భర్త సురేష్‌తో మృతురాలు దేవి( ఫైల్)
సబ్బవరం(పెందుర్తి): పెళ్లయిన మూడు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన సంఘటన సబ్బవరంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రం అల్లుడి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. మృతురాలి తండ్రి మల్లేశ్వరరావు ఫిర్యాదు మేరకు సబ్బవరం పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు.. మండలంలోని జోడుగుళ్లులో నీటిపారుదల శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్న కోన మల్లేశ్వరరావు కుటుంబంతో నివసిస్తున్నాడు. చిన్న కుమార్తె దేవి (24)కి మూడు నెలల కిందట పాత పెందుర్తిలోని యాతపేటకు చెందిన నడికొట్ల సురేష్‌తో వివాహం జరిపించారు. సురేష్ మండలంలోని రావలమ్మపాలెం బీసీ హస్టల్ లో కుక్‌గా పనిచేస్తున్నాడు. దేవితో సురేష్‌ది రెండో వివాహం.
పెళ్లయిన నాటి నుంచే వేధింపులు
అల్లుడు సురేష్ వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే ప్రతి దానికి కుమార్తెను అనుమానించేవాడని మృతురాలు తల్లిదండ్రులు వాపోయారు. తమ ఇంటికి ఎప్పుడూ వచ్చినా వీడియో కాల్‌లోనే మాట్లాడమనడంతో పాటు సూటిపోటి మాటలతో వేధించేవాడన్నారు. అనేక సార్లు వారించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఈ నెల 8న రాయపుర అగ్రహారంలో ఉంటున్న పెద్ద అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా చిన్న కూతురు దేవితో కలిసి కుటుంబ సమేతంగా రాయపుర అగ్రహారం వెళ్లారు. మరుసటి రోజుమాడుగుల మోదకొండమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో చిన్న అల్లుడు కుమార్తెకు ఫోన్ చేశాడు. మాట్లాడిన తర్వాత అతడి వేధింపులు భరించలేక పోతున్నానని ఫోన్‌ను నేలకు కొట్టిందన్నారు.
దాంతో మృతురాలి తల్లి అల్లుడితో కూతురిని వేధించే కన్నా వదిలేస్తే మంచిదని అల్లుడిని మందలించింది. అదేరోజు సాయంత్రం చిన్నఅల్లుడు రాయపుర అగ్రహారం రావడంతో మరలా మందలించారు. ఈ నెల11న ఉదయం 9.30 గంటలకు ఇంటికి వచ్చిన అల్లుడిని అత్త మందలించింది. దీంతో అల్లుడు వెళ్లిపోయాడు. కాగా మృతురాలి తండ్రి శుక్రవారం రాత్రి డ్యూటీ నుంచి వచ్చేసరికి భార్య కేకలు వినిపించాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్ రూమ్ లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు గట్టిగా నెట్టి లోపలికి వెళ్లగా సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి పోసుకుని కొనఊపిరితో కొట్టుకుంటుంది. దీనితో వెంటనే స్థానికుల సహాయంతో సబ్బవరం పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక సీఐ చంద్రశేఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సీఎస్టీసెల్ డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్తపై అట్రాసిటీతో పాటు 498–ఎ,306 ఐíపీసీ,3(2)(వి)సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment