విశాఖపట్నంలో విషాదం.. నడిరోడ్డుపై.. | Lorry Owner Deceased In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై లారీ యజమాని ఆత్మహత్య 

Sep 22 2020 10:14 AM | Updated on Sep 22 2020 10:15 AM

Lorry Owner Deceased In Visakhapatnam - Sakshi

నర్సిరెడ్డి (ఫైల్‌)

గాజువాక (విశాఖపట్నం): ఒక లారీ యజమాని నడిరోడ్డుపై ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ క్యాబిన్‌లో ఉన్న డీజిల్‌ను శరీరంపై పోసుకొని నిప్పు అంటించుకోవడంతో సంఘటనా స్థలంలోనే కాలి బూడిదయ్యాడు. మానసికంగా ఇబ్బంది పడుతుండటం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గాజువాక దరి శ్రీనగర్‌ జంక్షన్‌లో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాడ మండలం డెలిమనేడు ప్రాంతానికి చెందిన జి.నర్సిరెడ్డి (32)కి సొంత లారీ ఉంది. అతడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం మిర్యాలగూడ నుంచి ఒడిశా ప్రాంతానికి సరకు తీసుకెళ్లి అన్‌లోడ్‌ చేశాడు. అక్కడ ఇసుక లోడ్‌ చేసుకొని గాజువాక ప్రాంతానికి వచ్చాడు.

ఇసుకలోడ్‌తో ఉన్న లారీని శ్రీనగర్‌ జంక్షన్‌లోని సర్వీస్‌ రోడ్డులో పార్కు చేసి సేదతీరాడు. ఇసుకను గాజువాక ప్రాంతంలో ఉన్న యార్డుకు తరలించకుండా అక్కడే ఉండిపోవడంతో అతడితోపాటు వచ్చిన మరో డ్రైవర్‌ మధు లారీని యార్డుకు ఆదివారం తీసుకెళ్లి అన్‌లోడ్‌ చేసి వచ్చాడు. ఆదివారం రాత్రి నర్సిరెడ్డి ఆ లారీలోనే నిద్రించగా మధు విశ్రాంతి తీసుకోవడం కోసం అక్కడికి సమీపంలోనే ఇతర డ్రైవర్ల వద్దకు వెళ్లాడు. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నర్సిరెడ్డి తన లారీలో ఉన్న డీజిల్‌ క్యాన్‌ను తీసి నడిరోడ్డుపైకి వచ్చి తన శరీరంపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అదే సమయంలో అటువైపు వెళ్తూ గమనించిన పోలీస్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే నర్సిరెడ్డి పూర్తిగా కాలిపోవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గాజువాక సీఐ సూరినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. రెండు రోజులుగా నర్సిరెడ్డి మానసికంగా బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

అతడితో మాట్లాడటం కోసం తాను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ స్పందించలేదని మృతుడి సోదరుడు కృష్ణారెడ్డి పోలీసులకు ఫోన్‌లో తెలిపారు. నర్సిరెడ్డికి ఇంకా వివాహం కాలేదు. అన్నదమ్ములతో కలిసే నివాసముంటున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సీఐ ఈ సందర్భంగా తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement