జలాశయాల్లో పూడికతీత | Ministerial sub committee meeting headed by Minister Uttam | Sakshi
Sakshi News home page

జలాశయాల్లో పూడికతీత

Published Sat, Aug 10 2024 2:34 AM | Last Updated on Sat, Aug 10 2024 2:34 AM

Ministerial sub committee meeting headed by Minister Uttam

టీజీఎండీసీ ద్వారా టెండర్లు

పూడికతీత పనులకు ప్రభుత్వం ఖర్చు చేయదు.. పైగా పన్నులు, జీఎస్టీ, రాయల్టీ, సెస్‌ రూపంలో ఆదాయం

మంత్రి ఉత్తమ్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సూత్రప్రాయ నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: రాజస్తాన్, మహారాష్ట్రల తరహా రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక తొలగించనున్నారు. ఇందుకోసం భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్‌ డ్రెడ్జింగ్‌) జరిపే పనులను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో పూడికతీతకు ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయదు. పైగా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించి అత్యధిక ధర కోట్‌ చేసిన బిడ్డర్‌కు పూడికతీత పనులు అప్పగించే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది.

బిడ్డర్‌ పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని  పనులు దక్కించుకున్న వారు చెల్లించాల్సి ఉంటుంది. తవ్విన మట్టి, ఇసుకను బిడ్డర్‌ విక్రయించుకోవచ్చు. అయితే ఈ మోడల్‌ అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదు. జలాశయాల్లో పూడిక తొలగింపుపై కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఉత్తమ్‌ నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అనేక అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. 

రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ జలాశయాలున్నాయి. సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో భారీగా పూడిక పేరుకుపోయింది. నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16శాతం) నిల్వ సామర్థ్యం కోల్పోయినట్టు తేలింది. 
పూడికతో ఏటా ప్రపంచవ్యాప్తంగా రిజర్వాయర్లు 0–5 శాతం వరకు నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతున్నాయి. 
పీఎం కిసాన్‌ సించాయ్‌ యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయం నిర్మించడానికి రూ.162 కోట్లు కావాలి. 

 జలాశయాల్లో పూడిక పెరగడంతో నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతున్నాయి. వాటి రక్షణపై ప్రభావం చూపడంతోపా టు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి సరఫరాలో లోటు ఏర్పడుతోంది. పర్యా వరణ సమస్యలూ తలెత్తుతున్నాయి. 
జలాశయాలు, డ్యామ్‌లు, ఆనకట్ట లు, బరాజ్‌లు, నదులు, కాల్వల్లో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరముండదు. కేంద్రం మినహాయింపు కల్పించింది. పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి. 

నీటిపారుదల, గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈనెల 14న సమగ్ర నివేదిక సమర్పించాలి. పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి.  
సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూడికతీత జరగాలి. వాటి రక్షణ విషయంలో రాజీ పడరాదు. 
పూడికతీతలో సారవంతమైన మట్టిని వెలికితీస్తే రైతాంగానికి ఉచితంగా సరఫరా చేయాలి. రవాణా చార్జీలు రైతులే భరించాలి. 
 పూడికతీతతో వెలికితీసే ఇసుకను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వాడాలి. మట్టిని ఎప్పటికప్పుడు ఇతర చోట్లకు తరలించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement