ్యాస్ వాసన వస్తోంది.
ఒక రోజంతా అలాగే
సోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న వారు మంగళవారం ఉదయానికి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరూ చూసుకోలేదు. బుధవారం ఉదయం కుమారస్వామికి బంధువులు ఫోన్‌కాల్ చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో వారు ఇంటి ఇరుగుపొరుగు వారికి బంధువులు తెలియజేయగా వారు ఫైర్, పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉండగా, అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 3 గ్యాస్ సిలిండర్లను విచారణ కోసం సీజ్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారు. నగర పోలీసు కమిషనర్ రమేశ్ బానోత్ ఆ ఇంటిని పరిశీలించారు. విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు. అనుకోకుండా గ్యాస్ లీక్ అయ్యిందా, లేక కావాలనే చేశారా? అనేది అనుమానాస్పదంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment