పురోగతిలో కాల్వల తవ్వకం పనులు
రిజర్వాయర్‌లోకి ఇటీవలే నీటి విడుదల
4 నియోజకవర్గాల్లో 94 గ్రామాలకు త్వరలో సాగునీరు
ఫ్లోరైడ్ సమస్యకూ శాశ్వత పరిష్కారం
పూర్తయిన బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కృష్ణమ్మ బిరబిరా తరలివచ్చి కరువు నేల దాహార్తిని తీర్చనుంది. దాదాపు 100 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న ఉదయసముద్రం (బ్రాహ్మణ వెల్లెంల) ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తైంది.
నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. కాల్వల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తికాగానే కరువు నేలపై కృష్ణమ్మ ఉరకలెత్తనుంది. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించటంతోపాటు భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం లభించనుంది.
వైఎస్ చొరవతో ప్రాజెక్టు మంజూరు
నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టును 2007లో ఎమ్యెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబట్టి సాధించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, రూ.699 కోట్లతో 2008లో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2009లో పనులు ప్రారంభమయ్యాయి. ఉదయసముద్రం నుంచి అప్రోచ్ చానల్, సొరంగం, పంప్‌హౌస్ నిర్మాణం, మోటార్ల ట్రయల్ రన్, 486 ఎకరాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఈ రిజర్వాయర్‌లోకి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను ప్రారంభించారు.
ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇదీ..
ఏఎంఆర్‌పీలో భాగంగా నాగార్జునసాగర్ వెనుక జలాలు పానగల్‌లోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. దాని పైభాగాన ఉన్న దండంపల్లి గ్రామం సమీపం నుంచి అప్రోచ్ చానల్ ప్రారంభమై 6.9 కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామం వద్దకు నీరు వస్తోంది. అక్కడి నుంచి 10.625 కిలోమీటర్ల పొడవున సొరంగం ద్వారా నీరు నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామం వద్ద ఉన్న సర్జ్‌పూల్‌కు చేరుతుంది.
అక్కడి నుంచి రెండు మోటార్లతో 86 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి 1.12 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రెండు డెలివరీ పైపుల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కొంత వరకే అయ్యాయి. వాటికి సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, కాల్వల తవ్వకం, లైనింగ్ చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment