గోరుకల్లు కట్ట పరిశీలన
గోరుకల్లు కట్ట పరిశీలన
Published Sun, Sep 4 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
– లీకేజీలను పరిశీలించిన ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యులు
– రిజర్వాయర్‌ను సందర్శించిన ఎక్స్‌పర్ట్ కమిటీ
– సాయంత్రం వరకు పరిశీలన
– నిర్మాణలోపాలపై ఆరా
పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ కట్టకు లీకేజీలు ఏర్పడి నీరు బయటకు పారుతుండడంతో శనివారం ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులు వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉండగా కట్టకు నాలుగు చోట్ల నీటి ఊటలు బయటకు వస్తున్నాయి. అవుటర్ రెగ్యులేటర్ వద్ద రాతి కట్ట నుంచి రెండించుల నీరు లీకవుతోంది. సమీపంలోనే రెండు ఆయిల్ ఇంజిన్ల మేర నీరు బయటకు పోతోంది. దీన్ని దష్టిలో ఉంచుకుని విశ్రాంత ఇంజినీర్లు సుబ్బారావు, రైతు సత్యనారాయణ, సీఈ సీడీఓ గిరిధర్‌రెడ్డి, సీఈ నారాయణరెడ్డి, ఈఈ సుబ్బారాయుడుతో కూడిన ఎక్స్‌పర్ట్ కమిటీ శనివారం జలాశయాన్ని సందర్శించింది. లీకేజీ నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేకంగా కాల్వ తీయించారు. కాంక్రీట్ పనులు, గుర్రాల వాగు వద్ద కట్టకు నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రెండు పాయింట్ల వద్ద కట్టపై టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా డ్రిల్లింగ్ చేయించారు. కట్ట కింది భాగంలో మట్టి బురదగా ఉండడంతో డ్రిల్లింగ్‌కు ఆటంకం ఏర్పడింది. అలాగే అవుట్ రెగ్యూలేటర్ వద్ద కట్ట నుంచి రాళ్లను తొలగించి పరిశీలించారు. హెలిప్యాడ్ పాయిండ్ వద్ద ప్రత్యేకంగా ప్రొక్లెయిన్‌తో గుంత తవ్వించగా మూడు అడుగుల లోతులోనే నీరు పడడంతో కమిటీ సభ్యులు ఆలోచనలో పడ్డారు. జలాశయానికి పూనాది వేసిన ఇంజినీర్లను రప్పించే చర్యలు చేపట్టారు. నిర్మాణంలో లోటుపాట్లపై కంపెనీ ప్రతినిధులను ఆరా తీస్తున్నారు. విషయాన్ని తేల్చేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.
పంపింగ్ నిలిపివేత..
ప్రస్తుతం 14.5 మీటర్ల వద్ద జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 234.4 అడుగుల మేర నీరు వచ్చినట్లు చెబుతున్నారు. కట్టకు సంబంధించి నేల నుంచి దిగువకు 180అడుగుల లోతులో పునాదులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కట్టకు ఏర్పడిన లీకేజీలను దష్టిలో ఉంచుకుని జలాశయంలోకి పంపింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ఎస్సాఆర్‌బీసీ ప్రధాన కాల్వ నుంచి నీటిని దిగువకు వదుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 నుంచి 7 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితి దష్ట్యా అందుకు సాధ్యం కాదని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి కట్ట పరిస్థితిని పరిశీలించారు.
Advertisement
Advertisement