బ్లోఅవుట్‌కు కారకులెవరు? | who is Reasoners of gail Explosión? | Sakshi
Sakshi News home page

బ్లోఅవుట్‌కు కారకులెవరు?

Published Tue, Jul 1 2014 12:51 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

బ్లోఅవుట్‌కు కారకులెవరు? - Sakshi

బ్లోఅవుట్‌కు కారకులెవరు?

తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే  ఇంక  పీఎస్‌యూ నిర్వాహకులకు వాటిపై ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అలసత్వం, నిర్లక్ష్యం పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు!
 
తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో గ్యాస్‌ను సరఫరా చేసే ‘గెయిల్’ పైప్‌లైన్ బద్దలై సంభవించిన భీకరమైన విస్ఫోటనంలో అనేకమంది నిండు ప్రాణాలు కోల్పోయారు. సహజవనరులతో, పాడిపంటలతో, సుందరమైన ప్రకృతికి ఆలవాలమైన జిల్లాలో కొన్ని గ్రామాలను ఈ ఘోరకలి దఫదఫాలుగా కబళించుతూ రాష్ట్రాభివృద్ధికి, పర్యావరణ రక్షణకు పెద్ద చేటుగా మారింది. 1993 నుంచి తాజాగా నగరం గ్రామ దుర్ఘటనతో కలుపుకుని ఒకే జిల్లాలో గత 21 సంవత్సరాలలో ఏకంగా ఏడుసార్లు బ్లోఅవుట్‌లు, గ్యాస్ లీకేజి సంఘటనలు సంభవించాయి. తెలుగు గ్రామసీమల్లో తొలికోడి మేలుకొలుపులతోనే రైతులు, వ్యవసాయ కూలీలు, గృహిణులూ, తమతమ నిత్యవ్యాపకాల్లో మునిగిపోవడం సహజం. కాఫీలకూ, వంటకాలకూ పొద్దుపొడవకముందే పొయ్యి అంటించుకోవడం పల్లెల్లో  సాధారణ దృశ్యం. కాని నగరం గ్రామంలో జరిగిన ఘోరకలికి ప్రభుత్వరంగ చమురు సహజవాయువు ఉత్పత్తి కంపెనీ ఓఎన్‌జీసీ, ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను సరఫరా చేసే మరో ప్రభుత్వరంగ కంపెనీ ‘గెయిల్’ తమ నిర్వహణ లోపాలకు దేనికదే గ్రామస్తులపైకి నెట్టే పనిలో ఉన్నాయి! అసలు లీకేజీకి బాధ్యత తమది కాదన్నట్టుగా, ‘దాసుడి తప్పు దణ్ణంతో సరి’ అన్న చందంగా ఒక సామాన్య ‘టీ’ దుకాణదారుడు ‘స్టవ్’ వెలిగించినందువల్లనే ఈ పేలుడు సంభవించిందని చెప్పి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపుతో సరిపెట్టుకుందామని ఈ సంస్థలు చూస్తున్నాయి! మాడి, మసైపోయిన కుటుంబాలకు పరిహార చెల్లింపులతో చేతులు దులుపుకోవడం ధనికవర్గ వ్యవస్థలో ఒక క్రూరమైన జోక్! అంతేగాని, తాజా ఘటనకు సంబంధించి గ్రామస్తులు గత రెండు మాసాలనాడే ఇదే పైప్‌లైన్‌వల్ల లీకేజీ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినప్పుడు, ఆ లైన్‌ను తాత్కాలికంగా సర్దుబాటు చేసి వెళ్లారేగాని, మళ్లీ దానివైపు చూసిన పాపాన పోలేదనీ, ఫలితంగా అదే పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయిందని వెల్లడించారు. అంటే లీక్ అయిన గ్యాస్ క్రమంగా పరిసరాలలో వ్యాపించిపోయి ఉంది. ఆ సమయంలో ‘టీ’ దుకాణదారు ఇంట్లో ఉన్న పొయ్యికీ దీనికీ సంబం ధం లేదు. కాని ఆ సమయంలో పొయ్యి అంటించబోగా భగ్గుమని మంటలు రావడానికి కారణం అప్పటికే పైప్‌లైన్ నుంచి లీకయి వాతావరణంలో వ్యాపిం చిన గ్యాస్ వెంటనే అంటుకుందని అర్థమవుతుంది. పైగా పాశ్చాత్య దేశాల్లో గ్రామాల మధ్యనుంచో, గ్రామాలను ఆనుకునే గ్యాస్ పైప్‌లైన్లు వేయరనీ, గ్రామాలకు 5-6 కిలోమీటర్ల దూరంగా ఈ లైన్లు పరుస్తారని నిపుణులు చెపుతున్నారు.

పాశ్చాత్య దేశాల్లో పరిమిత నష్టం

పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీలు సంభవించవని కాదు. అయితే అవి ఎక్కువ భాగం కోస్తా తీరానికి దూరంగా సముద్రంతర వేదికలు ఆధారంగా డ్రిల్లింగ్‌లు, ప్రయోగాలు, లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో భారీ విస్ఫోటనాలు సంభవిస్తాయి. అలాంటివి ఆస్ట్రేలియా, నార్వే, నార్త్ సీ ప్రాంతాల్లో జరిగాయి. ఆ ప్రయోగాలు, డ్రిల్లింగ్‌లూ గ్రామాలనూ, కుటుంబాలనూ బూడిదపాలు చేయలేదు, శ్మశానవాటికలుగా మార్చలేదు. కాని ఇండియాలో మాత్రం ‘గెయిల్’, ఓఎన్‌జీసీ సంస్థలు ఇందుకు సంబంధించి అంతర్జాతీయ భద్రత, రక్షణ ప్రమాణాల నిబంధనలను పాటించడం లేదు. పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ఆయిల్ పరిశ్రమ ‘‘భద్రతాధికార సంస్థ’’(ఓఐఎస్‌డీ) నిబంధనలనూ పాటించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ ప్రాధికార సంస్థ అయిన ‘సేఫ్టీ డెరైక్టరేట్’ పెట్రోలియం-గ్యాస్ మంత్రివర్గం కనుసన్నల్లోనే పనిచేయాలి!


భద్రతా ప్రమాణాలు గాలికి

2009లో మరొక ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జైపూర్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో డజను మంది ఆహుతి అయినప్పుడు ఆయిల్ పరిశ్రమ తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి ప్రత్యేక సదస్సు జరిగినా ఫలితం లేకపోయింది. ఆయిల్ పరిశ్రమల నిర్మాణం, నిర్వహణ సమయాలలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రూపొందించిన సాధికారమైన ప్రమాణాలను పాటించడంలో ప్రభుత్వరంగ సంస్థలు విఫలమవుతున్నాయని చమురు పరిశ్రమ నిపుణులు పలుసార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ‘గెయిల్’, ఓఎన్‌జీసీ కంపెనీలు తరచుగా ఆ ప్రమాణాలను పాటించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వ విధానాల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. 1991లో ప్రపంచబ్యాంకు రుద్దిన ప్రజావ్యతిరేక సంస్కరణలను బేషరతుగా కేం ద్రం ఆమోదించింది లగాయతు  నియంత్రణ వ్యవస్థ నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుని కేవలం దేశ, బహుళజాతి కంపెనీలకు ‘బ్రోకర్’గా పని చేయసాగింది. ఫలితంగా ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు అంతకుముం దు ‘నవరత్నాల’లో భాగంగా ఉన్నా, ఆ సంస్థలలోని ప్రభుత్వ, అంటే ప్రజల వాటా ధనాన్ని కాస్తా క్రమంగా విదేశీ కంపెనీలకు, లేదా రిలయ న్స్ లాంటి దేశీయ కార్పొరేట్ దిగ్గజాలకు అమ్ముతూ వచ్చింది. దాంతో కంపెనీలపై ప్రభుత్వానికి నియంత్రణ, అధికారాలు సడలిపోయాయి. ఆ సంస్థల లాభాలు కాస్తా ప్రైవేట్ కంపెనీల పరమవుతున్నాయి.

విదేశీ దిగ్గజాలకు ఎర్రతివాచీ

ప్రపంచంలో పెట్రోలియం, గ్యాస్ వనరులపై  కన్నుపడడం అనేది ఓ భారీ వ్యాపారం. ఇందులో బహుళజాతి కార్పొరేట్ కంపెనీల పాత్ర పెద్దది. ఈ వనరుల కోసమే, వాటిమీద ‘భల్లూకపు’ పట్టు సాధించడం కోసమే అఫ్ఘానిస్థాన్, ఇరాక్, తదితర పశ్చిమాసియా, మధ్యాసియా గ్యాస్ నిల్వల కోసం యుద్ధాలే జరిగాయి, జరుగుతున్నాయి! అలాగే మన దేశం లోని ఆయిల్ సంపదపై విదేశీ కంపెనీల పెత్తనానికి ద్వారాలు తెరిచింది కాంగ్రెస్, యునెటైడ్ ఫ్రంట్, బీజేపీ ప్రభుత్వాలేనని మరచిపోరాదు. వీటిలో యూపీఏ, ఎన్‌డీఏలది ప్రధాన పాత్ర. ఈ రెండు ప్రధాన కూటములూ విదేశీ ఆయిల్ కంపెనీల ఒత్తిళ్లకు లొంగిపోయి, దేశీయంగా చమురు ఉత్పత్తికి గండికొట్టాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలను కుంటుపరిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. విదేశీ కంపెనీలకు, వారితో మిలాఖత్ అయిన రిలయన్స్ లాంటి ఒకటి రెండు దేశీయ కుబేర కంపెనీలు వాళ్ల ఇష్టమొచ్చినట్లు ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల ధరలను ఏకపక్షంగా నిర్ణయించి ప్రజలపై రుద్దే శక్తినీ ఇచ్చాయి!

1998లో కిరోసిన్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీలను ఉపసంహరించిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారుదే. ‘గెయిల్’ కింద నిర్వహిస్తున్న ప్రధాన గ్యాస్ క్షేత్రాలలో షేర్లను 18 శాతం పైగా విదేశీ కంపెనీ ‘ఎన్రాన్’కు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్‌కు అమ్మేసింది బీజేపీయే. చివరికి గ్యాస్‌ను మండించడానికి సైతం ప్రపంచ బ్యాంకు నుంచి రుణంకోసం అంగలార్చిందీ ప్రభుత్వ ఆయిల్ సంస్థే! తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను ఇలా నిర్వీర్యం చేసి, వాటిలోని ప్రజాధనాన్ని కాస్తా తక్కువ శాతానికి వాటాల రూపంలో విదేశీ, స్వదేశీ గుత్త కంపెనీలకు ధారాదత్తం చేసిన తర్వాత ఇంక  పీఎస్‌యూల నిర్వాహకులకు ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అల సత్వం, నిర్లక్ష్యం, పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు!

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)  ఏబీకే ప్రసాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement