
డబ్బులు ఇవ్వకపోతే చెల్లిని చంపేస్తానని కూడా తల్లిని పలు సందర్భాల్లో బెదిరించేవాడు. అదే క్రమంలో ఆదివారం రాత్రి డబ్బులు కోసం తల్లిదండ్రులను వేధించాడు.
సాక్షి, విశాఖపట్నం: చెడు వ్యసనాలకు బానిసై, అల్లరి చిల్లరిగా తిరుగుతూ కుటుంబానికి తలనొప్పిగా తయారైన ఓ కొడుకుని కన్నతల్లే చంపేసింది. విశాఖ నగర శివారు మధురవాడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రాజీవ్ గృహకల్ప కాలనీలో శ్రీను, మాధవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు అనిల్, మరొక కుమార్తె ఉంది. 20 ఏళ్లు కూడా దాటని అనిల్ చిన్నప్పటి నుంచే అల్లరిచిల్లరిగా తిరగడం అలవాటయింది. ఆ క్రమంలో మద్యం, గంజాయి సేవించడానికి బానిసయ్యాడు.
డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం అలవాటుగా మారింది. ఈ దశలో డబ్బులు ఇవ్వకపోతే చెల్లిని చంపేస్తానని కూడా తల్లిని పలు సందర్భాల్లో బెదిరించేవాడు. అదే క్రమంలో ఆదివారం రాత్రి డబ్బులు కోసం తల్లిదండ్రులను వేధించాడు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో తల్లి కోపం పట్టలేక ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను కొడుకుపై వేసింది. దీంతో అనిల్ ఇంట్లోనే మృత్యువాత పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనిల్ తల్లి మాధవిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే మృతుడు అనిల్ ఇప్పటికే విశాఖ పరిధిలో పలుకేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.